close

తాజా వార్తలు

వారు మాత్రమే కాంగ్రెస్‌ను నడపగలరు:అధిర్‌ రంజన్‌

కోల్‌కతా: నెహ్రూ-గాంధీ కుటుంబేతరులు కాంగ్రెస్‌ పార్టీని నడపడం కష్టమని ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్ చౌధురి వ్యాఖ్యానించారు. కేవలం ఆ కుటుంబానికి ఉన్న పరపతి మాత్రమే పార్టీని ముందుకు తీసుకెళ్లగలదన్నారు. స్పష్టమైన సిద్ధాంతాలు లేకుండా ఉన్న ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడం ద్వారానే కాంగ్రెస్‌కి పునర్‌వైభవం సాధ్యమని అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో ప్రాంతీయ పార్టీలు వైభవాన్ని కోల్పోతాయని.. ప్రస్తుతం వాటి పనితీరుతో అది స్పష్టమవుతుందన్నారు. దేశంలో కేవలం రెండు పార్టీలే కేంద్రంగా రాజకీయాలు నడుస్తాయని.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దేశవ్యాప్తంగా నెలకొన్న విద్వేషపూరిత వాతావరణాన్ని రూపుమాపడం కేవలం కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమన్నారు.  

కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సోనియా బాధ్యతలు స్వీకరించడానికి విముఖత వ్యక్తం చేశారని అధిర్‌ రంజన్ తెలిపారు. కానీ, పార్టీ సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న తరుణంలో సీనియర్‌ నాయకుల విజ్ఞప్తి మేరకు చివరకు అంగీకరించారన్నారు. ఆమె నాయకత్వంలోనే 2004, 2009లో పార్టీ అధికారంలోకి రాగలిగిందన్నారు. శాశ్వత అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. అయినా గాంధీ-నెహ్రూ కుటుంబేతరులు పార్టీని నడపడం కష్టసాధ్యం అన్నారు. భాజపాలో నరేంద్ర మోదీ, అమిత్‌ షా లేకుంటే పార్టీ నడుస్తుందా అని ప్రశ్నించారు. ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్‌ గాంధీని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. పార్టీలో సీనియర్లకు, యువనాయకులకు మధ్య విభేదాలు నడుస్తున్నాయన్న వార్తల్ని ఆయన కొట్టిపారేశారు. అందరూ కలిసే సోనియాని అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారని తెలిపారు. 

ఆర్టికల్‌ 370 రద్దు అప్రజాస్వామికమన్న అధిర్‌ రంజన్.. భవిష్యత్తులో దీనివల్ల తీవ్ర పరిణామాలుంటాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్ర జోక్యం పెరగబోతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. కశ్మీర్‌ అంశంలో పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవడంపై స్పందించిన ఆయన.. బిల్లుపై ఎలాంటి ముందస్తు సమాచారం లేదన్నారు. అందుకే పార్టీలో అంతర్గతంగా చర్చించడానికి అవకాశం చిక్కలేదని వివరించారు. కానీ, ఒకసారి సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన తర్వాత నేతలకు అన్ని అనుమానాలు తొలగిపోయాయని తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.