close

తాజా వార్తలు

గర్భిణికి మధుమేహం.. తిండి మారిస్తే చాలా?

సమస్య - సలహా

సమస్య: నా భార్య వయసు 31 సంవత్సరాలు. రెండు నెలల గర్భిణి. రక్తపరీక్ష చేస్తే హెచ్‌బీఏ1సీ 8.5% ఉంది. తీపి పదార్థాలు తినటం మానేసింది. అన్నానికి బదులు ఓట్స్‌ తింటోంది. ఆహార అలవాట్లు మార్చుకుంటే హెచ్‌బీఏ1సీ నార్మల్‌కు వస్తుందా? మున్ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- సుధీర్‌ కె (ఈమెయిల్‌ ద్వారా)

 

సలహా: మీరు చెప్పిన వివరాలను బట్టి మీ భార్యకు గర్భిణి మధుమేహం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది గర్భధారణ సమయంలోనే తలెత్తే సమస్య. మీరు హెచ్‌బీఏ1సీ గురించి రాశారు గానీ రక్తంలో గ్లూకోజు మోతాదులు ఎలా ఉన్నాయన్నది తెలియజేయలేదు. గర్భిణుల్లో రక్తంలో గ్లూకోజు మోతాదులు పరగడుపున 90 లోపు, భోజనం చేసిన రెండు గంటల తర్వాత 140 లోపే ఉండాలి. అలాగే హెచ్‌బీఏ1సీ 6.5% మించకూడదు. అంతకు మించితే కేవలం ఆహార అలవాట్లు మాత్రమే పాటిస్తే సరిపోదు. ఇన్సులిన్‌ కూడా తీసుకోవాలి. మీ భార్యకు హెచ్‌బీఏ1సీ 8.5% ఉందంటున్నారు. అందువల్ల ఇన్సులిన్‌ తీసుకోవటం తప్పనిసరి. అన్నానికి బదులు ఓట్స్‌ తిన్నంత మాత్రాన, తీపి పదార్థాలు మానేసినంత మాత్రాన హెచ్‌బీఏ1సీ మామూలు స్థాయికి రాదు. గర్భిణి మధుమేహాన్ని నిర్లక్ష్యం చేయటం తగదు. గర్భం ధరించిన తొలి 7 వారాల్లోనే పిండం శరీరంలోని అన్ని అవయవాలు తయారైపోతాయి. ఒకవేళ ఆలోపే రక్తంలో గ్లూకోజు మోతాదులు మరీ ఎక్కువగా ఉంటే పిండం అవయవాల నిర్మాణం దెబ్బతినొచ్చు, లోపాలు తలెత్తొచ్చు. ఇక రెండో త్రైమాసికంలో, మూడో త్రైమాసికంలో రక్తంలో గ్లూకోజు మోతాదులు అదుపులో లేనట్టయితే పిండం బరువు పెరుగుతుంది. ఇది కాన్పయ్యే సమయానికి 3.5 కిలోలకు పైగా చేరుకోవచ్చు. దీంతో ఉమ్మనీరు పెరగొచ్చు, కాన్పు కష్టం కావొచ్చు. నెలలు నిండకముందే సిజేరియన్‌ చేసి బిడ్డను బయటకు తీయాల్సిన పరిస్థితీ తలెత్తొచ్చు. ఇలా నెలలు నిండకముందే పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల వంటి అవయవాలు అంతగా అభివృద్ధి చెందవు. కాబట్టి ఇంక్యుబేటర్‌లో పెట్టాల్సి వస్తుంది. మరీ ఎక్కువ బరువుతో పుట్టే పిల్లలు పెద్దయ్యాక త్వరగా.. అంటే 25 సంవత్సరాల వయసులో గుండెజబ్బు, ఊబకాయం, మధుమేహం బారినపడే ప్రమాదమూ ఉంది. గర్భిణి మధుమేహం గలవారికి గర్భవాతం (ప్రిఎక్లాంప్సియా) ముప్పు కూడా ఎక్కువే. కాన్పు తర్వాత తల్లికి రక్తంలో గ్లూకోజు మామూలు స్థాయికి చేరుకుంటుంది గానీ ఐదేళ్ల తర్వాత మధుమేహం వచ్చే అవకాశముంది. కాబట్టి అశ్రద్ధ చేయొద్దు. కేవలం ఆహార నియమాలు పాటిస్తే సరిపోదని గుర్తించాలి.

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య - సలహా సుఖీభవ
ఈనాడు ప్రధాన కార్యాలయం,  రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.