close

తాజా వార్తలు

మా వైపు గొటబయ.. మరి మీ అభ్యర్థి?

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల కోలాహలం మొదలయింది. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స సారథ్యంలోని శ్రీలంక పొడుజన పెరమున  పార్టీ తరఫున రాజపక్స సోదరుడు గొటబయ రాజపక్సను అభ్యర్థిగా ప్రకటించారు. అధికారంలో ఉన్న యూఎన్‌పీ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. 

2015లో అనూహ్యంగా మైత్రిపాల
2015లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో న్యూడెమోక్రటిక్‌ ఫ్రంట్‌ తరఫున అభ్యర్థిగా నిలిచిన మైత్రిపాల సిరిసేన 51.28 శాతం ఓట్లతో  అధ్యక్షుడు మహిందా రాజపక్సను ఓడించారు. రాజపక్స కుటుంబ రాజకీయాలు, హింస, మైనార్టీలైన తమిళుల పట్ల వారు అనుసరించిన వైఖరి..ఓటమి బాట పట్టించాయి. సిరిసేన మొదట్లో రాజపక్స ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా చివర్లో ఫిరాయించి యూఎన్‌పీ సారథ్యంలోని న్యూడెమోక్రటిక్‌ కూటమి అభ్యర్థిగా నిలిచారు. రణిల్‌ విక్రమసింఘే నేతృత్వంలో రాజపక్స వ్యతిరేకశక్తులన్నీ ఒకటి కావడంతో సిరిసేనకు విజయం సులభమైంది. అయితే సిరిసేన మాత్రం కొంతకాలంలో రణిల్‌కు దూరమై మళ్లీ రాజపక్స వైపు మళ్లడం గమనార్హం. అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన కొద్దికాలానికే సిరిసేనకు శ్రీలంక ఫ్రీడం పార్టీ సారధ్యాన్ని అప్పగించారు.

యూఎన్‌పీ అభ్యర్థి ఎవరు?
తాజాగా జరగనున్న ఎన్నికల్లో రాజపక్స కుటుంబం  శ్రీలంక పొడుజన పెరమున  పార్టీ  తరఫున గొటబయ రాజపక్సను అభ్యర్థిగా ప్రకటించారు. యూఎన్‌పీ నుంచి ప్రస్తుత ప్రధాని రణిల్‌ విక్రమసింఘే లేదా మాజీ ప్రధాని ప్రేమదాస కుమారుడైన సాజిత్‌ ప్రేమదాస అభ్యర్థిగా ప్రకటితమయ్యే అవకాశముంది. 

గొటబయపై విమర్శల వర్షం
గొటబయ రాజపక్సపై మానవహక్కుల సంఘాలు, మైనార్టీలు విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నాయి. 2005 నుంచి 2015 వరకు ఆయన రక్షణశాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో మైనార్టీ తమిళులకు చెందిన వందలాది మంది యువకులు అదృశమయ్యారు. ఇంతవరకు వారి ఆచూకీ తెలియలేదు. శ్రీలంక ఉదారవాదులను కూడా ఇలాగే అపహరించేవారు. తెల్లవ్యాన్లలో వచ్చే భద్రతాసిబ్బంది వీరిని కిడ్నాప్‌ చేసేవారు. అప్పట్లో ప్రముఖ జర్నలిస్టు లశాంత విక్రమసింఘేను కూడా ఇదే రీతిలో చంపివేశారు. తమిళపులులపై యుద్ధం చివరిరోజుల్లో లొంగిపోయినవారిని చిత్రహింసలు పెట్టి చంపేవారు. ఈ దారుణాల వెనక గొటబయ హస్తముందని మానవహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అమెరికా పౌరసత్వం కలిగిన గొటబయ శ్రీలంకలో ఎలా పోటీచేస్తారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఆ దుర్మార్గులు గేట్‌ వద్దే ఉన్నారు..
తెల్లవ్యాన్లతో రక్తపాతం సృష్టించిన దుర్మార్గులు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్నారు. వారిని ఎదుర్కొందాం అని మంత్రి మంగళ సమరవీర ట్వీట్ చేశారు. గొటబయ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఉద్యమం ప్రారంభమైంది. 

వేడెక్కనున్న ప్రచారం
శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్‌ వెలువడలేదు. షెడ్యూల్‌ను విడుదల చేయగానే ఎన్నికల వేడి మొదలుకానుంది. భారత్‌తో ఎవరు సామరస్యంగా ఉంటారనే అంశంపై చర్చ జరుగుతోంది. రాజపక్సల కంటే ఇతరులే సానుకూలంగా ఉంటారని  కొందరు రాజకీయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.