
తాజా వార్తలు
వీధిలైట్లకయ్యే ఖర్చుని ఆదా చేయడానికి చైనా ఓ కృత్రిమ చందమామని తయారుచేస్తోంది. చైనా స్ఫూర్తితో తక్కిన దేశాలు కూడా చందమామలు చేయడం మొదలుపెడితే? ఏడాది పొడవునా పున్నమే అని ఆనందిస్తారేమో! కానీ ఇప్పుడు ప్రపంచానికి కావాల్సింది మిరుమిట్లుగొలిపే కాంతి కాదు.. చిక్కటి చీకటి! కాంతివృథాని తగ్గించి చీకటిని పెంచేందుకు కొత్తగా డార్క్‌స్కై పార్కులు, డార్క్‌స్కై టూరిజం వంటివి మొదలయ్యాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ!
ఆస్ట్రేలియాలోని న్యూసౌత్వేల్స్కి దగ్గరగా ఉన్న టస్మానియా ప్రాంతం అది. అక్కడే వారుంబెంగల్ జాతీయ ఉద్యానవనం ఉంది. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఈ పార్కుకి ఓ ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే.. ‘ఇచ్చట చిమ్మచీకటి దొరుకుతుంది’. ప్రభుత్వం దీనిని డార్క్‌స్కై పార్క్‌గా ప్రకటించింది. వినడానికి వింతగా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది యాత్రికులు ఆస్ట్రేలియాలోని టస్మానియా ప్రాంతానికి ఈ కారునలుపు చీకటిని దర్శించుకోవడానికే వస్తుంటారు. ఏటా డార్క్‌స్కై టూరిజం, ఆస్ట్రోటూరిజం పేరుతో ఇక్కడికి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ‘కొన్నిరోజుల క్రితం అలా అమెరికా నుంచి ఇక్కడకు వచ్చిన ఓ కుర్రాడు హఠాత్తుగా ఏడ్వడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు చీకటిని చూసి భయపడ్డాడేమో అనుకున్నారు. కానీ ఆ కుర్రాడు ఏడ్వడానికి కారణం చీకటి కాదు. చీకట్లో కనిపించిన కోటానుకోట్ల నక్షత్రాలు. నగరంలో పుట్టి, పెరిగిన ఆ కుర్రాడికి ఆకాశంలో అసలు అన్ని నక్షత్రాలుంటాయనే విషయమే తెలియదు. మొదటి సారి వాటిని చూసిన ఉద్వేగంతో అలా ఏడ్వడం మొదలుపెట్టాడు. మరో పదేళ్లు పోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలందరిదీ అదే పరిస్థితి. చీకటి అవసరం ఏంటో ప్రపంచానికి తెలియజేయడమే ఇక్కడున్న డార్క్‌స్కై టస్మానియా ప్రాజెక్టు లక్ష్యం’ అంటున్నాడు కాంతినిపుణుడుగా పేరొందిన లండన్ బానిస్టర్.
చీకటిని కాపాడుకుందాం..
పగల్లానే రాత్రి కూడా కాంతితో మెరిసిపోవడానికి మన శాస్త్రవేత్తలు కృత్రిమ కాంతికి జీవం పోశారు. కాంతి అవసరమే కానీ, అవసరానికి మించి కళ్లు మిరుమిట్లుగొలిపే కాంతి అవసరమా అనే విషయం గురించి ఆలోచించలేదు. దాంతో కృత్రిమ కాంతితో ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువ అనే విషయాన్ని ఆలస్యంగా కనిపెట్టారు. ముఖ్యంగా వీధిలైట్ల కోసం వాడే ఎల్ఈడీ లైట్ల కాంతిపుంజాలు అవసరానికి మించి ఉండటంతో కాంతి దుర్వినియోగం పెరుగుతూ వచ్చింది. గత పదేళ్లలో ఈ సమస్య మరీ తీవ్రతరం అయ్యింది. ఈ కృత్రిమ కాంతి అద్భుతాలు నిండిన ఆకాశాన్ని చూడనివ్వకుండా అడ్డుకోవడంతోపాటు, మనలో మానసిక సమస్యలు పెరగడానికీ కారణమవుతోంది. మరోపక్క రాత్రిపూట సంచరించే నిశాచర జీవులు పాలిట శాపంగా మారి పర్యావరణ సమతుల్యతకి పెనుసవాలుగా మారింది. ఈ పరిస్థితులని నివారించి స్వచ్ఛమైన తారలు నిండిన ఆకాశాలని కాపాడుకునేందుకు 1988లోనే ఇంటర్నేషనల్ డార్క్‌స్కై అసోసియేషన్ సంస్థ ఏర్పడింది.
