close

తాజా వార్తలు

ఆత్మీయ సంక్రాంతి!

‘పండుగ చేస్కో’ అనేది తెలుగునాట ఒక ఊతపదం. సంబరం, వేడుక వంటి సందర్భాలకు సరితూగే మాట అది. బతుకులో తీపిదనాన్ని ఆవిష్కరించే సాంస్కృతిక చిహ్నాలు పండుగలు. అటు ఆధ్యాత్మికపరమైన ఆచార సంప్రదాయాలకు ఇటు మనసులో ఉల్లాసానికి ఎంతో ఊతమిచ్చే ఉత్సాహపూరితమైన కలయికలకు నెలవులు పండుగలు. ‘పండువులు వచ్చునన్న శబ్దమ్ము విన్న పగులగొట్టిన గుమ్మడి పండునుండి చెదరిపడిన గింజలు ప్రోగు చేసికొనెడి వయసొకడు వచ్చి మనసును ఆశ్వాసపరుచు’ అన్నారు మహాకవి మధునాపంతుల. మనసును బాల్యం ఆవరించడం మనిషికి ఆనందదాయకం- ఎందుకంటే అది మనిషి చేజార్చుకొన్న అమూల్యమైన నిధి కనుక! అలా పోగొట్టుకొన్న ఎన్నింటినో వెతుక్కోవడానికే మనిషి పండుగ నెపంతో పల్లెలకు ప్రయాణం కడతాడు. ‘మనసుచే వాక్కుచేత కర్మంబు చేత కలుషితములు కాదగినట్టి తల్లిప్రేవు’లతో పోల్చి పల్లెసీమలను కవులు అభివర్ణిస్తారు. పండుగలకు పల్లెటూళ్లే పరమాద్భుత   వేదికలు. నగరాల్లోంచి సగానికి సగం జనాభా ఇళ్లకు తాళాలేసి    పల్లెబాట పట్టడాన్ని మనం ఈ కోణంలోంచే అర్థం చేసుకోవాలి. ‘వినుము ధనములు రెండు తెరగులు... ఒకటి మట్టిన పుట్టినది, వేరొకటి హృత్‌ కమలంపు సౌరభము’ అన్నారు గురజాడ. ఆ రెండు రకాల ధనాలు ఒక్కచోట జత పడితే అది స్వర్గసీమ అవుతుందనీ చెప్పారు. ఆ రెండింటికీ ఆస్కారం కల్పించేవి పల్లెటూళ్లే! మట్టినుంచి పుట్టే ధనం అంటే- పంట ధాన్యాలు. ‘తెలుగు మాన్యం’లో రాయప్రోలు ‘సస్యరమ’ అంటూ వర్ణించింది ఆ సస్యసంపదనే. ఆయన చెప్పినట్లు ‘ఇంపు లిగిర్చి ఫలించినట్టి ఉద్యానము పోల్కి సస్యరమ ఆడెడి వేదికలు’ అన్నప్పుడు మన గ్రామసీమలే గుర్తొస్తాయి... పాడిపంటలకు మన పల్లెలు అనువైన స్థావరాలు కనుక!

పల్లెటూళ్లలో అడుగుపెట్టగానే పేర్లతోనో హోదాలతోనో కాక, తియ్యని వరసలతో పరిమళించే పలకరింపులు చెవిన పడ్డప్పుడు, అలాగే గుమ్మంలోకి అడుగుపెట్టగానే ‘బాగున్నావా’ అంటూ బోసినోళ్లు విశాలంగా నవ్వి ఆప్యాయతను వర్షించినప్పుడు- గురజాడ చెప్పిన రెండో ధనం- హృదయకమల సౌరభం మనల్ని ఆలింగనం చేసుకుంటుంది. ‘ఏరోయ్‌’ అంటూ ఏకవచనం భుజం తట్టగానే గుబాళించే నేవళీకపు స్నేహ మాధుర్యం సరేసరి. ‘కలసినయంత మాత్రమున కాదు సుమీ చెలికారము! అంతరంబులను అతుకంగ జాలిన అపూర్వలంకెయె స్నేహమౌను’ అంటూ భావకవులు వేనోళ్ల కొనియాడిన అరమరికల్లేని బాల్య స్నేహపు పరమానందం పురివిప్పుకొని మట్టి వాసనలు వెదజల్లుతుంది. ‘చేతస్సుషమ’లో ఆవంత్స సోమసుందర్‌ కవి వర్ణించిన ‘చిరకాలమున ముసరు వార్షుకాభ్రము రీతి నరహృదయ సాగరము నర్తించె హర్షమున’ అన్న అపురూప భావం అనుభూతం అవుతుంది. కనీసం ఏడాదికోసారి ఆ అనుభూతికి జీవం పోయడానికే మనం పల్లెలకు   ఆసక్తిగా పరుగులు పెడతాం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే శుభఘడియల్లో ‘హేమంత వేళ నూతన సీమంతపు వధువు వోలె సింగారముగా’ సంక్రాంతి విచ్చేస్తుందని చెబుతారుగాని- మనిషి తనతో తాను సంగమించే అపురూప క్షణాలను, బాల్యమిత్ర మధుర సమాగమాలను, బంధుజన సంక్రమణలను మనం సంక్రాంతిగానే చెప్పుకోవచ్చు. ఊరుమ్మడి బతుకుల కమ్మని కలయికలే సంక్రమణాలు. ‘నా అనుగుం సఖా! చెలిమి నాటిన చిత్తమె ఆర్ద్రము... అందు ఆశాయతరంజనంబయి ప్రియం బెనయించిన ఆ దశల్‌’... చేజారి మిత్రులు చెల్లాచెదురైౖన కారణంగా ‘విడదీసిన రేకులపూవు చందమై పోయిన మైత్రి’లో తిరిగి నిండుదనాన్ని నింపడమే నిజమైన సంక్రాంతి. మనుషులను కలుసుకోవడం, కలుపుకుపోవడంలోనే సంక్రాంతి పరమార్థం ఇమిడి ఉంది. పండుగ అనే మాటకు నిజమైన అర్థం అదే!

బంధుమిత్ర సమాగమాలను సంక్రాంతులుగా చెప్పుకోవడానికి వీలుగా పురాణాలు బలమైన ఒక ఆధారం చూపించాయి. ‘కరి సరసిజ ముకుళము ఎత్తుగతి’... ఏనుగు తామరతూడును లేపినట్లుగా కృష్ణుడు ‘ఆ మహా శైలంబున్‌ వలకేల దాల్చి విపుల చ్ఛత్రంబుగా పట్టిన’... గోవర్ధనగిరిని గొడుగులా ఎత్తి పట్టుకున్నది సంక్రాంతి రోజుల్లోని కనుమనాడేనని పురాణాలు చెబుతున్నాయి. ‘రా తల్లి! రమ్ము తండ్రీ! వ్రేతలు గోపకులు రండు, వినుడీ కర్తక్ష్మాతలమున నుండుడు- గోవ్రాతముతో మీరు’ అంటూ అందరినీ చేరపిలిచాడు. ఒకచోటుకు చేర్చాడు. వారిని ఒక్కటి చేశాడు. ‘...గోపాలాంగనాపాంగ హాస రుచుల్‌ రత్న చయంబు కాగ అచల చ్ఛత్రంబు (కొండ గొడుగు) శోభిల్లె’ అని భాగవతం దశమస్కంధం వర్ణించింది. సూక్ష్మంగా ఆలోచిస్తే ఏటా మకర సంక్రాంతి చేస్తున్న పని అచ్చంగా అదే! మనుషులను కలుపుతోంది. సంక్రాంతి మనసులను అతుకుతోంది. ఎక్కడెక్కడో ఏవేవో రంగాల్లో స్థిరపడిన నాగరికులకు ‘మంజీర మణిరాజ పుంజాగత స్వచ్ఛ శింజాన మాధుర్య మంజిమములు, వేదాంత సంగీత విన్యాస మొకవంక, నొకవంక తాళంబులుల్లసిలగ...’ రకరకాల వృత్తులతో బతుకులీడ్చే జానపదులు వీనుల విందులు చేస్తూ ఆనందాల్ని పంచే అందమైన ఘట్టాలను సంక్రాంతి పండుగ మన పల్లెల్లో నిండుగా ఆవిష్కరిస్తుంది. మానవ జీవితపు మహా సంరంభాలన్నింటినీ మనోహరంగా ప్రదర్శించి, మనలో బెంగను రేకెత్తిస్తుంది. నిజానికివన్నీ మనిషికి మహాభాగ్యాలు. ‘కదిలి వచ్చెను భాగ్యాలకడలివోలె మకర సంక్రాంతిలక్ష్మి హేమంతవీధి’ అని తుమ్మలవారు చెప్పింది ఆ సిరిసంపదల గురించే. ఊరికే అన్నాడా శ్రీనాథ కవిసార్వభౌముడు సంక్రాంతిని ‘పెద్ద పండుగ’ అని!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.