close

తాజా వార్తలు

శాస్త్రిపై కక్షా? హ్హహ్హహ: దాదా

కోల్‌కతా: గత విభేదాలను దృష్టిలో పెట్టుకొని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రిపై కక్షపూరితంగా వ్యవహరిస్తామనడంలో అర్థం లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నారు. అవన్నీ వదంతులేనని పేర్కొన్నారు. పదవీకాలంలో చేసిన ప్రదర్శనల ఆధారంగానే వ్యక్తుల పనితీరు అంచనా వేస్తారని స్పష్టం చేశారు. 2016లో అనిల్‌కుంబ్లేను కోచ్‌గా ఎంపిక చేయడంలో దాదా కీలక పాత్ర పోషించారు. అప్పుడు ఇంటర్వ్యూకు హాజరైన శాస్త్రికి ఈ పదవి దక్కలేదు. దీంతో గంగూలీ వల్లే తనకు పదవి దక్కలేదని శాస్త్రి విమర్శించారు. దాదా సైతం ప్రతివిమర్శలు చేశారు.

‘అందుకే వాటిని పుకార్లు అంటారు. అలాంటి ప్రశ్నలకు నా వద్ద జవాబులు ఉండవు. ఎవ్వరైనా పనితీరు బాగుంటే కొనసాగుతారు. లేదంటే మరొకరు ఆ పదవిలో భర్తీ అవుతారు. నేను క్రికెట్‌ ఆడుతున్నప్పుడే అంతే. మాటలు, లీకులు, వదంతులు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఏకాగ్రత 22 గజాల్లో ఏం జరుగుతుందన్న దానిపై ఉండాలి. జీవితమంతా పనితీరుపై ఆధారపడుతుంది. దానికి ప్రత్యామ్నాయం ఉండదు’ అని గంగూలీ అన్నారు.

‘విరాట్‌ కోహ్లీ భారత క్రికెట్లో కీలక వ్యక్తి. అతడు మైదానంలో జట్టును నడిపిస్తాడు. మైదానంలో, బయటా అతడో రోల్‌ మోడల్‌. విజయవంతం అవ్వడానికి కావాల్సిన ప్రోత్సాహం రవి, విరాట్‌కు దొరుకుతుంది. ఏదేమైనా చివరికి మేం ఆశించేది ఫలితాలే. ఐసీసీ టోర్నీల్లో సెమీస్‌, ఫైనల్లో గెలవడం సామర్థ్యానికి సంబంధించింది కాదు. అది మానసికమైంది. పెద్ద మ్యాచుల్లో ఆటగాళ్లు మానసిక అడ్డంకులు అధిగమించాలి. టీ20 అనేది స్వేచ్ఛగా ఆడే నిర్భయ క్రికెట్‌. జట్టులో స్థానం కోసం ఆడకూడదు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన వల్ల మాజీ క్రికెటర్లు పనిచేసేందుకు ఇబ్బందులు వస్తున్నాయి’ అని దాదా తెలిపారు.

‘బీసీసీఐ కార్యదర్శిగా జై షా ఎన్నికల్లో గెలిచాడు. సొంతగా నిర్ణయాలు తీసుకోగలడు. అతడి తండ్రి రాజకీయ నాయకుడు. మేం వ్యక్తిగతంగా అతడితో కలిసి పనిచేస్తాం. బీసీసీఐలో రాజకీయ జోక్యానికి తావులేదు. అయితే క్రికెట్‌ పాలనలో నేతల ప్రాబల్యం కనిపిస్తోంది. దివంగత అరుణ్‌ జైట్లీ క్రికెట్‌కు సేవ చేసినప్పటికీ బీసీసీఐలో ఎలాంటి పదవులు చేపట్టలేదు. దిల్లీ క్రికెట్లో మాత్రం కీలకంగా ఉన్నారు. రాష్ట్ర సంఘాలకు ఎన్నికైన పాలనా వ్యవస్థ ఉంది. సంఘాలను నడిపించడం అంత సులభం కాదు. బలమైన వ్యక్తులు అవసరం’ అని గంగూలీ అన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.