close

తాజా వార్తలు

రాజపుత్రుల రాజ్యాల్లో గజనీ.. ఘోరీలు!

ఏపీపీఎస్సీ పరీక్షలు
భారతదేశ చరిత్ర

భారత దేశంపై గజనీ, ఘోరీ మహమ్మద్‌ల దండయాత్రలు తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను మార్చివేశాయి. ఆ దాడులు సోలంకీలు, చౌహానుల కాలాల్లో జరిగాయి. అప్పటి పరిస్థితులు, ఆ యుద్ధాలకు కారణాలను మధ్యయుగం అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు తెలుసుకోవాలి.

ధ్యయుగంలో మన దేశాన్ని పాలించిన రాజపుత్రుల్లో ప్రతీహారులు, పరమారులు, ఛందేలుల అనంతరం మరికొన్ని వంశాల వారు ఉన్నారు. ఆ రాజుల కాలంలో ఎన్నో ముఖ్యమైన పరిణామాలు సంభవించాయి. పరీక్షల కోణంలో అభ్యర్థులు వాటిని గుర్తుంచుకోవాలి.

సోలంకీలు

ప్రస్తుత గుజరాత్‌లోని అనిహిల్‌వాడ్‌ను రాజధానిగా చేసుకుని సోలంకీలు రాజ్యపాలన చేశారు. వీరినే ‘లాట చాళుక్యులు’ అని పిలుస్తారు. ఈ వంశ, రాజ్య స్థాపకుడు మూలరాజు. మొదటి చాళుక్య భీముడు (సోలంకీ భీముడు) గజనీ మహమ్మద్‌ దండయాత్రలను ఎదుర్కొన్నాడు. క్రీ.శ.1026లో సోలంకీ భీముడిని ఓడించి కథియవాడ్‌లోని సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేశాడు. ఇప్పటి రాజస్థాన్‌లోని మౌంట్‌అబూ పర్వత శిఖరంపై ఉన్న దిల్వారా జైన దేవాలయాలను సోలంకీ భీముడు నిర్మించాడు. సోలంకీ రాజు కర్ణుడు నేటి అహ్మదాబాద్‌ నగరాన్ని నిర్మించాడు. ఈ వంశ రాజుల్లో గొప్పవాడిగా పేరుపొందిన జయసింహ సిద్ధరాజు అనేక మంది కవి పండితులను పోషించాడు. ప్రముఖ జైన పండితుడు హేమచంద్రుడు ఇతడి ఆస్థానంలోనివాడే. హేమచంద్రుడి ప్రముఖ రచన పరిశిష్ఠపర్వం. జయసింహ సిద్ధరాజు సిద్ధపురంలోని రుద్ర మహకాల్‌ ఆలయాన్ని నిర్మించాడు. అనంతరం పాలనకు వచ్చిన కుమారపాలుడు, హేమచంద్రుడి ప్రభావంతో జైనమత పోషకుడిగా మారాడు. కానీ కుమారపాలుడి కుమారుడు అజయపాలుడు జైన దేవాలయాలను  కూల్చి, జైన పండితులను హింసించాడు. ఘోరీ మహమ్మద్‌ దండయాత్రల కాలంలో రెండో మూలరాజు బాలుడిగా ఉండటంతో అతడి తల్లి నాయకీదేవి సైన్యాలను నడిపి మౌంట్‌అబూ యుద్ధంలో (క్రీ.శ. 1178) తురుష్కులను ఓడించింది. ఆ తర్వాత పాలనకు వచ్చిన రెండో భీముడు సోమనాథ దేవాలయానికి  మరమ్మతులు చేయించాడు. ఇతడు ఘోరీ, కుతుబుద్దీన్‌ ఐబక్‌ దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇల్‌టుట్‌మిష్‌ కాలంలో సోలంకీ రాజ్యం పతనమైంది. బరోడా వద్ద ఉన్న సూర్యదేవాలయం, మౌంట్‌అబూలోని విమల దేవాలయాలను వీరి కాలంలోనే నిర్మించారు. 

