close

తాజా వార్తలు

ఊరి కోసం సంక్రాంతి

పండక్కి ఎంతమంది ఊరెళ్తారో తెలియదు కానీ... 
కొవ్వలి గ్రామస్థులు ఎక్కడున్నా సరే సంక్రాంతి వేళకు సొంతూరుకు చేరుకుంటారు. 
విదేశాల్లో ఉన్నవారు సైతం... తమ ఊరి అభివృద్ధిలో భాగం అవుతారు. 
సంక్రాంతి సంబరాలు చూడాలంటే... కొవ్వలి తరువాతే అని గర్వంగా చెబుతారు. 
ఆ జ్ఞాపకాలు, ఆనందాల వెనక ఉన్నది గ్రామదీప్‌ స్వచ్ఛంద సంస్థ. 
గ్రామాభివృద్ధి లక్ష్యంతో ఏటా సంక్రాంతి సంబరాలను వైవిధ్యంగా ఏర్పాటు చేయడానికి గల కారణాలు చెబుతున్నారు ఆ సంస్థ నిర్వాహకురాలు వెలమాటి మనోహరి.

ఊరి కోసం సంక్రాంతి

మా ఊరు... పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలంలోని కొవ్వలి. ఆ పేరు చెబుతున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా గ్రామాన్ని అభివృద్ది చేయాలనే ఆలోచనతోనే ఉద్యోగాన్ని మానేశా. ఎక్కడ ఉన్నా సరే! మా ఊరి వాళ్లంతా ఏటా ఒకసారైనా ఇక్కడకు రావాలనే ఉద్దేశంతోనే సంక్రాంతి వేడుకల్ని వైవిధ్యంగా ఏర్పాటు చేస్తున్నాం. చదువు, ఉద్యోగం... అంటూ ఇప్పటి యువత సొంతూరికి దూరమవుతోంది. వారి కుటుంబాలూ నెమ్మదిగా పట్టణాలు, నగరాలు, దేశాలకు వెళ్లిపోతున్నాయి. టెక్నాలజీ కూడా రోజురోజుకీ అభివృద్ధి చెందుతోంది. అలా ఊళ్ల స్థితిగతులే మారిపోయాయి. నేను కూడా పదిహేనేళ్లపాటు చదువు, ఉద్యోగం పేరుతో ఊరికి దూరంగా ఉన్నా. ఆ తరువాత తిరిగి వచ్చేసరికి కొవ్వలిలో ఎంతో మార్పు. పెంకుటిళ్లన్నీ, డాబాలుగా మారిపోయాయి. పండగల సందడి లేదు. టీవీలు, సెల్‌ఫోన్లే ప్రపంచం. సంక్రాంతి అంటే కోడిపందాలు, పేకాట అనుకునే పరిస్థితి చూసి చాలా బాధేసింది. నా వంతుగా మా ఊరిలో మార్పు తేవాలనుకున్నా. అందుకే గ్రామదీప్‌ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశా.

ఫొటోలతో మొదలు... 
2011 జనాభా లెక్కల ప్రకారం మా గ్రామ జనాభా తొమ్మిదివేలు. సామాజికవర్గాల వారీగా ఎవరికి వారుగా ఉంటారు. ఇక ఇక్కడి నుంచే ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకుని, దేశ విదేశాల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద వ్యాపారాల్లో నిలదొక్కుకుని పదిమందికీ సాయం చేసే స్థితిలో ఉన్నారు. ఎవరికి వారుగా తోచిన సాయం చేస్తున్నారు తప్ప వ్యవస్థీకృతమైన అభివృద్ధి మాత్రం లేదు. అందుకే అందరినీ ఒక బాటలో నడిపించాలనుకున్నాం. వీరిలో చాలామంది గ్రామదీప్‌లో సభ్యులుగా మారారు. ఆ తరువాత దెందులూరు మండలం పేరుతో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో గ్రూపులు ఏర్పాటు చేశాం. మా ఊళ్లోని ప్రదేశాలు, జరిగిన కార్యక్రమాల్ని ఫొటోలు తీసి పోస్టు చేసేదాన్ని. ఒక్కొక్కరుగా ఆయా ప్రాంతాలతో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకునేవారు. చివరకు ఎక్కడెక్కడో ఉన్నవాళ్లంతా ఒక్కచోట చేరారు. క్రమంగా గ్రామ సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లి, ఏదో ఒకటి చేద్దామని అడిగేదాన్ని. ఆసక్తి చూపించారు. అలా గ్రామాభివృద్ధిలో పాల్గొనడం మొదలుపెట్టారు.

