close

తాజా వార్తలు

జేఎన్‌యూ విద్యార్థుల ర్యాలీ: దిల్లీలో ఉద్రిక్తత

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థుల నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. వసతి గృహం ఫీజుల పెంపు సహా పలు డిమాండ్లు పరిష్కరించాలంటూ వేలాది మంది విద్యార్థులు పార్లమెంట్‌ ముట్టడికి బయల్దేరారు. దీంతో వారిని అడ్డుకొనేందుకు పోలీసులు భారీగా మోహరించారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఈ రోజే ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. వేలాది మంది జేఎన్‌యూ విద్యార్థులు చేతిలో ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేసుకుంటూ దిల్లీ వీధుల్లో ముందుకు సాగుతున్నారు.  యూనివర్సిటీ నుంచి బయల్దేరి పార్లమెంట్‌ భవనం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని సఫ్దర్‌గంజ్‌ సమాధి వద్ద అడ్డుకున్నారు. అలాగే, దిల్లీలోని పలు మెట్రో స్టేషన్లలో రాకపోకలను నిలిపివేశారు. పోలీసుల ఆదేశాల మేరకు ఉద్యోగ్‌ భవన్‌, పటేల్‌ చౌక్‌, సెంట్రల్‌ సెక్రటేరియట్‌ రైల్వే స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను దిల్లీ మెట్రో రైలు అధికారులు మూసివేశారు. విద్యార్థుల ర్యాలీతో పలు ప్రధాన ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. సఫ్దర్‌గంజ్‌ సమాధి వద్ద ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు అక్కడే బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తున్నారు.

ఫీజుల పెంపుపై ప్యానెల్‌ నియమించిన విషయాన్ని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ అధికారులు విద్యార్థి సంఘానికి తెలియజేయలేదని ఓ విద్యార్థి తెలిపారు. వర్సిటీ పాలనా అధికారులు, ప్యానెల్‌ సభ్యులు విద్యార్థి సంఘం నేతలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. 

ఎమర్జెన్సీలో కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదు: ఏచూరి
ఎమర్జెన్సీ కాలంలో కూడా ఇంత భారీగా పోలీసులను మోహరించడం తాను చూడలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థుల శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీని పోలీసులతో అడ్డుకోవాలని ప్రయత్నించడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఈ చర్య ప్రజాస్వామికంగా సంక్రమించిన నిరసన హక్కును  నిరాకరించడమేనని ఏచూరి ట్విటర్‌లో పేర్కొన్నారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు: పోలీసులు

మరోవైపు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని విద్యార్థులకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిరసన కారుల డిమాండ్లపై చర్చించి.. వారిని శాంతిపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. విద్యార్థులపై లాఠీఛార్జి జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ చేపడతామని దిల్లీ పోలీస్‌ పీఆర్వో మన్‌దీప్‌ సంధ్వా వెల్లడించారు. 

 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.