
తాజా వార్తలు
కేంద్రానికి దుష్యంత్ చౌతాలా లేఖ
చండీగఢ్ : వాతావరణ మార్పు పరిణామాల గురించి పాఠ్యాంశాల్లో బోధించాలని కోరుతూ హరియాణా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్‌కు రాసిలో లేఖలో వాతావరణ మార్పు, స్థిరత్వంల గురించి తెలిసేలా పాఠ్యాంశం రూపొందించాలని చౌతాలా కోరారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ మార్పు తీవ్ర సమస్యగా మారుతోందని, ఆ ముప్పు భారత్‌కు కూడా ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు. తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ప్రతి పౌరుడి ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉందని చౌతాలా పేర్కొన్నారు.
పాఠ్యాంశాల్లో ఈ అంశాన్ని చేర్చడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అది ఉపయోగపడుతుందని లేఖలో ప్రస్తావించారు. ఇటీవలే మొట్టమొదటిసారిగా ఇటలీ దేశంలో వాతావరణంపై క్లాసులు తప్పనిసరిగా బోధించాలనే నియమం తెచ్చారని పేర్కొన్నారు. ప్రాథమిక విద్యలోనే వాతావరణంపై విద్యార్థులకు క్షుణ్ణమైన అవగాహన కల్పిస్తే.. భవిష్యత్ తరాలకు దాని ప్రాముఖ్యత తెలిసే వీలుంటుదని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్సీఆర్ పరిధిలో పెరిగిపోతున్న కాలుష్యంపై కూడా చౌతాలా ఆందోళన వెలిబుచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి అన్ని వర్గాలు కలిసి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే సమయం ఆసన్నమైందని చెప్పారు. అడవుల నరికివేత, ఇంధన వాహనాల వినియోగానికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తే వాతావరణ మార్పు సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చౌతాలా సూచించారు.