
తాజా వార్తలు
సీఎం సహాయనిధికి విరాళం
తిరువనంతపురం: అనుకున్న లక్ష్యాలను సాధించడానికి అంగవైకల్యం ఏమాత్రం అడ్డుకాదని అతను మరోసారి నిరూపించాడు. కేరళలోని అలతూర్కు చెందిన ప్రణవ్ బాలసుబ్రమణ్యన్ పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయితేనేం ఏ మాత్రం అధైర్యపడకుండా తన కాళ్లతో చిత్రాలు గీస్తూ గొప్ప చిత్రకారుడిగా ఎదిగాడు. తన 21వ పుట్టినరోజు సందర్భంగా కేరళ సీఎం సహాయనిధికి రూ.5000 విరాళాన్ని అందించి పెద్ద మనసు చాటుకున్నాడు. ఈ చెక్కును తానే స్వయంగా కేరళ సీఎం పినరయి విజయన్‌కు అందించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను విజయన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ఈ రోజు ఉదయం గొప్ప అనుభూతిని పొందాను. అలతూర్కి చెందిన ప్రణవ్ అనే చిత్రకారుడు నన్ను శాసనసభ కార్యాలయంలో కలిశాడు. సీఎం సహాయనిధికి తన వంతు సహాయంగా చెక్కును అందించాడు’’ అని విజయన్ తెలిపారు.
అతడికి చేతులు లేకపోవడంతో కాలితో ఇచ్చిన సహాయనిధిని ముఖ్యమంత్రి తీసుకోవడం పలువురు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా ప్రణవ్ తన ధాతృత్వాన్ని చాటుకున్నాడు. గత సంవత్సరం సంభవించిన వరదల సమయంలోనూ సీఎం సహాయనిధికి రూ.5000 నగదును అందజేశాడు.
ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ‘‘నేను భిన్నంగా జన్మించాను కాబట్టి భిన్నంగా ఆలోచిస్తాను. రియాల్టీ షో ద్వారా నేను గెలుచుకున్న మొత్తాన్ని సీఎం సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అలా నేను ఇతరులకు ఆదర్శంగా నిలవాలనుకున్నాను. మాది పేద కుటుంబం కావటం వల్ల పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్క పుట్టిన రోజును కూడా జరుపుకోలేదు. కానీ ఈ రోజు రూ. 5000ల చెక్కును సీఎం సహాయనిధికి అందజేసిన తర్వాత వెయ్యి కేకుల తిన్నంత ఆనందంగా ఉంది’’ అని తెలిపాడు. ప్రస్తుతం ప్రణవ్ డిగ్రీ పూర్తిచేసి ఉన్నత చదువుల కోసం శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపాడు.