close

తాజా వార్తలు

గుండెను కాపాడుకుందాం!

గుండె మన గుప్పెడంతే ఉంటుంది. దాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా... స్పందించడం మానేస్తుంది. విచిత్రం ఏంటంటే... పురుషులతో పోలిస్తే మహిళలు గుండెను పెద్దగా పట్టించుకోరనేది వాస్తవం. అదే మనకు చేటు చేస్తోంది. ఉన్నట్టుండి సమస్యల్లోకి నెట్టేస్తోంది. అందుకే ఇకనుంచైనా హృదయాన్ని కాపాడుకుందాం. మనకూ మనసుంటుందని చాటి చెబుదాం.

ఒక కుటుంబ సంక్షేమం, భవిష్యత్తు... ఆ ఇంటి ఇల్లాలిపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఆమె ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. కానీ జ్వరమో, తలనొప్పో... మరేదైనా అనారోగ్యమో వస్తే చటుక్కున ఓ మాత్ర వేసుకుని పనిలో పడిపోతుంది. ఇక, గుండె ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యం అంతంతమాత్రమే. ఆ నిర్లక్ష్యమే...నివురుగప్పిన నిప్పులా ఆమెకు చిన్నవయసులోనే ముప్పు తెచ్చిపెడుతోంది. ‘నేను బాగానే ఉన్నాను కదా...’ అని సర్దిచెప్పుకోవడం, ఎప్పుడైనా డాక్టర్‌ దగ్గరకు వెళ్లినా... గుండె పరీక్ష చేయించుకునే అవకాశం వచ్చినా... తరువాత చూద్దాం అని వాయిదావేసే అలవాటు ప్రాణాలమీదకే తెస్తోంది. ఈ పరిస్థితి ఒక్క భారత్‌లోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరి సమస్య. సాధారణంగా స్త్రీలలో ఉండే ఈస్ట్రోజెన్‌ హార్మోను గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ మెనోపాజ్‌ తరువాత ఆ హార్మోను విడుదల ఆగిపోతుంది. దాంతో పురుషులతో సమానంగా మహిళల్లోనూ గుండెకు సంబంధించి సమస్యలు మొదలవుతాయి. అయితే ఒకప్పటితో పోలిస్తే... ఇప్పుడు జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల మెనోపాజ్‌ కన్నా ముందే హృదయ సంబంధిత సమస్యలు మహిళల్లో కనిపిస్తున్నాయి.

సహజ కారణాలే కాదు...

సాధారణంగా స్త్రీ, పురుషులు ఎవరికైనా సరే... అధిక కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు, స్థూలకాయం.. వంటివి గుండెకు హానిచేస్తాయి. ఇవి కాకుండా.. మెనోపాజ్‌తో పాటు ప్రత్యేకించి మరికొన్ని రిస్క్‌ఫ్యాక్టర్లు స్త్రీలలో గుండె సమస్యలు రావడానికి కారణం అవుతున్నాయి.
* మధుమేహం: పురుషులతో పోలిస్తే.. మహిళల్లో మధుమేహం ఉన్నప్పుడు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.  అంతేకాదు దీనివల్ల వల్ల మెనోపాజ్‌ కంటే ముందే ఈస్ట్రోజెన్‌ హార్మోను రక్షణ పోతుంది. దాంతో ఈ పరిస్థితి తలెత్తుతుంది.
*ఒత్తిడి: ఈ సమస్య మహిళల్లో ఎక్కువ. కుంగుబాటు, ఒత్తిడి  నుంచి బయటపడటానికి తగిన చికిత్స తీసుకోరు. దాంతో ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని కొనసాగించలేరు. ఆ ప్రభావం గుండెపై పడుతుంది.
* చురుగ్గా లేకపోవడం: ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం, శరీరానికి తగిన శ్రమ లేకపోవడం కూడా గుండె వ్యాధులకు ఓ కారణమే.
* గర్భధారణ: ఈ సమయంలో అధికరక్తపోటు ఉన్నా, మధుమేహం వచ్చినా, అంతకన్నా ముందే పీసీఓడీ సమస్య ఉన్నా... ఆ ప్రభావం భవిష్యత్తులో గుండె సమస్యలకు దారితీస్తుంది.
* వంశపారంపర్యం: కుటుంబంలో గుండె జబ్బులు ఉన్నా... మహిళకు అది సమస్యగా మారొచ్చు.  వీటన్నింటివల్లా ఎక్కువగా అయితే గుండెపోటు ఎదురవుతుంది. రక్తనాళాల్లో కొవ్వు చేరి ఆ నాళం సన్నగా మారి, మూసుకుపోతుంది. కొన్నిసార్లు ఆ నాళాల్లో నెత్తురు గడ్డకట్టుకుని దమనులు మూసుకుపోతాయి. దాంతో హార్ట్‌ ఎటాక్‌ వస్తుంది. అయితే మన దేశంలో మహిళల్లో వచ్చే గుండెజబ్బుల్ని కనుక్కోవడం చాలా కష్టం.

