close

తాజా వార్తలు

ట్రంప్‌ ఫోన్‌లో ఏం మాట్లాడారంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎవరికి తెలియదులే అనుకొని చేసిన ఒక పని ఇప్పుడు ఆయన పదవి మీదకు తెచ్చింది. బుధవారం ట్రంప్‌పై ప్రతినిధుల సభ అభిశంసన దర్యాప్తు తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆయనపై ఇటువంటి తీర్మానం ప్రవేశపెట్టడం ఇది రెండోసారి. కానీ, ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఆయనపై వచ్చిన ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలు ఉన్నాయి. వీటిని ఇటీవల బహిర్గతం చేశారు కూడా..

ఆరోపణలు ఏమిటీ.. 

ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన జో బిడెన్‌ వచ్చే ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయనకు ఇబ్బందులు కలిగించే ఉద్దేశంతో తూర్పు ఐరోపా దేశమైన ఉక్రెయిన్‌ సహాయాన్ని తీసుకున్నారన్నది ట్రంప్‌పై ఉన్న ప్రధాన ఆరోపణ. ప్రతిపక్షాల కథనం ప్రకారం...బిడెన్‌ కుమారుడు హంటర్‌ గతంలో ఉక్రెయిన్‌ దేశంతో వ్యాపారాలు చేశారు. దాన్ని అవకాశంగా తీసుకొని బిడెన్‌, హంటర్‌లపై అవినీతి ఆరోపణలు చేసి, దర్యాప్తు చేయించాల్సిందిగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోల్డీమిర్‌ జెలినిస్కీపై ట్రంప్‌ ఒత్తిడి తీసుకొచ్చారు. ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెంచేందుకు ఆ దేశానికి ఇవ్వాల్సిన 4 బిలియన్‌ డాలర్ల  సైనిక ఆర్థిక సాయాన్ని నిలిపివేశారు. 

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోల్డీమిర్‌ జెలినిస్కీ పార్టీ పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందించేందుకు ట్రంప్‌ ఫోన్‌ చేశారు.

ఆ ఫోన్‌కాల్‌లో ఏం మాట్లాడారు.. (సంక్షిప్తంగా)

ట్రంప్‌: గొప్ప విజయం సాధించినందుకు అభినందనలు. మీరు అద్భుతంగా పనిచేయడాన్ని అమెరికా నుంచి వీక్షిస్తున్నాం. మీరు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా విజయం సాధించారు. మీ విజయానికి అభినందనలు.

జెలినిస్కీ: మీరు చెప్పింది  నిజమే ‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌’. మేము దీనికోసం బాగా కష్టపడ్డాము. ఒకటి మాత్రం ఒప్పుకోవాల్సిందే. మీ నుంచి నేను నైపుణ్యాలను, విజ్ఞానాన్ని పొందాను. మొదటి సారి నేను అధ్యక్షుడిగా గెలిచినప్పుడు మీరు కాల్‌ చేసి అభినందించారు. ఇప్పుడు రెండోసారి మా పార్టీ విజయం సాధించినందుకు అభినందించేందుకు కాల్‌చేశారు. నేను మరిన్నిసార్లు పోటీ చేస్తాను.. మీరు మరిన్నిసార్లు కాల్‌ చేయొచ్చు.. మనం ఫోన్‌లో మరింత తరచూ మాట్లాడుకోవచ్చు. 

ట్రంప్‌: మంచి ఆలోచన. అలా అయితే మీ దేశం కూడా ఆనందంగా ఉంటుంది. 

జెలినిస్కీ: మేము దేశంలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాము. చాలా మంది కొత్తవారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చాము. వారంతా వయస్సు మళ్లిన వారు కాదు. వారంతా సమస్యలు సృష్టించే వారు కాదు. మాకు కొత్త విధానం.. కొత్త పాలన కావాలి. ఈ విషయంలో మీరు మాకు గురువు. 

ట్రంప్‌: సంతోషం. మేము ఉక్రెయిన్‌ కోసం చాలా సమయం, శ్రమ వెచ్చించాము. ఐరోపా దేశాల కంటే చాలా ఎక్కువ కృషి చేశాము. జర్మనీ దాదాపు ఏమీ చేయలేదు. వారు ఒట్టి మాటలు చెబుతారు అంతే. మీరు దీనిపై వారిని అడగాలి. నేను ఏంజెలీనాతో మాట్లాడినప్పుడు ఉక్రెయిన్‌ గురించి చెప్పారు. కానీ, చేసిందేమీ లేదు. చాలా ఐరోపా దేశాలు అంతే. ఉక్రెయిన్‌కు చాలా మంచి చేసింది అమెరికానే.  నేను దానికి ప్రతిఫలం ఉండాలని అనుకోవడం లేదు. అమెరికా ఉక్రెయిన్‌కు చాలా మంచి చేసింది. 

