close

తాజా వార్తలు

ఆజమ్‌ఖాన్‌ క్షమాపణ చెప్పాలి

డిమాండ్‌ చేసిన మహిళా ఎంపీలు.. దద్దరిల్లిన లోక్‌సభ 

దిల్లీ: భాజపా మహిళా ఎంపీ రమాదేవిపై సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజమ్‌ఖాన్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై మహిళా ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నేడు లోక్‌సభ దద్దరిల్లింది. ఆజమ్‌ఖాన్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలని లేదంటే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా సభ్యులతో పాటు భాజపా ఎంపీలు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. 

‘గురువారం లోక్‌సభలో ఏం జరిగిందో యావత్‌ దేశం చూసింది. పనిచేసే ప్రదేశంలో మహిళలు లైంగిక వేధింపులకు గురికాకుండా చూసేలా ఈ సభలో బిల్లును ఆమోదించాం. ఇప్పుడు ఇదే సభలో మహిళా ఎంపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు. మహిళను అగౌరవపర్చకూడదు. దీనిపై గళమెత్తాల్సిన సమయం వచ్చింది. దీన్ని మనం చూస్తూ ఊరుకోకూడదు. అభ్యంతరకరంగా మాట్లాడి వెళ్లిపోవడం సరికాదు. ఇదే వ్యాఖ్యలు బయట చేస్తే పోలీసులు అరెస్టు చేసేవారు’ అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అనంతరం తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మిమీ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘పార్లమెంట్‌లో నిలబడి ఎవరూ మహిళతో అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేయరు. దీనిపై మీరు కఠిన నిర్ణయం తీసుకుంటారని ఇక్కడున్న మహిళలందరం అనుకుంటున్నాం’ అన్నారు. కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందిస్తూ.. ఆజమ్‌ఖాన్‌ క్షమాపణ చెప్పాలని లేదంటే ఆయనను లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చేయాలని భాజపా తరఫున డిమాండ్‌ చేశారు. అటు కాంగ్రెస్‌ కూడా ఆజమ్‌ఖాన్‌ వ్యాఖ్యలను ఖండించింది. ‘మహిళలను అగౌరవపరచడాన్ని మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గతంలో సోనియాగాంధీపై కొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు’ అని గుర్తుచేశారు. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ.. ‘ఆజమ్‌ఖాన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీని రాజకీయం చేయొద్దు. ఇలాంటి వారికి వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా నిలబడాలి’ అని స్పీకర్‌ను కోరారు. కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో, ఎంపీలు సుప్రియా సూలే, కల్యాణ్‌ బెనర్జీ, మహతబ్‌ తదితరులు కూడా ఆజమ్‌ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

పార్లమెంట్‌లో ఎలా ప్రవర్తించాలో శిక్షణ ఇవ్వాలి: మాజీ స్పీకర్‌

ఖాన్‌ వ్యాఖ్యలపై లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ మండిపడ్డారు. ఇది చాలా విచారకరమని, ఇలాంటి వాళ్లకు ఓ శిక్షణ కార్యక్రమం పెట్టాలని అప్పుడే పార్లమెంట్‌లో ఎలా ప్రవర్తించాలో వారు నేర్చుకుంటారని అన్నారు. ‘ఇది ఓ మహిళ లేదా పురుషుల గౌరవానికి మాత్రమే సంబంధించి అంశం కాదు. పార్లమెంట్‌ సంప్రదాయాలు, ప్రతిష్ఠను భంగపరిచేలా ఖాన్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి. అయితే సస్పెన్షన్‌ ఒక్కటే సరిపోదు. ఇలాంటి వారి కోసం ఓ వారం పాటు ప్రత్యేక శిక్షణాతరగతులు నిర్వహించాలి. అప్పుడే సభలో ఎంపీ ఎలా మాట్లాడాలో వారికి అర్థమవుతుంది’ అని మహజన్‌ దుయ్యబట్టారు. 

నిర్ణయం తీసుకుంటా: స్పీకర్

ఆజమ్‌ఖాన్‌ వ్యవహారంపై స్పీకర్‌ ఓంబిర్లా స్పందించారు. దీనిపై అన్ని పార్టీల నేతలతో సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. 

 

 

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.