close

తాజా వార్తలు

నేను అలా చెప్పుంటే ప్రకాష్‌రాజ్‌ ఉండేవాడు కాదు! 


నేను అలా చెప్పుంటే ప్రకాష్‌రాజ్‌ ఉండేవాడు కాదు! 

Dఅంటే డీసెంట్‌ 
Aఅంటే యాటిట్యూడ్‌ 
Nఅంటే న్యూ వెర్షన్‌ 
Cఅంటే ఛాలెంజ్‌ 
Eఅంటే ఎనర్జటిక్‌

వీటన్నింటికీ ఒక రూపం ఉంటే, ఒక ప్రాణం ఉంటే, ఆ ప్రాణానికి ఒక పేరు ఉంటే ఆ పేరే సుందరం మాస్టర్‌. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో 1200లకు పైగా చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. రూ.40 జీతంతో జీవితం ప్రారంభించిన సుందరం మాస్టర్‌ అలనాటి అగ్ర తారలు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, ఎంజీఆర్‌లతోనేకాదు నేటి మేటి తారలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతోనూ కలిసి పనిచేశారు. అంతేకాదు ఆయన కుమారులు ప్రభుదేవా, రాజు, ప్రసాద్‌లను సైతం నృత్య దర్శకులుగా తీర్చిదిద్ది కళామ్మతల్లికి ఎంతో సేవ చేశారు. ‘అలీతో సరదాగా’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఎన్నో సంగతులు పంచుకున్నారిలా...!

మీ వయసెంత మాస్టర్‌? 
సుందరం మాస్టర్‌: నా వయసు గురించి అడిగే ముందుకు మీ (అలీ) వయసు గురించి అడగాలని ఉంది. మిమ్మల్ని ఎప్పుడో చూశాను. దాదాపు 30ఏళ్ల కిందటే చూశాను. అప్పుడెలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. రహస్యం ఏదైనా ఉంటే చెప్పండి. నేను కూడా యువకుడిలా ఉండాలని అనుకుంటున్నా. (అలీ సమాధానం చెబుతూ.. నేను ఇంత యంగ్‌గా ఉండటానికి కారణం మీలాంటి పెద్దల ఆశీర్వాదం) మాలాంటి పెద్దలు కాదు.. ఆ దేవుడి ఆశీర్వాదం.

మీ అబ్బాయిలందరూ చెన్నైలో సెటిల్‌ అయితే, మీరు మైసూర్‌లో ఉన్నారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? 
సుందరం మాస్టర్‌: నాకు వ్యవసాయం చేయటం చాలా ఇష్టం. ఇప్పుడు నేను అక్కడ వ్యవసాయం చేస్తున్నా, ట్రాక్టర్‌ నడుతున్నా. పనివాళ్లు దొరకడం కష్టమైంది.

నిక్‌ నేమ్‌ సుందరం మాస్టర్‌. మీ అసలు పేరేంటి? 
సుందరం మాస్టర్‌: నా తల్లిదండ్రులు సుందర అని పిలిచేవారు. మా పెద్దలు పెట్టిన పేరు శంకర్‌ మాంతప్పన్‌ మల్లప్ప. మా వూళ్లొ పెద్ద గుడి ఉంది. అక్కడ అభిషేకాలు చేసినప్పుడు శంఖం వూదాలి. మా తాతగారి తర్వాత ఆ గుడిలో పనిచేసే అవకాశం నాకు రావడంతో శంకర్‌ మాంతప్పన్‌ మల్లప్ప అని పిలిచేవారు. నా భార్యది మైసూర్‌ దగ్గర చిన్న గ్రామం. చాలా పేద అమ్మాయిని చేసుకున్నా. నేను పెళ్లి చేసుకునే సమయానికి తల్లిదండ్రులు కూడా లేరు.(బాధతో కన్నీళ్లు).

నేను అలా చెప్పుంటే ప్రకాష్‌రాజ్‌ ఉండేవాడు కాదు! 