జెలినిస్కీ: మీరు చెప్పింది నిజం. 100శాతం కాదు.. 1000శాతం నిజం. ఇక్కడ మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మెర్కెల్‌, మాక్రోన్‌తో కలిసి మాట్లాడాను. ఆంక్షల(రష్యాపై) విషయంలో వారు చేయాల్సింది కూడా చేయడంలేదని చెప్పాను.  వారు ఆంక్షలను అమలు చేయడంలేదు. వారు ఉక్రెయిన్‌కు చేయాల్సినంత చేయటం లేదు. వాస్తవానికి ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌కు అతిపెద్ద వ్యాపార భాగస్వాములు కావాలి. కానీ, సాంకేతికంగా అమెరికా అతిపెద్ద వ్యాపార భాగస్వామి . అమెరికా మా దేశం కోసం చాలా చేస్తున్నందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ముఖ్యంగా రష్యాపై ఆంక్షల విషయంలో ఐరోపా కంటే ఎక్కువ సాయం చేస్తున్నారు. మాకు రక్షణ రంగంలో బాగా సహకారం అందిస్తున్నారు.. దీనిని  మరింత ముందుకు తీసుకువెళ్లాలి. మేము అమెరికా నుంచి మరిన్ని జావెలిన్ల (భుజంపై ఉంచి ప్రయోగించే క్షిపణులు) కొనుగోలు చేసేందుకు దాదాపు సిద్ధంగా ఉన్నాము. 

ట్రంప్‌: మీరు మాకో సాయం చేస్తారని అనుకుంటున్నా. మా దేశానికి అది అవసరం. అది ఉక్రెయిన్‌కు బాగా తెలుసు. ఉక్రెయిన్‌తో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ దేశానికి సంబంధించిన ఒక సంపన్నుడికి చెందిన క్రౌడ్‌ స్ట్రైక్‌కు సంబంధించి. ఆ సర్వర్‌ ఉక్రెయిన్‌లో  ఉందని విన్నాను. ఈ మొత్తం వ్యవహారంలో చాలా విషయాలు జరిగాయి. మీ చుట్టు పక్కల ఉన్న వ్యక్తులను ఒక్కసారి చూసుకోండి. ఇటీవల రాబర్ట్‌ ముల్లర్‌  ఎంత రాద్ధాంతం చేశారో చూశారుగా. ఇదంతా ఉక్రెయిన్‌ నుంచే మొదలైంది. ఈ విషయంలో మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. మీరు చేసేది మాకు చాలా ముఖ్యం. 

(క్రౌడ్‌స్ట్రైక్‌ అనేది డెమోక్రాట్లు మెయిల్స్‌ హ్యాకింగ్‌పై దర్యాప్తు చేయడానికి  డెమోక్రాటిక్‌ నేషనల్‌ కమిటీ నియమించుకొన్న సంస్థ. ఈ సంస్థ అసలు నేరస్థులను దాచి నెపం  రష్యాపై ఉంచిందని ఆరోపణలు ఉన్నాయి.)

జెలినిస్కీ: కచ్చితంగా.. మేము మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అమెరికాలో మా రాయబారిని మార్చి ఇరుదేశాల సంబంధాలు మెరుగుపడేలా సమర్థులను నియమిస్తాను. ఆ వ్యక్తి మీ నమ్మకాన్ని పొంది మీతో మంచి వ్యక్తిగత సంబంధాలు ఉండేలా చూసుకుంటాడు. అప్పుడు మనం మరింత సహకరించుకోవచ్చు. ఇటీవల మా అసిస్టెంట్‌ గిలియాని (ట్రంప్‌ వ్యక్తిగత న్యాయ సహాయకుడు) తో మాట్లాడారు. త్వరలో ఆయన ఉక్రెయిన్‌ వచ్చే అవకాశం ఉంది. ఆయనతో భేటీ అవుతాను. నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉంటానని హామీ ఇస్తున్నాను. మీరు చెప్పిన అంశంపై బహిరంగంగా.. నిక్కచిగా దర్యాప్తు చేయిస్తానని హామీ ఇస్తున్నాను. 

