close

తాజా వార్తలు

 నవరత్నాలుకు చేయూతనివ్వండి

దిల్లీ: ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భేటీ ముగిసింది. వీరిద్దరూ దాదాపు 45 నిమిషాలపాటు పలు కీలక అంశాలపై చర్చించారు. అక్టోబరు 15న నెల్లూరులో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభం కానున్న వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ప్రారంభానికి హాజరు కావాల్సిందిగా  ముఖ్యమంత్రి జగన్‌.. ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. విభజన హామీలు, కడప ఉక్కుపరిశ్రమ, కాకినాడ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, ఇతర అంశాలపై చర్చించారు. పోలవరం పెండింగ్‌ నిధులు విడుదల చేయాలని సీఎం కోరారు. ప్రధాని మోదీకి సీఎం జగన్‌ సమర్పించిన విజ్ఞాపన పత్రంలోని ముఖ్యాంశాలు...

 అదనపు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కోసం విజ్ఞప్తి
‘కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.61,071.51 కోట్లు అవసరమవుతాయని గత ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్లో పేర్కొంది. ఈ ఏడాది (2019–20)లో మా ప్రభుత్వం సమర్పించిన పూర్తి స్థాయి బడ్జెట్లో ఇదే విషయాన్ని చెప్పాం.
కానీ ఇప్పటి వరకూ కేంద్రం నుంచి వచ్చింది రూ. 6,739 కోట్లు మాత్రమే. గత ప్రభుత్వం వివిధ పనులు, బిల్లులకు సంబంధించి రూ.50 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టింది. సకాలంలో నిధులు విడుదల చేసి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద వీటికి అదనంగా మరో రూ.40 వేల కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
2014–15లో రాష్ట్రాన్ని విభజించిన సమయంలో రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లుగా కాగ్‌ అంచనా వేసింది. కానీ ఇప్పటి వరకూ రూ.3,979.50 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. ఇంకా రూ.18,969.26 కోట్లు రావాల్సి ఉంది. రెవెన్యూ లోటు కింద ఇవ్వాల్సిన రూ.18,969.26 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇదే అంశంపై ఆగస్టు 23, 2019న ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో రాష్ట్రానికి చెందిన సీనియర్‌ అధికారులు సమావేశమయ్యారు. రెవెన్యూ లోటు గణాంకాలను సవరించాల్సిన అవసరాన్ని వారికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వివరించారు. రెవెన్యూ లోటు లెక్కలను సవరించడానికి సానుకూలత కూడా తెలిపారు. ఈ విషయం పరిగణనలోకి తీసుకొని రెవెన్యూ లోటు భర్తీకి ఇవ్వాల్సిన నిధులతో పాటు సవరించిన లెక్కల ప్రకారం అదనపు నిధులు కేటాయించాలి. కాబట్టి ఆ మొత్తం నిధులను వెంటనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి’.

సవరించిన అంచనాలు ఆమోదించాలి
‘పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాలు ఆమోదించాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలి. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులు రూ.5,103 కోట్లను ప్రాజెక్టుకోసం ఖర్చు చేసింది. ఆ నిధులను తక్షణమే రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి మరో రూ.16 వేల కోట్లు విడుదల చేయాలని కోరుతున్నాం. ప్రాజెక్టు కోసం ఇంకా భూసేకరణ, పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల మొత్తం రూ. 55,548 కోట్లు ఆమోదించాలని కోరుతున్నాం. ఇందులో భూసేకరణ, పునరావాస కార్యక్రమాలకే దాదాపు రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుంది.

రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.838 కోట్లు ఆదా
2014–19 మధ్య పోలవరం పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో నిపుణుల కమిటీ వేశాం.  ఆ కమిటీ సూచన మేరకు పాత కాంట్రాక్ట్‌లను రద్దు  చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించాం. పోలవరం ప్రాజెక్టు పనులను రివర్స్‌ టెండరింగ్‌ చేయడం ద్వారా దాదాపు రూ.838 కోట్లు ఆదా అయ్యాయి. ఇందులో హెడ్‌ వర్క్స్, హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు పనుల మొత్తం రూ.780 కోట్లు కాగా, టన్నెల్ పనులకు సంబంధించిన రూ.58 కోట్లు ఆదా అయ్యాయి’.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి 
‘వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని బుందేల్‌ఖండ్‌, కలహండి తరహాలో ప్రకటించారు. జిల్లాలు, వాటి ఖర్చు ప్రాతిపదికన ఈ ప్యాకేజీని రూపొందించారు. ఆ మేరకు యూపీలోని బుందేల్‌ఖండ్, మధ్యప్రదేశ్‌లోని కలహండిలో తలసరి రూ.4 వేలు కేటాయించారు. ఏపీలో మాత్రం ఆ మొత్తం కేవలం రూ.400 మాత్రమే. అందుకే ఈ ప్యాకేజీ మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడ్డ జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున ఈ 6 ఏళ్లలో రూ.2100 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ రూ.1050 కోట్లు మాత్రమే వచ్చాయి’.

కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం
‘కృష్ణా డెల్టా తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. కృష్ణా జలాలపై ఆధారపడిన ప్రాంతాల్లో సాగు నీటిని స్థిరీకరించాల్సి ఉంది. రాయలసీమ ప్రాంతానికి  ప్రధానంగా సాగు, తాగు నీటి వనరైన శ్రీశైలం రిజర్వాయర్కు నీటి సరఫరా గత 52 ఏళ్లుగా చూస్తే 1230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయింది. మరోవైపు గత 30 ఏళ్లుగా ఏటా సగటున ధవళేశ్వరం వద్ద 2780 టీఎంసీల గోదావరి వరద జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. గోదావరి నీటిని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించడం ద్వారా కృష్ణా డెల్టాను స్థిరీకరించడంతోపాటు, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు సాగు నీరు సమృద్ధిగా లభించి, ఆర్థికంగా ఆ ప్రాంతం పురోగమించడానికి దోహదపడుతుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మేలుమలుపు తిప్పే గొప్ప ప్రాజెక్టు. ఈ దిశగా సంబంధిత మంత్రులకు తగిన ఆదేశాలు జారీ చేయాలి’. 

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులకు ఆర్థిక సాయం
‘ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కడప స్టీల్‌ప్లాంట్, రామాయపట్నం పోర్టులను కేంద్రం నిర్మించాల్సి ఉంది. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఈ ప్రాజెక్టులు ఎంతో కీలకమైనవి. విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్‌  కారిడార్, కాకినాడ పెట్రోలియం కాంప్లెక్స్‌కూ తగిన రీతిలో నిధులు కావాలి. సకాలంలో ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేలా సంబంధిత మంత్రిత్వ శాఖలను ఆదేశించాల్సిందిగా కోరుతున్నాం’.

నవరత్నాలకు చేయూతనివ్వండి
‘రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాలు (పథకాలు) రాష్ట్రంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నాయి. రైతుల కోసం రైతు భరోసా, అందరికీ విద్యనందించేందుకు అమ్మ ఒడి, విద్యా దీవెన, అందరికీ ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ, నిరుపేదలకు గూడు కోసం పేదలందరికీ ఇళ్లు. ఈ ఏడాదే ఇళ్ల స్థలాల పంపిణీ, సామాజిక భద్రత కోసం పింఛన్ల పెంపు, మహిళా సాధికారత కోసం ఆసరా, నిరాదరణకు గురవుతున్న వర్గాలకు చేయూత, జలయజ్ఞం ద్వారా సాగునీటి వనరుల పెంపు ..ఇవన్నీ జాతీయస్థాయిలో అమలు చేయదగ్గవి కాబట్టి, రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని సంబంధిత మంత్రిత్వ శాఖలను ఆదేశించాలని కోరుతున్నాం’.

ప్రత్యేక హోదా ఇవ్వాలి
‘ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి మీకు ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశాం. విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయింది. ముఖ్యంగా పరిశ్రమలు, సేవా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తద్వారా రాష్ట్ర స్థూల ఆదాయంలో పెరుగుదల లేకపోగా తగ్గింది. ‘జీవీఏ’ (గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌)లో వీటి వాటా 76.2శాతం నుంచి 68.2 శాతానికి పడిపోయింది. తలసరి ఆదాయం కూడా రూ.1.46 లక్షల నుంచి రూ.1.29 లక్షలకు పడిపోయింది. ఈ పరిస్థితి మారాలంటే రాష్ట్రంలో పరిశ్రమలు, సేవా రంగం ఎంతో పురోగమించాల్సి ఉంది. అందువల్ల ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నాం.  ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలకు రాయితీలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా పెట్టుబడులను ఆకర్షించవచ్చు. పరిశ్రమలకు ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వకపోతే సహజంగా పెట్టుబడిదారులు మెట్రో నగరాలైన చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వైపు చూస్తారు’’ అని ప్రధాని మోదీకి సమర్పించిన వినతిపత్రంలో జగన్‌ పేర్కొన్నారు.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.