close

తాజా వార్తలు

చారిత్రక టెస్టులో టీమిండియా ఘన విజయం

ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో కోహ్లీ సేన విజయం

కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రక డేనైట్‌ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించడంతో ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో కోహ్లీసేన గెలుపొందింది. బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఉమేశ్‌ యాదవ్‌ 5, ఇషాంత్‌ 4 వికెట్లు పడగొట్టి భారత్‌కు మరపురాని విజయాన్ని అందించారు. శనివారం 240 పరుగులతో వెనుకంజలో ఉన్న బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముష్ఫికర్‌ రహీమ్‌ (74) రాణించినా జట్టు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాడు. అతనికి మిగిలిన సభ్యుల నుంచి సరైన తోడ్పాటు లభించలేదు. దీనికితోడు జోరుమీదున్నట్లు కనిపించిన మహ్మదుల్లా రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగడం జట్టుకు నష్టం కలిగించింది. 

శుక్రవారం ప్రారంభమైన పింక్‌ టెస్టులో టాస్‌ గెలిచిన బంగ్లా బ్యాటింగ్‌ ఎంచుకుంది. గత టెస్టు జోరును కొనసాగిస్తూ భారత పేసర్లు ఇషాంత్‌ శర్మ(5), ఉమేశ్‌ యాదవ్‌(3), మహ్మద్‌ షమి(2) విజృంభించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 106 పరుగులకే కుప్పకూలింది. అనంతరం విరాట్‌ కోహ్లీ (136), పుజారా (55), అజింక్య రహానె (51) రాణించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. రెండో రోజు 347/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌కు ఇషాంత్‌, ఉమేశ్‌ మరోసారి చుక్కలు చూపించారు. వీరి జోరుతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ 152/6తో నిలిచింది.

మూడో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఇబాదత్‌ హుస్సేన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ముష్ఫికర్‌ రహీమ్‌ కాసేపు ప్రతిఘటించాడు. ఎక్కువగా స్ట్రైకింగ్‌ తీసుకుంటూ వికెట్‌ పడకుండా చూసుకున్నాడు. ఈ క్రమంలో ఉమేశ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ తర్వాత బంగ్లా ఇన్నింగ్స్‌ ముగియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. బంగ్లా చివరి మూడు వికెట్లను ఉమేశే తీశాడు. ఈ విజయంతో టీమిండియా 2-0తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 360 పాయింట్లుతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు తీసిన ఇషాంత్‌ శర్మ.. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.  

స్కోరు వివరాలు:

బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ :  106 ఆలౌట్‌; షాద్మన్‌ ఇస్లామ్‌ (29), ఇషాంత్‌ 5/22

భారత్ తొలి ఇన్నింగ్స్‌: 347/9 డిక్లేర్డ్‌; విరాట్‌ కోహ్లీ (136), అమిన్‌ హుస్సేన్‌ 3/85

బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌: 195 ఆలౌట్‌; ముష్ఫికర్‌ రహీమ్‌ (74), ఉమేశ్‌ యాదవ్‌ 5/55


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.