close

తాజా వార్తలు

‘ద్వైపాక్షిక చర్చలతో కశ్మీర్ సమస్య కొలిక్కిరాదు’

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలు 

దిల్లీ: కశ్మీర్‌ సమస్య పరిష్కారంపై భారత్, పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ స్పందించారు. తమ ఇరు దేశాల మధ్య ఉన్న వివాదం ద్వైపాక్షిక చర్చలతో ఎప్పటికీ  పరిష్కారం కాదని ఇమ్రాన్‌ మంగళవారం మీడియాతో వ్యాఖ్యానించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా పాక్ ప్రధాని అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా శ్వేత సౌధంలో సమావేశమైన ట్రంప్‌, ఇమ్రాన్ అనేక అంశాల మీద చర్చలు జరిపారు. ఆ సమయంలో ట్రంప్‌ మాట్లాడుతూ..ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం నెరపడానికి తాను సిద్ధంగా ఉన్నానని, భారత ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని కోరారన్నారు. 

‘ద్వైపాక్షికంగా కశ్మీర్ వివాదం పరిష్కారం కాదు. గతంలో ఇదే అంశంపై జనరల్ పర్వేజ్ ముషారఫ్, అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ మధ్య జరిగిన చర్చల్లో భాగంగా ఈ వివాదం పరిష్కారం అయ్యే దశ వరకు వచ్చింది. కానీ తరవాత నుంచి మళ్లీ ఇరు దేశాల దారులు వేరయ్యాయి. ఇప్పుడు ఈ అంశంపై అమెరికా, ముఖ్యంగా ట్రంప్‌ ప్రముఖ పాత్ర పోషించగలరు’ అని అక్కడి మీడియాతో వెల్లడించారు. ద్వైపాక్షికంగానే ఇరు దేశాల సమస్యలను పరిష్కరించుకుంటామని భారత్ స్పష్టం చేయడంపై ప్రశ్నించగా ‘మేము 130  కోట్ల మంది ప్రజల గురించి మాట్లాడుకున్నాం. ఇదే సమస్య గనుక పరిష్కారం అయితే అంతమందికి లభించే ప్రశాంతత గురించి ఊహించండి’ అని ఇమ్రాన్‌ సమాధానం ఇచ్చారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ..‘భారత్ అణ్వాయుధాలను వదులుకుంటే మేము కూడా అందుకు సిద్ధంగా ఉన్నాం. అణు యుద్ధం ఎప్పటికీ ఒక పరిష్కారం కాదు’ అని వ్యాఖ్యానించారు. 

మధ్యవర్తిత్వంపై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆయన వ్యాఖ్యలతో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటాయన్న నిపుణుల విశ్లేషణతో అమెరికా వెనక్కి తగ్గి, నష్ట నివారణ చర్యలకు దిగింది. అయితే దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని పార్లమెంటు వేదికగా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.