close

తాజా వార్తలు

ఆర్థిక విష వలయంలో భారత్‌..?

 కొనుగోళ్లు తగ్గడమే సమస్యకు మూలం..
  

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: భారత్‌ ఇప్పుడు ఆర్థిక విష వలయంలో చిక్కుకొనే పరిస్థితి నెలకొంది. ఇది ఆర్థిక మాంద్యం కాదు.. వృద్ధిరేటు నెమ్మదించడం అంటారు. ఈ రెండిటికీ తేడా ఉంది.. వరుసగా రెండు త్రైమాసికాల్లో దేశ జీడీపీ వృద్ధి మైనస్‌లో ఉంటే అది ఆర్థిక మాంద్యం.. అదే వరుస త్రైమాసికాల్లో దేశ జీడీపీ వృద్ధిరేటు మందగిస్తుంటే దానిని వృద్ధిరేటు మాంద్యం (గ్రోత్‌ రెసిషన్‌) అంటారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఈ పరిస్థితుల్లో ఉంది. గత శుక్రవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇది ఒక రకంగా విష వలయం వంటిది.. దీనిలో చిక్కుకుంటే నానాటికీ పరిస్థితులు క్షీణించే ప్రమాదం ఉంది. ఏప్రిల్‌- జూన్‌లో భారత ఆర్థిక వ్యవస్థ నిరాశాజనక పనితీరు కనబర్చింది. దేశ జీడీపీ వృద్ధి ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. 5 శాతానికి వృద్ధి రేటు పడిపోయిందని శుక్రవారం అధికారిక గణాంకాలు వెల్లడించాయి. 2012-14లో నమోదైన 4.3 శాతం తర్వాత ఇదే అత్యంత తక్కువ వృద్ధి రేటు. తయారీ రంగం నెమ్మదించడం, వ్యవసాయ ఉత్పత్తిలో క్షీణత లాంటివి దేశ వృద్ధిని వెనక్కి లాగేశాయి.
భారత్‌ సాధారణంగా దేశీయ డిమాండ్‌పై ఆధారపడి వృద్ధి సాధిస్తున్న దేశం. ఎగుమతుల విలువ సుమారు 500 బిలియన్‌ డాలర్ల వరకే ఉంటుంది. మిగిలినది మొత్తం దేశీయ మార్కెట్‌లో ఉండే డిమాండే. 2008లో ఆర్థిక సంక్షోభానికి భారత్‌ తట్టుకొని నిలబడటానికి ఇదే ప్రధాన కారణం. ఈ సారి దేశీయ మార్కెట్లో డిమాండ్‌ పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.  ఇది చాలదన్నట్లు ప్రపంచంపై ఆర్థిక మాంద్యం  భయాలు ముసురుకోవడం, వాణిజ్య యుద్ధం ఇవన్నీ ఒకే సమయంలో కలిసి రావడంతో భారత వృద్ధిరేటు నెమ్మదించింది. 

కొనుగోళ్లు తగ్గడం..

దేశంలో అత్యధిక మంది నివసించే గ్రామాల్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు. గత ఏడాది వ్యవసాయ రంగం కరవు పరిస్థితులను ఎదుర్కొంది. ఫలితంగా ఆహార ధాన్యాల దిగుబడి కూడా 283.4 మిలియన్‌ టన్నులకే పరిమితమైంది. ఇది అంతకు ముందు ఏడాది దిగుబడి 285 మిలియన్‌ టన్నులతో పోలిస్తే తక్కువ. ఈ ప్రభావం కచ్చితంగా రైతులను ఖర్చులు తగ్గించుకొనేలా చేసింది. దీనికి తోడు చెరకు రైతులకు కంపెనీలు 25 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి పెద్దరాష్ట్రాల్లో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రైతులు ఖర్చులు తగ్గించుకొన్నారు. ఈ మేరకు ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. అందుకే ట్రాక్టర్ల విక్రయాల్లో కూడా తగ్గుదల కనిపించింది. 

