close

తాజా వార్తలు

పేరుకే ఇమ్రాన్‌.. పెత్తనమంతా సైన్యానిదే..!

అమెరికా సీఆర్‌ఎస్‌ నివేదికలో బయటపడిన నిజాలు 

వాషింగ్టన్‌‌: పాకిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వం ఉన్నా.. అదంతా మేడిపండు ప్రజాస్వామ్యమేనని, అసలు పెత్తనమంతా సైన్యానిదేనని అమెరికా కాంగ్రెస్‌ నివేదిక సీఆర్‌ఎస్‌ తెలిపింది.  ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలో పాక్‌ విదేశాంగ విధానం, భద్రతా విధానాలన్నింటినీ సైన్యం తీవ్రంగా ప్రభావితం చేస్తోందని పేర్కొంది. అధికారంలోకి రావడానికి ముందు ఇమ్రాన్‌ ఖాన్‌కు ఎలాంటి పాలనా అనుభవం లేదని.. అయితే,  అప్పటి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను అధికారంలోనుంచి దించాలనే ఏకైక దురుద్దేశంతో ఎన్నికల సమయంలో పాక్‌ సైన్యం దేశీయ రాజకీయాలను తారుమారు చేసిందని సీఆర్ఎస్ నివేదిక స్పష్టంచేసింది.

నయాపాకిస్థాన్‌ అన్న నినాదంతో.. మభ్యపెట్టి

ఇమ్రాన్‌ సారథ్యంలోని తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ పార్టీ  నయా పాకిస్థాన్‌ అన్న నినాదంతో ఎన్నికల బరిలోకి దిగి  చాలా మంది యువ, పట్టణ, మధ్యతరగతి ఓటర్లను ఆకర్షితుల్ని చేశారని.. అభివృద్ధికి సోపానాలు వేస్తున్నట్టు పైకి చెప్పినప్పటికీ అవేమీ సాకారం కావడం లేదని వెల్లడిమచింది. అవినీతిని నిరోధించడంతో పాటు మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణను అందించే సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమని చెప్పినప్పటికీ ఆ దిశగా ఇమ్రాన్‌ ప్రయత్నాలేమీ చేయడంలేదని.. ఆయన సైన్యం చేతుల్లో కీలుబొమ్మలా మారిపోయారని తెలిపింది. పాకిస్థాన్‌ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటోందని, దీన్నుంచి బయటపడాలంటే.. కొత్త దేశీయ రుణాలతో పాటు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది. పాక్‌ సైన్యం విదేశాంగ, దేశీయ భద్రతపై ఆధిపత్యం చెలాయించడమే ఎక్కువగా కనబడుతోందని తెలిపింది. 

నవాజ్‌ షరీఫ్‌ పార్టీని బలహీనపరిచి..
సీఆర్‌ఎస్‌ అనేది అమెరికాకు చెందిన స్వతంత్ర పరిశోధనా విభాగం. చట్టసభ్యులకు ఆసక్తి కల్గించే అంశాలపై ఇది అవసరమైన నివేదికలు రూపొందిస్తుంటుంది. అమెరికా చట్టసభ్యులకు సమాచారం అందిస్తుంది.నవాజ్ షరీఫ్‌ను అధికారం నుంచి తొలగించి, ఆయన పార్టీని బలహీనపర్చాలన్న ఉద్దేశంతోనే పాక్‌ భద్రతా దళాలు దేశీయ రాజకీయాలను రహస్యంగా తారుమారు చేశాయని చాలా మంది విశ్లేషకులు తమ అధ్యయనాల్లో పేర్కొన్నారని నివేదిక తెలిపింది. 

అలాగే, సైన్యం- న్యాయ వ్యవస్థ అపవిత్ర కలయిక ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీకి లబ్ధి చేకూర్చాయని నివేదికలో వెల్లడించింది. పాకిస్థాన్‌లో ప్రజాస్వామిక నిబంధనలు తీవ్ర దుర్వినియోగానికి గురవుతున్న అంశంపై  ఎన్నికల పరిశీలకులు, మానవహక్కుల సంఘాలు గళం విన్పించాయని నివేదిక పేర్కొంది. నిషేధానికి గురైన జైష్‌, లష్కర్‌ తొయిబా, ఐసిస్‌ లాంటి ముష్కర గ్రూపులతో సంబంధం ఉన్న చిన్నచిన్న పార్టీలు గత ఎన్నికల్లో పాల్గొనడం మిలిటెంట్లకు మరింత ఊపునిచ్చాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో ఉగ్రవాద సానుభూతి రాజకీయపక్షాలు 10శాతం ఓట్లను సాధించడంపై నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.