close

తాజా వార్తలు

0 ఏడాది ఏంటి?

మీకు 0 సంవత్సరం గురించి తెలుసా? ఆటపట్టించడానికి కాదండోయ్‌ నిజంగానే అడుగుతున్నాం! 
సర్లెండి... 2026 సంవత్సరాన్ని శాస్త్రవేత్తలు 0 సంవత్సరంగా ప్రకటిస్తున్నారు. 
ఎందుకు? సరిగ్గా అదే సంవత్సరానికి ఒక్క మనిషి తప్పించి ఈ భూమ్మీద ఉన్న జీవరాశులన్నీ 
వాటివాటి సహజ ఆవాసాలని కోల్పోయి దిక్కులేనివి అవుతున్నాయి కాబట్టి. ఇదంతా జరగడానికి 
ఏళ్లూపూళ్లూ పట్టడం లేదు. కేవలం మరో ఎనిమిది సంవత్సరాలు అంతే!

0 ఏడాది ఏంటి?

...అనగనగా రాజుగారు. ఆయనకు ఏడుగురు కొడుకులు... వేటకు వెళ్లారు. చేపలు తెచ్చి, ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేపా.. చేపా ఎందుకు ఎండలేదూ... అని అడిగితే అసలు కథ బయటకు వచ్చింది. ఇప్పుడా కథని మనం అంతరించిపోతున్న ధ్రువపు ఎలుగుబంటికు అన్వయించుకుందాం. ఎలుగూ ఎలుగూ ఎందుకు అంతరించిపోతున్నావ్‌ అంటే.. నేను దండిగా తినడానికి సీల్‌ చేపలు లేవుగా అందిట. సరే సీలు చేపా.. సీలు చేపా ఎందుకు తగ్గిపోతున్నావ్‌ అని అడిగితే సముద్రంలో నేను తినే కాడ్‌ రకం చేపలు ఎంత వెతికినా దొరకడం లేదు మరీ అందిట. కాడ్‌ చేపా చేపా నీకేమయ్యిందీ అంటే నేను తినే రొయ్య పిల్లలు లేవు మరి అందుకే మా జాతి అంతరించిపోతోందీ అంది. రొయ్యపిల్లా నీ సంగతేంటి అంటే నేను తినే సముద్ర నాచు లేనప్పుడు నేనేం చేయ్యాలి  అంటూ విషయానికి వచ్చింది. సముద్ర నాచుని విషయం అడిగితే... ‘ఈ ప్రశ్న నన్ను కాదు. మీ మనుషులనే అడగాలి. అడవులు నరుకుతూ, సహజ వనరులని వాడేస్తూ భూమికి సంవత్సరాలుగా మీరు పెట్టిన సెగ వల్ల సముద్ర జలాలు వేడెక్కి మా జాతి చచ్చిపోయింది’ అంది సమాధానంగా. తీగ లాగితే బయటపడింది... మానవ తప్పిదం, అంతులేని అతని స్వార్థం. సరే... ఇదంతా చదివితే పర్యావరణ గొలుసులో సింహాలు, పులుల్లాంటి పెద్ద జీవులే కాదు ఒక చిన్న నాచు కూడా కీలకమే అనే విషయం అర్థమైందిగా! ధ్రువపు ఎలుగుబంటి స్థానంలో అంతరించినపోతున్న పులి, సింహం, నాచు మరేదయినా జీవి ఉండొచ్చు. అవి అంతరించిపోవడానికి కారణం మాత్రం జీవవైవిధ్యంపై మనిషి కొడుతున్న చావుదెబ్బే. అడవులని నరికి, సముద్రాలని తోడేస్తూ... గాలిని కలుషితం చేస్తూ అనేకానేక జీవుల మనుగడకు మనం ముప్పు తెచ్చిపెట్టాం. ఆ పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే 2026 నాటికి ఈ భూమ్మీద ఉన్న జంతువులన్నీ తమతమ ఆవాసాలని పూర్తిగా కోల్పోయేంతగా! 
సహజ ఆవాసాలని సంరక్షించుకోవాలి... 
2026 తర్వాత జీవులకు అసలు ఆవాసమే ఉండదా? అంటే ఉంటుంది. కానీ మనమిక్కడ స్పష్టంగా తెలుసుకోవాల్సింది జీవుల సహజసిద్ధమైన ఆవాసాల గురించి కానీ... మనుషులు కృత్రిమంగా ఏర్పాటు చేసే వాటి గురించి కాదు. అడవులు, ఎడారులు, గడ్డిభూములు, బీలభూములు, సముద్రాలు, చెరువులు, కుంటలు, కొండలు, పర్వతాలు వంటివి జీవుల మనుగడకి అవసరం అయిన సహజ ఆవాసాలు. వాటి ఆవాసాలని మనిషి ఆక్రమించుకుంటూ వాటి స్థానాల నుంచి వాటిని వెళ్లగొడుతున్నాడు.  దానికి స్పష్టమైన ఆధారాలూ ఉన్నాయి. 2014లో వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫండ్‌ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధన తేల్చిన వాస్తవాలివి. 1970 నుంచి 2010 సంవత్సరాల మధ్యలో అంటే 40 సంవత్సరాలకాలంలో అటవీ జంతువుల జీవనప్రమాణాలని గమనిస్తే సగానికిసగం అటవీ జంతువులు తమ ఆవాసాలని కోల్పోయాయి. మరో రెండేళ్ల తేడాలో మరో పరిశోధన చేసినప్పుడు ఈ తరుగుదల నమ్మశక్యం కానంత వేగంగా ఉంది. ప్రతి రెండేళ్లలో వస్తున్న మార్పుని అంచనా వేసుకుంటే 2026 నాటికి భూమ్మీద ఉన్న అన్ని జీవులూ తమ సహజ ఆవాసాలని కోల్పోతాయని పరిశోధకులు చెబుతున్నారు. 
మానవ తప్పిదాలని తగ్గించుకుంటే... 
దీనికి పరిష్కారంగా మనుషులు ఏర్పాటు చేసిన కృత్రిమ ఆవాసాలు అంటే పార్కుల్లాంటివి ఎంతమాత్రం పరిష్కారం చూపించలేకపోతున్నాయనేది శాస్త్రవేత్తల వాదన. దీనికి తోడు కాలుష్యం, జంతువుల అక్రమరవాణా, రైలు మార్గాలు, కొండలు, గుట్టలు తొలిచివేయడం వంటివి కూడా ఏనుగులు, పులులు, ఖడ్గమృగాలు, రాబందుల వంటి జీవుల పాలిట శాపంగా మారాయి. మరోవైపు తీరప్రాంతాల రక్షణ గురించి సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఒడిశా తీరప్రాంతం తాబేళ్ల శ్మశానవాటికలా మారుతోంది. జపాన్‌లాంటి దేశాలు మాత్రం లెక్కకు మించి జనాభా ఉన్నా అడవుల సంరక్షణలో చిత్తశుద్ధితో ఉన్నాయి. అడవుల శాతం తగ్గిపోకుండా రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. మన మనుగడ జీవుల మనుగడపై ఆధారపడి ఉందన్న వాస్తవం తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.