మరోపక్క నిరుద్యోగం రేటు గత 45ఏళ్లలో ఎన్నడు లేని స్థాయికి చేరిందని ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఉద్యోగాలు లేకపోతే డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు చేస్తారు..?  పైగా పెరుగుతున్న నిరుద్యోగ భయాలు మిగిలిన వారిని ఖర్చులు తగ్గించుకొనేలా చేస్తున్నాయి. ఈ ప్రభావం ఎఫ్‌ఎంసీజీ రంగంపై పడింది. అందుకే బిస్కెట్ల విక్రయాలు కూడా తగ్గాయి. సామాన్యుడి కొనుగోలు శక్తి తగ్గిందనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. 

ప్రభుత్వ వ్యయాలు తగ్గడం..

ప్రభుత్వం కూడా వ్యయాలను తగ్గించుకోవడంతో వ్యవస్థలోకి నగదు ప్రవాహం తగ్గింది. ముఖ్యంగా ద్రవ్యలోటును కట్టడి చేయడానికి ప్రభుత్వం వ్యయాలకు  కళ్లెం వేసింది. దీనికి తోడు జీఎస్‌టీ వసూళ్లు అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఖర్చుల విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో కఠినమైన ఆర్థిక క్రమశిక్షణకు తెరతీసింది. ద్రవ్యలోటును 3 శాతానికి పరిమితం చేయాలని భావించి వ్యయాలను తగ్గించింది. ఇది మిగిలిన రంగాలపై ప్రభావం చూపింది. ప్రభుత్వ పనులు, కాంట్రాక్టులు తగ్గితే సాధారణంగా ఉద్యోగాలు తగ్గుతాయి. ఆ మేరకు ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. 

పెట్టుబడులు తగ్గడం..

సాధారణంగా పెట్టుబడులు ఉద్యోగాలను తీసుకొస్తాయి. భారత్‌లో పెట్టుబడులు క్రమంగా తగ్గడంతో ఉద్యోగాలు రావడం తగ్గింది. 2011 నుంచి భారత్‌లో పెట్టుబడుల వృద్ధిరేటు మైనస్‌లో ఉంది. గత  ఏడాది కూడా  ఇదే కొనసాగింది. సాధారణంగా పెట్టుబడులు పెడితే వాటికి మంచి లాభాలను ఆశించడం వ్యాపారి నైజం. పారిశ్రమిక రంగంలో  పెట్టుబడులు ఎక్కువగా మిషనరీ, మౌలిక సదుపాయాలపై ఉంటాయి. వీటిపై భారీగా పెట్టుబడి పెట్టిన తర్వాత రాబడి తక్కువగా ఉంటే అది వ్యాపారికి నష్టదాయకం. ప్రస్తుతం ప్రజలు వ్యయాలు తగ్గించుకోవడంతో డిమాండ్‌ పడిపోయింది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టేందుకు  ఎవరు మొగ్గుచూపడంలేదు. 2019 మేలో ఆర్‌బీఐ నివేదిక ప్రకారం ప్రైవేటు రంగంలో కాపెక్స్‌ ప్లాన్‌ 2016-17లోని రూ.1.65 లక్షల కోట్ల నుంచి 10.15 శాతం తగ్గింది. ఇక ఆర్థిక వ్యవస్థలోని మొత్తం పెట్టుబడులను కొలిచే గ్రాస్‌ఫిక్స్‌డ్‌ ఫార్మేషన్‌ 2011లో34.3శాతం ఉండగా.. అది 2018 వచ్చేసరికి 28.8శాతానికి తగ్గింది.  ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో భారీగా తగ్గుదల కనిపించింది. 

కీలక రంగాల్లో కొనుగోళ్లను ప్రభావితం చేసే ఎన్‌బీఎఫ్‌సీలు తీవ్ర నగదు సంక్షోభంలో ఉన్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు చెందిన కొన్ని రకాల ఆస్తులను ప్రభుత్వరంగ బ్యాంకులు కొనుగోలు చేస్తే 10శాతం నష్టాలకు హామీ ఉండేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కానీ, ఈ ఒక్క చర్యతో ఎన్‌బీఎఫ్‌సీలకు నగదు వచ్చే పరిస్థితి లేదు. చిన్న, మధ్యతరహా సంస్థలకు ఎన్‌బీఎఫ్‌సీలే పెట్టుబడి సమకూరుస్తుంటాయి. 

