close

తాజా వార్తలు

మాట మారిందా?

మాటే మంత్రం! మధురమైన మాట మనిషిని కట్టిపడేస్తుంది. తీయనైన పలుకు మనసును పరవశింపజేస్తుంది. అభిప్రాయాలను పంచుకోవటానికైనా.. ఆలోచనలను కలబోసుకోవటానికైనా ప్రధాన సాధనం మాటే. ఆనందమో, ఆగ్రహమో.. అభిమానమో, అనుమానమో.. అన్నింటినీ ఒక్క పలుకే వ్యక్తపరుస్తుంది. మదిలో లీలగా మెదిలే భావన.. స్వరతంత్రులను మీటుకొని.. శబ్దంగా పురుడుపోసుకొని.. గొంతులోంచి బయటకు ఉబికివస్తుంది. మన ఉనికికే ప్రాణం పోస్తుంది. నిజానికి మాట ‘విలువ’ను మనం పెద్దగా పట్టించుకోం. గొంతు బొంగురుపోయినప్పుడో, పీలగా మారినప్పుడో గానీ దాని గొప్పతనం తెలిసిరాదు. మాటను ఏమార్చే ఇబ్బందులు చాలావరకు మామూలువే. అయితే కొన్ని తీవ్రంగానూ వేధించొచ్చు. కొన్ని వాటంతటవే తగ్గినా కొన్నింటికి శస్త్రచికిత్స అవసరపడొచ్చు. అందుకే మాట సమస్యలపై సమగ్ర కథనం ఈవారం మీకోసం. 

మాట మారిందా?

లవోకగా, తోచిందే తడవుగా మనం ఎన్నెన్నో మాటలు మాట్లాడేస్తుంటాం. కానీ ఇది పైకి కనబడినంత తేలికైన పనేమీ కాదు. ఊపిరితిత్తుల దగ్గర్నుంచి.. శ్వాసనాళం, స్వరపేటిక, స్వరతంత్రులు, నాడులు, నాలుక, దంతాలు, అంగిలి, పెదవులు, ముక్కు, ముక్కు చుట్టుపక్కల గాలిగదుల వంటివన్నీ కలిసికట్టుగా పనిచేస్తేనే మాట్లాడటం సాధ్యమవుతుంది. మన మెడ ముందుభాగాన మధ్యలో స్వరపేటిక.. దాని లోపల నిలువుగా పట్టీల మాదిరిగా రెండు స్వరతంత్రులుంటాయి. మాటకు మూలస్థానాలు ఇవే. ఊపిరితిత్తుల నుంచి వచ్చే గాలి ప్రవాహం శ్వాసనాళం గుండా ప్రవహిస్తూ.. స్వరపేటికలోకి చేరుకొని.. ముక్కు, గొంతు ద్వారా బయటకు వస్తుంది. ఈ క్రమంలో స్వరపేటికలోని స్వరతంతుల్రు కంపించినపుడు శబ్దం, మాట పుట్టుకొస్తాయి. స్వరతంత్రులు పై భాగాన దగ్గరగా, కిందికి వస్తున్నకొద్దీ దూరంగా జరిగి ఉంటాయి. అంటే ఆంగ్ల అక్షరం ‘వి’ తలకిందులుగా ఉన్నట్టు అన్నమాట. ఇవి దూరంగా జరిగినపుడు ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్తుంటుంది. దగ్గరకు వచ్చినపుడు మాట పుట్టుకొస్తుంది. ఇలా పురుడు పోసుకున్న మాటకు నాలుక, పెదవులు, దంతాలు, అంగిలి, ముక్కు, సైనస్‌ గదుల వంటివన్నీ ‘సొబగులు’ అద్దుతాయి. శ్రుతి, శ్రావ్యత, గాంభీర్యత చేకూరుస్తాయి. మాట పుట్టుకలో స్వరపేటిక నాడుల పాత్ర కూడా చాలా కీలకం. ఇవి మెదడు నుంచి అందే సంకేతాలను చేరవేయటం మూలంగానే స్వరపేటిక కండరాలు కదులుతాయి. ఇలా మాట చాలా అవయవాలతో ముడిపడిన వ్యవహారం కావటం వల్ల ఆయా భాగాల్లో ఎక్కడ ఇబ్బంది తలెత్తినా సమస్యాత్మకంగా పరిణమించొచ్చు. 
సమస్యలు రకరకాలు 
స్వరపేటిక స్వరూపం, పనితీరులో ఎలాంటి మార్పులు తలెత్తినా మాట మీద ప్రభావం పడుతుంది. అతిగా మాట్లాడటం, గట్టిగా అరవటం, మాటిమాటికీ గొంతు సవరించుకోవటం, మెడకు దెబ్బలు తగలటం వంటివన్నీ ఇందుకు దారితీయొచ్చు. నాడులు దెబ్బతినటం వల్ల స్వరతంత్రులు చచ్చుబడినా మాటకు ఇబ్బంది కలగొచ్చు. జీర్ణాశయంలోని ఆమ్లం పైకి ఎగదన్నుకొని వచ్చే సమస్య (జీఈఆర్‌డీ) గలవారిలోనూ మాట మారిపోవచ్చు. కాబట్టి వీటిపై అవగాహన కలిగుండటం అవసరం. 
మాట మారిందా?బొంగురుపోవటం: దీనికి ప్రధాన కారణం అతిగా, గట్టిగా మాట్లాడటం. గట్టిగా అరచినపుడు స్వరతంత్రులు ఒకదాంతో మరోటి గట్టిగా రాసుకుపోయి సన్నటి బుడిపెలు (వోకల్‌ నాడ్యూల్స్‌) పుట్టుకొస్తాయి. ఒక మిల్లీమీటరు బుడిపెతోనూ మాట మారిపోవచ్చు. ఎక్కువగా మాట్లాడే అవసరం గల- ఉపాధ్యాయులు, గాయనీ గాయకులు, రాజకీయనేతలు, మార్కెటింగ్‌ ఉద్యోగుల వంటి వారికి వీటి ముప్పు ఎక్కువ.


స్వరపేటిక వాపు: టాన్సిల్స్‌ వాపు వంటి ఇన్‌ఫెక్షన్లు ఏవైనా కొన్నిసార్లు స్వరపేటికకూ విస్తరించొచ్చు. దీంతో స్వరతంత్రులు ఎర్రబడి, వాచిపోతాయి. ఫలితంగా మాట బొంగురుపోవచ్చు. అయితే ఇది తాత్కాలికమే. రెండు మూడు రోజులు ఎక్కువగా మాట్లాడకుండా చూసుకుంటే తగ్గిపోతుంది. మధుమేహం, అతిగా యాంటీబయోటిక్‌ మందులు వాడటంతో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఎక్కువ. ఆస్థమాకు స్టిరాయిడ్‌ ఇన్‌హేలర్లు వాడేవారికీ ఇది రావొచ్చు. అందువల్ల ఇన్‌హేలర్‌ వాడాక గొంతులో నీటిని పోసుకొని గలగలమని ఉమ్మేయటం మంచిది.


స్వరతంత్రులు ఉబ్బటం: చాలాకాలంగా పొగతాగే అలవాటు గలవారిలో స్వరతంత్రులు ఉబ్బిపోతుంటాయి (రీన్‌కీస్‌ ఎడీమా). దీంతో స్వరతంత్రులు నీటితో నిండిన బుడగల్లా కనబడతాయి. ఫలితంగా గొంతు బొంగురుపోతుంది 
పిలకలు: కొందరికి స్వరతంత్రులు ఒరుసుకుపోయే చోట పిలకలు (పాలిప్స్‌) తలెత్తొచ్చు. కొన్నిసార్లు ఇవి రక్తం కంతులుగానూ కనిపిస్తాయి. పిల్లల్లో హెచ్‌పీవీ ఇన్‌ఫెక్ష వల్ల తరచుగా తలెత్తే పిలకలు (రికరెంట్‌ రెస్పిరేటరీ ప్యాపిలోమాటోసిస్‌) కూడా మాట మారిపోవటానికి దారితీయొచ్చు. వీటిని లేజర్‌ చికిత్సతో తొలగించాల్సి ఉంటుంది.