చౌహానులు

నేటి తూర్పు రాజస్థాన్‌లోని అజ్మీర్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన ప్రముఖ రాజపుత్ర వంశం చౌహానులు. వీరినే చహమానులు అని వ్యవహరిస్తారు. మొదట ప్రతీహారులకు సామంతులుగా ఉండేవారు. చౌహాన్‌ వంశ స్థాపకుడు సింహరాజు ‘మహారాజాధిరాజు’ బిరుదుతో పాలన చేశాడు. అజ్మీర్‌ ప్రాంతంలోని శాకంభరి (నేటి సాంభర్‌ సరస్సు ప్రాంతం) ని రాజధానిగా చేసుకుని పాలించాడు. 12వ శతాబ్దంలో రెండో అజయరాజు తన రాజధానిని శాకంభరి నుంచి అజ్మీర్‌కు (అజయమేర్‌) మార్చాడు. చౌహానులు రాజ్య విస్తరణలో భాగంగా నాటి గుజరాత్‌ సోలంకీలు/చాళక్యులతో, మాళ్వా - పరమారులతో, తురుష్క పాలకులైన గజనీ, ఘోరీలతో పోరాడారు. మహారాజు బిరుదుతో పాలించిన వాక్పతిరాజు పుష్కర్‌ వద్ద శివాలయాన్ని కట్టించాడు. చౌహానుల్లో ఒకరైన నాలుగో విగ్రహరాజు విశాలదేవుడు ‘హరకేళి’ అనే ప్రసిద్ధ రచన చేశాడు. ఈ గ్రంథంలోని (నాటకం) కొన్ని అంశాలను అర్హిదిన్‌కా జోంప్రా మసీదు గోడలపై చిత్రించారు. విశాలదేవుడి ఆస్థానంలోని సోమదేవుడు అనే కవి లలిత విగ్రహరాజు అనే నాటకాన్ని రచించాడు. విగ్రహరాజు ‘కవి బాంధవ’ అనే బిరుదును పొందాడు. ఇతడు అజ్మీర్‌లో సంస్కృత విద్యాలయాన్ని స్థాపించాడు. విశాల్‌పూర్‌ పట్టణాన్ని నిర్మించాడు. చౌహానుల్లో గొప్పరాజు మూడో పృథ్వీరాజ్‌. క్రీ.శ.1179-1192. ఈయనను ముస్లిం రచనల్లో రాయపితౌరా అని ప్రస్తావించారు. ఘోరీ మహమ్మద్‌తో ఇతడు రెండు తరైన్‌ యుద్ధాలు చేశాడు. 1191 నాటి మొదటి తరైన్‌ యుద్ధంలో ఘోరీని ఓడించాడు. కానీ 1192 నాటి రెండో తరైన్‌ యుద్ధంలో ఘోరీ చేతిలో మరణించాడు. పృథ్వీరాజ్‌ ఆస్థాన కవి చాంద్‌బార్ధై ‘పృథ్వీరాజ్‌ రాసో’ అనే ప్రముఖ గ్రంథాన్ని హిందీలో రాశాడు.

గహద్వాలులు

నోజ్‌ను రాజధానిగా చేసుకుని ప్రతీహారులకు సామంతులుగా పాలించినవారు గహద్వాలులు. వీరి రాజ్య స్థాపకుడు చంద్రదేవుడు. ఈ వంశంలో గొప్పవాడు జయచంద్రుడు. గోవింద చంద్రుడి కాలంలో 14 మంది రాజులను ఓడించి రాజ్యాన్ని విస్తరించారు. ఈయన ఆస్థాన కవి లక్ష్మీధరుడు కృత్యకల్పతరు/కల్పద్రుమ అనే న్యాయశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. గోవింద చంద్రుడి భార్య కుమార దేవి బౌద్ధమతాన్ని అవలంబించి సారనాథ్‌లో ఒక విహారాన్ని నిర్మించింది. జయచంద్రుడి కాలంలో అతడి కుమార్తె రాణి సంయుక్తను మూడో పృథ్వీరాజ్‌ చౌహాన్‌ తీసుకుపోవడంతో ఘోరీ మహమ్మద్‌ను ఇతడు భారతదేశ దండయాత్రకు ఆహ్వానించాడు.  జయచంద్రుడి ఆస్థాన కవి శ్రీహర్షుడు ‘నౌషధ చరిత్ర’ అనే గొప్ప గ్రంథాన్ని రాశాడు. గహద్వాలుల్లో చివరి రాజు హరిశ్చంద్రుడు.

(పాల వంశీయులు, సేనరాజులు, తూర్పు గాంగులు, కశ్మీర్‌ పాలకులకు సంబంధించిన సమాచారం కోసం www.eenadupratibha.netచూడవచ్చు.)

- బొత్స నాగరాజు


 
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.