close

తాజా వార్తలు

పని పనికో జబ్బాయె!

రేపు మే డే

శ్రమ మన జీవనాడి! మన జీవితాలన్నీ శ్రమతో ముడిపడినవే. ఆకలిని తీర్చుకున్నా.. ఆశలు, ఆకాంక్షలు, బాధ్యతలను నెరవేర్చుకున్నా అన్నీ శ్రమతోనే. గనిలో, వనిలో, కార్ఖానాలో స్వేదం చిందించే కార్మికులైనా.. పొలాలనన్నీ హలాల దున్నే హాలికులైనా.. అందరిదీ ఒకటే లక్ష్యం. ప్రగతి రథ చక్రాలతో పాటు జీవన గమనాన్నీ పరుగులు పెట్టించటం. అయితే గులాబీ వెనక ముల్లు దాగున్నట్టు ప్రతి పని వెనకా ప్రమాదాలు లేకపోలేదు. పని వాతావరణంలోని పరిస్థితులు, దుమ్ము ధూళి, పొగలు, రసాయనాల వంటివెన్నో ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. పనిచేసే చోట ఏడాదంతా ఒకే వాతావరణంలో గడుపుతుండటం వల్ల కొన్ని ప్రత్యేకమైన సమస్యలు తలెత్తుతున్నట్టు చాలాకాలం క్రితమే గుర్తించారు. గాలిలో కలిసే ఆస్‌బెస్టాస్‌ పొడిని పీల్చటం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వస్తున్నట్టు 1956లోనే పసిగట్టారు. అప్పట్నుంచే భద్రతా ప్రమాణాలు, చట్టాలెన్నో రూపుదిద్దుకున్నాయి. ఇవి సత్ఫలితాలు ఇచ్చినప్పటికీ ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు. వీటికి కొత్త ఉద్యోగాలు, వృత్తులు కూడా తోడవుతున్నాయి. ప్రస్తుతం శ్రమ అంతగా లేని డెస్క్‌ ఉద్యోగాలు, కంప్యూటర్‌ ఉద్యోగాలు ఎక్కువవయ్యాయి. ఫలితంగా కొత్తరకం జబ్బులూ పుట్టుకొస్తున్నాయి. అదృష్టమేంటంటే ఇవన్నీ చాలావరకు నివారించుకోదగినవే కావటం. చిన్న చిన్న జాగ్రత్తలతోనే పెద్ద ప్రమాదాలను నివారించుకునే వీలుండటం. అందువల్ల అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మన పనులతో ముడిపడిన కొన్ని సమస్యల గురించి తెలుసుకొని, అప్రమతంగా ఉండటం అత్యవసరం.

గర్భధారణకు ‘షిఫ్ట్‌’ చిచ్చు!