స్వరతంత్రులు చచ్చుబడటం: దీనికి ప్రధాన కారణం స్వరపేటిక నాడులు దెబ్బతినటం. ఏ కారణంతో నాడులు దెబ్బతిన్నా స్వరతంత్రులు చచ్చుబడొచ్చు. తీవ్రమైన గాయాలు, శస్త్రచికిత్సల వంటివీ ఇందుకు దోహదం చేయొచ్చు. మెడ, థైరాయిడ్‌, గుండె శస్త్రచికిత్సల సమయంలోనూ కొందరికి పొరపాటున నాడులు దెబ్బతినొచ్చు. ఎప్‌స్టీన్‌ బార్‌ వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌లోనూ స్వరతంత్రులు చచ్చుబడొచ్చు. కొందరికి పుట్టుకతోనే స్వరతంత్రులు చచ్చుబడి ఉండొచ్చు. ఒక తంత్రి చచ్చుబడితే పిల్లలు సన్నగా, కీచుకీచుమని ఏడుస్తుంటారు. రెండు తంత్రులు చచ్చుబడితే శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది. ఊపిరితిత్తులు, థైరాయిడ్‌ గ్రంథి, అన్నవాహిక వంటి వాటిల్లో ఎక్కడ క్యాన్సర్‌ కణితులు తలెత్తినా కూడా స్వరపేటిక మీద ప్రభావం పడొచ్చు. వీటి మూలంగా నాడులు దెబ్బతిని స్వరతంత్రులు చచ్చుబడిపోవచ్చు కూడా. కొందరికి ఎలాంటి కారణం లేకుండానూ స్వరతంత్రులు చచ్చుబడొచ్చు (ఇడియోపతిక్‌).


నీటి తిత్తులు: కొందరికి స్వరతంత్రుల అంచున చిన్న నీటి తిత్తులు (సిస్ట్‌లు) తలెత్తి మాట మారిపోతుంటుంది. కొందరికి ఈ తిత్తుల లోపల తెల్లటి పిండి లాంటి పదార్థం కూడా ఉండొచ్చు.


కంతులు: నోటి ద్వారా మత్తుమందు ఇచ్చినవారికి, ఎక్కువరోజులు వెంటిలేటర్‌ మీదుండే వారికి కంతులు (గ్రాన్యులోమా) ఏర్పడే అవకాశముంది. స్వరపేటిక గుండా పంపించే గొట్టాలు రుద్దుకోవటం వల్ల ఇది తలెత్తుతుంది.


మాట మారిందా?తెల్లటి మచ్చలు: దీన్నే ల్యూకోప్లేకియా అంటారు. ఇది క్యాన్సర్‌కు ముందు దశ. ఇందులో స్వరపేటిక మీద తెల్లటి మచ్చలు తలెత్తుతుంటాయి. దీంతో మాట మారిపోతుంటుంది. బుడిపెల్లా పొడుచుకొని వచ్చే కెరటోసిస్‌ సమస్య కూడా మాట మారిపోయేలా చేయొచ్చు. నిర్లక్ష్యం చేస్తే ఇవి మున్ముందు క్యాన్సర్‌కూ దారితీయొచ్చు. పొగ, మద్యం అలవాటు గలవారికి వీటి ముప్పు ఎక్కువ.


గొంతు పూడుకుపోవటం: ఇది భావోద్వేగ సమస్య. దీన్ని ఫంక్షనల్‌ డిస్పోనియా/అఫోనియా అంటారు. ఇందులో తాత్కాలికంగా మాట పోతుంటుంది. గట్టిగట్టిగా అరచుకోవటం, తగాదాల వంటివి దీనికి దారితీస్తుంటాయి. వీరికి స్వరతంత్రులు బాగానే ఉంటాయి గానీ మాట రాదు. భావోద్వేగానికి గురికావటం వల్ల స్వరతంత్రులు దగ్గరకు రావు. దీంతో మాట్లాడితే గుసగుసలాడినట్టు ఉంటుంది. చిత్రంగా వీరికి గొంతు పరీక్ష సమయంలోనే మాటలు తిరిగి వస్తుంటాయి. నాలుకను బయటకు చాచి ఏదో ఒకటి మాట్లాడటమంటే తిరిగి మాట్లాడేస్తుంటారు. కొందరికి వాయిస్‌ థెరఫీ కూడా అవసరమవుతుంది.


