close

తాజా వార్తలు

పాక్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ఎఫ్‌ఏటీఎఫ్‌ ఏపీజీ

దిల్లీ: ఉగ్రవాదంపై తన వైఖరిని మార్చుకోని పాకిస్థాన్‌కు ఆర్థిక చర్యల కార్యదళం ఆసియా-పసిఫిక్‌ గ్రూప్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌-ఏపీజీ) భారీ షాక్‌ ఇచ్చింది. ఇప్పటి వరకు గ్రే లిస్ట్‌లో ఉన్న దాయాది దేశాన్ని ఎన్‌హాన్స్‌డ్‌ ఎక్స్‌పీడైటెడ్‌ ఫాలో అప్‌ లిస్ట్‌(బ్లాక్‌ లిస్ట్‌)లో చేర్చింది. ఈ మేరకు గత రెండు రోజులుగా ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో జరుగుతున్న ఎఫ్‌ఏటీఎఫ్‌-ఏపీజీ సమావేశంలో నిర్ణయించినట్లు భారత అధికారులు తెలిపారు. ఉగ్రవాద నిర్మూలన దిశగా తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన వివరాలను పాక్‌ ఇటీవల ఎఫ్‌ఏటీఎఫ్‌కి సమర్పించింది. పాక్‌ తీసుకున్న దాదాపు 40 రకాల చర్యల్లో దాదాపు 32 ఎఫ్‌ఏటీఎఫ్ నిబంధనలకు అనుగుణంగా లేవని ఆసియా-పసిఫిక్‌ గ్రూప్‌ కుండబద్దలు కొట్టింది. అలాగే ఉగ్రవాదులకు నిధుల చేరవేత, అక్రమ నగదు చలామణి లాంటి కీలకమైన 11 విషయాల్లో పాక్‌ 10అంశాల్లో లక్ష్యాల్ని చేరుకోలేదని స్పష్టం చేసింది. 42 మంది సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో పాక్‌ చర్యలతో ఏ ఒక్కరూ సంతృప్తి చెందనట్లు సమాచారం. ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అరికట్టే అంశంలో పాక్‌ తీసుకున్న చర్యలు ఎఫ్‌ఏటీఎఫ్‌ నిబంధనలకు అనుగుణంగా లేవని సభ్యులు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. 

పాక్‌ను గ్రే లిస్ట్‌లో పెట్టాలని ఎఫ్‌ఏటీఎఫ్‌ గత ఏడాది జూన్‌లో నిర్ణయించిన విషయం తెలిసిందే. 27 సూత్రాలతో ఒక కార్యాచరణ ప్రణాళికను ఇచ్చింది. దీనిపై గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా సమీక్ష జరిగింది. గత ఫిబ్రవరిలో రెండోసారి జరిగింది. జైషే మహ్మద్‌ సహా పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న పలు ఉగ్రవాద ముఠాలకు సంబంధించి  కార్యాచరణను అమలు చేయాలని స్పష్టం చేసింది. అయినా పాకిస్థాన్‌ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో గత జూన్‌లో మరోసారి పాక్‌ను తీవ్రంగా హెచ్చరించింది. ఉగ్రవాద ప్రమాదం పొంచి ఉన్న అంశాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ.. వ్యూహాత్మక లోపాలను అధిగమించడానికి ఎఫ్‌ఏటీఎఫ్‌ కార్యాచరణ ప్రణాళికను సరిగా అమలు చేయాలని పేర్కొంది. అలాగే అక్రమ నగదు చలామణి, ఉగ్రవాద నిధుల సరఫరా అరికట్టే అంశంలో పాక్‌ తీసుకుంటున్న చర్యలు ఎఫ్‌ఏటీఎఫ్‌ నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ఉగ్రవాద ముఠాలకు ఆర్థిక మూలాలతో పొంచి ఉన్న ముప్పుపై సరైన అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అయినా పాక్‌ కంటితుడుపు చర్యలకే పరిమితమవడం గమనార్హం.

దీంతో ఎఫ్‌ఏటీఎఫ్‌ ఏపీజీ తదుపరి కార్యాచరణను అమలు చేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని అరికట్టడం, అక్రమ నగదు చలామణి లాంటి అంశాల్లో ఎఫ్‌ఏటీఎఫ్‌ చేసిన సూచనల అమలుకు చివరి గడువైన అక్టోబర్‌ నాటికైనా లక్ష్యాలను చేరుకోని పక్షంలో పాక్‌కు బ్లాక్‌ లిస్ట్‌ ముప్పు తప్పదు.   



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.