
తాజా వార్తలు
దిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) హాస్టల్ ఫీజుల పెంపు నిర్ణయంపై విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు రావడంతో వెనక్కి తగ్గింది. ఫీజుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. అలాగే, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కూడా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి ఎస్. సుబ్రహ్మణ్యం ట్విటర్లో ఈ విషయంపై స్పందించారు. ‘‘హాస్టల్ ఫీజుల పెంపుపై ఇదివరకు తీసుకున్న నిర్ణయాన్ని జేఎన్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ వెనక్కి తీసుకుంది. అలాగే, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక రాయితీలు కూడా ఇవ్వాలని ప్రతిపాదించింది. విద్యార్థులు తరగతులకు హాజరుకావాల్సిన సమయమిది’’ అంటూ ఆయన ట్విటర్లో పేర్కొన్నారు.
వసతిగృహ నిర్వహణ ఖర్చులను విద్యార్థుల నుంచే వసూలు చేయాలన్న ఉద్దేశంతో జేఎన్యూలో వార్షిక రుసుమును రూ.30 వేల నుంచి రూ.70 వేలకు పెంచారు. పేద విద్యార్థులను నాణ్యమైన విద్యకు దూరం చేయాలన్న కుట్రతోనే కేంద్రం ఇలాంటి పాచికలు వేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విశ్వవిద్యాలయ పాలకమండలి నిర్దేశించిన దుస్తులు ధరించడం, గ్రంథాలయాలు-రీడింగ్ రూమ్లను రాత్రి 11 గంటలకల్లా మూసేయడం వంటి నిబంధనలనూ కొత్తగా తీసుకొచ్చారు. గత నెల 28న వాటికి పాలకమండలి ఆమోదముద్ర వేసింది. వీటినీ ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు.
వసతి గృహ రుసుముల పెంపు, ఆంక్షలకు వ్యతిరేకంగా సోమవారం విద్యార్థులు తమ నిరసన గళాన్ని విన్పించారు. కొత్త నిబంధనల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్నాతకోత్సవంలో రణరంగం సృష్టించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, వీసీ ఎం.జగదీశ్కుమార్కు సమస్యలు విన్నవించుకొనేందుకు ఏఐసీటీఈ ప్రాంగణం వైపు దూసుకొచ్చారు. దీంతో పోలీసులు అడ్డుకొనేందుకు ప్రయత్నించడంతో రణరంగంగా మారిన విషయం తెలిసిందే. అలాగే, కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ చాలాసేపు ఏఐసీటీఈ ప్రాంగణంలోనే ఉండిపోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే.