close

తాజా వార్తలు

కశ్మీర్‌లో ప్రభుత్వ వ్యూహం ఏమిటీ..?

35ఏ రద్దుకు మానసికంగా సిద్ధం చేస్తూ.. 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ‘అమర్‌నాథ్‌ యాత్ర మార్గంలో ఆయుధాలు దొరికాయి.. వీలైనంత త్వరగా యాత్రను కుదించుకొని యాత్రికులు వెళ్లిపోవాలి..’ ఇదీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన హెచ్చరిక.. తొలుత 10,000 అదనపు బలగాలు.. ఆ తర్వాత 25,000 వేల అదనపు బలగాలు.. ఇతర ప్రాంతాల వారు హడావుడిగా తిరుగు ప్రయాణాలు.. కేంద్రీయ విద్యాసంస్థలను వీడుతున్న ఇతర  ప్రాంత విద్యార్థులు.. ఆసుపత్రుల్లో పూర్తి సన్నద్ధత.. కశ్మీరీ పార్టీల  హడావుడి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు.. ఇవన్నీ చూస్తుంటే జమ్ము కశ్మీర్‌లో ఏదో పెద్ద మార్పులే చోటు చేసుకోనున్నాయనే సంకేతాలు బయట ప్రపంచానికి వెళ్లాయి. మరోపక్క ఆర్టికల్‌ 370 రద్దు చేయాలని గతంలో మురళీ మనోహర్‌ జోషీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నరేంద్ర మోదీ ఫొటో హఠాత్తుగా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో ఆర్టికల్‌ 35ఏ రద్దుకానీ, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై దాడి చేయవచ్చనే ప్రచారం కానీ జరుగుతోంది. వీటిల్లో వాస్తవాలు ఎంతో విశ్లేషిద్దాం..

అమర్‌నాథ్‌ యాత్ర కుదింపు ప్రకటన అవసరమా..

అమర్‌నాథ్‌ యాత్ర కుదింపు సాధారణ అంశం  ఏమీ కాదు. గతంలో అమర్‌నాథ్‌యాత్రీకులపై ఉగ్రదాడులు జరిగిన ఘటనలు ఉన్నాయి. అయినా కానీ ప్రభుత్వాలు భద్రతా ఏర్పాట్లను మరింత పెంచి యాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని కొనసాగించాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ సారి యాత్రనే కుదించుకోవడమో.. రద్దు చేసుకోవడమో చేయాలని ప్రభుత్వం కోరడంపై పలు అనుమానాలు రేగుతున్నాయి. 

ఆర్టికల్‌ 35ఏ రద్దు..?

వాస్తవానికి అభివృద్ధి చెందుతున్న భారత ప్రజలతో పూర్తిగా కశ్మీరీలను మమేకం చేసే విధంగా ఆర్టికల్‌ 35ఏ రద్దు చేస్తే అక్కడి సామాన్యూడికి కలిగే నష్టం ఏంటంటే ఒక్క రాజకీయ పార్టీ సరైన సమాధానం చెప్పదు. దీనిని ఒక భావోద్వేగ అంశంగా చూపే ప్రయత్నం చేస్తాయి. వాస్తవానికి రాజకీయ పార్టీలే ఈ భావోద్వేగాలను రెచ్చగొడతాయి. 35ఏలో మార్పులు చేయవద్దని ఇటీవలే మోహబూబా ముఫ్తీ చేతులు జోడించి మరీ ప్రభుత్వాన్ని కోరారు. చాలా సందర్భాల్లో కశ్మీరీ పార్టీల మాటలు పొంతన లేకుండా ఉంటాయి. కశ్మీర్‌ను ప్రభుత్వం రాజకీయ సమస్యగా చూడాలని పేర్కొంటాయి. ఇది కేవలం సయ్యద్‌ సలాహుద్దీన్‌ లాంటివారు ఉగ్రవాదుల్లో కలవక ముందు రోజుల్లో అయితే కావచ్చేమోకానీ.. ఇప్పుడు మాత్రం కాదు. అసలు రాజకీయ సమస్య ఉంటే పార్టీలు చూసుకోవాలి.. అలా కూడా కశ్మీర్‌లో జరగడంలేదు. అసలు రాజకీయ సమస్య అయితే జిహాద్‌ ప్రస్తావన దేనికి..? వీటికి కశ్మీరీ పార్టీలు ఎక్కడా సరైన సమాధానం చెప్పవు. రాళ్లు రువ్వేవారిని .. ప్రాణాలు తీసేవారిని వెనకేసుకు రావడం కశ్మీరీ పార్టీలకు అలవాటే.  ఇకపోతే జమ్ము, లద్దాక్‌ల్లో అంత వ్యతిరేకత రావడంలేదు. కేవలం కశ్మీర్‌లోయలో స్థానిక పార్టీలకు మద్దతు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ ఉద్రిక్తతలు ఎక్కువగా ఉంటున్నాయి. కశ్మీరీలను 35ఏ రద్దుకు మానసికంగా సిద్ధం చేసేలా ప్రభుత్వ వ్యూహం కొనసాగుతోంది. 

