close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 22/01/2019 00:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కుడి ఎడమైతే పొరపాటేనోయ్‌!

మధుమేహం ఒంటరిగా రాదు. వస్తూ వస్తూ గుండెజబ్బు, కిడ్నీ వైఫల్యం, పక్షవాతం, అంధత్వం, నాడీ సమస్యల వంటి ముప్పులనూ వెంటబెట్టుకొస్తుంది. మధుమేహం బయటపడిన తొలిరోజుననే 50% మందిలో గుండెజబ్బు ముప్పు కారకాలు ఉంటుండటం గమనార్హం. మిగతావారితో పోలిస్తే మధుమేహంతో బాధపడేవారిలో దీర్ఘకాల కిడ్నీజబ్బు నాలుగు రెట్లు ఎక్కువ కూడా! అంతేకాదు.. అంధత్వానికి మధుమేహం ప్రధాన కారణంగా మారటం.. మధుమేహం దాడిచేసిన పదేళ్ల లోపే దాదాపు అందరిలోనూ నాడులు దెబ్బతిని పోతుండటం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. అందుకే గుంపులో గోవిందంలా అందరికీ ఒకే చికిత్స కాకుండా ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి మందులను ఎంచుకోవాలని అమెరికన్‌ డయాబెటిక్‌ అసోసియేషన్‌ నినదిస్తోంది. ఇతరత్రా సమస్యలనూ  దృష్టిలో పెట్టుకొని.. కుడి ఎడమలు కానీయకుండా సరైన మందులను ఎంచుకుంటే మరింత మెరుగైన ఫలితం కనబడుతుందని తాజా మార్గదర్శకాల్లో సూచించింది. రక్తంలో గ్లూకోజు ఎక్కువగా ఉండటం కన్నా మరీ పడిపోతే కలిగే హానే ఎక్కువంటూ హైపోగ్లైసీమియా నివారణకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలో మధుమేహ చికిత్స కొత్త మార్గదర్శకాలపై సమగ్ర కథనం..

కుడి ఎడమైతే పొరపాటేనోయ్‌!

మధుమేహం సంక్లిష్ట సమస్య. ఒకసారి వచ్చిందంటే పోయేది కాదు. దీన్ని నియంత్రించుకోవటం తప్ప చేయగలిగిందేమీ లేదు. ఒకవైపు- శక్తినిచ్చే గ్లూకోజు రక్తంలో దండిగా ఉన్నా కణాలు దాన్ని సరిగా స్వీకరించలేక రోజురోజుకీ అవయవాలు చతికిల పడిపోతుంటాయి. మరోవైపు- రక్తంలో గ్లూకోజు మోతాదులు ఎప్పుడూ ఎక్కువగా ఉండటం రక్తనాళాలను దెబ్బతీస్తుంటుంది. మధుమేహంలో తలెత్తే దుష్ప్రభావాలన్నింటికీ ఇదే మూలం. రక్తనాళాలు దెబ్బతిన్న చోట క్రమంగా కొవ్వు పేరుకోవటం.. చివరికి పూడికలుగా ఏర్పడటం.. ఫలితంగా గుండెపోటు ముప్పు పెరగటం.. అంతా ఒక విష వలయంగా తయారవుతుంది. కిడ్నీల సామర్థ్యం తగ్గిపోయి వడపోత ప్రక్రియ కూడా మందగిస్తుంది. అంతేకాదు, సూక్ష్మరక్తనాళాలు దెబ్బతినటం మెదడు, కళ్ల వంటి సున్నిత అవయవాల మీదా విపరీత ప్రభావం పడుతుంది. నాడులు దెబ్బతినటం వల్ల కాళ్లు చేతుల వంటి భాగాల్లో స్పర్శ కూడా తగ్గిపోతుంది. అందుకే రక్తంలో గ్లూకోజు స్థాయులు నియంత్రణలో ఉండేలా చూసుకోవటం తప్పనిసరి. ఇందులో జీవనశైలి మార్పులతో పాటు మందుల పాత్ర చాలా కీలకం. దీన్ని దృష్టిలో పెట్టుకొనే అమెరికన్‌ డయాబెటిక్‌ అసోసియేషన్‌, యూరోపియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డయాబెటీస్‌, అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ సంయుక్తంగా తొలిసారిగా మధుమేహ చికిత్స మార్గదర్శకాలను సవరించాయి. ఇందులో గుండెజబ్బులు, గుండె వైఫల్యం, దీర్ఘకాల కిడ్నీజబ్బులతో పాటు రక్తంలో గ్లూకోజు స్థాయులు మరీ కిందికి పడిపోకుండా (హైపోగ్లైసీమియా) చూడటానికీ ప్రాధాన్యం ఇవ్వటం గమనార్హం. మందులు అవే అయినా ఎవరికి ఎలాంటి మందులు ఉపయోగపడతాయన్నది విస్పష్టంగా వర్గీకరించటం విశేషం. మధుమేహంతో బాధపడేవారితో పాటు డాక్టర్లు, వైద్య సిబ్బంది అంతా వీటి గురించి తెలుసుకొని ఉండటం మంచిది.

