పులి... సింహం...ఏదైతే ఆమెకేం!
close

తాజా వార్తలు

Published : 01/09/2019 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పులి... సింహం...ఏదైతే ఆమెకేం!


అది గుజరాత్‌లోని గిర్‌ అరణ్యం. అంతటా దట్టమైన చెట్లూ, పొదలూ...ఏ పొద మాటున ఏ సింహం ఉంటుందో... ఎటువైపు నుంచి ఏ పులి వచ్చి దాడి చేస్తుందో చెప్పలేం. క్షణం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణం మీదికొస్తుంది. అలాంటి ప్రాంతంలో ఎంతో ధైర్యంగా వన్యప్రాణులను రక్షిస్తోంది రసీలా వాథెర్‌. గిర్‌ అభయారణ్యంలో ఏకైక రెస్క్యూ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ఆమె.
మండు వేసవి. గిర్‌ అభయారణ్యంలోని జాతీయపార్కులో ఓ సింహం గాయపడి రహదారిపై పడి ఉందంటూ రెస్క్యూ అధికారిణి రసీలాకు ఫోనొచ్చింది. హుటాహుటిన ఆ ప్రదేశానికి సిబ్బందితో కలిసి జీపులో వెళ్లిందామె. గొంతులో ఏదో ఇరుక్కుపోయి అది బాధపడుతోంది. సింహం లేచే పరిస్థితి లేదనుకున్న రసీలా... దానికి మత్తు ఇంజెక్షను ఇచ్చి, బోను కోసం వెనక్కి వెళ్తోంది. అకస్మాత్తుగా అది ఆమెవైపు వేగంగా దూసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఆ అడుగుల చప్పుడు విని తేరుకున్న ఆమె మరింత వేగంతో జీపును చేరుకుంది. తృటిలో ప్రమాదం నుంచి గట్టెక్కింది. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఆమెకు తరచూ ఎదురవుతూనే ఉంటాయి.

