close

తాజా వార్తలు

వారి నినాదం హైజలాబాద్‌!

బ్యాంకులో డబ్బు ఎలా దాచుకుంటామో... భూగర్భంలో నీటిని అలా దాచుకోవాలి.. లేదంటే మనుగడ లేదు. ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయ్‌... అతి చిన్న కార్యాచరణ... మీ ఇంటి భూగర్భాన్ని నీటితో నింపుతుంది. కొద్దిపాటి శ్రమ మీతో పాటు పదిమంది దాహం తీరుస్తుంది... అంటున్నారు విజయరామ్‌... సేంద్రియ వ్యవసాయవేత్తగా ఖ్యాతి పొందిన ఈయన హైదరాబాద్‌కు అవసరమైన నీటి సంరక్షణ ప్రణాళికలను వినూత్న పద్ధతిలో ప్రచారం చేస్తున్నారు. నెల రోజులుగా ఉద్యమంలా దీన్ని ముందుకు తీసుకెళుతున్నారు.

తీసుకున్నప్పుడు ఇవ్వడం కూడా తెలిసుండాలి. లేకుంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది... ప్రకృతి నుంచి ఎన్నో తీసుకుంటున్న మనం తిరిగి ఇస్తోందేంటి? విధ్వంసాన్ని... దాని పర్యవసానం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది... ప్రకృతి మనకిచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌... విలయం... దుర్భిక్షం ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం మేల్కోవాలి. హైదరాబాద్‌ మహా నగరం... జనాభా కోటికి చేరుతోంది.

రవై ఏళ్ల క్రితం పుష్కలంగా భూగర్భ జలాలు అందుబాటులో ఉండేవి. నగరంలోని చాలా ప్రాంతాల్లో 150 అడుగుల్లో నీరుండేది. ఇప్పుడు 500 అడుగుల లోపు భూగర్భ జలాలున్న ప్రాంతాలు చాలా అరుదు. దీనికి కారణం మనమే. అందినంతమేరా నీటిని వాడుకున్న మనం తిరిగి భూమి పొరల్లోకి జలాలను పంపలేదు. ఇప్పుడు ఆ పనికి సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు విజయరామ్‌. ఇంకుడు గుంతలతో నగర గర్భాన్ని సస్యశ్యామలం చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. దీనికి కావాల్సింది కొద్దిపాటి స్థలం, కొంచెం శ్రమ. అంతే... అంటూ విజయరామ్‌ బృందం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ఈ స్ఫూర్తితో నగరంలోని పలు ప్రాంతాల్లో ఇంకుడు గుంతల తవ్వకం కార్యక్రమం జరుగుతోంది.

అనగనగా ఓ కాకి

ఎక్కడా నీరు దొరకలేదు.. ఓ కుండలో అడుగున ఉన్న నీటిని తాగి దాహం తీర్చుకోవాలనుకుంది. నాలుగు రాళ్లను కుండలో వేసి నీటిని పైకి వచ్చేలా చేసింది. చిన్నప్పుడు చదువుకున్న కథ. కుండలో నీళ్లు అందనప్పుడు గులకరాళ్లు వేసి నీటిమట్టాన్ని పెంచి తన దాహాన్ని తీర్చుకుందా కాకి...

ఇప్పుడు మన కింకర్తవ్యమూ అదే. మీ ఇంట్లో ఓ గుంత తీసి నాలుగు రాళ్లు వెయ్యి చాలు... ఆ రాళ్లు రత్నాలుగా మారతాయి. భూగర్భంలో జలజలారావాలు వినిపిస్తాయి. వాటిని మీరూ వినొచ్ఛు దానికి కావాల్సింది కేవలం మీ సంకల్పం...

