close

తాజా వార్తలు

Updated : 26/03/2019 04:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాదాలకు తీపి చెద!

మధుమేహం ఒళ్లంతా కబళిస్తుంది. ఇది నియంత్రణలో లేకపోతే కళ్ల నుంచి కాళ్ల వరకూ అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా రక్తనాళాలు, నాడులను దెబ్బతీసి రకరకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. వీటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది పాదాల మీద ఏర్పడే పుండ్ల గురించి. ఇవి ముందు చిన్న మచ్చలా, గుల్లలా మొదలై.. చివరికి పుండుగా మారి ఎంతకీ మానకుండా దీర్ఘకాలం వేధిస్తుంటాయి. వీటి మూలంగా కాళ్లు పోగొట్టుకుంటున్నవారు ఎందరో. ఆసుపత్రుల్లో చేరుతున్న మధుమేహుల్లో సుమారు పావు వంతు మొండి పుండ్లతో సతమతమవుతున్నవారే! ఈ నేపథ్యంలో మధుమేహ పుండ్లపై సమగ్ర కథనం ఈవారం మీకోసం.

నల్ని కదిలించేవి, మున్ముందుకు నడిపించేవి పాదాలే. శరీర బరువునంతా తమ మీదేసుకొని మనల్ని మోస్తూ ఎక్కడికంటే అక్కడికి చేరవేస్తుంటాయి. అలాంటి పాదాలకు ఏ చిన్న సమస్య వచ్చినా ఇబ్బందే. అలాంటిది ఒకపట్టాన మానకుండా, దీర్ఘకాలం వేధిస్తూ వెంటాడే పుండు పడితే శరీరం మొత్తం కుదేలవుతుంది. ఇక అది ఇన్‌ఫెక్షన్‌కు దారితీసి.. కండరాలను తినేసి.. వేళ్లను, పాదాన్ని కుళ్లిపోయేలా చేస్తే? జీవితం నరకప్రాయంగా తయారవుతుంది. మధుమేహం సరిగ్గా ఇలాగే పాదాలను దెబ్బతీస్తోంది. రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను, నాడీ సంకేతాలు అందించే నాడులను తీవ్రంగా దెబ్బతీసి పద్మాల్లాంటి పాదాలకు తీపి చెదను పట్టిస్తోంది. మానని పుండ్లకు దారితీసి తీవ్రంగా వేధిస్తోంది. మధుమేహంతో బాధపడుతున్నవారిలో 25 శాతానికి పైగా మంది మొండి పుండ్లతో సతమతమవుతున్నారని అంచనా. వీరిలో సుమారు 15-25% మందిలో సమస్య తీవ్రమై చివరికి వేళ్లు, పాదాలు తొలగించే స్థితికి చేరుకుంటున్నారు కూడా. కొందిరికి మోకాలి కింది వరకు కాలు తొలగించాల్సిన పరిస్థితి తలెత్తుతుండటం విషాదం. పాదాలకు, చీలమండలకు తగిలే చిన్న చిన్న దెబ్బలు కూడా మధుమేహం మూలంగా పెద్దవిగా తయారై వేధిస్తుంటాయి. కొన్నిసార్లు రాళ్లు, మట్టి గడ్డల మీద పాదం పడినా చాలు. అవే పెద్ద పుండుగా మారిపోవచ్చు. సరైన చెప్పులు వేసుకోకపోవటం, చెప్పులు లేకుండా నడవటం, చెప్పుల్లోని మేకుల వంటివి గుచ్చుకోవటం, వేళ్ల గోళ్లు వెనక్కి తిరగటం వంటివీ పుండ్లకు దారితీయొచ్చు. దీనికి ప్రధాన కారణం రక్తనాళాలు, నాడులు దెబ్బతినటమే. మధుమేహానికి పొగ తాగటం, మద్యం అలవాటు కూడా తోడైతే రక్తనాళాలు, నాడులు దెబ్బతినే ముప్పు మరింత పెరుగుతుంది కూడా. అంటే ఎప్పుడో పదేళ్ల తర్వాత రావాల్సిన పాదాల సమస్యలు ఇప్పుడే మొదలు కావొచ్చు. అవి మరింత తీవ్రంగానూ ఉండొచ్చు. కాబట్టి మధుమేహ పుండ్ల విషయంలో నిర్లక్ష్యం అసలే పనికిరాదు. వీటిని ఆదిలోనే గుర్తించి, జాగ్రత్త పడటం ఎంతైనా అవసరం.

లక్షణాలపై కన్నేయండి

సమస్య తీవ్రతను బట్టి రకరకాల లక్షణాలు కనబడుతుంటాయి.

తొలిదశలో- చర్మం మీద రంగు మారుతుంది. ముఖ్యంగా ఎర్రగా అవుతుంది. వేడి, వాపు కూడా ఉండొచ్చు. స్పర్శ తగ్గొచ్చు. కొందరిలో చర్మం విపరీతంగానూ స్పందించొచ్చు. దీంతో లోపల చీమలు పాకుతున్నట్టు, పొడుస్తున్నట్టు, అక్కడక్కడా మొద్దుబారినట్టు అనిపిస్తుంటుంది. అయితే చాలామందికివి పుండు లక్షణాలని తెలియకపోవటం గమనార్హం. దీంతో పెద్దగా పట్టించుకోరు. క్రమంగా సమస్య తీవ్రమవుతూ వస్తుంటుంది.
తర్వాతి దశలో- పుండు స్పష్టంగా కనిపిస్తుంది. చాలామంది ఏదైనా గీసుకుపోతేనో, దెబ్బలు తగిలితేనో పుండు పడుతుందని భావిస్తుంటారు. ఇలాంటివేవీ లేకపోయినా దానంతటదే పుండు పడొచ్చు. స్వయం చాలిత (అటనమిక్‌) నాడీ వ్యవస్థ దెబ్బతింటే రక్తనాళాల పనితీరు సైతం మందగిస్తుంది. దీంతో చర్మం పలుబడి సన్నటి పగుళ్లు బయలుదేరతాయి. వీటిలోంచి సూక్ష్మక్రిములు ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌ తలెత్తుతుంది. ఇది పుండు పడేలా చేస్తుంది. రక్తనాళాలు దెబ్బతినటం వల్ల చర్మం మీద నల్లటి మచ్చలు ఏర్పడి.. చివరికి పుండుగా మారొచ్చు.
* కొందరికి పుండ్లు ఇన్‌ఫెక్షన్‌కు దారితీయొచ్చు. దీంతో అక్కడంతా చీముపట్టి, కుళ్లిపోయి ‘గ్యాంగ్రీన్‌’ తలెత్తొచ్చు. ఇందులో తడి, పొడి.. అని రెండు రకాలున్నాయి. పొడి గ్యాంగ్రీన్‌లో కుళ్లిపోవటం నెమ్మదిగా సాగుతుంది. ఆ భాగమంతా నల్లగా పేడు ముక్కలా తయారవుతుంది. మొదట్లో ఇందులో ఇన్‌ఫెక్షన్‌ ఏమీ ఉండదు. ఇక తడి గ్యాంగ్రీన్‌లో చాలా వేగంగా రక్తసరఫరా ఆగిపోతుంది. క్రమంగా అక్కడంతా ఉబ్బిపోయి.. ఇన్‌ఫెక్షన్‌ మొదలై.. కుళ్లిపోతుంది.
* సమస్య ముదురుతున్నకొద్దీ వేళ్లు, పాదాల ఆకారమూ దెబ్బతినొచ్చు. వేళ్లలోని కీళ్లకు నాడుల సమాచారం సరిగా అందకపోతే అవి ఎలా ఉన్నాయనేవీ తెలియదు. దీంతో తెలియకుండానే వంకర్లు పోతుంటాయి. అలాగే పాదాల్లోని పెద్ద కీళ్లు కూడా దెబ్బతినొచ్చు. ఫలితంగా పాదం ఆకారమూ మారిపోవచ్చు. దీంతో మరో ముప్పేంటంటే- పాదాల మీద భారం సరిగా పడక ఎముకలు, పాదాల వంపు అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఒకచోట ఎక్కువగా, మరోచోట తక్కువగా బరువు పడుతుంది. బరువు అధికంగా పడిన చోట చర్మం దెబ్బతిని పుండు పడొచ్చు.
* పుండు ఇన్‌ఫెక్షన్‌ కొన్నిసార్లు రక్తంలోకి చేరుకొని, ఒళ్లంతా పాకొచ్చు. దీంతో జ్వరం, చలి వంటివీ వేధిస్తాయి. కొందరికివి తొలిదశలోనూ కనబడుతుండటం గమనార్హం. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమవుతున్నకొద్దీ ఆ భాగమంతా దెబ్బతిని పోతుంది. చివరికి కోలుకోలేని స్థితికి చేరుకుంటుంది. దీంతో ఆయా భాగాలను తొలగించటం తప్ప మరో మార్గమేదీ ఉండదు. కొన్నిసార్లు వేళ్ల వంటి భాగాలు వాటంతటవే రాలిపోయే (ఆటో యాంప్యుటేషన్‌) ప్రమాదమూ లేకపోలేదు. ఇది పొడి గ్యాంగ్రీన్‌లో తరచుగా చూస్తుంటాం.

నిర్ధారణ ఎలా?

చాలావరకు పుండు తీరుతెన్నులతోనే సమస్యను నిర్ధరిస్తారు. అవసరమైతే ఎక్స్‌రే తీయాల్సి ఉంటుంది. ఇందులో కీళ్ల ఆకారం, ఎక్కడెక్కడ బరువు ఎక్కువగా పడుతోంది, ఇన్‌ఫెక్షన్‌ ఎముకకు పాకటం వంటివి తెలుస్తాయి. ఇన్‌ఫెక్షన్‌ బాగా ఎక్కువుంటే స్రావాలను తీసి కల్చర్‌ పరీక్ష చేస్తారు.
* డాప్లర్‌ స్కాన్‌: సాధారణంగా మధుమేహుల్లో మోకాలి కింద.. ముఖ్యంగా మడమ కింద ధమనులు బాగా దెబ్బతింటుంటాయి. అందువల్ల రక్తసరఫరా ఎలా ఉందన్నది చూసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అల్ట్రాసౌండ్‌ డాప్లర్‌ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ధమనుల్లో, సిరల్లో మార్పులేవైనా ఉంటే బయటపడుతుంది. సిరల ఉబ్బు, బర్జర్స్‌ డిసీజ్‌ వంటి వంటి ఇతరత్రా సమస్యలేవైనా ఉన్నా తెలుస్తుంది.
సమస్య తీవ్రతను బట్టి రకరకాల లక్షణాలు కనబడుతుంటాయి.

నివారణే అత్యుత్తమం

మధుమేహంతో తలెత్తే పాదాల సమస్యలు తీవ్ర అనర్థాలకు దారితీసే మాట నిజమే అయినా వీటిని నివారించుకునే మార్గం లేకపోలేదు. రక్తంలో గ్లూకోజును కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పుండ్ల వంటి వాటిని నివారించుకోవచ్చు.
* పాదాలను రోజూ గమనించటం తప్పనిసరి. చేత్తో అన్ని వైపుల నుంచీ తాకుతూ ఏదైనా గీసుకుపోయిందా? చర్మం ఎక్కడైనా లేచిపోయిందా? అనేది చూసుకోవాలి. తమకు తాము చూసుకోవటం వీలు కాకపోతే అద్దంలోనైనా చూసుకోవాలి. ఇంట్లో వాళ్లనయినా చూడమని చెప్పాలి.
* పాదాలను రోజూ శుభ్రంగా కడుక్కోని, తడి లేకుండా తుడుచుకోవటం ద్వారా ఇన్‌ఫెక్షన్లు తలెత్తకుండా చూసుకోవచ్చు.
* ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే నడవాలి. సాక్స్‌ ధరిస్తే ఇంకా మంచిది.
* కూచున్నప్పుడు పాదాలు ఎత్తు మీద పెట్టుకోవటం, తరచుగా వేళ్లను కదిలిస్తుండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిది. దీంతో పాదాలకు తగినంత రక్తసరఫరా అవుతుంది.
* బ్లేడుకు బదులు నెయిల్‌ కట్టర్‌తో గోళ్లను కత్తిరించుకోవాలి. పూర్తిగా అంచుల వరకు కాకుండా కొంత వదిలేసి కత్తిరించుకోవాలి.
* ఆనెలు, గుల్లల వంటివి ఏర్పడితే డాక్టర్‌ను సంప్రతించాలి. ఇష్టం వచ్చినట్టు కోయటం, సూదితో పొడవటం వంటివి చేయకూడదు.
* పొగ అలవాటుంటే వెంటనే మానెయ్యాలి.

పుండెందుకు మానదు?

రక్తంలో గ్లూకోజు మోతాదులు ఎక్కువగా ఉండటమనేది ఎప్పుడైనా ప్రమాదకరమే. ఇది రక్తనాళాలు, నాడులు, కండరాలు.. ఇలా అన్ని వ్యవస్థలనూ దెబ్బతీస్తుంది. మధుమేహ పుండ్లు మానకపోవటానికి ఇదే ప్రధాన కారణం. మన శరీరంలో గుండె నుంచి చాలా దూరంగా ఉండేవి పాదాలే. పైగా శరీర బరువును మోస్తుండటం వల్ల వీటిపై భారమూ ఎక్కువగానే పడుతుంటుంది. అందువల్ల కాళ్లలోని రక్తనాళాల్లో ఎక్కడ సమస్య తలెత్తినా తీవ్ర ప్రభావం చూపుతుంది. మధుమేహంతో బాధపడేవారిలో ధమనుల గోడలకు కొవ్వు పేరుకుపోయే ముప్పు ఎక్కువ. దీంతో రక్తనాళాల లోపలి మార్గం సన్నబడుతుంది (ఎథెరోస్క్లెరోసిస్‌). కాళ్లలోని ధమనుల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే పుండ్లు పడే ముప్పు పెరుగుతుంది. త్వరగా మానవు కూడా. మరోవైపు మధుమేహుల్లో కాళ్లలో నాడులూ దెబ్బతింటుంటాయి (పెరిఫెరల్‌ న్యూరోపతీ). ఫలితంగా స్పర్శజ్ఞానం తగ్గుతుంది. నొప్పి కూడా తెలియదు. దీంతో పాదాలకు గాయాలయ్యే అవకాశం ఎక్కువ. నొప్పి తెలియకపోవటం వల్ల వాటిని త్వరగా గుర్తించలేరు. అందువల్ల చిన్న పుండ్లు కూడా పెద్దగా అవుతాయి. నాడులు దెబ్బతింటే కండర సంకోచ, వ్యాకోచాలూ అస్తవ్యస్తమవుతాయి. దీంతో కొంత రక్తం ఎప్పుడూ అక్కడే ఉండిపోతుంటుంది. అంతేకాదు, సూక్ష్మ రక్తనాళాల్లోంచి ద్రవం బయటకు లీకవుతుంటుంది కూడా. మామూలుగా ఇలా లీకైన ద్రవాలు లింఫ్‌ వ్యవస్థ ద్వారా తిరిగి గుండెకు చేరుకుంటాయి. కానీ మధుమేహంలో ఈ ప్రక్రియ కూడా అస్తవ్యస్తమవుతుంది. దీంతో పాదాలు ఉబ్బటం (ఎడీమా) మొదలవుతుంది. పైగా రక్తంలోని గ్లూకోజు నీటిని పట్టి ఉంచే ప్రయత్నం చేస్తుంటుంది. ఇదీ ఉబ్బునకు దారితీస్తుంది. పాదాలు ఉబ్బినపుడు కణాల మధ్య నీరు పోగుపడుతుంది. దీంతో రక్తం, రక్తంతో పాటు సరఫరా అయ్యే ఆక్సిజన్‌ సరిగా అందదు. దీంతో పుండు మానకుండా దీర్ఘకాలంగా వేధిస్తుంటుంది.