క్యాన్సర్లు: మిగతా భాగాల్లో మాదిరిగానే స్వరపేటికకూ క్యాన్సర్‌ రావొచ్చు. ఇది స్వరతంత్రుల పైన, కింద, మీద ఎక్కడైనా తలెత్తొచ్చు. స్వరతంత్రుల మీద కణితులు ఏర్పడితే మాట వెంటనే మారిపోతుంది. అందువల్ల రెండు, మూడు వారాలు దాటినా మాట కుదురుకోకపోతే తప్పకుండా స్వరపేటికను పరీక్షించుకోవాలి.


మాట వణకటం: దీన్నే స్పాస్మోడిక్‌ డిస్పోనియా అంటారు. దీనికి ప్రధాన కారణం స్వరపేటిక వణకటం. నాడులు సరిగా పనిచేయకపోవటం వల్ల స్వరపేటిక కండరాలు పట్టేసినట్టు అవుతాయి. ఫలితంగా మాట కూడా వణికినట్టు వస్తుంది. దీనికి బొటాక్స్‌ ఇంజెక్షన్లు బాగా పనిచేస్తాయి.


ప్యూబర్‌ ఫోనియా: సాధారణంగా మగపిల్లలకు 14 ఏళ్ల వయసులో మాట మారిపోతుంటుంది. కానీ కొందరికి చిన్నపిల్లల్లా మాట సన్నగానే వస్తుంటుంది. దీన్ని వాయిస్‌ థెరఫీ ద్వారా సరిచేయొచ్చు.

నిర్ధారణ 
మామూలు సమస్యలతో మాట మారితే రెండు, మూడు వారాల్లోపే కుదురుకుంటుంది. అప్పటికీ సర్దుకోకపోతే ఏదైనా సమస్య ఉందేమో పరీక్షించాల్సి ఉంటుంది. ముందుగా మెడ, గొంతు ఎలా ఉన్నాయో చూస్తారు. ఏదైనా తేడా అనిపిస్తే ఫ్లెక్సిబుల్‌ లారింగోస్కోపీ పరీక్ష చేస్తారు. ఇందులో ముక్కు ద్వారా సన్నటి వంగే గొట్టాన్ని పంపించి స్వరపేటిక ఎలా ఉందో చూస్తారు. అలాగే రిజిడ్‌ యాంగిల్డ్‌ ఎండోస్కోపీ పరీక్ష కూడా ఉపయోగపడుతుంది. లోపల మార్పులేవైనా ఉంటే వీటిల్లో బయటపడతాయి. అవసరమైతే స్వరతంత్రులు కంపించే తీరుతెన్నులను తెలిపే స్ట్రోబోస్కోపీ పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే ఛాతీ ఎక్స్‌రే కూడా అవసరపడొచ్చు. ఇందులో క్షయ, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, బృహద్ధమని ఉబ్బటం వంటి సమస్యలేవైనా ఉంటే కనబడతాయి. కొందరికి ముక్కు వెనక, చెవిలో కణితులు తలెత్తటం వల్ల కూడా స్వరతంత్రులు చచ్చుబడిపోవచ్చు. అందువల్ల అనుమానం వస్తే మెడ, ఛాతీ సీటీస్కాన్‌/ఎంఆర్‌ఐ పరీక్షలు చేయాల్సి ఉంటుంది.

