close

తాజా వార్తలు

ఇక అందరూ నిర్దోషులే! 

నకిలీ స్టాంపు పత్రాల కుంభకోణం 
తెల్గీ మరణంతో నిజాలు భూస్థాపితం

ఇక అందరూ నిర్దోషులే! 

కొన్ని కథలకు ముగింపు ఉండదు. ఏవో కారణాల వల్ల కథ ముందుకు కదలక నిలిచి పోతుందంతే. బోగస్‌ స్టాంపు పత్రాల కుంభకోణంలో ప్రధాన పాత్రధారి అబ్దుల్‌ కరీం తెల్గీ కథకు మృత్యువే ముగింపు పలికినా, పలువురు కీలక నిందితుల కథ మాత్రం కంచికి చేరలేదు. తెల్గీ 30 ఏళ్ల కారాగార శిక్ష అనుభవిస్తూ తీవ్ర అనారోగ్యం వల్ల 2017లో బెంగళూరులో మరణించాడు. అతడి తోడుదొంగలైన కొందరు రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, పోలీసు సిబ్బంది మాత్రం సరైన సాక్ష్యాలు లేక శిక్షల నుంచి తప్పించుకున్నారు. తాజాగా మహారాష్ట్రలో నాసిక్‌ సెషన్స్‌ కోర్టు కూడా సరైన సాక్ష్యాలు లేవంటూ కొందరు భద్రతా సిబ్బందిని దోషవిముక్తుల్ని చేసింది. నాసిక్‌లోని ప్రభుత్వరంగ ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌ (ఐఎస్పీ)లో ముద్రితమయ్యే స్టాంపు పత్రాలను రైల్వే రక్షణ (ఆర్పీఎఫ్‌) సిబ్బంది పహరాలో రైల్వేస్టేషన్‌కు చేరవేస్తుంటారు. ఆ సమయంలో కొన్ని స్టాంపు పత్రాలను ఆర్పీఎఫ్‌వారు తస్కరించి తెల్గీకి అమ్మినట్లు సీబీఐ అభియోగం. ఈ కేసులో 49మంది సాక్షులను విచారించిన సెషన్స్‌ కోర్టు, సీబీఐ తగు సాక్ష్యాధారాలను చూపలేకపోయిందంటూ తెల్గీని, ఆర్పీఎఫ్‌వారిని దోషవిముక్తుల్ని చేసింది.

ఆది నుంచీ అంతే... 
మొదట్లో ముంబయి పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌.ఎస్‌.శర్మ పేరు తెల్గీ కేసులో ప్రముఖంగా వినిపించేది. ఆ రోజుల్లో ఆయన్ను అతిపెద్ద చేపగా పత్రికలు వర్ణించాయి. శర్మ పదవీ విరమణ చేసిన మరుసటి రోజే స్టాంప్‌ కేసు దర్యాప్తు బృందం ఆయన్ను అరెస్టు చేయడం పెను సంచలనమైంది. ఇంకేముంది, డొంక అంతా కదలిపోతుందని విశ్లేషణలు వినిపించాయి. చివరకు ఓ ముంబయి కోర్టు శర్మ మీద సాక్ష్యాధారాలు లేవంటూ 2013లో ఆయన్ను విడిచిపెట్టింది. తెల్గీ నార్కో విశ్లేషణలో, ముంబయి మాజీ పోలీసు అధికారి దిలీప్‌ నాయక్‌ పాలీగ్రాఫ్‌ పరీక్షలో శర్మ పేరు పదేపదే ప్రస్తావనకు రావడంతో ఆయనపై విచారణ నడచినా, ఈ పరీక్షా ఫలితాలను కోర్టు గట్టి సాక్ష్యంగా పరిగణించలేదు. నిఖార్సైన అధికారిగా పేరున్న శర్మ పేరును ఉద్దేశపూర్వకంగా పత్రికలకు పొక్కించి ఆయన ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూశారని కొందరు భాష్యం చెప్పారు. అసలు నార్కో, పాలీగ్రాఫ్‌ పరీక్షలు కోర్టులో నిలబడవని పదేపదే నిరూపితమవుతున్నా దర్యాప్తు సంస్థలు, ఏలినవారు ఈ పరీక్షలను తమకు గిట్టనివారిని దెబ్బతీసే ఆయుధంగా ప్రయోగిస్తున్నారన్న విమర్శ ఉంది. రూ.32 వేల కోట్ల విలువైన స్టాంపుల కుంభకోణంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, పోలీసు అధికారులకు ప్రమేయం ఉందని మొదటి నుంచీ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా పనిచేసిన ఛగన్‌ భుజ్‌బల్‌ దర్యాప్తు ప్రక్రియకు గండి కొట్టి తెల్గీని కాపాడాలని చూసినట్లు ప్రతిపక్షాల అభియోగం. 25 ఏళ్లు శివసేనలో ఉండి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) లోకి మారిన భుజ్‌బల్‌తో పాటు, ఆ పార్టీ అధినేత శరద్‌ పవార్‌కూ ముడుపులు ముట్టజెప్పానని తెల్గీ నార్కో పరీక్షలో చెప్పాడు. తరవాత కోర్టుకు ఇచ్చిన సాక్ష్యంలో పవార్‌, భుజ్‌బల్‌ పేర్లను తెల్గీ ప్రస్తావించనే లేదు. రాష్ట్ర సిట్‌ నుంచి దర్యాప్తును స్వీకరించిన సీబీఐ తన ఛార్జిషీటులో భాజపా ఎమ్మెల్యే అనిల్‌ గోటే, మాజీ పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌.ఎస్‌.శర్మల పేర్లను చేర్చింది. దాంతో పవార్‌, భుజ్‌బల్‌ల మీదా నార్కో పరీక్షలు చేయించాలని గోటే డిమాండ్‌ చేశారు. తరవాత అక్రమ ధన చలామణీ కేసులో అరెస్టయిన భుజ్‌బల్‌కు నిరుడు బెయిలు లభించగా, గోటే కూడా తెల్గీ కేసులో బెయిలుపై విడుదలయ్యారు. మరికొందరు నిందితులూ కేసుల నుంచి పూర్తిగా విముక్తులయ్యారు. సాక్షాత్తు స్టాంప్‌ కేసు దర్యాప్తు బృందం సభ్యుడైన అసిస్టెంట్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ దిలీప్‌ కామత్‌, తెల్గీ అనుచరుడైన అహ్మద్‌ తుర్క్‌లనూ సాక్ష్యాలు లేక 2016లో విడిచిపుచ్చారు. మొత్తం మీద ప్రధాన పాత్రధారి తెల్గీ వెనక ఉన్న సూత్రధారులు ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే ఉన్నారు. 18 రాష్ట్రాలు, 70 నగరాల్లో విస్తరించిన తెల్గీ ముఠా 350 మంది ఏజంట్ల ద్వారా బోగస్‌ స్టాంపు పత్రాలను విక్రయించింది. ఈ భారీ కుంభకోణం అధికార స్థానాల్లో ఉన్నవారి సహకారం లేకుండా జరిగి ఉండేదా? వారి గుట్టుమట్లన్నీ తెల్గీ మరణంతో భూస్థాపితమైనట్లే!

కర్ణాటకలోని ఖానాపూర్‌లో 1980లలో పల్లీలు అమ్ముకుని జీవించిన తెల్గీ 1990లలో నకిలీ స్టాంపుల విక్రేత అవతారమెత్తి కోట్లకు పడగలెత్తాడు. మొదట తెల్గీ రద్దయిన స్టాంపు పత్రాలపై గుర్తులను ప్రత్యేక రసాయనంతో చెరిపేసి, కొత్త పత్రాలంటూ తగ్గింపు ధరలకు విక్రయించేవాడు. మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఏజంట్లను నియమించి ఇండియన్‌ ఆయిల్‌, ఎల్‌.ఐ.సి. వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ పత్రాలను విక్రయించాడు. 50 బ్యాంకులు, బహుళజాతి బీమా కంపెనీలు, 60 బడా ప్రైవేటు రంగ సంస్థలు, అంతే సంఖ్యలో బిల్డర్లు నకిలీ స్టాంపు పత్రాలు కొన్నారు. నకిలీల విక్రయానికి తెల్గీ నిరుద్యోగ పట్టభద్రులను నియమించాడు. వారు స్టాంపు పత్రాలు అవసరమయ్యే సంస్థలకు వెళ్లి గుమాస్తాలకు రెండు శాతం కమిషన్‌పై నకిలీలను విక్రయించేవారు. బేరాలు పెరిగిపోవడంతో పాత స్టాంపు పత్రాలను కొత్తవిగా మార్చడంకన్నా తానే నకిలీ పత్రాలను ముద్రించడం మేలని తెల్గీ నిశ్చయించాడు. నాసిక్‌కు చెందిన సింగ్‌ అనే వ్యక్తి ఐఎస్పీ అధికారులకు తెల్గీని పరిచయం చేశాడు. 1995-96లో ఐఎస్పీ వేలం వేసిన డజను ముద్రణ యంత్రాలను తెల్గీ ముంబయికి తరలించి నకిలీ స్టాంపు పత్రాల వ్యాపారాన్ని విస్తరించాడు. నాసిక్‌లోని ఐఎస్పీ ముద్రణాలయానికి ఇంకు, రసాయనాలు, స్టాంపు కాగితాలను సరఫరా చేసే గుజరాత్‌ సంస్థ నుంచే తానూ ఆ సామగ్రిని కొనేవాడు. స్టాంపు పత్రాల ప్లేట్లను అధికారుల నుంచి సంపాదించి డెన్మార్క్‌ నుంచి తెచ్చిన ప్లేట్‌ తయారీ యంత్రంతో మరిన్ని తయారు చేసేవాడు. వాటితో నకిలీ పత్రాలను ముద్రించి దేశం మీదకు వదిలేవాడు. ఇలా సంపాదించిన డబ్బుతో సినిమాలూ తీశాడు.

లొసుగులే శాపాలు 
తెల్గీ 2001లో అరెస్టయ్యాడు. వివిధ రాష్ట్రాల్లో 31 కేసులు దాఖలైనా, వాటిలో ఒక్కదానిలోనూ అతడికి శిక్ష పడలేదు. ప్రజలు, పత్రికల నుంచి వచ్చిన ఒత్తిళ్ల వల్ల మహారాష్ట్ర ప్రభుత్వం తెల్గీ కేసు దర్యాప్తు తీరుపై విచారణకు పోలీసు ఉన్నతాధికారి జైశ్వాల్‌ నాయకత్వంలో ప్రత్యేక కార్యాచరణ దళాన్ని నియోగించింది. అన్నా హజారే జోక్యం కేసు ముందుకు కదలడానికి దోహదం చేసింది. చివరకు 2006లో తెల్గీ, అతడి సహచరులకు 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. 2007లో మరో కేసులో 13 ఏళ్ల జైలుశిక్ష విధించారు. 13 ఏళ్ల జైలు జీవితం తరవాత అనారోగ్యం వల్ల తెల్గీ మరణించాడు. కానీ, అతడి వెనక ఉన్న పెద్ద తలలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. నకిలీ పత్రాలను తక్కువ రేట్లకు కొని లాభపడిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలూ నిక్షేపంగా ఉన్నాయి. వ్యక్తి నుంచి వ్యవస్థల వరకు ధనమే పరమావధిగా నైతిక విలువలకు నీళ్ళు వదలడం ఈ కుంభకోణానికి మూలకారణం. తెర వెనక, తెరపైన వేలకోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినవారు తమ నేరానికి మూల్యం చెల్లించనప్పుడు న్యాయ వ్యవస్థపై నమ్మకం సడలిపోతుంది. మన క్రిమినల్‌ న్యాయ వ్యవస్థలోని లొసుగులను ఇక్కడ ప్రస్తావించాలి. ఒక కేసు దర్యాప్తునకు పట్టే కాలమే ఎక్కువనుకుంటే అంతకు ఏడెనిమిది రెట్లు ఎక్కువ సమయం విచారణకు పడుతోంది. ఈ లోపల దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూటర్లు, జడ్జీలూ మారిపోతుంటారు. ఈ వ్యవధిలోనే ధనబలం, కండ బలం, రాజకీయ బలం ఉన్న నేరస్తులు తిమ్మిని బమ్మి చేసి శిక్ష పడకుండా తప్పించుకొంటున్నారు. అందుకే భారత్‌లో అవినీతి కేసుల్లో శిక్ష పడేవారి శాతం నాలుగుకు మించడం లేదు. ఈ దుస్థితిని అధిగమించాలంటే నేర న్యాయ వ్యవస్థను సంస్కరించాలి. జస్టిస్‌ మలీమత్‌ కమిటీ, సుప్రీంకోర్టు చెప్పినట్లు పోలీసు సంస్కరణలు తీసుకొచ్చి, నేర దర్యాప్తును ఇతర శాంతిభద్రతల విధుల నుంచి వేరు చేయాలి.

- వరప్రసాద్‌

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.