చికిత్స- రకరకాలు

మధుమేహ చికిత్సలో రక్తంలో గ్లూకోజు నియంత్రణ చాలా కీలకం. క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. అవసరమైతే ఇన్సులిన్‌ తీసుకోవాలి. అదే పుండ్లు తలెత్తితే అవి మరింత తీవ్రం కాకుండా, వీలైనంత త్వరగా మానేలా చూసుకోవాలి.
* పాదాన్ని ఎత్తు మీద పెట్టటం: పడుకున్నప్పుడు పాదం కింద కాస్త ఎత్తు పెట్టుకోవటం మంచిది. గుండె కన్నా పాదం ఎత్తుగా ఉంటే ద్రవం తేలికగా వెనక్కి వస్తుంది. ఉబ్బు తగ్గుతుంది. అయితే రక్తనాళాల సమస్యలు గలవారికి మాత్రం ఇదంత మంచిది కాదు.
* పుండు మీద శ్రద్ధ: పుండు నుంచి స్రావాలు రాకుండా చూసుకోవటం.. అలాగే కాస్త వేడిగా, తేమగా ఉండేలా చూడటం ముఖ్యం. ఇందుకోసం ఇప్పుడు మందులతో కూడిన రకరకాల బ్యాండేజీలు అందుబాటులో ఉన్నాయి. ఇవి స్రావాలను పీల్చేసుకొని.. కాస్త తేమ ఉండేలా చూస్తాయి. దీంతో కణాలు త్వరగా వృద్ధి చెందుతాయి. పుండు త్వరగా మానుతుంది.
* వ్యాక్యూమ్‌ థెరపీ: దీర్ఘకాలంగా మానకుండా వేధిస్తున్న పుండ్లకు వాక్యూమ్‌ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో పుండు దగ్గర సన్నటి గొట్టం అమర్చి.. దానిపై మెత్తటి స్పంజి, పైన ప్లాస్టిక్‌ పొరను బిగుతుగా అతికిస్తారు. గొట్టం ద్వారా లోపలి నుంచి స్రావాలు బయటకు వస్తాయి. ఈ గొట్టం లోపల శూన్యం ఏర్పడేలానూ చేస్తుంది. దీంతో పుండు మీద బయటి వాతావరణం ఒత్తిడి ఆగిపోతుంది. కణాలు త్వరగా మరమ్మతు అవుతాయి. ఫలితంగా పుండు త్వరగా మానుతుంది.