చిన్న చిట్కా / పెద్ద ప్రయోజనం

* ఉపాధ్యాయులు, అధ్యాపకులకు మాట్లాడకపోతే కుదరదు. రాజకీయ నాయకులకూ.. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఉపన్యాసాలు ఇవ్వక తప్పదు. ఇలాంటివాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. పాఠాలు చెబుతున్నప్పుడు, ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు మాట్లాడినా.. మిగతా సమయాల్లో గొంతుకు విశ్రాంతి ఇవ్వటం మేలు. 
* రోజుకు కనీసం 6-7 గ్లాసుల నీళ్లు తాగటం మంచిది. మాటిమాటికీ గొంతు సవరించుకుంటే స్వరతంత్రులు ఒకదాంతో మరోటి రాసుకుపోయే ప్రమాదముంది. కాబట్టి దీన్ని మానుకోవాలి. 
* సమావేశాల్లో వీలైనంతవరకు మైక్‌ ద్వారానే మాట్లాడాలి. చుట్టుపక్కల కోలాహలంగా ఉన్న ప్రాంతాలో మాట్లాడకుండా చూసుకోవాలి. 
* గుసగుసలు పెట్టటం మంచిది కాదు. గుసగుసలు పెడితే స్వరతంత్రులు మరింత ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. 
* సాధ్యమైనంతవరకు మద్యం, కాఫీ, టీలు తాగకపోవటం మేలు. పొగతాగే అలవాటుంటే మానెయ్యాలి. పొగ, దుమ్ము, ధూళితో కూడిన వాతావరణాలకు దూరంగా ఉండాలి. 
* అలర్జీ మందులతో స్వరపేటిక పొడిబారొచ్చు. కాబట్టి వీటిని అవసరమైతేనే వాడుకోవాలి.

మాట మారటం /ఒక్కటే కాదు  

మాట మారిందా?స్వరపేటిక, స్వరతంత్రుల సమస్యల్లో మాట బొంగురుపోవటం, రోజు గడుస్తున్నకొద్దీ మాట పీలగా అయిపోవటమే కాదు. ఇతరత్రా ఇబ్బందులూ తలెత్తొచ్చు. 
నొప్పి: మాట సరిగా రాకపోవటం వల్ల కొందరు బలంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. దీంతో స్వరపేటిక నొప్పి పుడుతుంది. 
శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది: స్వరతంత్రులు చచ్చుబడితే శ్వాస తీసుకోవటం కష్టం అవుతుంది. ముఖ్యంగా రెండు స్వరతంత్రులు చచ్చుబడినవారిలో అవి దగ్గరకు వచ్చేసి.. శ్వాస సరిగా ఆడదు. కొందరికి ముద్ద మింగటంలోనూ ఇబ్బందులు తలెత్తొచ్చు. 
దగ్గు: స్వరతంత్రులు పూర్తిగా మూసుకుపోతేనే మింగటానికి వీలవుతుంది. ఇవి సరిగా మూసుకుపోకపోతే నీళ్ల వంటివి శ్వాసనాళంలోకీ వెళ్లిపోవచ్చు. దీంతో దగ్గు వస్తుంది. 
చెవి నొప్పి: థైరాయిడ్‌ క్యాన్సర్‌, అన్నవాహిక క్యాన్సర్‌, స్వరపేటిక క్యాన్సర్‌ వంటి ఇతరత్రా సమస్యల మూలంగా చెవి నొప్పి తలెత్తొచ్చు.