వివిధ కారణాలతో స్టాక్‌ మార్కెట్లు వేగంగా విలువ కోల్పోతుండటంతో షేర్లను తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకొనే శక్తి కంపెనీలకు క్షీణిస్తోంది. ఇది కంపెనీల విస్తరణ, పనితీరుపై ప్రభావం చూపింది. ఈ ప్రభావం ఉద్యోగ సృష్టిని కూడా ప్రభావితం చేసింది.  

పడిపోయిన ఎగుమతులు..

జూన్‌ త్రైమాసికంలో ఎగుమతులు పడిపోవడం కూడా జీడీపీ తగ్గడానికి ఒక కారణం. చైనాకు చేసే ఎగుమతుల్లో 14.1శాతం తగ్గుదల కనిపించింది. చైనా దిగుమతులు 7శాతానికి పైగా తగ్గిపోవడం ఇందుకు నిదర్శనం.  ఆ దేశంలో వాణిజ్య యుద్ధం కారణంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గడమే దీనికి కారణం. యూఏఈకి ఎగుమతులు 15 శాతానికి పైగా తగ్గాయి. దీనికి తోడు అమెరికా భారత్‌కు జీఎస్‌పీ ఎత్తివేయడం, వాణిజ్య యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా భయాలు నెలకొని వ్యయాలు తగ్గడం దీనికి ప్రధాన కారణం.  పై అంశాలు మొత్తం ఒకదానికి మరొకటి అనుబంధంగా ఉంటాయి. ఏ ఒక్కటి దెబ్బతిన్నా దాని ప్రభావం మిగిలిన అంశాలపై చూపిస్తుంది. 

ఇక్కడ ప్రభుత్వ లోపాలు కూడా ఉన్నాయి..

 పెద్ద నోట్ల రద్దు సందర్భంగా నగదు కొరత తీవ్రంగా ఏర్పడింది. ఈ సమయంలో భారీగా అసంఘటిత రంగంలో ఉద్యోగాలు  పోయాయి. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ కొనుగోలు శక్తిని ప్రభావితం చేశాయి. దీనికి తోడు రైతులకు బ్యాంకుల నుంచి వెంటనే అప్పుల రూపంలో పెట్టుబడి లభించలేదు. ఇది కూడా వ్యవసాయ రంగంపై ప్రభావం చూపింది. 
జీఎస్‌టీ వంటి పన్ను సంస్కరణలను తీసుకురావడాన్ని అందరూ ఆహ్వానిస్తారు. కానీ వివిధ స్లాబులతో గందరగోళంగా వచ్చిన జీఎస్‌టీ కూడా ప్రభుత్వ ఆదాయాన్ని ప్రభావితం చేసింది. 
ఎన్‌బీఎఫ్‌సీల నగదు సంక్షోభాన్ని తీర్చేందుకు ప్రభుత్వం వేగంగా స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి. దీని ప్రభావం తయారీ రంగంపై పడింది. దీని దెబ్బకు ఆటోమొబైల్‌ రంగం బాగా ప్రభావితమైంది. 

తక్షణం మెరుగవ్వడానికి కొన్ని ఉపశమనాలు..

పారిశ్రామిక రంగానికి, వినియోగదారులకు రుణ సదుపాయాలను మెరుగుపర్చాలి. ఇవి పెట్టుబడులను పెంచడంతోపాటు.. కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయి. 
ఆటోమొబైల్‌ రంగం ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మళ్లడానికి మినహాయింపులు ఇవ్వాలి. 
జీఎస్‌టీ నిబంధనల్లో మార్పు తీసుకురావాలి. రూ. కోటి కంటే తక్కువ వ్యాపారం చేసే కంపెనీల నుంచి 3నెలలకు ఒక సారి జీఎస్‌టీ వసూలు చేయాలి. 
 జీఎస్‌టీ స్లాబ్‌ రేట్లను తగ్గించాలి. ఎక్కువ మంది పన్ను చెల్లించేలా  ప్రోత్సహించాలి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణాలు ఇచ్చే విధివిధానాల్లో మార్పులు చేయాలి. 
తాజాగా ఆర్‌బీఐ నుంచి మిగులు నిధులను తీసుకోవడంతో ప్రభుత్వ వ్యయాలు పెరిగి మళ్లీ ఆర్థిక వ్యవస్థ పుంజుకొనే అవకాశం ఉంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.