close

తాజా వార్తలు

పిచ్చుకలపై బ్రహ్మాస్త్రమా?

పిచ్చుకలపై బ్రహ్మాస్త్రమా?

‘ఎవడబ్బ సొమ్మని కులుకుతు తిరిగేవు?’ అని శ్రీరామ చంద్ర ప్రభువును సూటిగా, ధాటిగా ప్రశ్నించాడు రామదాసు. నిరంతరం తనను ఆరాధించేవాడు అంతగా ఆగ్రహించి దూషించడాన్ని రాజద్రోహంగా పరిగణించలేదు శ్రీరామచంద్రుడు. జనవాక్కును సదా మన్నించే మర్యాదా పురుషోత్తముడి పాలన అందుకే రామరాజ్యంగా ప్రశస్తిగాంచింది. అదేం చిత్రమో- రామరాజ్యాన్ని స్థాపిస్తామని ప్రతిజ్ఞలు చేసి అధికారానికి వచ్చిన నేతాగణాల ఏలుబడిలో- రాజద్రోహం కేసుల ఉరవడి ఠారెత్తిస్తోంది. బ్రిటీష్‌ వలస పాలన అవశేషంగా భారత శిక్ష్మాస్మృతిలో ఉన్న రాజద్రోహ నేర నిబంధన- జనస్వామ్య నిరసన గళాలపై ఎత్తిన కత్తిగా పదే పదే పరువు మాస్తోంది. ఇప్పుడా కత్తివేటు అసోమ్‌కు చెందిన కొందరు పెద్దలపైన, దాని గాటు అసలే కుపితులై ఉన్న నిరసనోద్యమకారులపైనా పడింది. అదెలాగో చిత్తగించండి!

‘ఈ శూన్యం తొలగాలి - ఈశాన్యం వెలగాలి’ అని ప్రసంగాల్లో నేతాగణాలు దశాబ్దాలుగా మోతెక్కిస్తున్నా, స్థానికంగా సెలవేసిన సమస్యల్ని సానుకూలంగా అర్థం చేసుకుని, సానునయంగా పరిష్కరించే చొరవే దశాబ్దాలుగా కొరవడింది. అక్రమ వలసలు పోటెత్తి స్థానికంగా తమ అస్థిత్వమే కదలబారిపోతోందంటూ ఎనిమిదో దశకంలో రేగిన విద్యార్థి ఉద్యమం అసోం రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసింది. ఒక్క అసోం అనేముంది? అక్రమ వలసలతో ఈశాన్య రాష్ట్రాలన్నీ తరతమ భేదాలతో అవస్థల పాలవుతున్నవే. ఈ నేపథ్యంలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ద్వారా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులందరికీ భారత పౌరసత్వం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడటం తీవ్రాందోళనకు కారణమైంది. స్థానికుల ప్రయోజనాలకు ఎలాంటి ముప్పూ వాటిల్లబోదంటూ సాక్షాత్తు ప్రధానే అభయమిస్తున్నా- అలాంటి హామీల చెల్లుబాటు ఎంతో తెలిసిన భిన్న వర్గాలు ఉద్యమ పథంలో కదం తొక్కుతున్నాయి. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన దరిమిలా నిరసనలు ముమ్మరించాయి. అందులో భాగంగానే- భారత రాజ్యాంగ లౌకికవాద విలువల్ని నిలబెట్టాలంటూ వివాదాస్పద బిల్లుకు వ్యతిరేకంగా సాహిత్య అకాడమీ అవార్డు విజేత హిరేన్‌ గొహైన్‌ సభ నిర్వహించారు. కొన్నాళ్ల క్రితం జరిగిన సభలో స్వతంత్ర అసోం (స్వాధీన్‌ అసోం) డిమాండును ప్రస్తావించారంటూ తాజాగా పోలీసులు ఆయనపై రాజద్రోహం కేసు బనాయించారు. నాటి ప్రదర్శనలో స్వతంత్ర అసోం అంశాన్ని ఎవరో లేవనెత్తినప్పుడు- బిల్లుకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుత చర్యలు పని చెయ్యనప్పుడు, బిల్లును ఉపసంహరించాలన్న వాదనను పట్టించుకోనప్పుడే స్వాధీన్‌ అసోం డిమాండు రావచ్చునని తాను బదులిచ్చినట్లు గొహైన్‌ చెబుతున్నారు. ఆయనతోపాటు సమాచార హక్కు చట్టం ఉద్యమకర్త, మరో సీనియర్‌ పాత్రికేయుడిపైనా గువాహటి పోలీసులు అదే కేసు పెట్టి పైత్య ప్రకోపాన్ని ప్రదర్శించడంతో- అసోం సమాజం మరింతగా భగ్గుమంటోంది.

