close

తాజా వార్తలు

వారంలో మూడోసారి వెనీస్‌కు వరద పోటు

చారిత్రక నగరానికి వరద గండం

వెనీస్‌: ఆకాశ హర్మ్యాలకు, ప్రకృతి అందాలకు నెలవైన వెనీస్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వాతావరణంలో అనూహ్యంగా వచ్చిన మార్పుల కారణంగా గత 50ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు, వరదలు ఆ నగరాన్ని చుట్టుముట్టాయి. ఫలితంగా చారిత్రక కట్టడాలు, భవనాలు సగానికిపైగా నీట మునిగాయి. సాధారణ రోడ్లు కూడా చెరువులను తలపిస్తున్నాయి. వెనీస్‌లో నెలకొన్న ఈ పరిస్థితిపై గార్డియన్‌ పత్రిక కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మరికొన్నాళ్లపాటు ఇలాగే కొనసాగితే వెనీస్‌ చరిత్రలోనే లేనంత భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని అభిప్రాయపడింది. 1966 తర్వాత ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుక కాలేదని చెప్పింది. గతవారం రోజుల్లో ఇలా భారీ ఎత్తున పోటు సంభవించడం ఇది మూడోసారని అక్కడి అధికారులు తెలిపారు. ఈ వరదల కారణంగా ఆయా ప్రాంతాల్లో బిలియన్‌ యూరోలకు పైగా నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.

వాతావరణ మార్పుల కారణంగా వేగవంతమైన గాలులు, ఎత్తైన అలలు కలిసి రావడంతో నదుల్లో నీటి మట్టం కూడా క్రమంగా పెరిగింది. ఫలితంగా 70% వెనీస్‌ నగరం నీట మునిగింది. ఇటలీకి ప్రధాన ఆదాయ వనరు అయిన వెనీస్‌లో ఈ పరిస్థితి ఏర్పడటం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రధాని గుసెప్పే కోంటే అభిప్రాయపడ్డారు. వరదల వల్ల నగరానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, కళలకు నెలవైన వెనీస్‌ పూర్వరూపుకోల్పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాణిజ్య కార్యకలాపాలకూ అవరోధం వాటిల్లిందన్నారు.

‘మోసే’తో సముద్రానికే అడ్డుకట్ట వేయాలని..!

వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా వెనీస్‌ భారీ స్థాయిలో నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. భారీ పోట్ల కారణంగా సముద్రపు నీరు అలల రూపంలో నగరంలోకి ప్రవేశిస్తోంది. ఫలితంగా ‘నీటిపై తేలియాడే’ నగరంగా పేరున్న వెనీస్‌ కాస్తా మునిగే పరిస్థితికి చేరుకుంటోంది. ఈ పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అక్కడి మౌలిక, రవాణాశాఖ మంత్రిత్వశాఖ ‘మోసే(మోడ్యులో స్పెరిమెంటల్‌ ఎలెట్రోమెకానికో)’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వెనీస్‌లో ఉన్న సముద్రం ఒడ్డున మూడు చోట్ల కదిలే గేట్లను(మొబైల్‌ గేట్లు) నిర్మిస్తున్నారు. లిడో,మలమోకో,చియోగియా వంటి ప్రాంతాల్లో వీటిని నిర్మాణం జరుగుతోంది. ఈ మూడు మార్గాల నుంచే సముద్రపు నీరు వెనీస్‌లోకి ప్రవేశిస్తోంది. దీంతో వీటిని నియంత్రించాలని ఇటలీ ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతానికి వీటిలో ఒకటి మాత్రమే పూర్తయింది. సముద్రంలో పెద్ద పెద్ద అలలు వచ్చే ప్రమాదమున్నప్పుడు ఈ గేట్లకు ఏటవాలుగా అమర్చిన తలుపుల వంటి నిర్మాణాలు ఆటోమేటిక్‌గా తెరుచుకుని అలలను అడ్డుకుంటాయి. మిగతా సమయంలో లోపలే ఉంటాయి. ఇవి సుమారు మూడు మీటర్ల(9.8అడుగులు) ఎత్తుండే అలలను అడ్డుకోగలవు. 2003లో మొదలైన ఈ ప్రాజెక్టును 2013లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అవరోధాలు ఏర్పడటంతో త్వరగా పూర్తి చేయలేకపోయారు. తర్వాత 2018లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా అది సాధ్యపడలేదు. ప్రస్తుతం 85% నిర్మాణం పూర్తయింది. ఆలస్యం కావడంతో నిర్మాణ ఖర్చు కూడా పెరిగిపోయింది.  ప్రస్తుతం 2022లోపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.