ఊరి కోసం సంక్రాంతి

ఆహ్వాన పత్రికలతో... 
గ్రామాభివృద్ధి జరగాలంటే అంతా ఒక చోట చేరాలి కాబట్టి సంక్రాంతిని వేదికగా చేసుకోవాలనుకున్నా. ఏటా కార్తీక మాసంలో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న దెందులూరు, కొవ్వలి గ్రామస్థులంతా  సారథి స్టూడియోస్‌ ప్రాంగణంలో కలుస్తారు. అక్కడికి వెళ్లి సంక్రాంతికి ఊరికి రమ్మని పిలిచాం. ఇంకోపక్క సొంతూరులో ఉండి కూడా ఒకరినొకరు పలకరించుకునే తీరిక లేదు చాలామందికి. అందుకే వారందరి మధ్య ఆత్మీయతలు, అనుబంధాలను పంచాలనుకున్నాం. పండక్కి కొన్ని రోజుల ముందే ఆహ్వాన పత్రికలు కొట్టించాం. ప్రపంచంలో ఏ మూల మా ఊరి వాళ్లున్నా వారందరినీ సంక్రాంతికి రావాలంటూ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా పిలిచాం. ఊళ్లో ప్రతి ఇంటికీ వెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చాం. అది చూసి చాలామంది ‘ఎందుకు ఇవన్నీ నీకు’ అని అన్నారు. ఈ ప్రయత్నం విజయవంతం అవుతుందా లేదా అని మనసులో ఏదో మూల ఆందోళన ఉన్నా నా ప్రయత్నం ఫలించింది. ఎక్కడెక్కడో ఉన్న మా ఊరివాళ్లంతా పండక్కి వచ్చారు. గ్రామస్థులూ స్పందించారు. నిజానికి మొదటి ఏడాది ఆ సంక్రాంతి హడావుడిగా జరిగినా క్రమంగా మార్పులు చేశాం. 


 ఊరి కోసం సంక్రాంతి

సొంతింటికి వచ్చినట్లే... 
మా ఊళ్లోని మహిళా గ్రామదీప్‌, బాల గ్రామదీప్‌ సభ్యులు, స్థానిక జిల్లాపరిషత్‌ పాఠశాల విద్యార్థులను సంక్రాంతి వేడుకల్లో భాగస్వాముల్ని చేశాం. వారందరికీ చెక్కభజన, కోలాటం, జానపద కళల్ని నేర్పించాం. భోగిమంటలు, గోదాదేవి కల్యాణం, సంక్రాంతి లక్ష్మి పూజ, గొబ్బెమ్మలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను గ్రామం అంతా కలిసి ఒకేచోట చేయాలనే నియమం పెట్టాం. ముగ్గుల పోటీలు ఉండనే ఉంటాయి. హరిదాసులు, పగటి వేషగాళ్లు, కొమ్ము దాసర్లు, గంగిరెద్దు వాళ్లు.. ఇలా అందరూ ఇక్కడికి వచ్చేలా మాట్లాడాం. ఇవన్నీ ఒకెత్తయితే... వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లకు పొద్దున్నే నేచర్‌వాక్‌ పేరుతో పంట కాలువలు, పొలం గట్ల వెంట నడిపిస్తాం. తిరుగు ప్రయాణంలో పట్టుకెళ్లడానికి స్థానిక మహిళలతో పిండివంటలు అందించే ఆలోచనా ఉంది. ఇతర ప్రాంతాల వాళ్లు కూడా ఇక్కడకు రావొచ్చు. గ్రామీణ పర్యటకాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఇలా ఆతిథ్య ఏర్పాట్లు చేస్తున్నాం. గతేడాది తెలంగాణ నుంచి చాలామంది సంక్రాంతి సంబరాలు చూడ్డానికి వచ్చారు. ఓపెన్‌ టాప్‌ జీపు, ఎండ్లబండిపై ఎక్కించి ఊరంతా చూసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం.

అభివృద్ధి ఇలా.... 
సంక్రాంతి సంబరాలను 2015లో ప్రారంభించినా ఏటికేడు గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. చెరువు గట్లమధ్య ఉండే ఖాళీ ప్రదేశాన్ని అలాగే వదిలేయకుండాఊరి కోసం సంక్రాంతి మొక్కల్ని పెంచాం. కొవ్వలి ఐక్యతా వనం పేరుతో పార్కుని ఏర్పాటు చేశాం. రాళ్లగుట్టలు, ఏటవాలు ప్రాంతాలను చదును చేసి రహదారులుగా తీర్చిదిద్దాం. ఊరిలోని ఖాళీ ప్రదేశాల్ని మొక్కలతో నింపేశాం. ఊళ్లోని గోడలపైనా చక్కని పెయింటింగ్‌లు, అక్కడక్కడా సిమెంటు బెంచీలూ కనిపిస్తాయి. సిటీలో ఉన్న ఫిట్‌నెస్‌ అవగాహన ఊళ్లలో ఉండదు. అందుకే తరచూ  మహిళలు, పిల్లలంతా కలిసి వెళ్లేలా నేచర్‌వాక్‌ పేరుతో ఓ వాకథాన్‌ కూడా ఉంటుంది. గ్రామంలోని పదకొండుమంది హెచ్‌ఐవీ బాధిత వితంతువులు, ఇతర మహిళలు, వృద్ధులను దత్తత తీసుకుని ఒక్కొక్కరికీ ఏడాదికి ఏడువేల రెండు వందల రూపాయల్ని, పోషకాహారాన్ని అందిస్తున్నాం. 

- స్వాతి కొరపాటి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.