అధికార దండధరులైన నేతలకు, ‘లాఠి’న్యంతో చెలరేగిపోయే పోలీసులకు తెలియదేమో గానీ- నిరసన తెలపడం అన్నది పౌరులకు రాజ్యాంగబద్ధంగా దఖలు పడిన ప్రజాస్వామ్య హక్కు! దాన్ని రాజద్రోహ చట్టం కర్కశంగా తొక్కిపెట్టే ప్రమాదం ఉందంటూ రాజ్యాంగనిర్ణయ సభలో కేఎం మున్షీ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘నూటయాభైఏళ్ల క్రితం ఇంగ్లాండ్‌లో సమావేశం పెట్టడం, ప్రదర్శన నిర్వహించడమూ రాజద్రోహమే’నన్న మున్షీ- జిల్లా మేజిస్ట్రేటును విమర్శించడాన్నీ రాజద్రోహంగా పరిగణించాలంటూ వచ్చిన విజ్ఞప్తిని ఆనాడు ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని విమర్శించగలడమే ప్రజాస్వామ్య సారం అయినప్పుడు, ఫలానా పార్టీ ప్రభుత్వానికి తన పార్టీయే ప్రత్యామ్నాయమని ఓటర్లకు  చెప్పి ఒప్పించి అధికారానికి నిచ్చెనలు వేసుకొనే పార్టీస్వామ్యం అమల్లో ఉన్నప్పుడు- రాజద్రోహ చట్టం అసంబద్ధమని గట్టిగా వాదించారు. విశేషం ఏమిటంటే బ్రిటీష్‌ రాజ్యాంగ పొత్తాల నుంచి రాజద్రోహ నేరాన్ని ఏనాడో తొలగించారు. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్న ఇండియాలో ప్రజాస్వామ్య పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రంగా దాన్ని భ్రష్ఠు పట్టిస్తూనే ఉన్నారు!

తమకు ఎదురాడిన వాడి మెడలు వంచడమే ఏకైక లక్ష్యంగా 124ఏ నిబంధనను తెచ్చిన బ్రిటీష్‌ పాలకులు దాన్ని తిలక్‌, మహాత్మాగాంధీ వంటి స్వాతంత్య్ర సమర సేనానులపై ప్రయోగించారు. ‘పౌరుల స్వేచ్ఛను అణచివేసేందుకు భారతీయ శిక్ష్మాస్మృతిలో పేర్చిన అన్ని రాజకీయ నిబంధనల్లో, 124-ఏ యువరాజులాంటిది’ అని బాపూజీ దాన్ని ఈసడించారు. ప్రభుత్వం ఎలాంటి దగాకోరు పని చేసినా దాన్ని ప్రేమించడమే గానీ, ద్వేషించరాదన్నది రూలు. ప్రజాస్వామ్యానికి అది పొసగేదేనా అసలు?

ఎంతటి పరుష పదజాలం వాడినప్పటికీ కేవలం ప్రభుత్వాల్ని విమర్శించడమే 124-ఏ కింద నేరం కాబోదని సర్వోన్నత న్యాయస్థానమే విస్పష్టంగా లక్ష్మణరేఖలు గీసింది. అయినా సరే- భారత రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు ఉరితాళ్లు పేనేలా ఆ నిబంధనను విచ్చలవిడిగా ప్రయోగించే దుర్వినీత వాతావరణం నిక్షేపంగా వర్థిల్లుతోంది. చట్టబద్ధంగా ఆ వివాదాస్పద నిబంధనను ఏయే సందర్భాల్లో ప్రయోగించగల వీలుందో లా కమిషన్‌ పరిశీలిస్తోందని కేంద్ర ప్రభుత్వం నిరుడు జులైలో రాజ్యసభాముఖంగా తెలిపింది. ఆగస్టు చివరిలో లా కమిషన్‌ అందరి అభిప్రాయాలు కోరుతూ 124-ఏ రద్దు మీద ఓ సంప్రతింపుల పత్రాన్ని వెలువరించింది. ప్రజాస్వామ్యంలో అందరూ ఒకే పాటల పుస్తకం నుంచే పాడాలనడం- దేశభక్తికి కొలమానం కాదనీ స్పష్టీకరించింది. ‘ప్రభుత్వ విధానాల్లో లొసుగుల్ని ఎత్తిచూపేటప్పుడు, వ్యక్తీకరణ కఠినంగాను, కొందరికి ఇబ్బందికరంగానూ ఉండవచ్చు. అంతమాత్రం చేత ఆయా చర్యల్ని దేశద్రోహంగా భావించరా’దనీ ఆ పత్రం పేర్కొంది. నేతల్లో, పోలీసుల్లో ఆ ప్రజాస్వామ్య స్పృహ కొరవడటమే కొత్త కుంపట్లు రాజేస్తోంది.

సహేతుక విమర్శకు దేశం సిద్ధంగా లేకపోతే- దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లు ఎలా అవుతుందన్నది సమంజసమైన ప్రశ్న! 2017 జులైనాటికే మూడేళ్లలో 165 మందిని రాజద్రోహం కింద నిర్బంధించినట్లు గణాంకాలు చాటుతున్నాయి. ‘పాకిస్థాన్‌ నరకం కాదు... పాకిస్థానీలూ మనలాంటి వాళ్లే’  అన్నందుకు కన్నడ సినిమా నటి రమ్యపై రాజద్రోహం కేసు పెట్టారు. జేఎన్‌యూ గొడవల్లో విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌ పైన, రిజర్వేషన్ల రగడలో హార్థిక్‌ పటేల్‌ మీదా అవే కేసులు. అంతెందుకు? న్యాయవ్యవస్థలో నియామకాల చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడం అసంబద్ధమని అన్నందుకు కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మీద ఝాన్సీ జిల్లాలోని మహోబా సివిల్‌ జడ్జి తనంతట తానుగా కేసు పెట్టారు. వాక్‌ స్వాతంత్య్రానికి గొడ్డలిపెట్టులా మారిన 124-ఏను ఇంకా కొనసాగించడంలో అర్థం లేదు. దాన్ని రద్దుల పద్దులో చేర్చినప్పుడే- ప్రాథమిక హక్కులకు భరోసా దక్కినట్లు. ఏమంటారు?

- పర్వతం మూర్తి

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.