నిద్ర తీరుతెన్నులను మార్చేసే నేటి షిఫ్ట్‌ ఉద్యోగాలు మోసుకొస్తున్న అతి పెద్ద సమస్య సంతానం కలగకపోవటం. పెళ్లయి నాలుగైదేళ్లు అయినా ఎంతోమంది సంతాన భాగ్యానికి నోచుకోవటం లేదు. దీనికి ప్రధాన కారణం జీవ గడియారం (సర్కేడియన్‌ రిథమ్‌) దెబ్బతినటం. మనకు మధ్యాహ్నం కాగానే ఆకలేస్తుంది, రాత్రి కాగానే నిద్ర ముంచుకొస్తుంది. ఇలా మన ఒంట్లో అన్ని పనులూ ఒక పద్ధతి ప్రకారం.. సమయం ప్రకారం జరిగేలా చూసేది ఈ జీవగడియారమే. ఇది దెబ్బతింటే అన్ని జీవక్రియలూ మందగిస్తాయి. నిద్రవేళలను మార్చేసే షిఫ్ట్‌ ఉద్యోగాలు చేస్తున్నది ఇదే. కొన్నిరోజులు పగలు, కొన్నిరోజులు రాత్రి పూట ఉద్యోగాలు చేయటం వల్ల నిద్రవేళలు మారిపోయి జీవగడియారం దెబ్బతింటోంది. దీంతో మహిళల్లో సమయానికి అండం విడుదల కాకపోవటం.. ఫలితంగా గర్భధారణ జరగకపోవటం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాత్రి పూట పనిచేయటం వల్లనో, వంట వండుకోవటానికి సమయం దొరక్కపోవటం వల్లనో చాలామంది బయటి తిండీ తింటుంటారు. పోషకాలు లేని జంక్‌ఫుడ్‌ తినేస్తుంటారు. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. ఒంట్లో కొవ్వు పెరుగుతున్నకొద్దీ ఇన్సులిన్‌ నిరోధకత (కణాలు ఇన్సులిన్‌ను స్వీకరించే సామర్థ్యం తగ్గటం) తలెత్తుతుంది. ఇది అండాశయంలో నీటితిత్తులు ఏర్పడటానికి (పీసీఓస్‌) దారితీస్తుంది. దీంతోనూ అండం సరిగా విడుదల కాదు. ఇన్సులిన్‌ నిరోధకత మూలంగా మధుమేహం కూడా దాడిచేస్తుంది. ఇది గర్భధారణకు అడ్డు తగలకపోవచ్చు గానీ పిండం మీద తీవ్ర దుష్ప్రభావాలు చూపుతుంది. ఇక ఊబకాయం మూలంగా మగవారిలో ఈస్ట్రోజెన్‌ స్థాయులు ఎక్కువవుతాయి. ఇది స్తంభన లోపానికి దారితీస్తుంది. ఆధునిక ఉద్యోగాలు మోసుకొస్తున్న మరో ఉపద్రవం మానసిక ఒత్తిడి. ఇది కార్టిజోల్‌ హార్మోన్‌ స్థాయులు పెరిగేలా చేస్తుంది. దీంతో ఆందోళన, కుంగుబాటు వంటివి మొదలవుతాయి. ఇలాంటి మానసిక సమస్యలకు వేసుకునే మందుల మూలంగా ఆడవారిలో ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ ఉత్పత్తీ పెరుగుతుంది. ఇదీ అండం విడుదల కావటానికి అడ్డు తగులుతుంది. ఒత్తిడి మూలంగా మగవారిలో వీర్యకణాల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతుంది. సంతానం కలగాలంటే కనీసం 15 మిలియన్ల వీర్యకణాలయినా ఉండాలి. కానీ చాలామందిలో ఒక మిలియన్‌ కన్నా తక్కువే ఉంటున్నాయి. ఒత్తిడితో మరో ముప్పేటంటే శృంగారాసక్తి తగ్గటం. ఫలితంగా అండం విడుదలయ్యేల సమయంలో కలవరు. అండం విడుదలయ్యే సమయంలో కలవాలని డాక్టర్లు చెబితే ఆ సమయానికి మరింత ఒత్తిడికీ లోనవుతుంటారు.
* ప్రస్తుతం వలసలు పెరిగిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచీ వచ్చి భవన నిర్మాణరంగంలోనూ, ఇటుకబట్టీల దగ్గర కూలీ పనులు చేసేవారు ఎందరో. వీరిలో చాలామంది అంతగా చదువుకోనివారే. పైగా కుటుంబాన్ని వదిలిపెట్టి ఒంటరిగానూ వస్తుంటారు. కొందరు తెలిసో తెలియకో అసురక్షిత లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనటం, సుఖవ్యాధుల బారినపడటం తరచుగా చూస్తున్నదే. లైంగిక ఇన్‌ఫెక్షన్ల మూలంగా సంతాన సామర్థ్యమూ దెబ్బతింటుంది. ఫలోపియన్‌ ట్యూబులు మూసుకుపోవటం వంటి వాటితో మున్ముందు సంతానం కలిగే అవకాశం తగ్గుతుంది. అరకొర జీతాలతో నెట్టుకురావటం వల్ల వేళకి బోజనం చేయరు. సరైన పోషకాహారం కూడా తీసుకోరు. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. ఇది సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒకవేళ గర్భం ధరించినా గర్భస్రావమయ్యే ముప్పూ పెరుగుతుంది.