ప్రధాన ఔషధం- మెట్‌ఫార్మిన్‌
కుడి ఎడమైతే పొరపాటేనోయ్‌!మధుమేహం ఉందని బయటపడగానే చాలామంది ముందుగా బరువు తగ్గించుకోవటం గురించే ఆలోచిస్తుంటారు. వ్యాయామాలు, ఆహార నియమాలతోనే గ్లూకోజు స్థాయులను నియంత్రించుకోవచ్చని భావిస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. మధుమేహం బయటపడిన తొలిరోజు నుంచే మెట్‌ఫార్మిన్‌ మందు ఆరంభించాలి. దీన్ని వాడుకుంటూ.. బరువును అదుపులో ఉంచుకోవటం, శారీరక శ్రమ, వ్యాయామాల వంటివి కొనసాగించాలి. అంతే తప్ప కేవలం వ్యాయామాలు, శారీరకశ్రమతోనే గ్లూకోజు స్థాయులను నియంత్రణలోకి తెచ్చుకోవటానికి ప్రయత్నించటం తగదు. రక్తంలో గ్లూకోజు స్థాయులను బట్టి 500 మి.గ్రా. నుంచి 2,000 మి.గ్రా. వరకూ మెట్‌ఫార్మిన్‌ వాడుకోవాల్సి ఉంటుంది. దీన్ని మూడు నెలల పాటు తీసుకున్నాక హెచ్‌బీఏ1సీ పరీక్ష చేయించాలి. ఇందులో మూడు నెలల కాలంలో రక్తంలో గ్లూకోజు స్థాయుల సగటు బయట పడుతుంది. ఇది 7% లోపునకు చేరుకోకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రెండో మందును ఆరంభించాల్సి ఉంటుంది.

మెట్‌ఫార్మిన్‌తో విటమిన్‌ బి12 మోతాదులు తగ్గే అవకాశముంది. కాబట్టి అవసరమైతే బి12 మాత్రలు, ఇంజెక్షన్లు తీసుకోవాలి. రక్తహీనత లేదా కాళ్లు చేతుల్లో నాడులు దెబ్బతిన్నవారికిది మరింత ముఖ్యం.