సినిమాల్లో ఎలా అడుగుపెట్టారు? 
సుందరం మాస్టర్‌: సినిమా ఫీల్డ్‌లోకి రావడానికి చాలా కష్టపడ్డా. వాహిని స్టూడియోలో చందమామ ప్రెస్‌ ఉండేది. అందులో వీలర్‌గా రూ.40 జీతంతో నా జీవితం ప్రారంభించా. సినిమాల్లో రావాలన్న తపనతో రూ.10 ఇచ్చి ఓ డ్యాన్స్‌ మాస్టర్‌ దగ్గర డ్యాన్స్‌ నేర్చుకునే వాడిని. ఆయనకు కూడా పెద్దగా రాదు. కానీ, ఎక్కడైనా డప్పు కొట్టడం వినపడితే నా బాడీ షేక్‌ అయిపోయేది. అప్పట్లో ప్రతి సినిమాలో ఓ క్లబ్‌ సాంగ్‌ ఉండేది. దానిలో నటించేందుకు ఇంగ్లీష్‌వాళ్లను తీసుకొచ్చేవారు. వారు డ్రమ్స్‌, గిటార్‌ మొదలైనవి వాయించేవారు. నేను పనిచేసే ప్రెస్‌కు పక్కనే షూటింగ్‌ జరుగుతుండటంతో చూడటానికి వెళ్లేవాడిని. వాళ్లు ఆ వాయిద్యాలను వాయిస్తుంటే నాకు డ్యాన్స్‌ చేయాలనిపించేది. ఆ సమయంలో ఎంవీ రామన్‌ అనే దర్శకుడు జెమినీ గణేశన్‌, సావిత్రి ప్రధాన పాత్రల్లో ‘కొంచెం చిల్లంగే’ అనే తమిళ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాలో ఓ పాటకు డ్యాన్సర్లు కావాలని రాశారు. ఎవరో చెబితే ఆడిషన్స్‌కు వెళ్లి సెలక్ట్‌ అయ్యా. సినిమా వాళ్లు ఎవరెవరు ఉన్నారనేది అప్పుడే తెలిసింది. అప్పట్లో సినిమా అవకాశం రావడం చాలా కష్టం.

మీరు మొదట ఏ చిత్రానికి డ్యాన్స్‌ మాస్టర్‌గా చేశారు 
సుందరం మాస్టర్‌: ప్రముఖ హాస్యనటుడు నాగేష్‌గారు నన్ను కె.బాలచందర్‌కు పరిచయం చేశారు. అప్పుడు ఆయన ‘నీర్కుముళి’(1965) తీస్తున్నారు. నాగేష్‌గారు, బాలచందర్‌గారు, సంగీత దర్శకుడు కుమార్‌ వీళ్లందరికీ తొలి చిత్రమిది. ఆ సినిమా జనం మధ్య కూర్చొని చూశా. వాటిలో కథానాయకుడు వేసే స్టెప్స్‌కు 24సార్లు క్లాప్స్‌ కొట్టారు. అన్నీ లేటెస్ట్‌ స్టెప్‌లే. ఆ తర్వాత తంగప్ప మాస్టర్‌ వద్ద సహాయకుడిగా చేరా. అప్పుడే నాగేశ్వరరావుగారు, ఎన్టీఆర్‌గారు, శివాజీ గణేశన్‌గారు పరిచయం అయ్యారు. ఇక్కడ నేను మీకో విషయం చెప్పాలి. నేను మద్రాసు కొత్తగా వచ్చిన రోజుల్లో వాహినీ స్టూడియో ముందు నిలబడితే, అదుగో ఎన్టీఆర్‌.. ఇదిగో ఎంజీఆర్‌ అంటూ వాళ్లు వెళ్తుంటే చూసి సంబరపడిపోయిన వాళ్లలో నేనూ ఒకడిని.

మీరు చెన్నైకి వచ్చేటప్పుడు ఓ హోటల్‌లో దొంగతనం చేసి వచ్చారట! ఏంటా కథ! 
సుందరం మాస్టర్‌: (నవ్వులు) ఇప్పుడు ఆ విషయాలు చెబితే నా పిల్లలు ఏమనుకుంటారు. అప్పట్లో ఓ హోటల్‌లో పనిచేసేవాడిని. డబ్బు కొట్టేసి సినిమాలకు వెళ్లేవాడిని. అలా ‘పాతాళభైరవి’ ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు.

నేను అలా చెప్పుంటే ప్రకాష్‌రాజ్‌ ఉండేవాడు కాదు! 

