close

తాజా వార్తలు

ఇది మన చరిత్రలో అద్భుతమైన ఘట్టం.. మోదీ

చంద్రయాన్‌ 2 ప్రయోగంపై ప్రముఖుల ప్రశంసలు

దిల్లీ: ‘ప్రతి భారతీయుడు అత్యంత గర్వపడే రోజు ఇది’ అని చంద్రయాన్ 2 ప్రయోగం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) మీద ప్రశంసలు కురిపించారు. జాబిల్లిపై పరిశోధనల కోసం చంద్రయాన్‌ 2 ఉపగ్రహాన్ని ఇస్రో సోమవారం శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. దానిపై వరస ట్వీట్లతో మోదీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు ఈ ప్రయోగ విజయంపై తమ శుభాకాంక్షలు తెలియజేశారు. 

‘మన చరిత్రలో అద్భుతమైన క్షణాలు ఇవి! చంద్రయాన్‌ 2 ప్రయోగం మన శాస్త్రవేత్తల నైపుణ్యాన్ని, శాస్త్ర రంగంలో కొంత పుంతలు తొక్కాలన్న 130 కోట్ల మంది దేశ ప్రజల నిబద్ధతను చూపిస్తోంది. ప్రతి భారతీయుడు ఈ రోజు చాలా గర్వంగా ఉన్నాడు. మనసులో, స్ఫూర్తిలో భారతీయత తొణికసలాడింది. చంద్రయాన్‌ 2 పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం ఈ రోజు ప్రతి భారతీయుడి ఆనందానికి అత్యంత ముఖ్యకారణం. రిమోట్ సెన్సింగ్ కోసం ఆర్బిటార్, చంద్రుడి ఉపరితలాన్ని విశ్లేషించడానికి లాండర్‌-రోవర్ ఈ మిషన్‌లో ఉన్నాయి. జాబిల్లి దక్షిణ ధ్రువం మీద పరిశోధనలు చేయడమే ఈ ప్రయోగం ప్రధానోద్దేశం. గతంలో ఏ మిషన్ అక్కడ పరిశోధనలు చేయలేదు. దీనివల్ల వల్ల కొత్త విషయాలు తెలుసుకోనున్నాం. ఈ ప్రయోగానికి సంబంధించిన పరిశోధనలు యువతను శాస్త్రరంగం, పరిశోధన, ఆవిష్కరణల వైపు దృష్టి సారించేలా చేస్తాయి. చంద్రయాన్‌ 2 ప్రయోగానికి కృతజ్ఞతలు. దీని వల్ల చందమామకు సంబంధించి మన పరిజ్ఞానం మరింత మెరుగుకానుంది’ అని మోదీ ట్వీట్లు చేశారు. 

*చంద్రయాన్ 2 చరిత్రాత్మక ప్రయోగం దేశప్రజలకు అత్యంత గర్వకారణం. ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు నా అభినందనలు. ఈ ప్రయోగంతో  సాంకేతికతలో ఇస్రో సరికొత్త ఎత్తుకు చేరింది - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. 
*చంద్రయాన్‌ 2 ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు శాస్త్రవేత్తలు, దేశ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన దేశాన్ని గర్వపడేలా చేసినందుకు శాస్త్రవేత్తలకు ప్రత్యేక అభినందనలు -ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
*చంద్రయాన్‌ 2ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రోకు శుభాకాంక్షలు. స్వదేశీ పరిజ్ఞానంతో ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టి ఇస్రో కొత్త చరిత్ర సృష్టించింది. ఇస్రో, శాస్త్రవేత్తల పట్ల దేశం గర్వంగా ఉంది -రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 

‘‘ చంద్రయాన్‌ -2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. కఠోర శ్రమ, అద్భుతమైన ప్రతిభాపాటవాలతో ఈ ప్రయోగం విజయవంతం చేశారు’’ - కేసీఆర్‌, తెలంగాణ సీఎం

* ‘‘చంద్రయాన్‌ -2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోకు కంగ్రాట్స్‌. కోట్లాది ఆశలతో జాబిల్లిపైకి ఉపగ్రహాన్ని పంపిన ఈ సందర్భం చారిత్రాత్మక ఘట్టం. ఇస్రో శాస్త్రవేత్తలు, షార్‌కు అభినందనలు’’ - వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఏపీ సీఎం

*  ‘‘అంతరిక్ష పరిశోధనల్లో భారత ప్రతిష్ఠను మన శాస్త్రవేత్తలు పెంచారు. జీఎస్ఎల్వీ మార్క్-3 ఎం1 ద్వారా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష ప్రయోగంలో భారత్ మరో మైలురాయిని దాటింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతమవడంతో అంతరిక్షంలో భారత్‌ ప్రత్యేక ముద్ర వేసింది. చంద్రయాన్‌-2 ద్వారా చంద్రునిపై ఉన్న వాతావరణ పరిస్థితులు, జాబిల్లి పుట్టుక, నీరు, ఇతర మూలకాల గురించి లోతుగా తెలుసుకునే ఆస్కారమేర్పడుతుందని ఆశిస్తున్నాం. ప్రతిష్ఠాత్మక ‘చంద్రయాన్‌-2’ ప్రయోగంలో కీలక బాధ్యతలను మహిళలు నిర్వహించడం మహిళా సాధికారతకు ముందడుగు’’ - నారా చంద్రబాబు నాయుడు, తెదేపా జాతీయ అధ్యక్షుడు  

* చంద్రయాన్‌-2 విజయం పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హర్షం వ్యక్తంచేశారు.  ఈ ఘనత వెనుక ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. 

* ‘‘భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం భారత్‌ను అగ్ర దేశాల సరసన నిలిపింది. చంద్రయాన్- 2 రాకెట్ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడం శుభపరిణామం. విజయవంతంగా ఉపగ్రహాన్ని పంపిన ఇస్రో శాస్త్రవేత్తలకు నా తరఫున, జనసైనికుల తరఫున అభినందనలు. పరిమిత బడ్జెట్‌తోనే చంద్రుడి పైకి రోవర్‌ను ప్రయోగించడంతో అన్ని దేశాలూ మన సాంకేతిక పరిజ్ఞానం వైపు ఆసక్తిగా చూడటం గొప్ప విషయం. చంద్రునిపై ఉన్న వాతావరణ పరిస్థితులు, చంద్రుని పుట్టుక, నీరు, అక్కడి ఉపరితలం, ఇతర మూలకాల గురించి లోతుగా తెలుసుకునేందుకు చేపట్టిన చంద్రయాన్ - 2తో  అంతరిక్ష పరిశోధనల్లో మన దేశం మరో మెట్టు ఎక్కింది. భారత శాస్త్రవేత్తలు అంతరిక్ష యానంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’’ - పవన్‌ కల్యాణ్‌,  జనసేన అధినేత


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.