రసీలా గుజరాత్‌, భొండూరి గ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది. చిన్నవయసులోనే తండ్రి చనిపోయాడు. రసీలా, ఆమె అక్క, తమ్ముడిని పోషించడానికి తల్లి రోజూ కూలీకి వెళ్లేది. పదోతరగతి పాసైన తరువాత ఆమె ఏదైనా చిన్న ఉద్యోగం వెతుక్కుని అమ్మకు చేదోడువాదోడుగా నిలవాలనుకుంది. అదే సమయంలో వార్తాపత్రికలో గిర్‌ ఫారెస్ట్‌ గార్డులకు ఉద్యోగాల ప్రకటన వెలువడటంతో తమ్ముడిని ప్రయత్నించమని చెప్పింది. అతడు ఆసక్తి చూపించలేదు. ఆ పోస్టులకు అమ్మాయిల్నీ ఎంపిక చేస్తున్నారని తెలుసుకుని      ఆ పరీక్షలకు హాజరైంది. శిక్షణ తీసుకుని, శారీరక ధారుఢ్య పరీక్షల్లో పాల్గొని, పాసైంది. అలా 2007లో రూ.2,500 జీతంతో ఉద్యోగంలో చేరింది.
* సింహం దాడి చేస్తున్నా...
రసీలా మొదట టెలీ కమ్యూనికేషన్స్‌ విభాగంలో విధులు నిర్వర్తించేది. ఎప్పటినుంచో అడవిలో పనిచేయాలని ఉన్నా... చాలా మంది ఆమెను భయపెట్టారు. అయినా వెనకడుగు వేయలేదామె. ప్రమాదకర పరిస్థితుల్లో ఉద్యోగం చేయడం చూసి తల్లీ భయపడేది. కుటుంబ భారం మోయడానికి కష్టపడుతున్న కూతురిని చూసి బాధపడేది. అక్కడి పరిస్థితులు తట్టుకోలేక మానేస్తుందనీ హేళన చేశారు కొందరు. ఎంతమంది వెనక్కిలాగినా ఆమెలో కసి పెరిగిందే తప్ప తగ్గలేదు. పట్టుదలతో రెస్క్యూ ఆఫీసర్‌గా మారింది.  ‘పనివేళలు ఎనిమిది గంటలే అయినా ఒక్కోసారి 12 గంటలు పని చేయాల్సి వచ్చేది. వన్యమృగాలు ఆపదలో ఉన్నా, ప్రజలకు ప్రమాదం పొంచిఉన్నా తక్షణం అక్కడకు చేరుకోవాలి. అడవిలో అప్పుడప్పుడు అగ్నిప్రమాదాలు జరగడమూ మామూలే.  అటవీ ప్రాంతంలో దుండగులు ప్రవేశించినా వెంటనే అప్రమత్తం కావాలి. అది 2014. దగ్గర్లోని జలంధర్‌ గ్రామంలో నీరు లేని లోతైన బావిలో సింహం పడిపోయింది. మా జట్టులో వన్యప్రాణులను రక్షించడానికి సిబ్బంది, డ్రైవరు, వైద్యుడు ఉంటారు. ఆ రోజు రక్షణ సిబ్బంది లేరు. మేం ముగ్గురమే అక్కడికి చేరుకున్నాం. బావిలో పడిన సింహం గర్జిస్తోంది. ముందుగా పెద్దతాడు లోపలికి పంపాం. కోపంతో దాన్ని కొరికేసింది. బావిలోకి దిగితేనే దానిని రక్షించగలమని అర్థమైంది. కానీ ఎవరూ ధైర్యం చేయకపోవడంతో నేనే దిగడానికి సిద్ధమయ్యా. మిగిలిన వారు నన్ను వద్దని వారించినా వినలేదు. చివరకు ఇనుప పంజరంలో నేను కూర్చుంటే దాన్ని బావిలోకి దింపారు. అదిచూసి సింహం దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంటే గుండెల్లో దడ. అది విసిరిన పంజాకు నాకు గాయాలయ్యాయి. బెదరకుండా దానికి మత్తు ఇంజక్షన్‌ ఇవ్వగలిగా. ఆ తరువాత దాన్ని అదే పంజరంలో పైకి తీసుకొచ్చా. ఇలాంటి సంఘటనలు నా జీవితంతో ఎన్నో’ అని చెబుతుందీ అధికారిణి.
* గ్రామాల్లో...
గిర్‌ అటవీప్రాంతానికి సమీపంలో దాదాపు 300 గ్రామాలున్నాయి. వన్యప్రాణులు గ్రామాల్లోకి ప్రవేశించి వారిపై దాడులకు దిగిన సందర్భాలు అనేకం. సమాచారం అందగానే అక్కడికి చేరుకుని వారికి సూచనలివ్వాల్సిన బాధ్యతా రసీలాదే. ‘వాటిని బయట బంధించడం కష్టం. ఆ సమయంలో అవి చాలా కోపంగా ఉంటాయి. వాటిని గమనిస్తూ, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ పట్టుకోవాల్సి ఉంటుంది. మరోవైపు చుట్టూ ఉన్న ప్రజలకూ ధైర్యం చెప్పాలి. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది...’ అని వివరిస్తుంది రసీలా.


వాటి సంఖ్యను పెంచి...

ఈ అడవిలో చిరుతలు, సింహాలతో పాటు మొసళ్లు, కొండచిలువలు సహా ఎన్నో ఉంటాయి. విధుల్లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు 1,100 వన్యప్రాణులను సంరక్షించిందామె. ఇందులో 515 చిరుతలు, 250 సింహాలున్నాయి. అటవీశాఖ లెక్కల ప్రకారం గతంలో ఈ అడవిలో 359 చిరుతలుండగా, ఇటీవల ఆ సంఖ్య 500కు పెరిగింది. సింహాల సంఖ్య ప్రస్తుతం 523కు చేరుకుంది. గుంపునకు దూరమయ్యే వన్యప్రాణుల పిల్లలను సంరక్షించి, తిరిగి వాటిని తల్లి వద్దకు చేర్చడమూ రసీలా బాధ్యతే.


 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని