close

తాజా వార్తలు

అధ్యక్షా.. మీ రూటే సెపరేటు..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ‘కర్నాటకీయం’.. గత రెండు వారాలుగా యావత్‌ దేశం ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న అంశం. క్షణానికో మలుపు.. రోజుకో ట్విస్ట్‌తో కన్నడ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. 15రోజులైనా కర్ణాటక రాజకీయ నాటకానికి ఇంకా తెరపడలేదు.. సంక్షోభం ముగియలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆ రాష్ట్ర శాసనసభాధిపతి కేఆర్‌ రమేశ్ కుమార్‌ తీరు మరో ఎత్తు.. గత వారం రోజులుగా అందరి దృష్టి ఆయనపైనే.. గవర్నర్‌ ‘సూచన’లకంటే నిబంధనలే ముఖ్యమంటూ సభాపర్వం కొనసాగిస్తున్న రమేశ్ కుమార్‌ సంచలనాలకు పెట్టింది పేరు.. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌. 

ఆరు సార్లు అసెంబ్లీకి.. స్పీకర్‌గా రెండోసారి..

కె. రామప్ప రమేశ్ కుమార్‌ 1949 నవంబరు 22న కోలార్‌ జిల్లాలోని శ్రీనివాసపూర్‌లో జన్మించారు. 1970ల్లో రాజకీయ జీవితాన్ని ఆరంభించిన రమేశ్.. యూత్‌ కాంగ్రెస్‌ సభ్యుడిగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనతి కాలంలోనే యువ నాయకుడిగా ఎదిగారు. ఆయన దూకుడుతత్వం చూసి 1978లో అప్పటి ముఖ్యమంత్రి దేవరాజ ఉర్స్‌ రమేశ్‌కు టికెట్‌ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో శ్రీనివాసపూర్‌ నియోజకవర్గం నుంచి గెలిచి తన 29ఏళ్ల వయసులోనే తొలిసారిగా శాసనసభకు అడుగుపెట్టారు. ఆ తర్వాత 1985లో రమేశ్‌ జనతాదళ్‌ పార్టీ నుంచి శాసనసభకు పోటీ చేసి గెలుపొందారు. 

అనంతరం కొన్ని కారణాల వల్ల 2004లో తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరిన రమేశ్‌ అప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారు. శ్రీనివాసపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఆరు సార్లు శాసనసభకు ఎంపికైన రమేశ్ కుమార్‌ను తన నియోజకవర్గ ప్రజలు ‘స్వాములు’ అని అభిమానంగా పిలుచుకుంటారు. 1994-99 మధ్య రమేశ్‌ తొలిసారిగా స్పీకర్‌ బాధ్యతలు చేపట్టారు. 2018లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో మరోసారి స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో సీఎం కుమారస్వామి బలపరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే రోజులు గడుస్తున్నా విశ్వాస పరీక్ష ఎటూ తేలకపోవడంతో గవర్నర్‌ జోక్యం చేసుకుని రెండు సార్లు గడువిచ్చారు. అయితే ఆ గడువును పట్టించుకోకుండా రమేశ్‌ కుమార్‌ సభకు సోమవారానికి వాయిదా వేశారు. గవర్నర్‌ ఆదేశించినా సరే సభా నిబంధనలు మార్చుకోలేనని కరాఖండిగా చెప్పి సంచలనం సృష్టించారు. 

వివాదాలు కొత్తేం కాదు..

తాజా సంక్షోభంలో ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించకపోవడం.. గవర్నర్‌ సూచనలు చేసినా బలపరీక్ష పెట్టకపోవడం, నిబంధనలే ముఖ్యమంటూ దూసుకెళ్లడంతో ఇటీవల రమేశ్ కుమార్‌ పేరు మార్మోగిపోయింది. స్పీకర్‌ పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ ప్రతిపక్షం ఆయనపై ఆరోపణలు చేస్తున్నా.. తనను ఒత్తిడి చేసే వ్యక్తే ఇంతవరకూ పుట్టలేదంటారు రమేశ్‌. అయితే వివాదాలు ఆయనకు కొత్తేం కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆడియో టేపుల అంశం కర్ణాటకలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్‌ కమలం’కు సంబంధించిన ఆడియో టేపులను ముఖ్యమంత్రి కుమారస్వామి అసెంబ్లీలో విడుదల చేశారు. వీటి గురించి మీడియా రమేశ్ కుమార్‌ను పశ్నించగా.. తన పరిస్థితి అత్యాచార బాధితురాలికంటే దారుణంగా ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పార్టీ ఒత్తిడితో క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. 

ఇది జరిగిన కొద్ది రోజులకు అప్పటి కాంగ్రెస్‌ ఎంపీ మునియప్పతో రమేశ్‌ కుమార్‌కు ఉన్న అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. మునియప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న కోలార్‌  పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోనే శ్రీనివాసపూర్‌ కూడా ఉంది. వీరి మధ్య చాలా కాలంగా గొడవలున్నాయి. దీని గురించి మీడియా అడిగిన ప్రశ్నకు మునియప్ప బదులిస్తూ.. ‘రమేశ్‌కు నాకు ఎలాంటి విభేదాలు లేవు. మేమిద్దం భార్యాభర్తల్లాంటి వాళ్లం’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలకు రమేశ్‌..‘నేను మగాళ్లతో పడుకోను. నాకు ఓ భార్య ఉంది’ అని ఘాటుగా స్పందించారు. ఆ సమయంలోనే రమేశ్‌ వార్తల్లో నిలిచారు.

సినీ కెరీర్‌ కూడా సూపర్‌ హిట్టే..

రాజకీయ పరంగానే కాదు.. సినీ నటుడిగా కూడా రమేశ్‌ కుమార్‌ కన్నడ ప్రజల్లో ఎంతో పేరుపొందారు. 1994లో స్పీకర్‌గా నియమితులైన రమేశ్‌.. ఆ తర్వాత 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. దీంతో రాజకీయాలకు కొంత విరామమిచ్చి.. సినీ రంగ ప్రవేశం చేశారు. తొలుత సీరియళ్లలో నటించిన ఆయన.. కొన్ని సినిమాల్లోనూ కన్పించారు. ప్రముఖ ఫిల్మ్‌మేకర్‌ టీఎన్ సీతారామ్‌ దర్శకత్వం వహించిన ‘ముక్త’ అనే సూపర్‌హిట్‌ సీరియల్‌లో న్యాయమూర్తిగా నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. అలా ప్రజలకు మరింత చేరువయ్యారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.