close

తాజా వార్తలు

కీడెంచీ.. మేలెంచీ..

ముందస్తు ఆరోగ్య పరీక్షలు

అతి సర్వత్ర వర్జయేత్‌. అంటే అతి ఎక్కడా వద్దని! ఇది ముందస్తు ఆరోగ్య పరీక్షలకూ (స్క్రీనింగ్‌) వర్తిస్తుంది. జబ్బుల ఆనవాళ్లను ముందే పట్టుకోవటానికి, వాటిని నివారించుకోవటానికివి ఎంతగానో తోడ్పడతాయనటంలో ఎలాంటి సందేహం లేదు. మనదేశం సాంక్రమికేతర జబ్బుల నిలయంగా మారిపోయిన ప్రస్తుత తరుణంలో ఇవి అవసరం కూడా. కానీ ఎవరికి, ఎప్పుడు, ఎలాంటి పరీక్షలు అవసరమన్నదీ కీలకమే. పరీక్షలు నిర్వహించే ప్రయోగశాలల సామర్థ్యం, పరీక్షల విధి విధానాలు, సాంకేతిక పరిజ్ఞాన పరిమితుల దృష్ట్యా అన్ని ఫలితాలు సరిగా రావాలనేమీ లేదు. కొన్ని తప్పుగానూ రావొచ్చు. కొన్ని పరీక్షలు అసలు జబ్బులనే పట్టుకోలేకపోవచ్చు. ఇది మానసిక వేదనకు, తప్పుడు చికిత్సలకు దారితీయొచ్చు. అందుకే మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌లు, కంప్లీట్‌ బాడీ చెకప్‌ల పేరుతో అందరికీ మూకుమ్మడిగా పరీక్షలు చేసేయటం ఏమంత సమంజసమైన పద్ధతి కాదని.. వీటి విషయంలో కీడెంచి మేలెంచాలనే భావన పుంజుకుంటోంది.