మన భవిష్యత్తు పిల్లలే. ఏ పని చేసినా వాళ్ల బాగు కోసమే. అలాంటిది మన పనులే సంతాన భాగ్యం దూరమయ్యేలా చేస్తుంటే? ఆధునిక ఉద్యోగాలు, వాటితో ముడిపడిన ఒత్తిడి సరిగ్గా ఈ పనే చేస్తుండటం గమనార్హం.

జాగ్రత్తలు పాటించాలి
* రోజూ కనీసం 8 గంటల సేపు నిద్ర పోయేలా చూసుకోవాలి
* బరువు అదుపులో ఉంచుకోవటం ప్రధానం
* సమతులాహారం తీసుకోవాలి. జంక్‌ ఫుడ్‌ మానెయ్యాలి
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
* ఒత్తిడిని తగ్గించుకోవాలి. నలుగురితో కలివిడిగా ఉండటం, యోగా, ధ్యానం వంటివి మేలు చేస్తాయి
* అసురక్షిత లైంగిక చర్యలకు దూరంగా ఉండటం మంచిది

ఊపిరిలో ‘రాతి’ మోత!

రాళ్లలో, ఇసుకలో.. అన్నిచోట్లా సిలికా అనే మూలకం ఉంటుంది. మామూలుగానైతే ఇదేమీ చెయ్యదు. కానీ రాళ్లను పగలగొట్టటం, కంకరగా, పొడిగా మార్చటం వంటివి చేస్తున్నప్పుడు ఇది సన్నటి దుమ్ము రూపంలో గాల్లో కలుస్తుంది. ఇది శ్వాసతో పాటు ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయి స్థిరపడి సిలికోసిస్‌కు దారితీస్తుంది. దీంతో ఊపిరితిత్తుల కణజాలం మీద మచ్చపడొచ్చు. ద్రవాల మోతాదు పెరుగొచ్చు. ఫలితంగా శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది. క్వారీలు, గనులు, గాజు తయారీ, భవన నిర్మాణ రంగంలో పనిచేసేవారికి దీని ముప్పు ఎక్కువ. ఇటీవలి కాలంలో జీన్స్‌ దుస్తులను వేలాడదీసి వాటిని ఇసుక తుపాకీతో పేల్చటం ఎక్కువైంది. ఈ పనిచేసేవారికీ సిలికోసిస్‌ ముప్పు పొంచిఉంటోంది. సిలికాకు ఎలాంటి వాసనా ఉండదు. పీల్చినా కూడా దురద పెట్టటం వంటి ఇబ్బందులేవీ ఉండదు. కాబట్టి దీని ప్రభావానికి గురైనట్టు కూడా తెలియదు. అందుకే సమస్య ముదిరిన తర్వాత గానీ ఇది బయటపడటం లేదు. చాలావరకిది దీర్ఘకాలిక సమస్యే అయినా కొందరికి సిలికాను పీల్చుకున్న కొద్దివారాల్లోనే తీవ్రం కావొచ్చు. దీంతో దగ్గు, బరువు తగ్గటం, నీరసం వంటి లక్షణాలు మొదలవుతాయి. దురదృష్టవశాత్తు సిలికోసిస్‌కు ఎలాంటి చికిత్స లేదు. దీన్ని నివారించుకోవటం ఒక్కటే మార్గం. సిలికాతో మరో చిక్కేంటంటే- ఇది ఊపిరితిత్తుల్లోని లింఫ్‌ గ్రంథుల్లో చిక్కుకుపోవటం. దీంతో లింఫ్‌ నాళాలు మూసుకుపోతాయి. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తుంది. అందుకే సిలికోసిస్‌ బాధితులకు క్షయ ముప్పు ఎక్కువ. చాలాసార్లు దీన్ని క్షయగానూ పొరపడుతుంటారు. ఎందుకంటే ఎక్స్‌రేలో సిలికోసిస్‌, క్షయ రెండూ ఒకేలా కనిపిస్తాయి.