చిన్నప్పుడు స్కూల్‌ వెళ్లమంటే వెళ్లేవాళ్లు కాదట! 
సుందరం మాస్టర్‌: నేను చాలామంది పెద్ద పెద్ద దర్శకులతో, చదువుకున్న దర్శకులతో పనిచేశా. వాళ్లకి ఇంగ్లిష్‌ మాట్లాడటం వచ్చు. నాకు కనీసం సంతకం పెట్టడం కూడా రాదు. రెండో తరగతి వరకే చదివాను. ఒకటి తరగతి చదివిన తర్వాత అందరినీ రెండో తరగతికి వెళ్లమన్నారు. కానీ, నన్ను మాత్రం పంపలేదు. ఎందుకని అడిగితే, ‘నీకు అక్షరం ముక్కరాదు. రెండో తరగతికి వెళ్తావా’ అని టీచర్‌ తిట్టింది. చాలా బాధనిపించింది. కానీ, ఒకవేళ నేను చదువుకుని ఉంటే ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌, జయలలిత వంటి గొప్పవాళ్లకు డ్యాన్స్‌ మాస్టర్‌గా చేసే అవకాశం వచ్చేది కాదేమో!

మీరు మాస్టర్‌ అయిన తర్వాత మీ ముగ్గురు పిల్లలను ఏం చదివించారు? 
సుందరం మాస్టర్‌: నాలాగా నా బిడ్డలు అవ్వకూడనుకున్నా. నా పిల్లలను ఫారెన్‌ పంపి చదివించమని కమల్‌హాసన్‌ వంటి పెద్ద నటులు కూడా సలహా ఇచ్చారు. ప్రభుదేవాకు కాలేజ్‌లో సీటు దొరకలేదు. వచ్చి ఇంట్లో పడుకున్నాడు. ఏంటి సంగతి అని అడిగితే విషయం చెప్పాడు. అప్పుడు మణిరత్నం ‘మౌనరాగం’ సినిమా చేస్తున్నారు. ఆరుగురు డ్యాన్సర్లలో ఒకరు రాలేదు. దాంతో నాతో పాటు ప్రభును వూటీకి తీసుకెళ్లా. అప్పటివరకూ ప్రభు షూటింగ్‌కు వచ్చింది లేదు. అయితే, ఆ పాటలో అతని డ్యాన్స్‌ను అందరూ మెచ్చుకున్నారు. అలా ప్రభుదేవా కెరీర్‌ ప్రారంభమైంది. రాజుకు సినిమాలు ఇష్టంలేదు. కానీ, ముగ్గురు పిల్లలకు డ్యాన్స్‌ నేర్పించా. వారికి క్లాసికల్‌ తెలుసు. ఎందుకంటే నేను ఇండస్ట్రీని నమ్ముకున్నా. ఇక్కడ మీకో సీక్రెట్‌ చెప్పాలి. నాకు అసలు డ్యాన్స్‌ తెలియదు. ‘పారిస్‌ బై నైట్‌’, ‘లండన్‌ బై నైట్‌’ సినిమాలు చూసి స్ఫూర్తి పొంది నాకు నేనుగా నేర్చుకున్నా. లోకమంతా నన్ను గొప్ప డ్యాన్స్‌ మాస్టర్‌ అనుకుంటోంది. మరి నాకేమో సరిగా డ్యాన్స్‌ రాదని లోపల గిల్టీ ఫీల్‌ ఉండేది. నాలాగా నా పిల్లలకు కాకూడదని వాళ్లకు క్లాసికల్‌ నేర్పించా.

డ్యాన్స్‌ గురించి తెలియకుండా 1200 సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారా? 
సుందరం మాస్టర్‌: అదేంటో తెలియదండీ! దేవుడిచ్చిన వరం. సంగీతం వినిపిస్తే, దానిలో లీనమైపోతా. ఒక్కో మాస్టర్‌కు ఒక్కో టెక్నిక్‌ ఉంటుంది. నాకు మాత్రం గ్రేస్‌+ఎక్స్‌ప్రెషన్‌ ఉంటే చాలు.

నేను అలా చెప్పుంటే ప్రకాష్‌రాజ్‌ ఉండేవాడు కాదు! 

మిలటరీలోకి వెళ్దామనుకున్నారట! 
సుందరం మాస్టర్‌: 1962లో గ్రూప్‌ డ్యాన్స్‌ దాదాపు కనుమరుగైపోయింది. అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో భారత్‌-చైనా యుద్ధం జరుగుతోంది. ఆర్మీలో పనిచేయడానికి సైనికులు కావాలని పేపర్‌లో ప్రకటన వచ్చింది. అప్పుడు కైలాసం అనే వ్యక్తి నాతో ఉండేవాడు. ఒకసారి ‘ఎందుకు రా ఇక్కడ ఆకలితో చచ్చేది. వెళ్లి మిలటరీలో చేరదాం. కనీసం దేశం కోసమైనా చావొచ్చు’ అన్నా. ‘మొదట నువ్వు వెళ్లు. తర్వాత నేను వస్తా’ అన్నాడు. వాడు రాడని అర్థమైపోయింది. నేను మొండిగా ఆర్మీ ఆఫీస్‌కు వెళ్లా. సెలక్ట్‌ అయ్యా కూడా. శిక్షణ కోసం బెంగళూరు పంపిస్తామన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ జ్ఞాపకం వచ్చింది. ఏడుస్తూనే ఉన్నా. ఎందుకంటే ఆర్మీలోకి వెళ్తే తిరిగి రాడని అప్పట్లో అందరూ అనుకునేవారు. అలా ఏడుస్తూ ఇంట్లో పడుకుంటే అర్ధరాత్రి 1.30గంటకు నటరాజ్‌ అనే సినిమా ఏజెంట్‌ మా ఇంటికి వచ్చి, ‘రేపు గీతాకృష్ణ మాస్టర్‌ వస్తున్నారు. సెలక్షన్స్‌ ఉన్నాయి. జెమిని స్టూడియోకు రా’ అన్నాడు. సరేనని వెళ్తే, 30మంది వచ్చారు. ఎంపికైన వాళ్లలో నేను రెండో వాడిని. రూ.300 ఇచ్చారు. నా జీవితం మారిపోయింది.

మీరు నిర్మాతగా ఏదైనా సినిమా తీశారా? 
సుందరం మాస్టర్‌: ప్రసాద్‌ హీరోగా ‘మనసంతా నువ్వే’ కన్నడలో తీశా. కొత్తవాడినని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. నేనే మూడుచోట్ల సొంతంగా విడుదల చేశా. మంచి టాక్‌ వచ్చిన తర్వాత చాలా మంది కొనడానికి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ మరోసారి సినిమా తీయలేదు.

మీ ముగ్గురు పిల్లల్లో మీ ఓటు ఎవరికి? 
సుందరం మాస్టర్‌: మీ శరీరంలో ఏ భాగం కావాలంటే ఏం చెబుతారు? అందరూ బాగా చేసేవాళ్లే కాదా! నాకు ఇన్స్‌ప్రేషన్‌ ప్రభుదేవా.

మీకు ఏ కొరియోగ్రాఫర్‌తోనైనా గొడవలు వచ్చాయా? 
సుందరం మాస్టర్‌: ఎలాంటి గొడవలు లేవు. నా పనేదో నేను చేసుకుని వెళ్లిపోతా.

మీరు చాలా సినిమాల్లో నటించారు కదా! 
సుందరం మాస్టర్‌: మీరు నవ్వనంటే మీకో విషయం చెబుతా. ‘బాగ్దాద్‌ థ్రిల్లర్‌’ అనే చిత్రం కోసం నన్ను సెలక్ట్‌ చేశారు. ఆ సినిమాలో ఎంజీఆర్‌, వైజయంతి మాల హీరో హీరోయిన్లు. ఆఫీస్‌లో టెస్టు కూడా చేశారు. అంతా ఒకే అనుకున్నారు. గోల్డెన్‌ స్టూడియోలో షూటింగ్‌. ‘రెడీ టేక్‌.. యాక్షన్‌’ అని క్లాప్‌ కొట్టారు. నేనేమో ‘ఏమన్నారు’ అని తెల్ల ముఖం వేశారు. క్లాప్‌ కొడితే నాకు నోట మాటరాలేదు. 400మంది జూనియర్‌ ఆర్టిస్టులు చూస్తున్నారు. 13 టేక్‌లు తీసుకున్నా. అయినా, చేయలేకపోయా. ఆ డైలాగ్‌ అప్పుడు చెప్పి ఉంటే ఇప్పుడు ప్రకాష్‌రాజ్‌ అనే నటుడు ఉండేవాడు కాదు. ఆ తర్వాత ఎవరు వేషం ఇస్తామన్నా.. వద్దని దండం పెట్టేవాడిని.