శస్త్రచికిత్స- డిబ్రైడ్‌మెంట్‌, మైక్రోసర్జరీ

పుండు పెద్దగా ఉండి, దీర్ఘకాలంగా మానకుండా వేధిస్తున్నప్పుడు.. తీవ్రమైన జ్వరం వంటి ఇతరత్రా లక్షణాలూ ఉన్నప్పుడు శస్త్రచికిత్స పద్ధతులు ఉపయోగపడతాయి. అయితే వీటిని చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. దెబ్బతిన్న కండరాన్ని సున్నితంగా పట్టుకోవటం దగ్గర్నుంచి.. ఎంతవరకు తొలగించాలి అనేది చూసుకోవటం వరకూ ప్రతిదీ కీలకమే. అందుకే మొండి మధుమేహ పుండ్ల చికిత్సలో ఇప్పుడు ప్లాస్టిక్‌ సర్జన్ల ప్రాముఖ్యత పెరుగుతోంది.
* మృతకణాలను తొలగించటం: దీన్నే డిబ్రైడ్‌మెంట్‌ అంటారు. పుండు చివర్లను, అడుగు భాగాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ.. అక్కడి మృతకణజాలాన్ని తొలగించటం దీని ప్రత్యేకత. పుండు మానటానికి తోడ్పడే ప్రేరకాలకు స్పందించని మృతకణజాలాన్ని తొలగించటం ద్వారా లోపల పుండు నయమయ్యే వాతావరణం ఏర్పడుతుంది. రక్తస్రావం మెరుగుపడి చుట్టుపక్కల కణజాలానికి ఆక్సిజన్‌ వంటి పోషకాలు తగినంత అందుతాయి. దీంతో పుండు మానుతుంది. మృతకణజాలాన్ని తొలగించిన తర్వాత పాదం ఎత్తుగా పెట్టటం.. రక్తస్రావం, వాపు తగ్గటానికి కాస్త బిగుతుగా కట్టు కట్టటం (కంప్రెషన్‌) వంటివి చేస్తారు.
* మైక్రోసర్జరీ: రక్త సరఫరాను మెరుగుపరచి పుండు మానేలా చేయటం ద్వారా వీలైనంతవరకు పాదాన్ని, వేళ్లను కాపాడుకోవటం దీని ఉద్దేశం. ఇందులో పుండు సైజు, లోతును బట్టి వేరేచోటు నుంచి చర్మం లేదా కండను తెచ్చి అతికిస్తారు. పుండు చిన్నగా, పైపైనే ఉండి.. కండరం, నాడులు, ఎముక, కండర బంధనాల వంటివన్నీ బాగానే ఉన్నప్పుడు వేరేచోట నుంచి చర్మాన్ని తీసుకొచ్చి అతికిస్తే మంచి ఫలితం కనబడుతుంది. అదే పుండు బాగా లోతువరకూ ఉండి.. కండరం, నాడులు దెబ్బతిని.. ఎముక కూడా పైకి కనబడుతుంటే వేరేచోటు నుంచి రక్తనాళాలతో కూడిన కండను తెచ్చి అతికించాల్సి ఉంటుంది. దీంతో  చుట్టుపక్కల భాగాలకూ రక్త సరఫరా మెరుగుపడి త్వరగా మానిపోతుంది. ఈ పద్ధతిలో పుండు చుట్టుపక్కల భాగాల్లోంచి గానీ తొడ వంటి దూరంగా ఉండే భాగాల్లోంచి గానీ కండరాన్ని తెచ్చి అతికిస్తారు. మైక్రోసర్జరీ ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా తగ్గిన తర్వాతే చేస్తారు. ఇన్‌ఫెక్షన్‌ లేకపోతే వెంటనే చేయొచ్చు. ఒకవేళ ఎముక బాగా దెబ్బతిన్నవారికి ఇతర భాగాల్లోంచి ఎముకను తెచ్చి అతికించొచ్చు కూడా.
* దెబ్బతిన్న భాగం తొలగింపు: ఇతరత్రా పద్ధతులతో ఉపయోగం లేనప్పుడు చివరి ప్రయత్నంగా దెబ్బతిన్న భాగాన్ని తొలగించాల్సి ఉంటుంది. వాపుతో పాటు దుర్వాసన వస్తుండటం.. చర్మం దగ్గర్నుంచి కీళ్ల వరకూ ఇన్‌ఫెక్షన్‌ విస్తరించటం.. ఇన్‌ఫెక్షన్‌ రక్తంలోకీ వ్యాపిస్తున్న లక్షణాలు కనబడితే దెబ్బతిన్న భాగాన్ని తీసేయటం తప్ప మరో మార్గం లేదు.
పాదాల చర్మం రంగు మారుతున్నా.. మడమలు, పాదాలు ఉబ్బుతున్నా.. పాదాలు వేడిగా అనిపిస్తున్నా.. పాదాల్లో చురుకుగా పొడుస్తున్నట్టు నొప్పి, మంట వస్తున్నా.. వేళ్ల మధ్య ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వేధిస్తున్నా.. మడమలు పొడిబారి, పగిలిపోతున్నా.. ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలేవైనా కనబడుతున్నా.. వేలి గోళ్లు లోపలి వైపునకు పెరుగుతున్నా.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. వెంటనే డాక్టర్‌ను సంప్రతించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
పాదాలు ఉబ్బినపుడు కణాల మధ్య నీరు పోగుపడుతుంది. దీంతో రక్తం, రక్తంతో పాటు సరఫరా అయ్యే ఆక్సిజన్‌ సరిగా అందదు. దీంతో పుండు మానకుండా దీర్ఘకాలంగా వేధిస్తుంటుంది.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.