హైపోగ్లైసీమియాతోనే ఎక్కువ ప్రమాదం
రక్తంలో గ్లూకోజు స్థాయులు ఎక్కువగా ఉండటం కన్నా ఉండాల్సిన దాని కన్నా తక్కువగా ఉంటే కలిగే నష్టమే ఎక్కువ. ఇది ప్రాణాపాయానికీ దారితీయొచ్చు. మధుమేహుల్లో ఆరో వంతు మరణాలకు హైపోగ్లైసీమియానే కారణమవుతోంది. కాబట్టి హైపోగ్లైసీమియా తలెత్తకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. గ్లూకోజు స్థాయులు 70 మిగ్రా/డీఎల్‌ కన్నా తగ్గితే హైపోగ్లైసీమియా వస్తోందనే అర్థం. ఇక గ్లూకోజు 50 మిగ్రా/డీఎల్‌కు పడిపోతే హైపోగ్లైసీమియాకు చేరుకున్నట్టే. అప్పుడు శరీరంలో ‘అడ్రినెర్జిక్‌ హైపర్‌యాక్టివిటీ’ తలెత్తుతుంది. అంటే గ్లూకోజుకు ప్రత్యామ్నాయంగా శరీరానికి శక్తిని అందించటం కోసం ఎడ్రినలిన్‌, నార్‌ అడ్రినలిన్‌, కార్టిజోల్‌ వంటి హార్మోన్లు పుట్టుకొస్తాయి. ఇవి శక్తి కోసం పిండి పదార్థాన్ని కాకుండా మాంసకృత్తులు, కొవ్వులను వాడుకుంటాయి. దీంతో అసిటోన్‌ వంటి కీటోన్స్‌ పెద్దమొత్తంలో విడుదలవుతాయి. ఇవి ఎక్కువసేపు కొనసాగితే తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. ఇక గ్లూకోజు 30 మిగ్రా/డీఎల్‌ కన్నా పడిపోతే ఈ ప్రత్యామ్నాయ శక్తి కూడా అందుబాటులో ఉండదు. అప్పుడు మెదడు కూడా పనిచేయటం మానేస్తుంది (న్యూరో గ్లైకోపీనియా). దీంతో కోమాలోకి వెళ్లిపోతారు. శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రక్తంలో ఆక్సిజన్‌ గణనీయంగా పడిపోయి అవయవాలు శాశ్వతంగా దెబ్బతినొచ్చు. ఇది ప్రాణాంతక స్థితి. అందుకే హైపోగ్లైసీమియా నివారణకు మార్గదర్శకాల్లో ప్రముఖంగా ప్రాధాన్యం కల్పించారు.

* మామూలుగా హైపోగ్లైసీమియాలో చేతులు వణకటం, అరచేతుల్లో చెమట్లు పట్టటం, కళ్లు తిరగటం, స్పృహ తప్పుతున్నట్టు అనిపించటం వంటి హెచ్చరిక సంకేతాలు కనబడతాయి. కానీ అడ్రినెర్జిక్‌ హైపర్‌యాక్టివిటీకి శరీరం స్పందించకపోవటం వల్ల మధుమేహుల్లో చాలామంది ఇలాంటి హెచ్చరిక సంకేతాలు లేకుండానే హైపోగ్లైసీమియా నుంచి న్యూరో గ్లైకోపీనియాకు చేరుకుంటుంటారు. కాబట్టి తరచుగా రక్తపరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి. గ్లూకోజు స్థాయులు 70 మిగ్రా/డీఎల్‌ ఉన్నట్టయితే త్వరలోనే హైపో గ్లైసీమియాకు చేరుకునే ప్రమాదముంది.

* ధర తక్కువ కావటం వల్ల మనదేశంలో మొదట్నుంచీ సల్ఫనైల్‌ యూరియా మాత్రలనే వాడుతూ వచ్చాం. వీటితో హైపోగ్లైసీమియా వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే వీటిని నాలుగో మందుగా వాడుకోవటమే మంచిదని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అయితే ఖర్చు భరించలేని పరిస్థితుల్లో మాత్రం వాడుకోవచ్చని సూచించారు.  ఒకవేళ వీటిని వాడుకోవాల్సి వస్తే తక్కువ సమస్యలుండే గ్లైమిపెరైడ్‌, గ్లైక్లిజైడ్‌,     గ్లైపిజైడ్‌ వంటి రకాలు ఎంచుకోవచ్చు.
 