సంకేతాలు ఉంటాయా...

గుండెపోటుకి సంకేతాలు కనిపిస్తాయి కానీ... చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కొన్నిసార్లు అవేవీ కనిపించకపోయినా కూడా గుండెపోటు రావొచ్చు. అయితే కొన్ని లక్షణాలను బట్టి ఈ సమస్యను అంచనా వేయొచ్చు. అవేంటంటే ముఖ్యంగా మెడ, దవడ, ఎడమ భుజం, వీపు పై భాగం నొప్పిగా ఉండటం, పొట్టలో అసౌకర్యం, వికారం, వాంతి వచ్చినట్లుగా ఉండటం, ఆయాసం సహజం. అకారణంగా చెమట పట్టొచ్చు. అకారణంగా అలసట, కళ్లు తిరగడం వంటివీ ఎదురవుతాయి. ఛాతీభాగం పట్టేసినట్లుగా అనిపిస్తుంది. ఈ లక్షణాల ఆధారంగా  సమస్యను అంచనా వేస్తారు.

చికిత్స ఎలా అంటే.....

గుండె పోటు వస్తే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టొచ్చు. దానివల్ల హృదయానికి రక్త సరఫరా ఆగిపోతుంది. అదే జరిగితే యాంజియోప్లాస్టీ చేసి మళ్లీ రక్తసరఫరా జరిగేలా చేస్తారు.  గుండె కండరం చనిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. యాంజియోప్లాస్టీ వీలుకాని పక్షంలో మందులు ఉంటాయి. అవి ఇచ్చిన మూడు నుంచి ఇరవైనాలుగ్గంటల్లోపు యాంజియోప్లాస్టీ చేస్తారు.

నివారణా మార్గాలు...

గుండెపోటు వచ్చాక ఆసుపత్రికి పరుగెత్తడం కన్నా ముందు నుంచీ నివారణా చర్యలపై దృష్టి పెట్టాలి.  కొన్ని రిస్క్‌ఫ్యాక్టర్లను గమనించుకుంటూ అప్రమత్తంగా ఉండాలి.
* ఆహారంలో మార్పులు అవసరం. ప్రాసెస్‌ చేసినవి, శీతలపానీయాలు వంటివాటికి దూరంగా ఉండాలి. సహజంగా లభించే పదార్థాలు ఎంచుకోవాలి. అంటే దంపుడుబియ్యం, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, చేపలు, మొలకలు, నట్స్‌, కొవ్వులేని పదార్థాలు వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. చక్కెర, ఉప్పు శాతం తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి.
* కనీసం గంటసేపు వ్యాయామం చేయాలి. మహిళలకు నడక మంచిది కాబట్టి.. రోజూ అరగంట నుంచి ముప్పావుగంట చొప్పున వారంలో ఐదురోజులు వేగంగా నడిచేలా చూసుకోవాలి. స్థూలకాయం సమస్యను అదుపులో ఉంచాలి. రోజంతా వ్యాయామం చేసే అవకాశం లేకపోతే... రోజులో సమయాన్ని విభజించుకుని వ్యాయామం చేయొచ్చు. జీవనవిధానం చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇంటిపనులు చేసుకోవడం, మెట్లెక్కి దిగడం, ఎక్కువసేపు కూర్చోకపోవడం వంటివి చేయాలి. ఇవన్నీ మీ గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి.

* గర్భధారణ సమయంలో అధికరక్తపోటు, మధుమేహం, అంతకన్నా ముందే వచ్చిన పీసీఓడీ ఉన్నవారు... వైద్యులు చెప్పిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఆ తరువాత కూడా ఆ సమస్యల్ని అదుపులో ఉంచుకోవాలి.
* కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బులు ఉంటే... ముప్ఫైఏళ్లు దాటాక ప్రతి రెండుమూడేళ్లకోసారి కొలెస్ట్రాల్‌తో పాటు బీపీ, మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి. నెలసరి ఆగిపోయాక కూడా కొలెస్ట్రాల్‌ పరీక్ష తప్పనిసరి. ఒకవేళ ఆ సమస్య ఉంటే గనుక వైద్యులు మందులు సూచిస్తారు. పదేళ్లలోపు నుంచే కొలెస్ట్రాల్‌ నిల్వలు మొదలవుతాయి.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.