నేను అలా చెప్పుంటే ప్రకాష్‌రాజ్‌ ఉండేవాడు కాదు! 

‘గీతాంజలి’కి మీరే కొరియోగ్రాఫర్‌ కదా! ‘ఓం నమః...’ పాట అలా తీయాలన్న ఆలోచన ఎవరిది? 
సుందరం మాస్టర్‌: మణిరత్నంగారిదే. ఆ సినిమాలో ఓ పాటలో కూడా కనిపిస్తా.

‘అబ్బనీ తీయ్యని దెబ్బ’ పాటకు కొరియోగ్రఫీ ఎలా చేశారు. 
సుందరం మాస్టర్‌: సినిమా ఏదైనా ఒప్పుకొంటే ముందు నటీనటులు ఎవరనేది తెలుసుకుంటాం. శ్రీదేవిలాంటి నటి ఉంటే భయపడక్కర్లేదు. చేసుకుంటూ వెళ్లిపోతారు. ‘మీరు ఏ మూమెంట్‌ అనుకున్నారో అదే చేసేయండి’ అని అనేది ఆవిడ. చిరంజీవి అంటే మాస్‌ స్టెప్‌లు ఉండాలి. అలాంటిది ‘కొండవీటి దొంగ’ చిత్రంలోని ‘ఛమకు ఛమకు ఛాం.. పట్టుకో ఛాన్స్‌ దొరికెలా హొయ్యా’ పాటకు సింపుల్‌ స్టెప్స్‌ వేయించాం. ‘కొత్తగా ఉంది. మంచి హిట్‌ అవుతుంది’ అని దర్శకుడు కోదండరామిరెడ్డి మెచ్చుకున్నారు. అలాగే అది మంచి హిట్‌ అయింది.

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లలో బెస్ట్‌ డ్యాన్స్‌ ఎవరు? 
సుందరం మాస్టర్‌: నేను బాగుండటం మీకు ఇష్టం లేదా? అందరూ వాళ్ల వాళ్ల స్టైల్‌ వారు బాగా చేస్తారు.

మీరు కొరియోగ్రఫీ చేసిన వాటిలో మర్చిపోలేని పాట ఏది? 
సుందరం మాస్టర్‌: ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’

ప్రభుదేవాకు ఏవైనా సలహాలు ఇస్తారా? 
సుందరం మాస్టర్‌: అప్పట్లో ‘అప్పాజీ ఆ షాట్‌ ఇలా తీయొచ్చా? అలా తీయొచ్చా’ అని అడిగేవాడు. ‘నువ్వు సొంతంగా ఆలోచించి నీ నిర్ణయం నువ్వు తీసుకో. అదే నీకు మంచిది’ అని అనేవాడిని

నేను అలా చెప్పుంటే ప్రకాష్‌రాజ్‌ ఉండేవాడు కాదు! 

మీరు జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా? 
సుందరం మాస్టర్‌: నాకో చెడ్డ అలవాటు ఉంది. గుర్రం పందేలు ఆడేవాడిని. ఒకరోజు నేను బెంగళూరు వెళ్తుంటే నా భార్య అడ్డుకుంది. ఆమెను కాదని, వెళ్లా. అక్కడికి వెళ్లాక ఫోన్‌. ‘మీ భార్య పరిస్థితి విషమంగా ఉంది’ అని చెప్పారు. 50నిద్ర మాత్రలు మింగేసింది. అప్పుడు మూడో వాడు ప్రసాద్‌ కడుపులో ఉన్నాడు. ఎలాగైనా భార్య, బిడ్డను బతికించమని డాక్టర్లను వేడుకున్నారు. పెద్ద ప్రాణాన్నే బతికిస్తామని అన్నారు. దేవుడి దయవల్ల ఇద్దరూ బతికారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.