శ్వాస తీసుకోకపోతే ఒక్క క్షణమైనా ఉండలేం. ఏ పనీ చేయలేం. ఇక చేసే పనే శ్వాసను అడ్డుకుంటే? రాతి దుమ్ముతో తలెత్తే సిలికోసిస్‌ సమస్య అలాంటిదే.

నివారణ ఇలా..
* సిలికాతో కూడిన దుమ్మును పీల్చకుండా ఉండటం ప్రధానం. కంకర, రాతిపొడి తయారుచేసే చోట నీళ్లు చల్లే స్ప్రేల వంటి పరికరాలతో దుమ్ము పైకి లేవకుండా చూసుకోవాలి. గాలి బాగా ఆడేలా చూడాలి.

చెవులకు ‘చప్పుడు’ శాపం!

వినికిడి లోపానికి కారణాలు అనేకం. కానీ చాలామంది పెద్దగా పట్టించుకోనిది భారీ శబ్దాల మూలంగా వినికిడి దెబ్బతినటం (నాయిస్‌ ఇండ్యూజ్డ్‌ హియరింగ్‌ లాస్‌). ఇది ప్రధానంగా చేసే పని వాతావరణంతో ముడిపడిన సమస్యే. కొందరు 8 గంటల పనివేళల్లో దాదాపు 7 గంటల పాటు పెద్ద పెద్ద చప్పుళ్లతో కూడిన యంత్రాల వద్దే పనిచేస్తుంటారు. ఇలాంటివారికి వినికిడి దెబ్బతినే ముప్పు ఎక్కువ. గనుల్లో పనిచేసేవారికి, భారీ సంగీత కచేరీల్లో పాల్గొనేవారికి, అచ్చు యంత్రాల దగ్గర పనిచేసేవారికి, నిర్మాణ రంగ కార్మికులకు, మరమగ్గాల కార్మికులకు, బోరింగు యంత్రాల వద్ద పనిచేసేవారికి, వెల్డింగు పనులు చేసేవారికి కూడా దీని ముప్పు ఎక్కువే. చెవులకు ఎలాంటి రక్షణ లేకుండా తుపాకీ పేల్చటంలో శిక్షణ తీసుకునే పోలీసులకూ ఇలాంటి వినికిడి లోపం తలెత్తొచ్చు. ఇటీవలి కాలంలో ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులోనూ ఇది కనబడుతుండటం గమనార్హం. సాధారణంగా 85 డెసిబెల్స్‌ కన్నా ఎక్కువ తీవ్రతతో కూడిన శబ్దాలకు తరచుగా గురయ్యేవారికి పనులతో ముడిపడిన వినికిడిలోపం తలెత్తుంటుంది. దీర్ఘకాలంగా భారీ శబ్దాలకు గురైనప్పుడు లోపలి చెవిలోని సూక్ష్మకేశాలు క్రమంగా దెబ్బతింటూ వస్తాయి. కొందరికి శ్రవణ నాడి దెబ్బతినొచ్చు. ఉన్నట్టుండి పెద్ద శబ్దాలకు గురైతే కొన్నిసార్లు కర్ణభేరికి చిల్లు కూడా పడొచ్చు.