కాంతివృథాని అరికడదాం...
ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిమ్మచీకటి ప్రాంతాలని గుర్తించి వాటిని సంరక్షించడం, పట్టణప్రాంతాల్లో కృత్రిమ కాంతి చొరబడకుండా చేసి చీకటిని కాపాడ్డం, డార్క్‌స్కై పార్కులు ఏర్పాటు చేయడం, ప్రజల్లో చీకటి పట్ల అవగాహన తీసుకురావడం, నిశాచర జీవులూ, సముద్ర తాబేళ్ల జీవనానికి ఇబ్బందులు రాకుండా వాటి సంతతి పెరిగేటట్టు చేయడం ఇంటర్నేషనల్ డార్క్‌స్కై లక్ష్యాల్లో కొన్ని. సముద్ర తాబేళ్లు రాత్రిపూట చీకట్లో మాత్రమే గుడ్లని పొదుగుతాయి. కానీ ఫ్లడ్‌లైట్ల వల్ల తాబేళ్ల సంతతి గణనీయంగా తగ్గిపోతూ వచ్చింది. ఇక మనుషుల విషయానికే వస్తే... ఊబకాయం, ఆందోళన, నిద్రలేమి సమస్యలు, మధుమేహం, సంతానసాఫల్యత తగ్గిపోవడం, రొమ్ము, చర్మ క్యాన్సర్లు రావడానికీ కృత్రిమ కాంతికి సంబంధం ఉందని ఈ సంస్థ చేసిన అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి, పగలు.. అందుకు అనుగుణంగా శరీరం స్పందించే తీరు ఒకటి ఉంటుంది. దీనినే సర్కాడియమ్ క్లాక్ లేదా జీవగడియారం అంటారు. దీని పనితీరు బాగుంటే మెలటోనిన్ విడుదల సవ్యంగా ఉంటుంది. మంచినిద్రకి, థైరాయిడ్, పాంక్రియాస్, అండాశయాల పనితీరు, అడ్రినల్ గ్రంథి పనితీరు సవ్యంగా జరగడానికి ఈ మెలటోనినే కారణం. క్రమంగా ఇప్పుడు మెలటోనిన్ విడుదలలోనూ సమస్యలు ఎక్కువవుతున్నాయి. కాంతి వృథాని అరికట్టడమే దీనికి పరిష్కారం అంటున్నారు నిపుణులు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో 80 శాతం మంది ప్రస్తుతం కృత్రిమకాంతిలోనే జీవనం సాగిస్తున్నారు. 80 దేశాల్లో గడిచిన నాలుగేళ్లలో విపరీతమైన కాంతికాలుష్యం నమోదైంది. గతంతో పోలిస్తే 30 శాతం నిశాచర కీటకాల సంఖ్య తగ్గిపోయి .. ఆ ప్రభావం మొక్కల పరాగసంపర్కం, అడవుల విస్తీర్ణతపై పడింది. |
చైనా 2020 నాటికి కక్ష్యలో ప్రవేశపెట్టాలనుకుంటున్న కృత్రిమ జాబిల్లితో ప్రయోజనాలకన్నా చిక్కులే ఎక్కువ అంటున్నారు నిపుణులు. ఈ చందమామ ఎనిమిది రెట్లు ఎక్కువ కాంతిమంతంగా ఉంటుంది. దాంతో యాభైరెట్లు ఎక్కువగా కాంతికాలుష్యం ఏర్పడుతుంది. పట్టణ ప్రాంతంలో నివసించే జంతుప్రపంచంపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. రాత్రి అనేదే లేకపోవడంతో నిద్రకు దూరమైన ప్రజల్లో ఆందోళన, ఒత్తిడి వంటివి క్రమంగా పెరుగుతాయి. కొన్ని రకాల వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. |
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
