close

తాజా వార్తలు

బాబు సమస్య ఏంటో తెలియడం లేదు!
మా బాబుకు ఆరేళ్లు. హైపర్‌యాక్టివ్‌గా ఉంటాడు. ఒకచోట స్థిమితంగా కూర్చోడు. చెప్పినమాట వినడు. మూడేళ్ల నుంచి ఇది మొదలైంది. ఇప్పుడు మరింత మొండిగా తయారయ్యాడు. పదిసార్లు పిలిచినా పలకడు. నిర్లక్ష్యం ఎక్కువ.  ఎంత మంచిగా చెప్పినా చెవికెక్కించుకోడు. అరచి చెప్పినా అలాగే స్పందిస్తాడు. అస్సలు ఎవరికీ భయపడడు. మా అబ్బాయిని ఎలా మార్చాలి?
 

- ఓ సోదరి

మీ బాబు ‘ఏడీహెచ్‌డీ’, ‘ఆటిజమ్‌ స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌’ అనే రెండు సమస్యల్లో ఏదో ఒకదానితో బాధపడుతున్నాడేమోనని అనిపిస్తోంది. మెదడు అభివృద్ధి చెందుతున్న సమయంలో వీటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రెండింటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. మీ బాబులో రెండు రకాల మానసిక ప్రవర్తనలు ఉన్నట్లు కనిపిస్తోంది. అందులో ఒకటి ఏడీహెచ్‌డీ (అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌). ఈ సమస్య ఉన్న పిల్లలు అతి చురుగ్గా ఉంటారు. వీరిలో తొందరపాటూ ఎక్కువే. ఎంత పిలిచినా వినిపించుకోరు. ఏకాగ్రత ఉండదు. ముఖ్యంగా మొండితనం, అత్యుత్సాహం, తొందరపాటుతనం అనే మూడు లక్షణాలు మూడేళ్ల వయసులో కనిపించి స్కూలుకు వెళ్లే సమయంలో పూర్తిగా బయటపడతాయి. ఒకవేళ మీ బాబు ఈ సమస్యతో బాధపడుతున్నాడేమో గమనించండి.
ఎలా గుర్తించొచ్చు...
ఏడీహెచ్‌డీగా ఉన్నప్పుడు పెద్దయ్యేకొద్దీ ఆ లక్షణాలు పెరుగుతాయి. ఒకచోట స్థిరంగా ఉండకపోవడం, తోటి పిల్లలతో కలవకపోవడం, ఇతరులతో దెబ్బలాడటం, మొండితనంతో తల్లిదండ్రులను సతాయించడం.... ఆటల్లో కూడా తమ పంతం నెగ్గించుకోవడం... లాంటి లక్షణాలెన్నో కనిపిస్తాయి. మరో సమస్య కూడా ఇలాగే మూడేళ్ల వయసులో మొదలై ఆరేళ్లలో బయటపడుతుంది. ఆ సమస్యే ఆటిజమ్‌ స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌. దీనిలో పిల్లలకు అర్థంపర్థం లేని అతిచురుకు కనిపిస్తుంది. పలుసార్లు పిలిచినా పరధ్యానంగా ఉంటారు. ఒంటరిగా ఆడుకుంటారు. కాబట్టి ఈ రెండు లక్షణాలు కనిపిస్తే ముందు మానసిక నిపుణులను సంప్రదించండి.
వీరేం చేస్తారంటే...
ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలు చాలామటుకు సాధారణంగానే కనిపిస్తారు.పెరుగుదల కూడా వేగంగానే ఉంటుంది. కానీ ఆటిజమ్‌ స్పెక్ట్రమ్‌ సమస్య ఉన్న చిన్నారులు ఆలస్యంగా మాట్లాడతారు. ఇతరులతో త్వరగా కలవలేరు. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెబుతారు. అయితే ఈ రెండు సమస్యల్లో కూడా మెదడు అభివృద్ధి కాస్త తక్కువగా ఉండొచ్చు. కాబట్టి సైక్రియాటిస్ట్‌ దగ్గరకు వెళితే ఎంతవరకూ ఈ సమస్యతో బాధపడుతున్నారో, ఏ స్థాయిలో ఉన్నారో పరీక్షిస్తారు. కాన్నెర్స్‌ టెస్ట్‌ లేదా వాండర్‌ బిల్ట్‌ టెస్ట్‌ లేదా సీబీసీఎల్‌... వంటి పరీక్షలు చేస్తారు. వీటి ద్వారా ఏడీహెచ్‌డీ ఉందా లేదా తెలుస్తుంది. అవసరమైతే డెవలప్‌మెంటల్‌, ఐక్యూ అసెస్‌మెంట్స్‌తోపాటు ఇతర పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ మూడింటితోపాటు పిల్లాడి డెవలప్‌మెంటల్‌ హిస్టరీని పరిశీలిస్తే సమస్య ఏంటో తెలుస్తుంది. మూడు నుంచి ఆరేళ్ల మధ్యలో ఈ లక్షణాలతో వచ్చిన చిన్నారుల్లో ఈ సమస్యల్ని నిర్ధరించడం చాలా కష్టం. పిల్లల అతిచురుకును ఎలా నియంత్రించాలో తల్లిదండ్రులకు చెబుతాం. అయినప్పటికీ నియంత్రణలో ఉండటం లేదని అనిపిస్తే మందులను సూచిస్తాం. ఆటిజమ్‌ స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌ అని సందేహం వస్తే...స్పీచ్‌ థెరపీ ఇస్తాం. వాళ్లు మిగతావాళ్లతో కలివిడిగా ఉండటానికి ఆక్యుపేషన్‌ థెరపీ చేస్తాం. అలాగే వారికి ఇంటలెక్చువల్‌ డెవలప్‌మెంటల్‌ డిలే ఉంటే.. చిన్నారులతో ఎలా వ్యవహరించాలో తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తాం. కాబట్టి ఓసారి నిపుణులను సంప్రదించండి.

- మీ సందేహాలను vasukid@eenadu.net కు పంపించగలరు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.