మోతతో మొదలు..
భారీ శబ్దాలతో వినికిడిలోపం తలెత్తినవారికి చెవిలో రింగుమనే మోత (టిన్నిటస్‌) మొదలవుతుంది. చెవులు దిబ్బడేసినట్టు ఉంటాయి. క్రమంగా వినికిడీ తగ్గుతూ వస్తుంది. వీరికి చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉంటే బాగానే వినబడుతుంటుంది గానీ.. ఎక్కువమంది గుమిగూడిన చోట మాటలు సరిగా వినపడవు. టీవీ చూసేటప్పుడు సౌండ్‌ ఎక్కువగా పెట్టుకుంటుంటారు. స, ష శబ్దాలు సరిగా వినబడకపోవటం వల్ల ఆడవాళ్లు మాట్లాడే మాటలు వినబడక ఇబ్బంది పడుతుంటారు. మూడు అడుగుల దూరంలో ఉన్నవాళ్లు మాట్లాడే మాటలు సరిగా వినబడకపోతుంటే వినికిడి దెబ్బతిన్నదనే అర్థం. వినికిడి లోపంతో పాటు కొందరికి చికాకు, తలతిప్పు, తలనొప్పి కూడా ఉండొచ్చు.

నిర్ధరణ-చికిత్స
వినికిడిలోపాన్ని అనుమానించినపుడు ప్యూర్‌టోన్‌ ఆడియోమెట్రీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇందులో 4 కిలోహెడ్జ్‌ తీవ్రత వద్ద గ్రాఫ్‌ బాగా పడిపోయి, ఆ తర్వాత పైకి పోతున్నట్టు తేలితే సమస్య ఉందనే అనుకోవాలి. దురదృష్టవశాత్తు వినికిడిలోపాన్ని నయం చేయటానికి మందులేవీ లేవు. ఉన్నట్టుండి పెద్ద శబ్దాలకు గురై.. వినికిడి తగ్గిపోతే 24-48 గంటల లోపు మధ్యచెవిలోకి కార్టికోస్టీరాయిడ్స్‌ ఇంజెక్షన్లు ఇస్తే మంచి ఫలితం కనబడుతుంది. దీంతో వాపు ప్రక్రియ తగ్గి కొందరికి వినికిడి తిరిగి రావొచ్చు. కానీ చాలామంది సమస్యను పెద్దగా పట్టించుకోరు. బాగా ముదిరిన తర్వాతే చికిత్స కోసం వస్తుంటారు. సమస్య తీవ్రమైతే వినికిడి సాధనాలు అమర్చుకోవటం తప్ప చేయగలిగిందేమీ లేదు. అయితే ఇది పూర్తిగా నివారించుకోదగ్గ సమస్యని గుర్తించటం అవసరం. ఇది మన చేతుల్లోనే ఉంది. 

మన జీవితమంతా చప్పుళ్లతో ముడిపడిందే. మరి అలాంటి చప్పుళ్లే వినికిడిని దెబ్బతీస్తే? పెద్ద పెద్ద శబ్దాలతో కూడిన పనులతో తలెత్తే వినికిడిలోపం ఇలాంటిదే.

నివారణ ఇలా..
* భారీ శబ్దాలకు దూరంగా ఉండటం మంచిది.
* ఒకవేళ అలాంటి చోట్ల పనిచేయాల్సి వస్తే ఇయర్‌ ప్లగ్స్‌, ఇయర్‌ మఫ్స్‌ ధరించాలి.

డిస్కులకు ‘డెస్క్‌’ దెబ్బ!