రెండో దశ మందులు- నాలుగు ఉద్దేశాలు
మెట్‌ఫార్మిన్‌ వాడుతున్నా కూడా గ్లూకోజు స్థాయులు అదుపులోకి రానప్పుడు రెండో దశ మందులను ప్రారంభించాలి. వీటిని నాలుగు అంశాలను బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది.

1. గ్లూకోజు మరీ పడిపోకుండా చూడటం

మధుమేహ చికిత్స ప్రధాన ఉద్దేశం రక్తంలో గ్లూకోజు స్థాయులను తగ్గించటం. అలాగని గ్లూకోజు మరీ పడిపోయినా (హైపోగ్లైసీమియా) ప్రమాదమే. అందువల్ల హైపోగ్లైసిమియా తలెత్తకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. ఇందుకోసం ప్రస్తుతం రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. మెట్‌ఫార్మిన్‌తో పాటు వీటిల్లో ఏదో ఒకదాన్ని వాడుకోవాల్సి ఉంటుంది. రక్తంలో గ్లూకోజు మోతాదులను అదుపులో ఉంచుతూనే హైపోగ్లైసీమియా తలెత్తకుండా చూసే మందుల్లో ప్రధానమైనవి గ్లిప్టిన్లు (డీపీపీ4 ఇన్‌హిబిటార్స్‌). ఒకవేళ ఎవరికైనా గ్లిప్టిన్స్‌ ఇవ్వటం కుదరకపోతే గ్లుటైడ్స్‌ (జీఎల్‌పీ1 ఆర్‌ఏ) ఆరంభించాలి. కాకపోతే ఇవి ఇంజెక్షన్‌ రూపంలోనే ఉంటాయి. గ్లుటైడ్స్‌, గ్లిప్టిన్స్‌ ధర ఎక్కువ కావటం వల్ల గతంలో వీటిని మూడో మందుగానో నాలుగో మందుగానో పరిగణించేవారు. అయితే మంచి ఫలితం కనబడుతుండటంతో తాజా మార్గదర్శకాల్లో వీటిని పైకి తీసుకొచ్చారు. ఇవి తిన్న ఆహార పరిమాణానికి అనుగుణంగా క్లోమంలోంచి ఇన్సులిన్‌ బయటకు వచ్చేలా చేస్తాయి. ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఇలా రక్తంలో గ్లూకోజు స్థాయులను అదుపులో ఉంచుతాయి. జీర్ణాశయంలో ఆహారం ఎక్కువసేపు ఉండేలా చేస్తూ.. కడుపు నిండిన భావన కలిగించటం వల్ల ఆకలి కూడా తగ్గుతుంది. అయితే కొందరిలో ఇవి అజీర్ణం, కడుపుబ్బరం వంటి సమస్యలకు దారితీయొచ్చు. ఇలాంటివారికి గ్లిఫ్లోజిన్స్‌ (ఎస్‌జీఎల్‌టీ2 ఇన్‌హిబిటార్స్‌) బాగా ఉపయోగపడతాయి. ఇవి జీర్ణక్రియతో సంబంధమేమీ లేకుండా మూత్రం ద్వారా మరింత ఎక్కువగా గ్లూకోజు బయటకు వెళ్లిపోయేలా చేస్తాయి. ఇవేవీ కుదరకపోతే గ్లిటజోన్స్‌ ఇవ్వొచ్చు. ఇవి నేరుగా కణ కేంద్రకంలోని గ్రాహకాలను ప్రేరేపితం చేస్తూ.. ప్రోటీన్లు, కొవ్వుల తయారీని అదుపులో పెడతాయి. ఒకప్పుడు పయోగ్లిటజోన్‌ మందును ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. దీంతో పెద్దగా దుష్ప్రభావాలేవీ తలెత్తటం లేదని గుర్తించి, వాడుకోవటానికి అనుమతించారు.

