close

తాజా వార్తలు

రివ్యూ: ఎఫ్‌2(ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)

రివ్యూ: ఎఫ్‌2(ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)

చిత్రం: ఎఫ్‌2(ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)
నటీనటులు: వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ, బ్రహ్మాజీ, రఘుబాబు, అన్నపూర్ణ, వై.విజయ, నాజర్‌ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
ఎడిటింగ్‌: బిక్కిని తమ్మిరాజు
నిర్మాత: దిల్‌రాజు
దర్శకత్వం: అనిల్‌ రావిపూడి
సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
విడుదల: 12-01-2019
‘పటాస్‌’, సుప్రీమ్‌, ‘రాజా ది గ్రేట్‌’ ఈ మూడు చిత్రాలు చాలు దర్శకుడిగా అనిల్‌ రావిపూడి టేకింగ్‌ ఏంటో! ప్రేక్షకులను కితకితలు పెడుతూనే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోలికి పోకుండా హీరోయిజాన్ని ఎలివేట్‌ చేయడం ఎలాగో ఆయనకు తెలుసు. ఇక కామెడీ టైమింగ్‌లో వెంకటేష్‌ గురించి వేరే చెప్పనక్కర్లేదు. తన 30ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అలాంటి పాత్రలెన్నో చేశారు. మరి వీరిద్దరికీ యువ కథానాయకుడు వరుణ్‌ తేజ్‌ కూడా కలిస్తే ఆ ఫన్‌ రెండింతలవుతుంది. కానీ, తమన్నా, మెహరీన్‌లను పెళ్లి చేసుకున్న తర్వాత ఫన్‌ పోయి ఫ్రస్ట్రేషన్‌ ఎలా వచ్చింది? ఆ ఫ్రస్ట్రేషన్‌లో వాళ్లు ఏం చేశారు? సంక్రాంతి అలుళ్లకు ఎదురైన అనుభావాలేంటి? చూడాలంటే ‘ఎఫ్‌2’కు వెళ్లాల్సిందే!

క‌థేంటంటే:  హారిక‌(త‌మ‌న్నా), హ‌నీ(మెహ‌రీన్‌) అక్కా చెల్లెళ్లు. వెంకీ (వెంక‌టేష్‌) ఒక ఎమ్మెల్యే ద‌గ్గ‌ర పీఏగా ప‌నిచేస్తుంటాడు. హారిక‌ను పెళ్లి చేసుకుంటాడు. అప్పటివ‌ర‌కూ సాఫీగా సాగిపోతున్న వెంకీ జీవితం పెళ్లితో ఒక్క‌సారిగా మారిపోతుంది. భార్య‌, అత్త వెంకీని త‌మ చెప్పు చేత‌ల్లో పెట్టుకునేందుకు య‌త్నిస్తుంటారు. వ‌రుణ్ యాద‌వ్‌(వ‌రుణ్‌తేజ్‌) హ‌నీని ఇష్ట‌ప‌డ‌తాడు. అప్ప‌టికే అత్తింటి ప‌రిస్థితులు అర్థ‌మైన వెంకీ.. హ‌నీని పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని వ‌రుణ్‌యాద‌వ్‌ను హెచ్చ‌రిస్తాడు. ప్రేమ మ‌త్తులో వ‌రుణ్‌కు ఇవేవీ ప‌ట్ట‌వు. చివ‌ర‌కు హ‌నీని పెళ్లి చేసుకుంటాడు. అప్ప‌టి నుంచి అక్కాచెల్లెళ్ల ఆధిప‌త్యానికి తోడ‌ళ్లులు న‌లిగిపోతుంటారు. మీరిద్ద‌రూ ఎక్క‌డికైనా వెళ్లిపోండ‌ని, అప్పుడే అక్కాచెల్లెళ్లకు మీ విలువ తెలిసి వ‌స్తుంద‌ని, ప‌క్కింటి వ్య‌క్తి(రాజేంద్ర‌ప్ర‌సాద్‌) ఈ తోడ‌ల్లుళ్లకు స‌ల‌హా ఇస్తాడు. దీంతో ఇద్ద‌రూ యూర‌ప్ వెళ్తారు. అయితే, వెంకీ.. వ‌రుణ్‌ల‌తో పాటు, హారిక‌.. హ‌నీలు కూడా యూర‌ప్ వెళ్తారు. వీరంద‌రూ ప్ర‌కాష్‌రాజ్ ఇంట్లో తిష్ట వేస్తారు. ఇంత‌కీ వీళ్లు యూర‌ప్ ఎందుకు వెళ్తారు? ప‌్ర‌కాష్‌రాజ్ ఇంట్లోనే ఎందుకు దిగార‌న్న‌ది అస‌లు క‌థ‌. చివ‌ర‌కు పెళ్లాల‌ మనసు మార్చారా?  లేక వీళ్లే మారిపోయారా? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే!

రివ్యూ: ఎఫ్‌2(ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)

ఎలా ఉందంటే:  ఇద్ద‌రు భార్య బాధితుల జీవితాలు ఎలా ఉంటాయి? ఆ ఇంట్లో ఎలాంటి వినోదం పుడుతుంది? అన్న‌దాని నుంచే పుట్టింది ఈ సినిమా. ద‌ర్శ‌కుడు ముందు నుంచీ ఇది భార్య బాధితుల సినిమా అని చెబుతూనే ఉన్నాడు. వారు ప‌డే ఇబ్బందుల నుంచి ఫ‌న్ ఎలా పుట్టుకొచ్చింద‌నేది సినిమాలో చూపించాడు. ప్ర‌తి ఇంట్లోనూ జ‌రిగే విష‌యాలే స్క్రీన్‌పై క‌నిపిస్తాయి. ‘నువ్వు నాకు న‌చ్చావ్‌’, ‘మ‌ల్లీశ్వ‌రీ’లాంటి చిత్రాల్లో వెంక‌టేష్ చేసిన పాత్ర‌లు మ‌ళ్లీ ఈ మ‌ధ్య కాలంలో చేయ‌లేదు. చాలా రోజుల త‌ర్వాత ఆ స్థాయి పాత్ర‌లో వెంక‌టేష్‌ను చూస్తాం. తొలి స‌గం పూర్తిగా వినోద ప్రాధాన్యంగా దర్శకుడు నడిపించాడు. ప్ర‌తి సీన్‌ను న‌వ్వుల‌తో పండించాడు. ప్ర‌తి పాత్ర‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. మెహ‌రీన్‌కు కూడా ఒక మేన‌రిజం ఇచ్చి, ఆ పాత్ర ప్ర‌త్యేకంగా క‌నిపించేలా చేశాడు. అత్తారింటిలో వెంక‌టేష్ చూపించే ఫ్ర‌స్ట్రేష‌న్ చూసి క‌చ్చితంగా న‌వ్వుకుంటారు. సందర్భోచిత కామెడీ రాసుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు విజ‌యం సాధించాడు.
ద్వితీయార్ధం మొత్తం యూర‌ప్ చుట్టూ తిరుగుతుంది. అయితే, ప్ర‌థ‌మార్ధంలో ఉన్న బ‌లం ద్వితీయార్ధంలో క‌నిపించ‌దు. కానీ, ఈ రెండు జంట‌లు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు మాత్రం కిక్ ఇస్తాయి. చివ‌రిలో నాజ‌ర్ పాత్ర ప్ర‌వేశించ‌డం కూడా క‌లిసి వ‌చ్చేదే. అక్క‌డ కూడా డైలాగ్‌లు చాలా బాగున్నాయి. మొత్తంగా ఇది ఒక ఫ‌న్ రైడ్ సినిమా. క‌థగా చెప్పాల్సి వ‌స్తే, ఇదేమీ గొప్ప క‌థ కాదు. గ‌తంలో ‘సంద‌డే సంద‌డి’, ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి!’ వంటి చిత్రాల ఛాయ‌ల్లోనే సాగుతుంది. సందేశాల జోలికి వెళ్ల‌కుండా, మరీ క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌వైపు ప‌రుగులు తీయ‌కుండా సున్నిత‌మైన వినోదాన్ని చ‌క్క‌గా ఆవిష్క‌రించాడు ద‌ర్శకుడు. అయితే, వినోదాన్ని పండించ‌డంలో కొన్ని చోట్ల శ్రుతి మించిన‌ట్లు అనిపిస్తుంది. పాత్ర‌లు కూడా కొన్నిసార్లు ఓవ‌ర్‌గా ప్ర‌వ‌ర్తిస్తున్నాయ‌నిపిస్తుంది. ఫ‌స్టాఫ్‌లో ఉన్న బిగి ద్వితీయార్ధంలో రాదు. అక్క‌డ‌క్క‌డా స‌న్నివేశాల‌ను పేర్చుకుంటూ వెళ్లిపోవ‌డంతో కాస్త సాగ‌దీత‌గా అనిపిస్తుంది. 

ఎవ‌రెలా చేశారంటే:  వెంక‌టేష్ చాలా కాలం త‌ర్వాత త‌న స్థాయికి త‌గ్గ వినోదం అందించే పాత్ర‌లో క‌నిపించారు. పాత చిత్రాల్లో వెంక‌టేష్ ఎలా న‌వ్వించారో ఈ సినిమాలో అలాగే న‌వ్వించారు. ఇద్ద‌రు తోడ‌ల్లుళ్ల ఫ్ర‌స్ట్రేష‌న్ అనే క‌న్నా, వెంక‌టేష్ ఫ్ర‌స్ట్రేష‌న్ అంటే బాగుంటుందేమో! ఎందుకంటే ఆయ‌న పాత్రే సినిమాలో హైలైట్‌. వ‌రుణ్ తేజ్ కూడా చ‌క్క‌గా న‌టించాడు. తెలంగాణ యాస‌లో మాట్లాడాడు. అయితే, ఆ యాస వ‌రుణ్‌కు కృత్రిమంగా అనిపించింది. త‌మ‌న్నా చాలా రోజుల త‌ర్వాత పూర్తి స్థాయి క‌థానాయిక‌గా క‌నిపించింది. మెహ‌రీన్ కూడా ప‌ర్వాలేద‌నిపించింది. ర‌ఘుబాబు, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌కాష్‌రాజ్‌, నాజ‌ర్‌లు ఇలా ప్ర‌తి పాత్ర న‌వ్వించ‌డానికి ఉద్దేశించిందే! అన్న‌పూర్ణ‌, వై.విజ‌య జోడీగా క‌నిపించి న‌వ్వులు పంచారు. 
ర‌చ‌యిత‌గా అనిల్‌రావిపూడి బాగా స‌క్సెస్ అయ్యాడు. త‌న బ‌లం వినోద‌మే. దాన్ని సాధ్య‌మైనంత‌వ‌ర‌కూ ప్ర‌తి సీన్‌లో పండించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. కానీ, ఎఫ్‌2 చాలా చిన్న క‌థ‌. తొలి స‌న్నివేశాల్లోనే మ‌న‌కు అర్థ‌మైపోతుంది. ట్విస్టులు, హంగుల‌వైపు వెళ్ల‌లేదు. మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కూ ఒకేలా ఉంది. దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం ప‌ర్వాలేదు. అయితే,  పాట‌లు అన్నీ ఆక‌ట్టుకోలేదు. యూర‌ప్‌లో తెర‌కెక్కించిన పాట మాత్రం బాగుంది. కెమెరా ప‌రంగా క‌ల‌ర్‌ఫుల్‌గా ఉందీ సినిమా. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

రివ్యూ: ఎఫ్‌2(ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)
 

బ‌లాలు
+ వెంక‌టేష్ కామెడీ
+ ప్ర‌థ‌మార్ధం
+ డైలాగ్‌లు, నిర్మాణ విలువ‌లు

 

బ‌ల‌హీన‌త‌లు
- ద్వితీయార్ధం
- పాట‌లు
- క‌థ‌

 

చివ‌రిగా: స‌ంక్రాంతి అల్లుళ్ల‌ సంద‌డి
గ‌మ‌నిక: ఈ స‌మీక్ష స‌మీక్ష‌కుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది స‌మీక్ష‌కుడి వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మే

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.