కిందికి వంగుతాం. పైకి లేస్తాం. అటు తిరుగుతాం, ఇటు తిరుగుతాం. ఇవన్నీ తేలికగా చేయగలుగుతున్నామంటే కారణం వెన్నెముక. మన వెన్నెముక నడుం దగ్గర, మెడ దగ్గర కదలటానికి అనువుగా ఉంటుంది. అందుకే సమస్యలు కూడా ఇక్కడే ఎక్కువ. మన వెన్నెముక ఒక పూసల దండలా ఉంటుంది. ఈ పూసల మధ్య మందమైన, దృఢమైన రబ్బర్ల వంటి డిస్కులుంటాయి. ఇవి వాషర్‌లా పనిచేస్తూ.. పూసలు తేలికగా కదలటానికి, ఒకదాంతో మరోటి రుద్దుకోకుండా ఉండటానికి తోడ్పడతాయి. షాక్‌ అబ్జార్వర్ల మాదిరిగా పూసల మీద పడే ఒత్తిడిని తీసుకుంటాయి. అయితే ఇవి ఎముకలాగా గట్టిగా ఉండవు. అందువల్ల దెబ్బతినే అవకాశం ఎక్కువ. ఒత్తిడి పెరుగుతున్నకొద్దీ డిస్కులు నలిగిపోవచ్చు, మెత్తబడొచ్చు, దెబ్బతినొచ్చు, పక్కలకు జరగొచ్చు. నడుం నొప్పి, మెడనొప్పికి ప్రధాన కారణాలు ఇవే. రోజులో ఎక్కువసేపు కుర్చీలో కూలబడిపోయి కంప్యూటర్ల వంటి పరికరాలతో పనిచేసేవారిలో ఇవి మరింత ఎక్కువ. నిజానికి మన నడుము ఎక్కువసేపు కదలకుండా కూచోవటానికి అనువుగా తయారైంది కాదు. నిలబడినప్పటి కన్నా కూచున్నప్పుడు వెన్నెముక మీద 90% ఎక్కువ ఒత్తిడి పడుతుంది. కానీ మన ఉద్యోగాలు, వృత్తులు మన నడుమును ‘కట్టి’పడేసి అదేపనిగా కూచునేలా చేస్తున్నాయి. కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాక ఇది మరింత పెరిగిపోయింది. ముందుకు వంగిపోయి కూచోవటం, కదలకుండా ఎక్కువసేపు ఒకే భంగిమలో కూచోవటం వంటివన్నీ వెన్నెముక డిస్కుల మీద బాగా ఒత్తిడి పడేలా చేస్తున్నాయి. అంతేకాద.. అంతగా కదలకపోవటం వల్ల డిస్కులకు దన్నుగా ఉండే కండరాలు సైతం బలహీన పడుతుంటాయి. ఫలితంగా డిస్కుల మీద మరింత ఒత్తిడి పెరుగుతోంది. అలాగే అదేపనిగా ఎక్కువసేపు కూచోవటం వల్ల వెన్నుపూస కీళ్ల మీద కూడా నిరంతరం ఒత్తిడి పడుతుంది. ఇది మెడనొప్పి, నడుంనొప్పుల వంటి సమస్యలకు దారితీస్తోంది. డిస్కులు వెనక్కి తోసుకొచ్చి నాడులు నొక్కుకుపోతే కాళ్లలో గుంజుతున్నట్టు నొప్పి (సయాటికా) కూడా తలెత్తొచ్చు. డెస్కు ఉద్యోగాలు చేసేవారికే కాదు.. ఎక్కువసేపు వాహనాలు నడిపే లారీ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్ల వంటి వారికీ నడంనొప్పి ఎక్కువే. రోజుకు 10-15 గంటల పాటు సుదీర్ఘంగా ప్రయాణాలు చేయటం వల్ల నడుము అంతగా కదలదు. కండరాలకు ఎలాంటి వ్యాయామమూ లభించదు. క్రమంగా ఇది నడుంనొప్పికి దారితీస్తుంది. అలాగే తగు జాగ్రత్తలు తీసుకోకుండా పెద్ద పెద్ద బరువులు ఎత్తే హమాలీల వంటివారికి నడుం కండరాలు పట్టేయటం, నడుం నొప్పి వంటివి తలెత్తొచ్చు. కాకపోతే వీరిలో కండరాలు బలంగా ఉండటం వల్ల అంత ఇబ్బంది ఉండదు.