* ఈ మందులను గరిష్ఠ మోతాదులో వాడుతున్నా 3 నెలల తర్వాత హెచ్‌బీఏ1సీ 7% లోపునకు చేరుకోకపోతే మూడో మందుగా వీటిల్లోంచే మరొకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

2. బరువు పెరగకుండా చూడటం

మధుమేహ మందుల్లో గ్లిప్టిన్లు, గ్లుటైడ్‌ వంటి ఒకటీ అరా తప్పించి మిగతావన్నీ బరువు పెరిగేలా చేసేవే. కాబట్టి ఊబకాయులు బరువు తగ్గించుకోవటానికి, సన్నగా ఉన్నవారు బరువు పెరగకుండా చూసుకోవటం తప్పనిసరి. మెట్‌ఫార్మిన్‌ వాడుతున్నా హెచ్‌బీఏ1సీ 7% లోపునకు చేరుకోకపోతే.. లావుగా ఉన్నట్టయితే గ్లుటైడ్‌ ఇంజెక్షన్లు తీసుకోవటం మంచిది. ఒకప్పుడు ఇది చివరి వరుసలో ఉండేది. బరువు తగ్గిస్తుండటం తాజాగా ముందుకు తీసుకొచ్చారు. ఇంజెక్షన్లు తీసుకోవటం ఇష్టపడనివారికి, ఖర్చు ఎక్కువవుతుందని భావించేవారికి గ్లిఫ్లోజిన్లు వాడొచ్చు. గ్లిఫ్లోజిన్లతో పెద్దగా బరువు తగ్గకపోవచ్చు గానీ బరువు పెరగకుండా మాత్రం చూసుకోవచ్చు. మూడు నెలలుగా గ్లుటైడ్‌ ఇంజెక్షన్లు తీసుకుంటున్నా హెచ్‌బీఏ1సీ నిర్ణీత స్థాయికి చేరుకోకపోతే మూడో మందుగా గ్లిఫ్లోజిన్లను తీసుకోవాలి. ఇలా మూడు మందులు వాడుతున్నా బరువు తగ్గకపోతే దీర్ఘకాలం పనిచేసే బేసల్‌ ఇన్సులిన్‌ ఆరంభించటం మంచిది.

3. గుండె, కిడ్నీ జబ్బులున్నప్పుడు

రక్తనాళాల్లో పూడికల మూలంగా తలెత్తే గుండెజబ్బులు గలవారికి.. అలాంటి జబ్బులు వచ్చే అవకాశమున్నవారికి మెట్‌ఫార్మిన్‌తో పాటు గ్లుటైడ్‌ ఇంజెక్షన్లు ఆరంభించాలి. బరువుతో సంబంధం లేకుండా.. ఎక్కువున్నా తక్కువున్నా వీటిని మొదలుపెట్టాలి. ఒకవేళ ఇంజెక్షన్లు ఇష్టం లేకపోతే గ్లిఫ్లోజిన్‌ మాత్రలు ఇవ్వొచ్చు. వీటితో గుండె రక్తనాళాల సమస్యల ముప్పు తగ్గుతున్నట్టు, అప్పటికే అలాంటి జబ్బులుంటే వాటిని ముదరకుండా చేస్తున్నట్టు అధ్యయనాల్లో తేలింది. గుండె వైఫల్యం, దీర్ఘకాల కిడ్నీజబ్బులు గలవారికి.. అలాంటి జబ్బులు వచ్చే అవకాశం గలవారికి కూడా ఈ మందులనే వాడుకోవాలి. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే- మూత్రపిండాలు రక్తాన్ని వడకట్టే వేగం (జీఎఫ్‌ఆర్‌) బాగుంటేనే వీటిని వాడుకోవాలి. ఒకవేళ జీఎఫ్‌ఆర్‌ 30 ఎం.ఎల్‌. కన్నా తక్కువున్నట్టయితే ఇన్సులిన్‌ వాడుకోవటమే ఉత్తమం. గ్లుటైడ్‌, గ్లిఫ్లోజిన్‌లు పడకపోయినా, వీటితో ఫలితం కనబడకపోయినా సల్ఫనైల్‌ యూరియా, ఇన్సులిన్‌లలో ఏదో ఒకటి ఇవ్వాలి.