ట్రంప్‌: మీకు ఒక మంచి ప్రాసిక్యూటర్‌ ఉన్నారని విన్నాను. ఆయన్ను పక్కన పెట్టారని తెలిసింది. జనం దానిగురించి మాట్లాడుకొంటున్నారు. ఆయన్ను పక్కన పెట్టడం వెనుక దుష్టుల హస్తం ఉంది. అటార్నీ జనరల్‌తో కలిసి గిలియానిని మీతో మాట్లాడమని చెబుతాను. ఆయన చాలా ప్రతిభావంతుడు. ఏం జరుగుతుందో అతడికి తెలుసు. గతంలో అమెరికాలో మీ దేశానికి చెందిన మహిళా రాయబారి పనితీరు ఏమీ బాగోలేదు. ఈ విషయం మీకు తెలియాలని చెబుతున్నాను. మరో విషయం.. బిడెన్‌ కుమారుడిపై ప్రాసిక్యూషన్‌ను బిడెన్‌ ఆపి వేయించిన విషయంపై చాలా మాట్లాడుకుంటున్నారు. మీరు ఆ విషయాన్ని కొంచెం చూస్తారా.. అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. 

జెలినిస్కీ: నేను అర్థం చేసుకున్నాను.. నాకు ఈ విషయం తెలుసు.  తొలుత ప్రాసిక్యూటర్‌ గురించి చెప్పాలనుకుంటున్నాను. పార్లమెంట్‌లో కచ్చితమైన మెజార్టీ వచ్చింది. తర్వాత వచ్చే ప్రాసిక్యూటర్‌ 100శాతం నా మనిషే. అతడినే పార్లమెంట్‌ ఆమోదిస్తుంది. అతడు లేదా ఆమె బాధ్యతలు చేపట్టాక ఈ విషయాన్ని చూస్తారు. ముఖ్యంగా మీరు చెప్పిన కంపెనీ విషయం. ఈ కేసు దర్యాప్తు అంశం నిజాయితీని నిలబెట్టే అంశంగా ఉండాలి.. మేము దానిని చూసుకొంటాము. మీ వద్ద అదనపు సమాచారం ఏదైనా ఉంటే మాకు అందించండి. అది దర్యాప్తునకు సాయపడుతుంది. అమెరికాలోని మా రాయబారి పేరు ఇవనోవిచ్‌. ఆమెను వీలైనంత త్వరగా రీకాల్‌ చేస్తాను. ఆమె విషయాన్ని నాతో చెప్పిన మొదటి వ్యక్తి మీరే. మీతో నూరు శాతం ఏకీభవిస్తాను. ఆమె పాత అధ్యక్షుడికి అనుకూలంగా ఉంటుంది. ఆమె నాకు ఆమోదయోగ్యం కాదు. 

ట్రంప్‌: మంచిది. నేను గిలియానికి మీకు ఫోన్‌ చేయమని చెబుతాను. మీరు ఆ విషయాన్ని పూర్తిగా కనుక్కోండి. మీ  ప్రాసిక్యూటర్‌ మంచివారు. మీ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందుతుందని భావిస్తున్నాను. నాకు ఉక్రెయిన్‌లో ఫ్రెండ్స్‌ ఉన్నారు. 

జెలినిస్కీ: నాకు అక్కడ చాలా మంది మిత్రులు ఉన్నారు. గతంలో అక్కడకు వచ్చినప్పుడు న్యూయార్క్‌లోని సెంట్రల్‌ పార్క్‌ వద్ద నేను బస చేశాను. దీంతోపాటు ట్రంప్‌ టవర్స్‌లో కూడా ఉన్నాను. అమెరికాకు రమ్మని ఆహ్వానించింనందుకు ధన్యవాదాలు. మనం కేసు, దర్యాప్తు విషయంలో పనిచేద్దాము. ఉక్రెయిన్‌ ఎనర్జీ రంగంలో మరింత స్వయం సమృద్ధి సాధించాలి. ఇప్పటికే ఈ విషయంలో మీతో కలిసి పనిచేస్తున్నాము. ఇప్పటికే అమెరికా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాము. భవిష్యత్తులో మీతో జరగబోయే సమావేశంపై చాలా ఆశావహంగా ఉన్నాము. 

ట్రంప్‌: మంచిది. రూడీ, అటార్నీని కాల్‌ చేయమని చెబుతాను. మీరు ఎప్పుడనుకుంటే అప్పుడు శ్వేతసౌధానికి రావచ్చు. నాకు ఎప్పుడైనా ఫోన్‌ చేయవచ్చు. 

వీరి సంభాషణ ఇలా సాగింది. చివరికి పరస్పర ఆహ్వానాల తర్వాత కాల్‌ ముగిసింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.