ఉగ్రవాదుల తయారీ ఉద్యమాలు..

కశ్మీర్‌లోని ఉగ్రవాదుల్లో 80శాతం మంది గతంలో రాళ్లు రువ్వేవారిగా పనిచేశారని 15కార్పస్‌ డీజీ కేజేసీ దిల్లాన్‌ పేర్కొన్నారు. రాళ్లు రువ్వేఘటనలే ఉగ్రవాదులకు రిక్రూట్‌మెంట్ల్‌గా మారుతున్నాయి. రాళ్లురువ్వే వారిని గుర్తించే ఉగ్రబృందాలు వారికి నెమ్మదిగా భావజాలాన్ని ఎక్కించి ఉగ్రశిక్షణకు పంపిస్తున్నాయి. మరోపక్క రాజకీయ పార్టీలేమో ‘‘వారంతా పిల్లలు.. కేసులు పెడితే వారి భవిష్యత్తు ఏం కావాలో’’ అంటూ శోకాలు పెడతాయి. ప్రపంచంలో ఏ దేశంలోనైనా రాయితో ఒకరి  తలపగలగొడితే పోనీలే పిల్లలు అని వదిలేసేలా చట్టాలు ఉన్నాయా..? అయినా రోడ్లపై పడి రాళ్లదాడి చేసి ప్రాణాలు తీయటం తెలిసినవారు పిల్లలు ఎలా అవుతారు..? కేవలం యువత ఓట్ల కోసం పోటీపడి మరీ రాజకీయపార్టీలు వారిని వెనకేసుకు వస్తాయి. 
అక్కడి పాలన అల్లర్లకు సహకరించేలా ఉంటుందనటానికి ఒక బలమైన ఉదాహరణ ఉంది. భారత్‌లో ఎక్కడైనా పెట్రోల్‌ బంకుల్లో పెద్ద క్యాన్లు తీసుకెళ్లి పెట్రోల్‌ పోయమంటే సాధారణంగా నిరాకరిస్తారు. అదే కశ్మీర్‌లో ప్రజలే క్యాన్లతో పెట్రోల్‌ పంపుల వద్ద లైన్లో నిలబడితే నిరభ్యంతరంగా వాటిని నింపుతారు. ఆ తర్వాత ఆ పెట్రోల్‌ను అల్లర్ల సమయంలో వాడినా అడిగేవారు ఉండరు. అక్కడి శాంతిభద్రతలు.. చట్టం అమలు ఇంత నేలబారుడుగా ఉంటాయి. 

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ స్వాధీనం సాధ్యమేనా.. 

> పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ స్వాధీనం సాధ్యమేనా.. అంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యమనే చెప్పాలి. భారత్‌-పాక్‌లు రెండూ అణ్వాయుధాలు ఉన్న దేశాలు. యుద్ధం ద్వారా పీవోకే స్వాధీనం దాదాపు అసాధ్యమే. భారత సేనలు అక్కడకు చొచ్చుకు వెళ్లినా ఆ భూభాగం భారీ పర్వతాలతో కూడి ఉండటంతో యుద్ధం ఖర్చు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. 
> ‘చర్చల ద్వారా పరిష్కారం’ అనే అంశాన్ని పరిశీలిస్తే.. భారత్‌ చేతిలో ఉన్న కశ్మీర్‌ నాటి పాలకుడు రాజా హరిసింగ్‌ నుంచి చట్టబద్ధంగా భారత్‌లో కలిసింది. దీనిపై ఎటువంటి చర్చలు ఉండవు. ఇక పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఎవరి ఆధీనంలో ఉండాలో అనే అంశంపై చర్చలు జరిగినా అది భారత్‌ చేతికి రాదు. ఎందుకంటే తమ నియంత్రణలోని భూభాగాన్ని భారత్‌కు అప్పగించడం పాక్‌ పాలకులకు ఆత్మహత్యతో సమానం. మరి చైనా చేతికి వెళ్లిన ఆక్సాయిచిన్‌ తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఇప్పట్లో దాదాపు లేవనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ విషయంలో ప్రస్తుతానికి యథాతథ పరిస్థితి కొనసాగే అవకాశాలే ఉన్నాయి. చర్చలు జరిగినా అది కేవలం ఉగ్రస్థావరాల మూసివేత వరకే పరిమితం అయ్యే అవకాశాలు దండిగా ఉన్నాయి. భారత్‌ బలంగా ప్రయత్నిస్తే ఈ విషయంలో విజయం సాధించవచ్చు. 

> ఒక వేళ పీవోకేపై మనం దాడి చేస్తే అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చే ప్రమాదముంది. ఇన్నాళ్లు పాక్‌ను ఉగ్రవాద పురిటిగడ్డగా చూసిన ఆ దేశాలు పాక్‌ పట్ల కాస్తా సానుభూతితో వ్యవహరించే అవకాశముంది. దీంతో ఇన్నాళ్లూ శాంతికాముక దేశంగా పేరొందిన మన ప్రతిష్టకు విఘాతం కలిగవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే పీవోకే పై దాడి వరకు పోయే అవకాశమే లేదని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.