4. ఖర్చునూ దృష్టిలో పెట్టుకోవాలి

మధుమేహ మందుల విషయంలో కొన్నిదేశాల్లో.. ముఖ్యంగా మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఖర్చు కూడా పెద్ద సమస్యే. దీన్ని కాదనటానికి లేదు. మందుల ధర పెరిగితే భరించటం కష్టం. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని మార్గదర్శకాల్లో తొలిసారిగా చేర్చారు. ఖర్చు భరించలేనివారికి మెట్‌ఫార్మిన్‌తో పాటు సల్ఫనైల్‌ యూరియా రకం మందులు వాడుకోవచ్చు. కాకపోతే వీటితో బరువు పెరుగుతుంది. అందువల్ల బరువు ఎక్కువగా గలవారు కాస్త ధర ఎక్కువైనా గ్లిటజోన్స్‌ వాడుకోవటం మేలు.

* సల్ఫనైల్‌ యూరియా మందులు వేసుకుంటున్నవారు హెచ్‌బీఏ1సీ నిర్ణీత స్థాయిలకు చేరుకోకపోతే గ్లిటజోన్స్‌ వాడుకోవాలి. అప్పటికీ ప్రయోజనం లేకపోతే ఇన్సులిన్‌ ఇవ్వక తప్పదు.

ఆఖరి అస్త్రం- ఇన్సులిన్‌

ఏదైనా మందుతో మూడు నెలలు దాటినా ఫలితం కనబడకపోతే వెంటనే తర్వాతి మందులకు మారిపోవాలి. అవసరమైతే తక్కువ తక్కువ మోతాదుల్లోనే రెండు, మూడు మందులను కూడా కలుపుకోవచ్చు. అప్పటికీ ఫలితం కనబడకపోతే ఇన్సులిన్‌ ఇవ్వటం తప్పనిసరి. అయితే 3 గంటలు, 6 గంటలు పనిచేసే ఇన్సులిన్ల కన్నా 12 గంటలు గానీ 24 గంటలు గానీ పనిచేసే బేసల్‌ ఇన్సులిన్లు వాడుకోవటం ఉత్తమం. వీటితో అంతగా బరువు కూడా పెరగదు. కాబట్టి గుండెకూ మేలు చేస్తాయి.

* అయితే కొందరికి మందులతో పనిలేకుండా ముందు నుంచే ఇన్సులిన్‌ ఆరంభించాల్సి రావొచ్చు. రక్తంలో గ్లూకోజు స్థాయులు మరీ పెరిగిపోతే (హైపర్‌ గ్లైసీమియా) బరువు తగ్గిపోవటం, నీరసం, నిస్సత్తువ, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోలేకపోవటం, నోరు పొడిబారటం, చూపు మసకబారటం వంటి లక్షణాలు కనబడతాయి. ఇలాంటి లక్షణాలు కనబడినా.. రక్తంలో గ్లూకోజు  300 మిగ్రా/డీఎల్‌ కన్నా ఎక్కువున్నా. హెచ్‌బీఏ1సీ 9% కన్నా ఎక్కువున్నా రెండో మందు ఇవ్వటం వంటి ప్రయోగాలకు బదులు నేరుగా ఇన్సులిన్‌ ఆరంభించాలి. మనదేశంలో రక్తంలో గ్లూకోజు పరగడుపున 250, ర్యాండమ్‌గా 500 ఉంటేనే హైపర్‌ గ్లైసీమియాగా భావిస్తుంటాం. అయితే గ్లూకోజు 300 దాటితే వెంటనే ఇన్సులిన్‌ వాడుకోవటం ఉత్తమమన్నది తాజా సిఫారసు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.