చికిత్స 
గొంతుకు విశ్రాంతి కీలకం బుడిపెలు, ఇన్‌ఫెక్షన్ల వంటివాటితో మాట మారిపోతే చాలావరకు విశ్రాంతితోనే కుదురుకుంటుంది. కొద్దిరోజులు ఎక్కువగా మాట్లాడకుండా చూసుకుంటే చాలు. ఇక ఇన్‌ఫెక్షన్లు గలవారికి ఆవిరి పట్టటం మేలు చేస్తుంది. వేడి నీటిలో యూకలిప్టస్‌ నూనె వంటివి వేసుకొని ఆవిరి పడితే ఇంకా మంచిది. స్వరపేటిక వాచి.. పెద్దగా ఇబ్బందులు లేనివారికి యాంటీబయోటిక్‌ మందుల అవసరమేమీ లేదు. అయితే నొప్పి ఉన్నప్పుడు మాత్రం యాంటీబయోటిక్స్‌ ఇవ్వాల్సి రావొచ్చు. 
వాయిస్‌ థెరపీ: ప్యూబర్‌ ఫోనియా, ఫంక్షనల్‌ డిస్పోనియా, అపోనియా వంటి సమస్యలకు ఇది బాగా తోడ్పడుతుంది. ఇందులో సరిగా మాట్లాడే పద్ధతులు, గాఢంగా శ్వాస తీసుకునే వ్యాయామాల వంటివి నేర్పిస్తారు. ఒకవైపు స్వరతంత్రి చచ్చుబడినవారికి కూడా ముందుగా వాయిస్‌ థెరపీ ఇస్తూ.. మూడు నెలల వరకు వేచి చూస్తారు. ఒక స్వరతంత్రి చచ్చుబడినప్పుడు రెండో స్వరతంత్రి దాని దగ్గరకు చేరుకోవటానికి ప్రయత్నిస్తుంటుంది. దీంతో మాట కొంతవరకు తిరిగి కుదురుకోవచ్చు. వాయిస్‌ థెరపీతో ఇది మరింత త్వరగా కుదురుకుంటుంది. 
స్వరతంత్రిని మధ్యలోకి తేవటం: ఒక స్వరతంత్రి చచ్చుబడటం మూలంగా మూడు నెలలైనా మాట మెరుగుపడకపోతే, దగ్గు వస్తుంటే, పొరపోతుంటే వోకల్‌ కార్డ్‌ మీడియాలైజేషన్‌ థైరోప్లాస్టీ చేయాల్సి ఉంటుంది. ఇందులో థైరాయిడ్‌ కుహరాన్ని కొద్దిగా తెరచి.. చిన్న పరికరాన్ని అమర్చి పక్కకు జరిగిపోయిన స్వరతంత్రిని మధ్యకు తీసుకొస్తారు. దీంతో మాట కుదురుకుంటుంది. దగ్గు, పొరపోవటం వంటివన్నీ తగ్గుతాయి. రెండువైపులా స్వరతంత్రులు చచ్చుబడినవారికి మాట బాగానే ఉంటుంది గానీ శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు పడుతుంటారు. అందువల్ల వీరికి స్వరతంత్రుల్లో లేజర్‌తో కొంత భాగాన్ని కత్తిరించి తొలగిస్తారు (లేజర్‌ కార్డెక్టమీ). దీంతో శ్వాస తీసుకోవటం మెరుగవుతుంది. 

మాట మారిందా?

మైక్రోలారింజియల్‌ సర్జరీ: పిలకలు, తిత్తుల వంటివి గలవారికి వాయిస్‌ థెరపీతో ఫలితం కనబడకపోతే దీన్ని చేస్తారు. ఇందులో ఎండోస్కోపీ ద్వారా స్వరపేటిక దగ్గరకు చేరుకొని, మైక్రోస్కోపీతో చూస్తూ పిలకలు, తిత్తుల వంటివి తొలగిస్తారు. దీన్ని వీడియోలో చూస్తూ కూడా చేయొచ్చు. వీటికిప్పుడు లేజర్‌ పద్ధతీ  అందుబాటులో ఉంది. దీంతో రక్తస్రావం లేకుండా చూసుకోవచ్చు. మాట కూడా వెంటనే మెరుగవుతుంది. 
రేడియేషన్‌: మిగతా అవయవాలకు వచ్చినట్టుగానే స్వరతంత్రులకూ క్యాన్సర్‌ రావొచ్చు. అయితే అదృష్టమేంటంటే- ఇది రేడియేషన్‌తోనే చాలామందికి నయమైపోతుంది. కాకపోతే దీన్ని తొలిదశలోనే గుర్తించటం అవసరం. ఆలస్యమైనకొద్దీ కణితి విస్తరించి స్వరతంత్రులు పూర్తిగా కదలని స్థితికి చేరుకోవచ్చు. కణితి మరీ పెద్దగా అయిపోతే స్వరపేటికను పూర్తిగా తొలగించాల్సి వస్తుంది. ఇలాంటివారికి అన్నవాహిక, శ్వాసనాళం మధ్యలో కవాటాన్ని అమరుస్తారు. దీంతో మాటలు వచ్చేలా చేయొచ్చు. శిక్షణ ద్వారా మాట మెరుగవుతుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.