close

తాజా వార్తలు

23ఏళ్లు పనిచేశాడు.. రూ.45లక్షలు కాజేశాడు! 

యజమాని ఇంటికే కన్నం వేసిన డ్రైవర్‌ 
ఒకేరోజులో పట్టుకున్న రాయదుర్గం పోలీసులు

23ఏళ్లు పనిచేశాడు.. రూ.45లక్షలు కాజేశాడు! 

రాయదుర్గం, న్యూస్‌టుడే: 23ఏళ్లుగా నమ్మకంగా డ్రైవర్‌గా పనిచేశాడు.. యజమాని ఎలాంటి సంకోచం లేకుండా ఇంటి తాళాలూ ఇచ్చి వెళ్లేంత నమ్మకం పొందాడు.. చివరికి.. డబ్బులు చూసి అతడే నమ్మక ద్రోహం చేశాడు... ఏకంగా రూ.45లక్షలు తస్కరించాడు.. తరువాత కూడా ఏమీ తెలియనట్లు విధులు కొసాగిస్తున్నాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తమదైన శైలిలో ఆరా తీయగా విషయం వెలుగుచూసింది. యజమాని ఇంటికే కన్నం వేసిన ఓ డ్రైవరును రాయదుర్గం పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం ఇన్‌స్పెక్టర్‌ ఎం.రాంబాబు, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాయదుర్గం విస్పర్‌ వ్యాలీకి చెందిన అనుమూరి కృష్ణ ప్రసాద్‌ లింక్‌వెల్‌ టెలిసిస్టమ్‌ సంస్థకు ఎండీగా ఉన్నారు. ఆయన వద్ద కుత్బుల్లాపూర్‌ మండలం రాఘవేంద్రకాలనీ ప్రాంతంలో నివసించే కుంట బాలరాజు(43) 23 ఏళ్లుగా డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఇటీవల కృష్ణప్రసాద్‌ తన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన రూ.45లక్షల నగదును పడక గదిలోని బీరువాలో ఉంచారు. కొంతకాలంగా ఆ గదిలో మరమ్మతులు చేపడుతున్నారు. పనులను పర్యవేక్షించాలని డ్రైవరుకు సూచించి ఆయన బయటికి వెళ్లేవారు. ఇదే అదునుగా అతడు ఈనెల 4వ తేదీన రూ.25 లక్షలు, ఆ తర్వాత 8వతేదీన మరో రూ.20 లక్షలు తస్కరించాడు. బుధవారం రాత్రి ఆయన బీరువాను పరిశీలించగా డబ్బులు కనిపించలేదు. దీంతో గురువారం ఉదయం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఐ విజయ్‌కుమార్‌, సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో పనిచేస్తున వారందరినీ విచారించినా ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం యజమాని, కుటుంబ సభ్యులు డబ్బులు చోరీకి గురైన విషయం, పోలీసులకు ఫిర్యాదు చేయడంపై చర్చించుకుంటుండగా.. అప్పటికే విధులకు వచ్చిన బాలరాజు విని అక్కడి నుంచి జారుకున్నాడు. దీంతో పోలీసులు బాలరాజును అనుమానించి అతడి ఇంటివెళ్లారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించాడు. నిందితుడు తన ఇంట్లోని బీరువాలో దాచిన రూ.45లక్షల నగదును పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. యజమాని తన బీరువాలోని లాకర్‌కు న్యూమరిక్‌, బయోమెట్రిక్‌ విధానంలో భద్రంగా తాళం వేసే వీలున్నా బాలరాజుపై ఉన్న నమ్మకంతో అలా చేయలేదు. ఆ నమ్మకాన్ని వంచించి నిందితుడు నగదు చోరీ చేశాడని డీఐ చెప్పారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.