ఆరోగ్య సంరక్షణను రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి- జబ్బులకు చికిత్స చేయటం. రెండోది- అసలు జబ్బుల బారినపడకుండా ముందే జాగ్రత్త పడటం. ముందస్తు ఆరోగ్య పరీక్షల లక్ష్యం ఇదే. మున్ముందు ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశముందో తెలుసుకోవటానికి.. ఏదైనా తేడా కనబడితే ముందుగానే వాటిని నివారించుకోవటానికివి తోడ్పడతాయి (ప్రైమరీ ప్రివెన్షన్‌). ఉదాహరణకు- ఎవరికైనా ముందస్తు మధుమేహం ఉన్నట్టు తేలితే అది పూర్తిస్థాయి మధుమేహానికి దారితీయకుండా చూసుకోవచ్చు. లేదూ త్వరగా దాని బారినపడకుండా కాపాడుకోవచ్చు. ఆరోగ్య పరీక్షలతో ఒనగూడే మరో ప్రయోజనం ఆయా జబ్బుల ముప్పు అధికంగా గలవారిలో సమస్యను ముందుగానే గుర్తించే వీలుండటం (సెకండరీ ప్రివెన్షన్‌). వీటిని ఆరంభంలోనే గుర్తిస్తే ముదరకుండా చూసుకోవచ్చు. అంతేకాదు, ఆయా జబ్బులతో ముడిపడిన తీవ్రమైన సమస్యలు దరిజేరకుండా కాపాడుకోవచ్చు. ఉదాహరణకు- ఎవరికైనా గుండెజబ్బు ఉందనుకోండి. మున్ముందు గుండెపోటు, గుండె వైఫల్యం, హఠాత్తుగా మరణించటం వంటి వాటిని ముందస్తు పరీక్షలతో కనిపెట్టుకుంటూ అప్రమత్తంగా ఉండొచ్చు. ఒకవేళ సమస్యాత్మకంగా పరిణమిస్తోందని అనిపిస్తే ముందుగానే చికిత్స ఆరంభించొచ్చు.
* చవక యావలో పడొద్దు
ముందస్తు పరీక్షల విషయంలో వయసు, కుటుంబ చరిత్ర, లింగ భేదం, ఆహార, విహారాలు, జీవనశైలి వంటి విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం విరివిగా అందుబాటులోకి వస్తున్న మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ల వంటివి చాలావరకు ఇలాంటి శాస్త్రీయ పద్ధతిని పాటించటం లేదనే చెప్పాలి. తక్కువ ధరలకే బోలెడన్ని పరీక్షలంటూ ఊరించటమూ చూస్తున్నాం. ‘ఒక్క రక్తం నమూనాతోనే చాలా పరీక్షలు చేస్తున్నారు కదా. దీంతో వచ్చే నష్టమేంటి?’ అని వాదించేవారూ లేకపోలేదు. ఖర్చు సంగతి పక్కపెడితే అసలు అన్ని పరీక్షలు అవసరమా? అన్నది ప్రధానమైన ప్రశ్న. పరీక్షలు నిర్వహించే ప్రయోగశాలల్లో అన్నిసార్లూ ఒకేలా, కచ్చితమైన ఫలితాలే రావాలనేమీ లేదు. 5-10% ఫలితాలు తప్పుగానూ రావొచ్చు. జబ్బు లేకపోయినా ఉన్నట్టు తేలితే కలిగే మానసిక వేదన అంతా ఇంతా కాదు. అనవసర చికిత్సలు, మందులతో ఇల్లు, ఒళ్లు గుల్లవుతాయి. జబ్బు ఉన్నా లేనట్టు తేలితే సమస్య రోజురోజుకీ ముదిరిపోతుంది. మనదేశంలో మందులకు 30%, పరీక్షలకు 20-30% ఖర్చు పెడుతున్నారని అంచనా. అందువల్ల అనవసర పరీక్షలకు తావివ్వకుండా చూసుకోవటమే ఉత్తమం.
* ఫలితాల విశ్లేషణ కీలకం
కొన్నిసార్లు వయసులను బట్టి కూడా నార్మలా? కాదా? అన్నది బేరీజు వేయాల్సి ఉంటుంది. 60 ఏళ్ల వృద్ధుడికి ఎకోకార్డియోగ్రామ్‌ పరీక్ష చేశారనుకోండి. గుండె వైఫల్యం (డయాస్టాలిక్‌ డిస్‌ఫంక్షన్‌) ఉన్నట్టు తేలినంతమాత్రాన అది సమస్యాత్మకం కాకపోవచ్చు. వయసుతో పాటు గుండె కండరం గట్టిపడటం వల్ల అలాంటి ఫలితం వచ్చి ఉండొచ్చు. అదే చిన్న వయసులో గుండె వైఫల్యం సూచనలు కనబడితే మాత్రం సమస్యాత్మకంగానే భావించాలి. ఇలా ఆయా అంశాలను బట్టి ఫలితాలను బేరీజు వేయటమనేది చాలా కీలకం. ఇప్పుడు ఇలాంటి నిపుణుల సంఖ్య తగ్గిపోతుండటం దురదృష్టకరం.
* అనవసరంగా చేస్తే తీవ్ర అనర్థాలు
ఒక సీటీ యాంజియోగ్రామ్‌ 250 ఎక్స్‌రేలతో సమానం! అంటే అవసరం లేకపోయినా ఒకసారి సీటీ యాంజియోగ్రామ్‌ చేస్తే 250 ఎక్స్‌రేలతో సమానమైన రేడియో ధార్మికశక్తి ప్రభావానికి గురైనట్టే. ముఖ్యంగా చిన్న వయసులో ఎక్కువ రేడియో ధార్మికశక్తికి గురైతే మున్ముందు క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది. సీటీ యాంజియోగ్రామ్‌ వంటివి చేసేటప్పుడు రక్తంలోకి అయోడిన్‌ కాంట్రాస్ట్‌ కూడా ఇస్తుంటారు. కిడ్నీ జబ్బు ముప్పునకు దగ్గర్లో ఉన్నవారికిది మరింత చేటు చేస్తుంది. ముఖ్యంగా మధుమేహుల్లో క్రియాటినైన్‌ 1.2 కన్నా తక్కువున్నా అయోడిన్‌ కాంట్రాస్ట్‌ ఇచ్చిన తర్వాత ఉన్నట్టుండి కిడ్నీలు దెబ్బతినటం చూస్తున్నాం. ఇలాంటి తీవ్రమైన అనర్థాలు నూటికి 5 మందిలోనే కనబడొచ్చు గానీ దానికి ఆస్కారం ఇవ్వటం ఎందుకు? అవసరమైనప్పుడు సీటీ యాంజియోగ్రామ్‌ పరీక్ష తప్పదు. ఇలాంటి పరీక్షలతో కలిగే లాభాలతో పోలిస్తే నష్టాలు తక్కువగా ఉన్నప్పుడు చేయటంలో తప్పులేదు. కానీ అనవసరంగా చేయకపోవటమే ఉత్తమం కదా. మానసిక ఒత్తిడి, భయాల వంటివన్నీ పక్కనపెడితే తీవ్రమైన అనర్థాలకు దారితీసే సీటీ యాంజియోగ్రామ్‌, శరీరానికి కోత పెట్టి చేసే యాంజియోగ్రామ్‌ వంటి పరీక్షల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. వైద్యరంగం మీద ప్రజలకు నమ్మకం సడలకుండా చూసుకోవటం అవసరం. పరీక్షలకూ ఒక పరిమితి ఉందని తెలుసుకోకుండా అందరికీ గంపగుత్తగా నిర్వహించటంలో అర్థం లేదని గుర్తించాలి. అవసరమైనవారికి, అవసరమైన పరీక్షలు చేయటం ఎంత ముఖ్యమో.. అనవసరంగా పరీక్షలు చేయకపోవటం, చేయించుకోకపోవటం కూడా అంతే ముఖ్యం.

కొన్ని కీలక పరీక్షలు

సీరం క్రియాటినైన్‌
ఇది కిడ్నీల పనితీరును తెలుసుకోవటానికి తోడ్పడే పరీక్ష. చాలామంది క్రియాటినైన్‌ నార్మల్‌గా (1.2) ఉంటే అంతా బాగానే ఉందనుకుంటుంటారు. కానీ కిడ్నీలు 50 శాతం వరకు దెబ్బతిన్నా క్రియాటినైన్‌ నార్మల్‌గానే ఉండొచ్చు. అందువల్ల తొలిదశ కిడ్నీజబ్బును తెలుసుకోవటానికి కిడ్నీల వడపోత సామర్థ్యం (జీఎఫ్‌ఆర్‌) కూడా కీలకం. దీన్ని వయసు, లింగ బేధం వంటి అంశాల ఆధారంగా అంచనా వేస్తారు. అందువల్ల రిపోర్టులో జీఎఫ్‌ఆర్‌ విలువను కూడా తప్పకుండా పేర్కొనాలి. ఇది 90 కన్నా తక్కువకు చేరుకుందంటే కిడ్నీ జబ్బు మొదలైందనే అర్థం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నిపుణుల సూచనల మేరకు తరచుగా పరీక్ష చేయించుకోవాలి.

ఎవరికి?
దీర్ఘకాలంగా అధిక రక్తపోటు గలవారికి, మధుమేహం నియంత్రణలో లేనివారికి, కుటుంబంలో ఎవరైనా కిడ్నీజబ్బులు గలవారికి, నొప్పి మందులు అతిగా వేసుకునేవారికి, తరచుగా మూత్ర ఇన్‌ఫెక్షన్లకు గురయ్యేవారికి ఇది అవసరం.

