close

తాజా వార్తలు

1983 వరల్డ్‌ కప్‌.. ఈయన మరోహీరో!

1983.. పసికూనలా అడుగుపెట్టిన భారత్‌ జగజ్జేతగా నిలిచింది. ప్రత్యర్థులపై సింహనాదాలు చేస్తూ తొలిసారిగా ప్రపంచకప్‌ను ముద్దాడింది. మెగాటోర్నీ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది కపిల్‌దేవ్‌ జింబాబ్వేపై చేసిన 175 పరుగులే. టీమ్‌ఇండియా విశ్వవిజేతగా నిలవడంలో ఆ ఇన్నింగ్సే ప్రధాన ఆయుధంగా మారిందని అందరూ వర్ణించారు. కానీ, భారత క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయే ఓ ఆటగాడి పోరాటంతో ప్రపంచ సమరంలో గెలిచామని అతి కొద్దిమందికే గుర్తుంది. అతడే ఆల్‌రౌండర్‌ మొహిందర్‌ అమర్‌నాథ్‌. నేడు ఆయన జన్మదినం. 

మొహిందర్‌ అమర్‌నాథ్ భరద్వాజ్‌ రక్తంలోనే క్రికెట్ ఉంది. అతడి తండ్రి లాలా అమర్‌నాథ్‌ భారత జట్టు సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. స్వాతంత్ర్యం అనంతరం తొలి టీమ్‌ఇండియా కెప్టెన్‌గా లాలా రికార్డు నెలకొల్పాడు. తండ్రి అడుగుజాడల్లోనే మొహిందర్‌ కూడా నడిచాడు. చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మమకారం పెంచుకున్నాడు. 19 ఏళ్లకే జట్టులో చోటు సంపాదించాడు. జట్టు ప్రయోజనాలే తప్ప సొంత రికార్డుల గురించి అతడెప్పుడూ ఆలోచించలేదు. ప్రపంచకప్‌లో అతడు పోరాడిన తీరే అందుకు నిదర్శనం. సెమీస్‌, ఫైనల్లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. పేసర్‌గా, టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా ఎన్నో మ్యాచుల్లో అద్భుతంగా రాణించాడు. తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాడు. ఒకానొక సమయంలో పేలవ ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు. అయినా, అద్వితీయంగా పోరాడి తిరిగి జట్టులో చోటు సంపాదించి సంచలన ప్రదర్శనలు చేశాడు. అందుకే అతడిని ‘కమ్‌ బ్యాక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్రికెటర్‌’గా పిలుస్తారు.

‘అమర్‌’ విజయం
వీలైతే బ్యాటుతో కుదిరితే బంతితో అన్న రీతిలో మొహిందర్‌.. ప్రపంచకప్‌లో చెలరేగాడు. సెమీస్‌లో బలమైన ఇంగ్లాండ్‌ను వారి సొంతగడ్డపై ఓడించడమంటే ఆషామాషీ కాదు. పసికూనగా అడుగుపెట్టి సెమీ ఫైనల్‌కు చేరిన భారత్‌ కథ ముగిసినట్టేనని భావించారంతా. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ ఇంగ్లాండ్‌పై భారత్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొహిందర్‌ ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో కపిల్‌సేన తొలి సారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆ మ్యాచ్‌లో అతడు 49 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లో విండీస్‌ను మట్టికరిపించడంలో అమర్‌నాథ్‌ కృషి ఎంతో ఉంది. తుదిపోరులో భారత ఆటగాళ్లు సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిని 140 పరుగులకే పరిమితం చేశారు. నిర్ణయాత్మక పోరులో అమర్‌నాథ్‌ చేసిన 26 పరుగులు, తీసిన మూడు వికెట్లు విజయంలో ఎంతో కీలకం.
విండీస్ విలన్  
అప్పటి కరీబియన్లను చూస్తే ప్రత్యర్థి జట్లన్నింటికీ వెన్నుల్లో వణుకే. అరవీర భయంకర బౌలర్లు విండీస్‌ సొంతం. అయితే, అమర్‌నాథ్‌ తెగువ మాత్రం ఎవరికీ ఉండదు. వెస్టిండీస్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో బంతి తగిలి అతడి దవడకు గాయమైంది. తెల్లటి అతడి జెర్సీ ఎరుపెక్కింది. రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆస్పత్రికి వెళ్లి ఆరు కుట్లు వేయించుకొని మైదానంలోకి తిరిగి అడుగుపెట్టాడు. రాబర్ట్స్‌, మార్షల్‌, హోల్డింగ్‌, గార్నర్‌ వంటి టాప్‌ బౌలర్లను ఎదుర్కొనేందుకు వెళ్లాడు. దాదాపు మూడున్నర గంటలు క్రీజులో నిలిచాడు. 30 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఆయనదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. 

అమర్‌నాథ్‌ 69 టెస్టుల్లో 4,378 పరుగులు సాధించాడు. దాదాపు 25% పరుగులు విండీస్‌పై చేసినవే. ఆ జట్టుపై 17 టెస్టుల్లో 38.42 సగటుతో 1,076 స్కోరు సాధించాడు. మూడు శతకాలు బాదాడు. ఇక 23 వన్డేల్లో 694 చేశాడు. పేలవ ప్రదర్శనతో మూడేళ్లు జట్టుకు దూరమైన మొహిందర్‌ 1982-83లో పునరాగమనం చేసి 1,182 రన్స్‌ కొట్టాడు. విండీస్‌, పాక్‌పైనే 11 టెస్టులు ఆడాడు. విదేశాల్లో 5 శతకాలు బాదాడు. 

మొహిందర్‌ గురించి ఆసక్తికర విషయాలు:

> అమర్‌నాథ్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ఎరుపు రంగు రుమాలు తన జేబులో ఉంచుకునేవాడు. దాని వల్ల కలిసొస్తుందని అతడి నమ్మకం.

> భారత్‌లో కంటే విదేశాల్లో అతడు బాగా రాణించేవాడు. స్వదేశంలో అతడు 30.44 సగటుతో పరుగులు చేస్తే విదేశాల్లో 51.80 సగటుతో చేశాడు.

> పేసర్లకు స్వర్గధామమైన పెర్త్‌ పిచ్‌లో ఆసీస్‌ బౌలర్లను అమర్‌నాథ్‌ దీటుగా ఎదుర్కొని 90 పరుగులు చేశాడు. అతడి గొప్ప ఇన్నింగ్స్‌ల్లో ఇది ఎంతో ప్రత్యేకం. 

> 1983 ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించిన అతడు తర్వాత జరిగిన విండీస్‌ సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే పరుగు తీశాడు. 

> క్రికెట్‌ చరిత్రలో హ్యాండ్లింగ్‌ ది బాల్‌, అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్‌తో ఔటైన ఏకైక ఆటగాడు అమర్‌నాథ్‌.

> 1969 ఆసీస్‌ టెస్టుతో అరంగ్రేటం చేసిన అతడు మరో మ్యాచ్ కోసం ఏడేళ్లు ఎదురు చూశాడు. 1976 న్యూజిలాండ్‌ సిరీస్‌లో తిరిగి జట్టులో చోటు సంపాదించాడు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.