నగరంలో 100 గజాల్లో ఎక్కువ నివాసాలున్నాయి. 300-500 గజాల్లో గ్రూప్‌ హౌస్‌లు, అపార్టుమెంట్లు ఉన్నాయి. ప్రతిచోటా ఆరు అడుగుల స్థలం కేటాయించడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఆరు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల లోతున్న ఇంకుడు గుంత 250 నుంచి 500 గజాల భూగర్భాన్ని నీటితో నింపుతుంది. మరి ఈ మాత్రం చోటు కూడా లేని వాళ్లేం చేయాలి?... ద్విచక్ర వాహనం పెట్టుకునే కింది భాగాన్ని ఇంకుడు గుంతగా మార్చి దానిపై పార్కింగ్‌ చేసుకోవచ్ఛు మూడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు భూమి దొరికినా చాలు దాన్ని జలవంతం చేయొయ్చని చేసి చూపిస్తున్నారు. చదరపు గజం భూగర్భంలో మనం 824 లీటర్ల నీటిని నిల్వ చేయవచ్ఛు కానీ ఆ విషయాన్ని ఎవరూ లక్ష్య పెట్టడం లేదు. కురుస్తున్న వానలో 92 శాతం వృథాగా కాలువల వెంట వెళ్లిపోతుంటే కళ్లప్పగించి చూస్తున్నాం. వాటికి అడ్డుకట్ట వేయాల్సిన విధానాలను వారు ప్రచారం చేస్తున్నారు.

వట్టిపోయిన బోర్లకు జీవం...

హైదరాబాద్‌ నగరంలో నీటి చెమ్మ కూడా లేకుండా ఎండిపోయిన బోర్‌వెల్స్‌ కొన్ని వేలున్నాయి. నీరందక ఓ మూలన పడిపోయిన ఈ గొట్టపు బావులను ఇంకుడు గుంతలుగా మార్చడంపై వీరు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.

సాధారణంగా అలా నీరింకిన ఆ గొట్టపు బావులను కేసింగ్‌ పైపుతో సహా అలాగే వదిలేస్తాం. వీళ్లేం చేస్తున్నారంటే... ఎండిపోయిన ఆ బోర్‌ చుట్టూ ఉన్న భాగాన్ని లోతుగా తవ్వుతారు. కేసింగ్‌పైపుకు నాలుగు వైపులా ఓ పద్ధతిగా రంధ్రాలు చేస్తారు. దానికి స్టీల్‌ మెష్‌ను చుట్టి, గులకరాళ్లు, ఇసుకతో దాన్ని నింపేస్తారు. ఇప్పుడా కేసింగ్‌ పైపునకు ఇంటి పైనుంచి నీరు పడే గొట్టాన్ని అనుసంధానం చేస్తారు. అంతే ఆ పనికి రాని బోర్‌వెల్‌ కాస్తా అద్భుతమైన ఇంకుడు గుంతగా మారిపోతుంది. సాధారణంగా వీటి ద్వారా భూగర్భంలోకి జలం చేరి అక్కడ నీటి మట్టం పెరగడానికి కొన్ని నెలలు పడుతుంది. అయితే ఈ బోర్‌వెల్‌ను ఇంకుడు గుంతగా మార్చినచోట నీటిమట్టం రెండురోజుల్లోనే గణనీయంగా పెరిగిన ఉదాహరణలు చాలా ఉన్నాయని విజయరామ్‌ చెబుతున్నారు. ఇలాంటి బోర్లు ఉన్న ఎక్కడైనా ఇలా చేయొచ్ఛు మంచి ఫలితాలు పొందొచ్చని చెబుతున్నారాయన. దీనికయ్యే ఖర్చూ తక్కువే.
నగరాల్లో పేవ్‌మెంట్లు, ట్రాఫిక్‌ ఐలండ్లు, డివైడర్ల కింది భాగాన్ని సమర్ధంగా వినియోగించుకోవచ్ఛు వాటన్నిటినీ ఇంకుడు గుంతలుగా మార్చే ప్రణాళిక అమలుకు ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధమంటున్నారు.

ఇలా చేస్తే:

* నగరంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు శనివారం కూడా సెలవు ప్రకటించాలి. దాన్ని నీటి సంరక్షణ కార్యక్రమాలకు కోసం కేటాయించాలి.

* ప్రతి ప్రభుత్వ శాఖలోనూ ఈ విషయంపై విస్తృత ప్రచారం చేయాలి. పని వెసులుబాటు ఉన్న ఫైర్‌ డిపార్టుమెంట్‌ వంటి వాటిని జలసంరక్షణ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి.

* వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్‌ కింది భాగంలో నీటి విలువను గురించిన సూచనలు పెట్టి ఇవ్వచ్ఛు

-మేకల రవికుమార్‌


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.