మూత్రంలో సుద్ద
కిడ్నీజబ్బు తొలిదశలో చాలావరకు ఎలాంటి లక్షణాలూ కనబడవు. లక్షణాలు కనబడేసరికే కిడ్నీలు ఎంతోకొంత దెబ్బతిని ఉండొచ్చు. దీన్ని ముందుగానే గుర్తించటానికి మూత్రంలో ప్రోటీన్‌ (అల్బూమిన్‌ వంటి ప్రోటీన్లు) పరీక్ష ఉపయోగపడుతుంది. మూత్రంలో చిన్న పట్టీని ముంచి చేసే పరీక్షలో ఫలితం 2 ప్లస్‌ అని తేలితే 300మి.గ్రా./డీఎల్‌ కన్నా ఎక్కువ ప్రోటీన్‌ పోతుందనే అర్థం. అంతకన్నా ముందే సమస్యను తెలుసుకోవటానికి మూత్రంలో సుద్ద (మైక్రో అల్బుమినూరియా) పరీక్ష ఉపయోగపడుతుంది. ఇది 30 మి.గ్రా. లోపు ఉంటే బాధపడాల్సిన పనిలేదు. 30-300 మి.గ్రా. ఉంటే జాగ్రత్తగా ఉండాలి. అదే 300 మి.గ్రా. కన్నా మించితే మందులు తప్పనిసరి.                                                                                                            ఎవరికి?
మధుమేహం, అధిక రక్తపోటు గలవారికి. మధుమేహంతో బాధపడేవారికి ఏటా ఈ పరీక్ష చేయాల్సి ఉంటుంది.

హెపటైటిస్‌ పరీక్ష
ఇది కాలేయజబ్బును పట్టుకునే పరీక్ష. హెపటైటిస్‌ బి ఇన్‌ఫెక్షన్‌ నివారణకు ఇప్పుడు పుట్టగానే టీకా ఇస్తున్నారు. హెపటైటిస్‌ సి ఇన్‌ఫెక్షన్‌కు టీకా లేదు. వీటిని గుర్తించటానికి పరీక్షలు అవసరం.

ఎవరికి?
* రక్తం ఎక్కించుకున్నవారికి
* రక్త పరీక్షలు, డయాలసిస్‌, సర్జరీల వంటివి చేసే వైద్య సిబ్బందికి
* మాదకద్రవ్యాల అలవాటు గలవారికి
* కాలేయ ఎంజైమ్‌లు అస్తవ్యస్తమైనవారికి

ఎల్‌ఎఫ్‌టీ
ఇది కాలేయం పనితీరును తెలిపే పరీక్ష. ఇందులో రక్తంలో ఏఎల్‌టీ, ఏఎస్‌టీ, ఏఎల్‌పీ, అల్బుమిన్‌, టోటల్‌ ప్రోటీన్‌ స్థాయులు తెలుస్తాయి. వీటి ఆధారంగా కాలేయం దెబ్బతింటుంటే ముందుగానే గుర్తించొచ్చు.
ఎవరికి?
* మద్యం అలవాటు గలవారికి, హెపటైటిస్‌ ఇన్‌ఫెక్షన్లు గలవారికి, కుటుంబంలో ఎవరికైనా కాలేయ కణితులు తలెత్తినవారికి
కొలనోస్కోపీ
ఇది మలద్వార క్యాన్సర్‌ నివారణకు తోడ్పడే పరీక్ష. ఇందులో పెద్దపేగులోకి కెమెరాతో కూడిన గొట్టం పరికరాన్ని పంపించి లోపల ఏవైనా మార్పులు ఉన్నాయో చూస్తారు. పెద్దపేగులో బుడిపెల వంటివి క్యాన్సర్‌కు దారితీయొచ్చు. పరీక్ష చేసే సమయంలో ఇలాంటివి కనిపిస్తే వెంటనే తొలగిస్తారు. దీంతో క్యాన్సర్‌ బారినపడకుండా చూసుకోవచ్చు. దీన్ని ప్రతి ఐదేళ్లకు ఒకసారి చేయాల్సి ఉంటుంది. కొందరికి మలంలో రక్తం పోతుందేమో అనేదీ తెలుసుకోవటానికి పరీక్ష చేయాల్సి ఉంటుంది.
ఎవరికి?
* 50 ఏళ్లు పైబడినవారికి, కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్ల బారినపడ్డవారికి, పెద్దపేగులో బుడిపెలు గలవారికి
మామోగ్రామ్‌
ఇది రొమ్ము క్యాన్సర్‌ను ముందే పట్టుకోవటానికి తోడ్పడే పరీక్ష. ఇందులో రొమ్ముల్లో గడ్డలేవైనా ఏర్పడుతుంటే వెంటనే తెలిసిపోతుంది. గతంలో 40 ఏళ్లు దాటిన స్త్రీలందరికీ మామోగ్రామ్‌ అవసరమని చెప్పేవారు. అయితే ఆరోగ్యంగా ఉన్న అందరికీ మామోగ్రామ్‌ చేసినా పెద్దగా తేడా కనబడటం లేదని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతకన్నా రొమ్ములను ఎవరికి వారు జాగ్రత్తగా పరిశీలిస్తుంటే చాలావరకు రొమ్ముక్యాన్సర్‌ ఆనవాళ్లను ముందుగానే పట్టుకోవచ్చని వివరిస్తున్నాయి.
ఎవరికి?
* కుటుంబంలో ఎవరైనా రొమ్ముక్యాన్సర్‌ బారినపడ్డవారికి, సంతానం లేనివారికి, రేడియేషన్‌ ప్రభావానికి గురైనవారికి

