
తాజా వార్తలు
కేరళ మంత్రి
తిరువనంతపురం: శబరిమల అయ్యప్పను దర్శించుకునే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రక్షణ కల్పించే ఆలోచనేమీ లేదని కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ శాంతియుత వాతావరణం కోసమే కృషి చేస్తుందన్నారు. అందువల్ల ప్రస్తుతానికి దేవాలయం వద్ద యథాతథ స్థితిని కొనసాగించడమే సరైందని ఆయన అభిప్రాయపడ్డారు. తిరువనంతపురంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శుక్రవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నెలకొన్న వివాదానికి సంబంధించిన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు భక్తుల దర్శనార్థం ఆలయ తలుపులు రేపటి నుంచి తెరవనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు, గురువారం కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. కోర్టు తీర్పు విషయంలో ఉన్న సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాతే మహిళల ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
అయితే, ఈ నెల 16న అయ్యప్ప దేవాలయాన్ని దర్శించుకుంటానన్న మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తి దేశాయ్ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి సురేంద్రన్.. ‘శబరిమల ఆలయానికి ఎవరైనా వెళ్లాల్సిన అవసరం ఉంటే కోర్టును ఆశ్రయించి ఆదేశాలు తెచ్చుకోవచ్చు’ అని వ్యాఖ్యానించారు. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం సహా ఇతర మతపరమైన అంశాలను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం పరిశీస్తుందని గురువారం సుప్రీంకోర్టు వెల్లడించిన విషయం తెలిసిందే. 2018లో మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను పెండింగ్లో పెట్టింది.