close

తాజా వార్తలు

సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో

వాంఖడే పొలార్డ్‌కు కొట్టిన పిండి

అన్ని విభాగాల్లో రాణించకపోతే టీమిండియాకు కష్టం

‘క్యాచులే మ్యాచులను గెలిపిస్తాయి..’ అనే క్రికెట్‌ నానుడిని మర్చిపోయిన కోహ్లీసేన మరో కీలక సమరానికి సిద్ధమైంది. సిరీస్‌ దక్కాలంటే తప్పక గెలవాల్సిన టీ20లో విండీస్‌తో తలపడనుంది. టీమిండియా చేతిలో వరుసగా ఏడు మ్యాచుల్లో ఓడిన కరీబియన్లు తిరువనంతపురంలో దానికి అడ్డుకట్ట వేశారు. శాయశక్తులా పోరాడి సిరీస్‌ చేజిక్కుంచుకోవాలని పట్టుదలతో ఉన్నారు. మరోవైపు వేయి కళ్లతో పునరాగమనం కోసం సంజు శాంసన్‌ ఎదురుచూస్తున్నాడు. మరి వాంఖడే బుధవారం నాడు ఎవరి కోరికలను తీరుస్తుందో..!!


టాస్‌ కీలకం

అటు వైపంతా యువ బృందమే. ఇటేమో అనుభవం + కొత్తదనం. ఐనా సరే గెలిచేందుకు తడబడుతోంది టీమిండియా. లక్ష్యాలను విజయవంతంగా ఛేదిస్తున్న కోహ్లీసేన మొదట బ్యాటింగ్‌ చేసినప్పుడు బ్యాట్లెత్తేస్తోంది. ఆఖరి నాలుగు ఓవర్లలో పరుగుల వరద పారించేందుకు ఇబ్బంది పడుతోంది. 40-45 పరుగులైనా చేయాలి. దానికి భిన్నంగా రెండో టీ20లో చివరి 5 ఓవర్లలో వచ్చింది 38 పరుగులే. మ్యాచ్‌ ఫినిషర్ల కొరతను ఇది సూచిస్తోంది. మూడో టీ20లో ఈ సమస్యను అధిగమించకపోతే కష్టం. మంచు కురిసే వాంఖడేలో ఛేదన అత్యంత సులభం. విండీస్‌కు టాస్‌ వరించి ఫీల్డింగ్‌ ఎంచుకుంటే పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరం.


పేలవ ఫీల్డింగ్‌

టీమిండియా ఫీల్డింగ్‌ ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఫిట్‌నెస్‌ ప్రమాణాలు పెరిగిన కోహ్లీసేనలో 90ల నాటి ఫీల్డింగ్‌ అవ లక్షణాలు కనిపించడమేంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మొదటి టీ20లో 4, రెండో టీ20లో 3 క్యాచులు నేలపాలయ్యాయి. స్వయంగా కెప్టెన్‌ విరాట్‌ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఫీల్డింగ్‌ ఇలాగే ఉంటే ఎన్ని పరుగులైనా చాలవని హెచ్చరించాడు. వాషింగ్టన్‌ సుందర్‌ పవర్‌ప్లేలో పరుగులను నియంత్రిస్తున్నా వికెట్లు తీయకపోవడం ఆందోళనకరం. దీపక్‌ చాహర్‌, భువి త్వరగా లయ అందుకోవాలి. చాహర్‌ స్థానంలో షమి, సుందర్‌ బదులు కుల్‌దీప్‌ను పరీక్షించినా ఆశ్చర్యం లేదు. చివరి పోరులో అర్ధశతకం అందుకున్న ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె నుంచి జట్టు అదే ప్రదర్శన కోరుకుంటోంది. రోహిత్‌ తన సొంత మైదానంలో విజృంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. పంత్‌ సమయోచితంగా ఆడినప్పటికీ తన మునుపటి దూకుడు ప్రదర్శించాల్సి ఉంది.


సంజుకు చోటుందా?

ఎప్పుడో 2015లో జింబాబ్వేపై ఒక టీ20 ఆడాడు సంజు శాంసన్‌. బంగ్లాదేశ్‌ సిరీస్‌లో చోటు దక్కలేదు. ప్రస్తుత సిరీస్‌లోనూ తొలి రెండు మ్యాచ్‌లకు ఎంచుకోలేదు. మరి కీలకమైన వాంఖడే పోరులో అతడికి చోటు దక్కుతుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ జట్టులోకి తీసుకుంటే ఎవరిని పక్కన పెట్టాలన్నది కోహ్లీకి మరో తలనొప్పి. విఫలమవుతున్నా పంత్‌కు మద్దతుగా ఉంటామన్నాడు. రాహుల్‌ అర్ధశతకంతో రాణించాడు. వీరిద్దరిలో ఎవరికీ విశ్రాంతినిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సంజు ఏ స్థానంలోనైనా ఆడగలడు. బహుశా అతడిని శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో ఆడించొచ్చు! కీలకమైన నాలుగో స్థానానికి శ్రేయస్‌ పరిష్కారమని భావిస్తున్న తరుణంలో ఇదెలాంటి సంకేతాలు పంపిస్తుందన్నది మరో ప్రశ్న? కీలకమైన మ్యాచులో ఒక బౌలర్‌ను తగ్గించే ప్రయత్నం విరాట్‌ చేయడు. మరి సంజు ఎదురుచూపులు ఎలా ఫలిస్తాయో చూడాలి.


ధీమాగా కరీబియన్లు

తిరువనంతపురం విజయంతో పొలార్డ్‌ సేనలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. సిమన్స్‌, లూయిస్‌, హెట్‌మైయిర్‌, పూరన్‌, బ్రాండన్‌ కింగ్‌, పొలార్డ్‌, హోల్డర్‌ ఫామ్‌లో ఉన్నారు. ఏ ఇద్దరు నిలిచినా పరుగుల వరద ఖాయమే. పైగా వాంఖడే పొలార్డ్‌కు కొట్టినపిండి. అక్కడి పరిస్థితులు, పిచ్‌పై పూర్తి అవగాహన ఉంది. అతడు చెలరేగితే టీమిండియాకు కష్టాలు తప్పవు. బౌలర్లు షెల్డన్‌  కాట్రెల్‌, పియరీ, కెస్రిక్‌ విలియమ్స్‌, హెడేన్‌ వాల్ష్‌ కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నారు. పరుగులనూ నియంత్రిస్తున్నారు. కాబట్టి కోహ్లీసేన అన్ని విభాగాల్లోనూ తమ ప్రణాళికలను పటిష్ఠంగా అమలు చేయాలి. లేదంటే చాలా కష్టం. వాంఖడేలో రెండో ఇన్నింగ్స్‌లో మంచు కురుస్తుంది. బంతిపై బౌలర్లకు పట్టు చిక్కదు. బ్యాట్స్‌మన్‌ అలవోకగా ఆడతారు. మంచు కీలకమవుతుంది.

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.