* సాంక్రమికేతర జబ్బులే ఎక్కువ
ఒకప్పుడు మనదేశంలో ఇన్‌ఫెక్షన్ల వంటి సాంక్రమిక జబ్బులే ఎక్కువ. మరణాలు కూడా ఎక్కువగానే ఉండేవి. పరిశుభ్రత, సార్వత్రిక టీకా కార్యక్రమాల వంటి జాగ్రత్తలతో వీటిని చాలావరకు అధిగమించగలిగాం కూడా. అలా అని ఆనందించటానికి లేదు. మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ల వంటి సాంక్రమికేతర జబ్బులు ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. మనదేశంలో సంభవిస్తున్న మరణాల్లో 61% మరణాలకు సాంక్రమికేతర జబ్బులే కారణమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంటోంది. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుండెజబ్బు, పక్షవాతం, అధిక రక్తపోటు గురించే. సాంక్రమికేతర జబ్బుల మరణాల్లో ఇవే 45% వరకు కారణమవుతుండటం గమనార్హం. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్య (22%), క్యాన్సర్లు (12%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరి వీటిని నివారించుకోలేమా? తప్పకుండా నివారించుకోవచ్చు. ఇందుకు జీవనశైలిని మార్చుకోవటంతో పాటు ముందుస్తు ఆరోగ్య పరీక్షలూ ఎంతగానో తోడ్పడతాయి.
* గుండెజబ్బుల నివారణకు..
మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు.. ఈ మూడు గుండెకు ప్రధాన శత్రువులు. వీటి బారినపడకుండా చూసుకుంటే గుండెజబ్బుల బారినపడకుండా జాగ్రత్త పడినట్టే. అందువల్ల 30 ఏళ్లు పైబడిన అందరూ రక్తపోటు, కొలెస్ట్రాల్‌, పరగడుపున రక్తంలో గ్లూకోజు పరీక్షలు చేయించుకోవటం అత్యవసరం. ముందు జాగ్రత్త కోసం వీటిని ప్రతి మూడేళ్లకు ఓసారి చేయించుకుంటే సరిపోతుంది. అలాగే శరీర ఎత్తు-బరువుల నిష్పత్తి, నడుము చుట్టుకొలత చూసుకోవటమూ ముఖ్యమే.
* రక్తపోటు (బీపీ) పరీక్ష: చాలా తేలికైన పరీక్షే అయినా దీనికీ ఒక పద్ధతుంది. మనకు రక్తపోటు రోజంతా ఒకేలా ఉండదు. మారిపోతూ ఉంటుంది. మెట్లు ఎక్కటం, వేగంగా నడవటం వంటి పనులు చేసిన వెంటనే రక్తపోటు పరీక్ష చేస్తే పై/మొదటి సంఖ్య ఎక్కువగా కనబడుతుంది. తలనొప్పి, తలతిప్పు వంటివి ఉన్నప్పుడూ రక్తపోటు ఎక్కవగానే ఉంటుంది. కాబట్టి బీపీ పరీక్ష ఎప్పుడు చేయాలనేది కూడా ముఖ్యమేనన్నది గుర్తుంచుకోవాలి. అలాగే కనీసం 3 సార్లు పరీక్ష చేసి.. అన్నిసార్లూ ఎక్కువుంటేనే సమస్య ఉన్నట్టు నిర్ధరించాలి. రక్తపోటు 120/80 లోపు ఉండటం ఉత్తమం. అంతకు మించిపోతుంటే జాగ్రత్త అవసరం. ఒకవేళ 140/90 దాటితే చికిత్స తీసుకోవటం తప్పనిసరి.
* పరగడుపున గ్లూకోజు పరీక్ష: మధుమేహం ముప్పును తెలుసుకోవటానికి ప్రాథమికంగా ఈ పరీక్షే సరిపోతుంది. రక్తంలో గ్లూకోజు పరగడుపున 110 ఎంజీ/డీఎల్‌ లోపు ఉండటం మంచిది. ఇది 110-120 మధ్యలో ఉంటే త్వరలో మధుమేహం వచ్చే అవకాశముందని.. 126 కన్నా ఎక్కువుంటే మధుమేహం వచ్చిందని అర్థం. పరగడుపున గ్లూకోజు పరీక్ష చేయటం కుదరకపోతే ర్యాండమ్‌ గ్లూకోజు పరీక్ష చేయించుకోవచ్చు. ఇందులో గ్లూకోజు 200 ఎంజీ/డీఎల్‌ లోపు ఉంటే బాధపడాల్సిన పనిలేదు. ఒకవేళ 200 కన్నా ఎక్కువుంటే మధుమేహానికి సూచిక కావొచ్చు. ఇలాంటివాళ్లు పరగడుపున గ్లూకోజు పరీక్ష కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం హెచ్‌బీఏ1సీ పరీక్ష అందుబాటులో ఉంది. ఇందులో మూడు నెలల కాలంలో రక్తంలో గ్లూకోజు సగటు తెలుస్తుంది. ఇది 5.7 లోపుంటే భయపడాల్సిన అవసరం లేదు. 5.7 నుంచి 6.4 ఉంటే త్వరలో మధుమేహం వచ్చే అవకాశముందని అర్థం. 6.5, అంతకన్నా ఎక్కువుంటే మధుమేహంలోకి అడుగుపెట్టినట్టే.
* కొలెస్ట్రాల్‌ పరీక్ష: ఇందులో మొత్తం కొలెస్ట్రాల్‌తో పాటు చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌), మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) మోతాదులూ తెలుస్తాయి. హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ తక్కువుగా ఉన్నకొద్దీ గుండెజబ్బు ముప్పు పెరుగుతూ వస్తుంటుంది. ఇది స్త్రీలకు 45 కన్నా ఎక్కువ, మగవారికి 40 కన్నా ఎక్కువుండాలి. ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ 100 కన్నా తక్కువే ఉండాలి. మధుమేహుల్లోనైతే 90కి మించకూడదు. ఇక టోటల్‌ కొలెస్ట్రాల్‌ 240 దాటితే ఎక్కువగా ఉన్నట్టు భావిస్తుంటారు. కానీ ఇది 160 కన్నా మించకపోవటమే మంచిది.
* బీఎంఐ పరీక్ష: ఇది శరీర ఎత్తు-బరువుల నిష్పత్తిని తెలియజేసే పరీక్ష. బీఎంఐ 25 కన్నా తక్కువుండటం మంచిది. అలాగే నడుం చుట్టుకొలత ఆడవారికి 35 అంగుళాల లోపు, మగవారికి 40 అంగుళాల లోపు ఉండాలి. ఇది పెరుగుతున్నకొద్దీ గుండెజబ్బు ముప్పూ పెరుగుతుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.