close

తాజా వార్తలు

ఇంకేం కావాలి?

ఇంకేం కావాలి?

పంచభూతాత్మకమైన ఈ సృష్టిలో మానవుడు తాను కావాలనుకున్న సకల సౌఖ్యాలు పొందుతున్నాడు. తన శ్రమకు తగిన ఫలితం అందుకుంటూనే ఉన్నాడు. అయినా అతడికి సంతోషం లేదు. సంతోషం అంటే సంతృప్తి. సంతోషం లేని ఆనందం ఆనందం కాదు. ఒకవేళ ఆనందమే అని సమర్థించుకున్నా అది శాశ్వతానందం కాదు. నిజానికి సంతోషమే సంపూర్ణ బలం. అదే సంపూర్ణానందం. కష్టార్జితంతో సముపార్జించింది చాలక, ఇంకా ఇంకా ఏదో కావాలన్న తపన, ఆశ, కాంక్ష, తృష్ణ మనిషిని పెడదారి పట్టిస్తున్నాయి.

ఈ తపోభూమిలో పుట్టిన ప్రతి  మనిషికీ, ధర్మం ప్రాణసమానం. ధర్మాన్ని విస్మరించినవాడికి భారతీయం అర్థం కాదు. సంస్కృతి, సంప్రదాయం, సదాచారం ఒంటపట్టవు. యుగయుగాలుగా మహర్షులు, యోగులు, సిద్ధులు, అవధూతలు అనేక రూపాల్లో ధార్మిక సూత్రాలు, సిద్ధాంతాలు అందిస్తూ వచ్చారు. అపౌరుషేయాలైన వేదాలు మనకు మహోజ్జ్వల కరదీపికలుగా భాసిల్లుతూ వచ్చాయి. వాటి గురించి తెలిస్తే మన బతుకుల్ని తెరిచిన పుస్తకాలుగా చేసుకోవచ్చు. ఇహపరాలకు ‘యోగం’ ద్వారా పటిష్ఠ వారధిగా చేసుకునే విజ్ఞతను ఆర్జించవచ్చు.

ధర్మాలు, విలువలంటే- మనం ఇష్టమైనప్పుడు తగిలించుకుని వదిలేసే వలువలు కావు. అవి మనకు సహజ కవచ కుండలాల్లాంటివి. ఎన్ని యుగాలైనా భద్రంగా కాపాడుకోవాల్సిన సిరిసంపదలు అవి.

సమయం, మాట, ఆలోచన, ఆచరణాల విలువలు తెలుసుకున్న మనిషికి వాస్తవమైన సంతోషం కచ్చితంగా లభించే తీరుతుంది.

‘సంతోషం ఒకచోట లేనప్పుడు మరోచోట దొరుకుతుంది. లేనిచోటే ఉండిపోతే మరోచోట సంతోషాన్ని పొందలేం’- హెలెన్‌ కెల్లెర్‌ మాటలివి. ఈ సత్యాన్ని గ్రహించగలిగితే మనిషిలో తృష్ణ, తపన ఉత్పన్నం కావు. రాగద్వేషాలకు దూరంగానూ మనిషి ఉండగలుగుతాడు. అక్రమంగా, అవినీతి మార్గాన ఆర్జించిన మనిషి ధైర్యంగా జీవించలేడు. భర్తృహరి చెప్పిన భయాలన్నీ పిశాచాలై వాడిని పీడిస్తూనే ఉంటాయి. సంతోషం కేవలం శ్రమ వల్ల, నిజాయతీ వల్ల మాత్రమే లభిస్తాయి. ‘పవలు రేలును నా కుటుంబమ్మునకు, అతిథి సజ్జనులకు భుక్తికి నిరతము సరిపడెడు గంజినొసగిన చాలునయ్యా, స్వామి! ఇంతకు మించి ఇంకేమి వలయు?’ అంటాడు కబీరు. ఇలాంటి సంతోషాన్ని మించిన సౌఖ్యం స్వర్గంలోనైనా దొరుకుతుందా? కలిసి పంచుకుందాం, కలిసి భుజిద్దాం, కలిసి నడుద్దాం... మనకు ఉపనిషత్తులు బోధించిన సత్యమిదే! దురాశ మనిషికి మనఃక్లేశాన్ని    కలిగిస్తుంది. ధనతృష్ణ అశాంతికి గురిచేస్తుంది. దొరికిన ఆహారమంతా పుష్కలంగా ముందున్నా, వింటికి     కట్టిన నరాన్ని కొరుక్కుంటూ ప్రాణానికే ముప్పు తెచ్చిపెట్టుకున్న నక్కలా ముగిసిపోతుంది మనిషి బతుకు, అసంతుష్టికి బానిసైతే.

‘ఎదురుదెబ్బలు తగిలినా సాధించాలనుకున్నది సాధించి, కృతకృత్యుడయ్యేవాడే అసలైన సంతోషానికి అర్హుడు’ అంటాడు చాణక్యుడు. మనల్ని ఆనందంగా ఉంచడానికే, భగవంతుడు మనం కోరినవన్నీ ఇవ్వడు. దేనికి మనం యోగ్యులమో అదే ఇస్తాడు. సంతోషాన్ని, ఆనందాన్ని బయటి నుంచి పొందాలనుకునేవాడు లౌకికుడు. దాన్ని తన లోపలనే దర్శించేవాడు జ్ఞాని. ‘తృప్తి కలిగితే సుఖం, తృప్తి తొలగితే దుఃఖం. తృష్ణ కలిగితే దుఃఖం. తృష్ణ తొలగితే సుఖం’ అన్నది మనుస్మృతి. సంతోషానికి మనసులో చోటివ్వక, అలక్ష్యం చేసిన వెంటనే సంతాపం వచ్చి తిష్ఠ వేస్తుంది. సంతృప్తి పొందుతున్నకొద్దీ మనిషి సచ్చిదానంద స్థితికి సన్నిహితుడవుతుంటాడు. సంతోషం అనేది మనసులో జ్ఞానేంద్రియాల ద్వారా ప్రవేశించిన ప్రాపంచిక విషయాలతో ముడివడిన ఆరోగ్యకరమైన భావోద్వేగం. అది జీవన వీణను పలికించే మధురానురాగం. ఇంతకు మించి మనిషికి ఇంకేం కావాలి?

- చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.