
తాజా వార్తలు
కొలంబో: శ్రీలంక నూతన ప్రధానిగా మహింద రాజపక్స నియమితులు కానున్నారు. తన సోదరుడైన గోటబాయ రాజపక్స దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మహీందా రాజపక్సను దేశ కొత్త ప్రధానిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమ సింఘే గురువారం ఉదయం రాజీనామా చేస్తారనీ.. ఆయన స్థానంలో మహింద రాజపక్స బాధ్యతలు చేపడతారని ప్రభుత్వ అధికార ప్రతినిధి విజయానంద హెరాత్ స్పష్టంచేశారు. రాజపక్స గతంలో రెండు సార్లు దేశాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన పదవీ కాలంలో ఎల్టీటీటీపై పోరాటంలో అమాయక తమిళులను ఊచకోత కోయించారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. శ్రీలంకలో కొన్ని దశాబ్దాల పాటు జరిగిన అంతర్యుద్ధాన్ని క్రూరంగా అణచివేశారనే ఆరోపణలూ ఉన్నాయి. మానవహక్కుల హననానికి పాల్పడ్డారంటూ ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే.