close

తాజా వార్తలు

సేద్యం పండుగ అయ్యేదెప్పుడు? 

సంస్కరణలతోనే పల్లెల్లో వెలుగులు

సేద్యం పండుగ అయ్యేదెప్పుడు? 

పాడి పంటలతో సుసంపన్నం కావాల్సిన గ్రామసీమలు నేడు గత వైభవ చిహ్నాలుగా మిగులుతున్నాయి. రైతుల ఇంట పాడి వట్టిపోతోంది. నష్టాలతో అన్నదాతలు అప్పులపాలవుతున్నారు. సేద్య సంస్కరణలు రైతులకు మేలు చేస్తున్న దాఖలాలు లేవు. వ్యవసాయం దండుగ కాదు పండుగ అని నిరూపించే స్థాయికి పాలకులు ఎదగలేదు. పై పూతలతో తాత్కాలిక ఉపశమనం కల్పిస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారాలు చూపడం లేదు. మట్టిని నమ్ముకున్న రైతులు ఆ మట్టిలోనే కలిసిపోతుంటే వారికి చేదోడు వాదోడుగా ఉండాల్సిన వ్యవస్థలన్నీ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేద్యరంగానికి తమ పరిధిలో చేయూత ఇవ్వగలిగితేనే సాగుదారులకు మనుగడ.

కళ తప్పిన గ్రామాలు 
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా సగర్వంగా సేద్యం చేసే పరిస్థితులు లేవు. అప్పులు చేసైనా పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని రైతులు భావిస్తున్నారే తప్ప తమలాగా సేద్యం చేయాలని కోరుకోవడం లేదు. అధికార యంత్రాంగంలో అవినీతి, ఉత్పాదకాల సరఫరాలో మోసాలు, సహకార సంఘాల్లో రాజకీయ జోక్యం, గిట్టుబాటు కాని మద్దతు ధరలు, విపణి శక్తుల మోసాలు, సహకరించని ప్రకృతి- వెరసి... సాగుదారులకు వ్యవసాయంపై భరోసా లేకుండా చేస్తున్నాయి. ఈ పరిస్థితులన్నీ రైతుబిడ్డలకు సహజంగానే ఇబ్బందిగా మారుతున్నాయి. సేద్యం గిట్టుబాటు కాకపోతుండటంతో చదువుకుని ఉద్యోగాలు చేసుకోవడానికే అధిక శాతం రైతుబిడ్డలు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు రైతులు ఎంత కష్టానికైనా వెనకాడటం లేదు. నేడు నూటికి 90 శాతం రైతుబిడ్డలు ఉద్యోగాలకు వెళ్లిపోతుంటే కేవలం 10 శాతం మాత్రమే వ్యవసాయం చేస్తున్నారని ఒక అంచనా. ఫలితంగా గ్రామాల్లో వ్యవసాయం చేతులు మారుతోంది. కమతాల పరిమాణం మరింత తగ్గిపోతోంది. వారసత్వపు విభజన, కూలీనాలీ చేసుకునేవారు కొత్తగా సేద్యంలోకి దిగుతుండటం వల్ల చిన్న కమతాలు అధికమవుతున్నాయి. ఈ పోకడలు నేలల స్థితిగతుల్నీ నాశనం చేస్తున్నాయి. ఏటా ఖరీఫ్‌కు ముందు సొంత భూమికి పశువుల ఎరువు తోలే రైతుల స్థానే కౌలుదారులు రంగప్రవేశం చేశారు. నేల నుంచి తీసుకోవడమే కానీ నేలకు అందించే అలవాటు తగ్గి భూసారం క్షీణిస్తోంది. ఈ పోకడ దీర్ఘకాలంలో పంటల ఉత్పత్తి, ఉత్పాదకతను ప్రభావితం చేయనుంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు సగానికి పైగా భూమిని కౌలుదారులే సాగు చేస్తున్నారు. మొత్తంగా గ్రామాల్లో 90 శాతం వ్యవసాయదారుల్ని నష్టభయం వెంటాడుతోంది. గ్రామాల్లో పంటే కాదు, పాడి సైతం కనుమరుగవుతోంది. పాడిపంటలతో విలసిల్లాల్సిన గ్రామసీమలు వెలాతెలాపోతున్నాయి. ఇవి రెండూ జోడు గుర్రాల్లా స్వారీ చేసినంత కాలం రైతులింట డబ్బులకు కొదవ లేకుండేది. నేడు ప్రతిదానికీ రైతులు వెతుక్కోవాల్సి వస్తోంది. తరచుగా చేయి చాచాల్సి వస్తోంది. ఈ పరిణామాలన్నింటికీ మూలం- పాడి నిరాదరణకు గురికావడం, పంటల సాగు కలిసిరాకపోవడమే. పశుపోషణ నుంచి తప్పుకొని ఎందరో రైతులు పాలు సైతం కొనుక్కోవలసి వస్తోంది. ఈ పరిణామాలు గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి.

ఒకప్పుడు సంక్రాంతి వస్తోందంటే గ్రామసీమల్లో ఉండే కళే వేరు. ధాన్యపు రాశులు ఇంటికి చేరి అలికిన ముంగిళ్లతో పల్లెలు కొత్త శోభను సంతరించుకునేవి. నేడా పరిస్థితులు లేవు. ఇంటికి చేరాల్సిన ధాన్యం కళ్లాల్లోనే అప్పుల కింద జమ అవుతోంది. మమతలు పంచాల్సిన పల్లెలు అర్థంలేని పగలతో రగిలిపోతున్నాయి. అనుచిత రాజకీయాల ప్రవేశంతో రైతుల్లో ఐక్యత చెడింది. వారి మధ్య అగాధం పెరిగిపోతోంది. ఒకప్పుడున్న సహకార ధోరణి నేడు లేదు. అన్నదాతల ఇబ్బందులను అర్థం చేసుకుని విధాన నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో కనీసం రైతులకు మేలుచేసే చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. సాగుదారుల మేలు కోసం ఏవేవో చేస్తున్నామనే భ్రమలు కల్పించడం తప్ప- శాశ్వత ప్రాతిపదికన వారి కష్టాలు తీర్చే తరుణోపాయాలపై దృష్టి సారించడం లేదు. పైపై పూతలతో సేద్యానికి ఉపశమనం కల్పించడమే తప్ప రైతులు సగర్వంగా తలెత్తుకునే పరిస్థితులు కల్పించడం లేదు. పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న చేయూతతో పోలిస్తే రైతులకు చేస్తున్నది స్వల్పమే. వేల కోట్ల రూపాయల మేర ప్రజల డిపాజిట్లను కొల్లగొట్టి అవినీతిపరులైన పలువురు పారిశ్రామికవేత్తలు దేశాలు దాటిపోతున్నా పట్టించుకోని యంత్రాంగం పదివేల రూపాయలు బాకీపడిన రైతుల్ని మాత్రం వేధింపులకు గురిచేస్తోంది. ఇటువంటి అపసవ్య పోకడలతో సేద్యరంగాన్ని నిర్వీర్యం చేసి చివరకు రైతులు వాళ్లంతటవాళ్లే వ్యవసాయం నుంచి వైదొలగే పరిస్థితులు కల్పిస్తున్నారు. రైతు తనకు అన్నీ ఉచితంగా కావాలని కోరుకోవడం లేదు. రైతుల దీనస్థితికి కారణాలేమిటో అన్వేషించేందుకు ఎన్నో కమిటీలను నియమించినా వాటి సూచనలు అమలుకు నోచుకోవడం లేదు. వ్యవస్థాగతంగా సాగుదారులను పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటే రైతులకు ఏవీ ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్నేళ్లుగా ఇవన్నీ విస్మరించి పరిస్థితిని దుర్భరం చేశారు.

లాభాలకు ఇదీ మార్గం...

సేద్యం పండుగ అయ్యేదెప్పుడు? 

తెలుగు రాష్ట్రాల్లో ఎందరో అభ్యుదయ రైతులు సమీప పట్టణాల్లోని అపార్ట్‌మెంటు సంఘాలతో మాట్లాడి వాళ్లకు కావలసిన బియ్యం, కందులు, మినప్పప్పు, మిర్చి సరఫరా చేస్తున్నారు. తద్వారా వారు లబ్ధి పొందుతున్నారు. ఇలా వ్యవహరిస్తే రైతుకు లాభసాటి ధరలు అందుతాయి. మరికొందరు విత్తనోత్పత్తితో పాటు మిరప వంటి పంటల్లో నారుమడులు పోస్తూ రైతులకు నారు సరఫరా చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఈ విషయంలో కొందరు యువకులూ చొరవ చూపుతున్న సంఘటనలు ఉన్నాయి. దాదాపు లక్ష రూపాయలు ఖర్చయ్యే చిన్నపాటి పప్పుమిల్లు ఏర్పాటు చేసుకుని మినుము, పెసర, కంది వంటి   అపరాల నుంచి పప్పు తీసి సూపర్‌ మార్కెట్లకు,  అపార్ట్‌మెంటు సంఘాలకు విక్రయిస్తున్నవారూ ఉన్నారు. రైతు కుటుంబాలతో పాటు గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాలు, యువతరం పంటల ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసుకోగలిగితే ఆదాయాలు పెరుగుతాయి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయవలసిందల్లా- పంట కోత అనంతర సాంకేతికతను గ్రామీణులకు విస్తృతంగా అందుబాటులోకి తేవడమే. ఇందుకోసం అయిదారు గ్రామాలను ఒక సమూహం(క్లస్టరు)గా విభజించి రైతులకు కావలసిన సదుపాయాలన్నీ అక్కడ కల్పిస్తే పంటలు పండించుకునే క్రమంలో ప్రాథమికంగా తలెత్తే సమస్యలన్నీ తీరతాయి. ఒక నోడల్‌ అధికారిని నియమించగలిగితే రైతులకు మంచి ధరలు అందించేలా ఆయన తోడ్పడగలుగుతారు. రైతులకు లాభసాటి ధరలు అందించే బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలి. ఈ క్రమంలో విపణి శక్తులను నియంత్రించాల్సిన  అవసరముంది. వడ్డీ వ్యాపారులు, దళారులను నియంత్రించి సాగు సలహాలను విస్తృతంగా అందిస్తే రైతులు మంచి ఫలితాలు పొందగలుగుతారు.

వ్యవసాయాన్ని, ఆ రంగంపై ఆధారపడిన రైతు కుటుంబాల ప్రగతిని పట్టించుకోవాలి. పల్లె సంక్షేమానికి ఊపిరులూదాల్సిన తరుణమిది. గ్రామాల ఆర్థిక పరిపుష్టికి వ్యవసాయమే మూలాధారం. రైతు బాగుంటేనే పల్లెలు పచ్చగా ఉంటాయి. సహకార సంఘాల్లో రాజకీయ జోక్యం పెచ్చరిల్లాక చాలావరకు వాటి ఉనికి ప్రశ్నార్థకమైంది. ఒకప్పుడు ఎంతో ఘనంగా వెలుగొందిన ఈ సంఘాలు నేడు నామమాత్రమయ్యాయి. ఇప్పటికీ కొన్ని సంఘాలు విశేష ఫలితాలను సాధిస్తున్నా అవి క్రియాశీలకంగా వ్యవహరించలేకపోతున్నాయి. ఈ తరుణంలో పంటలవారీగా ఉత్పత్తిదారుల సహకార సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాల్సిన అవసరముంది. ప్రభుత్వం వీటిని ప్రోత్సహించడంతో పాటు ఆర్థికంగా పరిపుష్టినిచ్చి రాజకీయ జోక్యం లేకుండా చేయగలిగితే సత్ఫలితాలు లభిస్తాయి. పంటకు నిల్వ సదుపాయాలు కల్పించాలి. కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలి. చదువుకున్న గ్రామీణ యువతకు శిక్షణ ఇస్తే వ్యవసాయాధారిత రంగం ఊపందుకుంటుంది. వ్యవసాయోత్పత్తికి విలువ పెంచే ఉత్పత్తుల తయారీని యువతరంతో పాటు మహిళలు చేపడితే విపణి పరిధి విస్తరిస్తుంది. గ్రామాలకు దూరంగా ఉద్యోగాలు చేసుకుంటున్న రైతుబిడ్డలు సైతం వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియని తమ పెద్దలకు చేయూత ఇవ్వాల్సిన అవసరముంది. గ్రామాల్లో అవగాహన లోపంతో మోసపోతున్న రైతులకు అండగా నిలవాల్సి ఉంది. ఎవరి ఉద్యోగాలు వాళ్లు చేసుకుంటూనే ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని తమ పరిధిలో పెద్దలకు అండగా ఉంటూ వ్యవసాయంలో సరికొత్త పద్ధతులతో పాటు నైపుణ్యాలను పెంచుకునే ఉపాయాలను రైతులకు పరిచయం చేయాలి. రైతులు మార్కెట్‌ నైపుణ్యాన్ని అందిపుచ్చుకొంటే కొద్దిపాటి శ్రమతోనే లాభశాతాన్ని పెంచుకోవచ్చు.

రైతుల్ని ఆదుకుందాం! 
భూమి రైతుల బతుకులతో పెనవేసుకున్న బంధమని, అదొక జీవన విధానమని నేటి తరానికి అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే సాగుదారుల కష్టాలపై అవగాహన పెరుగుతుందో, నాటి నుంచి రైతులంటే అందరికీ గౌరవం ఇనుమడిస్తుంది. మనం తినే ఆహారం పండించేందుకు రైతులెన్ని అవస్థలు పడుతున్నారో, ఆరుగాలం కష్టపడ్డా వారు పస్తులెందుకు ఉండాల్సి వస్తున్నదో తెలిస్తే రైతుశ్రమకు విలువ కట్టే విషయంలో అవగాహన పెరుగుతుంది. పంట ఉత్పత్తుల్ని నేరుగా రైతుల నుంచి కొనే సంస్కృతి అలవడుతుంది. సాగు తప్ప రైతులకు మరో వ్యాపకం తెలియదని, వాళ్లు సేద్యం మానేస్తే ఆహారం కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తుందన్న స్పృహ కలుగుతుంది. విత్తనాలు, రుణాలు సహా పంట ఉత్పాదకాలు పొందే క్రమంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని ప్రభుత్వాలు చేయూతనివ్వాలి. రైతుల్ని ఒక దరికి చేర్చి రాజకీయాల ఊసు లేకుండా మేలైన సాగు విధానాలు పాటించేలా, మార్కెట్‌ నైపుణ్యాన్ని పెంచుకునేలా అవగాహన పెంపొందించాలి. సాగులో ఖర్చులు తగ్గించుకుని లాభపడే అవకాశాలను తెలియజేయడం అత్యవసరం. పండించేవాణ్ని పస్తులుంచకుండా కాయకష్టానికి ప్రతిఫలం దక్కేలా చూడగలిగితే సత్ఫలితాలు సమకూరతాయి. ఇందుకు ఈతరం పూనుకోవాలి. యువభారత్‌ ఈ విషయంలో క్రియాశీలంగా వ్యవహరించాలి. అంకుర ఆవిష్కరణలతో సేద్యంలో సాంకేతికతను కొత్తపుంతలు తొక్కిస్తున్న నేటి తరం, సేద్యంలో సత్ఫలితాలు సాధించేలా రైతులకు అండగా నిలవాలి. మేలైన పద్ధతులు పాటిస్తూ లాభసాటి సేద్యం చేస్తున్న రైతుల్ని చూసి తోటి రైతులు పోటీతత్వాన్ని అలవరచుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ చదివి ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నవారెందరో ఉన్నారు. ఇలాంటివారిని క్లస్టర్ల పరిధిలోకి తెచ్చి కుటీర పరిశ్రమల్లో భాగస్వామ్యం కల్పించాలి. ఇలా గ్రామీణ కుటుంబాల్లో ఆదాయ సముపార్జనకు బాటలు పడుతున్న కొద్దీ పల్లెలు సుసంపన్నమవుతాయి. పల్లెలు కాంతులీని రైతుల పండగ సంక్రాంతికి వన్నెతెస్తాయి. అన్నదాతల జీవన ప్రమాణాలూ ఇనుమడిస్తాయి!

- అమిర్నేని హరికృష్ణ

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.