చికిత్స- విశ్రాంతి, ఫిజియోథెరపీ
ప్రత్యేకించి ఏదైనా పని చేస్తున్నప్పుడే నొప్పి వస్తున్నట్టయితే ముందు ఆయా పనులు చేయకుండా ఉండటం మంచిది. అయినా కూడా నొప్పి తగ్గకపోతే డిస్కు సమస్యల వంటివేవైనా ఉన్నాయేమో పరీక్షించాల్సి ఉంటుంది. డిస్కు తోసుకురావటం వంటివి ఉంటే తగు చికిత్స అవసరమవుతుంది. నిజానికి చాలామందికి కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అవసరమైతే నొప్పి మందులు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పొత్తికడుపు, నడుం కండరాలను బలోపేతం చేసే ప్రత్యేకమైన వ్యాయామాలు (ఫిజియోథెరపీ) కూడా సూచిస్తారు. చాలామంది నడుంనొప్పి అనగానే ముందే ఫిజియోథెరపిస్టుల దగ్గరకి వెళ్తుంటారు. ఇది మంచిది కాదు. ముందు ఎముకల నిపుణులను సంప్రదించి డిస్కు సమస్యల వంటివేవీ లేకపోతే ఫిజియోథెరపీ ఆరంభించాలి. డిస్కులు నాడులను నొక్కుతుంటే సర్జరీ కూడా అవసరపడొచ్చు.

మన జీవనానికి పనే వెన్నెముక. మరి ఆ పనే వెన్నెముక పని పడుతుంటే? వెన్నెముకలోని డిస్కులకు చిక్కులు తెచ్చిపెడుతుంటే? కొత్తతరం ఉద్యోగాల, వృత్తుల పుణ్యమాని ఇప్పుడిలాంటి సమస్యలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి.

నివారణ ఉత్తమం
* ఎక్కువసేపు కూచోవటానికి అనువైన, వెన్నుకు దన్నుగా ఉండే కుర్చీలను ఎంచుకోవాలి.
* మరీ ఎక్కువసేపు కూచోవాల్సి వస్తే గంటకోసారి లేచి, కాసేపు అటూఇటూ నడవాలి. వీలైతే కండరాలను సాగదీసే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. వీటితో శరీరం, మనసు ఉత్తేజితవుతాయి.
* డెస్క్‌ మీద వంగిపోవటం తగదు. కూచున్నప్పుడు వీపు మొత్తం కుర్చీకి ఆనుకునేలా చూసుకోవాలి. వీపు ఎక్కడైనా కుర్చీకి ఆనకపోతున్నట్టయితే అక్కడ దిండు పెట్టుకోవాలి.
* కంప్యూటర్‌ మానిటర్‌ పైభాగం కంటికి సమాన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. మానిటర్‌ను ముందుకు వెనక్కు జరుపుకోవటానికి వీలుగా ఉండేలా చూసుకుంటే మరీ మంచిది.
* కుర్చీలో గానీ సోఫాలో గానీ ఒకపక్కకు ఒరిగి పోయి కూచోవటం తగదు.
* కీబోర్డు మీదికి వంగకూడదు. కీబోర్డును వెనక్కి లాక్కొని టైప్‌ చేయటం వంటివి చేయాలి.
* కారులో కూచున్నప్పుడు మెడ వంపు దగ్గర చిన్న దిండు లాంటిది పెట్టుకోవాలి.
* పడుకున్నప్పుడు బాగా ఎత్తుగా ఉండే దిండ్లు వేసుకోవద్దు. పడుకొని టీవీ చూడొద్దు.
* బరువులు ఎత్తేటప్పుడు మోకాళ్ల దగ్గర వంచి పైకి లేపాలి.
* వ్యాయామం చాలా కీలకం. దీన్ని రోజువారీ జీవితంలో భాగంగానే పరిగణించాలి. నడుంనొప్పి నివారణకు ఈత ఎంతో మేలు చేస్తుంది. నడక కూడా మంచిదే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.