
తాజా వార్తలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పోలీసుల అదుపులో ఉన్న 34 మంది రాజకీయ నాయకులను శీతాకాలం దృష్ట్యా ఇతర ప్రాంతానికి తరలించారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా ఆగస్టు 5 నుంచి వారిని నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం శీతాకాలం కారణంగా చలి తీవ్రత పెరిగి మంచు కురుస్తుండటంతో వారిని కాస్త వెచ్చటి ప్రదేశానికి తరలించాలని హోంశాఖ అధికారులు నిర్ణయించారు. దీంతో పోలో గ్రౌండ్ సమీపంలోని ఎమ్మెల్యే వసతిగృహంలో గదులను వాతావరణానికి అనుగుణంగా పలు మార్పులు చేపట్టారు. మూడు నెలల నుంచి సెంటార్ హోటల్లో ఉంచిన ఆ 34 మంది నాయకులను పోలోగ్రౌండ్ సమీపంలోని ఎమ్మెల్యే వసతిగృహానికి తరలించారు. ఇప్పటికే తన తల్లిని వేరే ప్రదేశానికి తరలించాలని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె కోరింది. దీంతో ముఫ్తీని శ్రీనగర్ చష్మే అతిథి గృహం నుంచి లాల్‌చౌక్‌కు మార్చారు.
జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్య రాజకీయ నేతలను శాంతి భద్రతల దృష్ట్యా నిర్బంధంలోకి తీసుకున్నారు. అదుపులో ఉన్నవారిలో అలీ ముహమ్మద్ సాగర్(ఎన్సీ), సజ్జద్లోనె(పీసీ), యాసిన్ రేషి, షా ఫైజల్, నీమ్ అక్తర్(పీడీపీ) సహా పలువురు నేతలు ఉన్నారు.