close

తాజా వార్తలు

పెద్దదిక్కు 

- డేగల అనితాసూరి

‘‘ఒరే వరుణ్‌, సింధు మొన్న ఫోన్‌లో మాట్లాడినప్పుడు నీ గురించి బెంగపడినట్లు అనిపించింది. ఓసారి వెళ్ళి చూసి రారాదూ’’ అంది నవనీతమ్మ. 
‘‘చాల్లే నానమ్మా, మాట్లాడితే చాలు... నాతో పోట్లాటకొస్తుందిగానీ, దానికి నామీద బెంగకూడానా?’’ కొత్తగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని అందిపుచ్చుకున్న మనవడు వరుణ్‌ అన్నాడు వ్యంగ్యంగా. 
‘‘అదేంట్రా అలాగంటావ్‌? నీకన్నా రెండేళ్ళు చిన్నదని ఇంట్లో కాస్త గారమెక్కువై అల్లరి చేస్తోందిగానీ, దానికి అన్న మీద ప్రేమ లేకుండా ఎట్లా ఉంటుందిరా. పెళ్ళయి 
సంవత్సరమైనా కాలేదు... పైగా కడుపుతో ఉందాయె. నిన్ను చూడాలనుందని నీతోనే చెప్పడానికి మొహమాటమనుకుంటా... ‘ఏంటో నానమ్మా ఈమధ్య వరుణ్‌గాడు ఊరికే కల్లోకి వస్తున్నాడు. చెబితే నవ్వులాటకనుకుంటాడని చెప్పలే’దని అంది’’ చెప్పింది నవనీతమ్మ. 
మర్నాడు నవనీతమ్మ మరోసారి చెబితే ‘‘నేనెళ్ళనే. అది మొన్న పండక్కొచ్చినప్పుడు నాతో ఎంత పోట్లాడిందో తెలుసు కదా’’ అని విసురుగా బ్యాగు భుజానికెత్తుకుని ట్రైనుకెళ్ళడానికి బయలుదేరాడు వరుణ్‌. నవనీతమ్మ ముఖం చిన్నబోయింది. తమ మాట వినకపోయినా, పెద్దావిడ చెబితే వింటాడని ఆశపడిన వరుణ్‌ అమ్మానాన్నలు కూడా అతని మొండితనానికి ఏమనలేక ఊరుకున్నారు.

పెద్దదిక్కు 

సాయంత్రం మనవరాలు సింధు 
దగ్గర్నుంచి ఫోను వస్తుంటే తీసింది 
నవనీతమ్మ. ‘‘ఏం తల్లీ ఎలా ఉన్నావ్‌? మీ అత్తామామలూ అబ్బాయీ బాగే కదా! పొట్టలో బుడ్డోడు ఏమంటున్నాడు?’’ అంటూ మురిపెంగా పలకరించింది. 
‘‘ఆ... అంతా బాగే. నీ దగ్గెట్లా ఉంది? మందులు సరిగా వాడుతున్నావా లేదా? 
అవునుగానీ ఒకటి చెప్పు... ఈ వరుణ్‌గాడి కేమైందసలు?’’ అంది సింధు. 
‘అయ్యో రామా, వెళ్ళి చూడకపోతేమానె, ఏ వాట్సప్పుల్లోనో ఫేసుబుక్కుల్లోనో కొట్టుకు చచ్చారా ఏందిరా భగవంతుడా’ అనుకుంటూ గొంతు పెగల్చలేదు నవనీతమ్మ. 
‘‘అరె, ఏమైందవతల? చడీచప్పుడూ లేదు’’ రెట్టించింది మనవరాలు. 
‘‘ఏమోనే తల్లీ, నాకేంతెల్సు మీ పోట్లాటల సంగతి. పిల్లీ ఎలకలాయె మీరిద్దరూ. దేనికోసమైనా ఎప్పుడైనా పోట్లాడుకోవటమే కదా మీ పని. నాకేం తెలుస్తది?’’ అంది 
నవనీతమ్మ చివరికి గొంతు పెగిల్చి.

‘‘అబ్బబ్బ... మాట్లాడితే చాలు మా పోట్లాట గురించే అంటావ్‌. మేం బాగున్నా మంచిగుండనివ్వవా? ఎంతైనా మాది రక్తసంబంధం. ప్రేమ ఎక్కడికి పోతుంది? మధ్యాహ్నం నన్ను చూడ్డానికి ఇంటికొచ్చాడు. నాకిష్టమైన స్వీట్లూ పళ్ళూ తీసుకొచ్చి అందర్నీ పలకరించి ఇందాకే సాయంత్రం ట్రైన్‌కి వెళ్ళాడు’’ చెప్పింది సింధు. 
‘‘అవునా, ఏమో నాకేం తెలుసు? దూరంగా సిటీలో ఉద్యోగమొచ్చింది కదా. వెళ్ళి చూసిరమ్మంటే ఎట్లాగూ కుదరదంటాడు కదాని నీ సంగతే ఎత్తలేదు మేము’’ చెప్పింది లోలోపల ఆనందిస్తూ నవనీతమ్మ. 
‘‘నువ్వేంటి? ఇక్కడ మా ఆయనా అత్తమామలూ కూడా మీ అన్నకు మంచి ఉద్యోగమొస్తే వచ్చి కలవలేదా? చెల్లెలంటే ఎంత ప్రేమ ఉందో చూడు అని దెప్పిపొడుస్తారని లోపల్లోపల అనుకుంటున్నా. ఇప్పుడిక వాళ్ళముందు తలెత్తుకుని తిరగ్గలిగేట్టు చేశాడు. మొదటి జీతమొచ్చిందని అయిదువేలు ఇచ్చి చీర కొనుక్కోమన్నాడు తెలుసా?’’ దాని గొంతులో ఏనుగెక్కినంత సంబరం కనిపిస్తుంటే నవనీతమ్మ కళ్ళు ఆనందబాష్పాలతో మెరిశాయి తన సీమంతానికి ఏవో మాటపట్టింపులొచ్చి రాకుండా ఏడ్పించిన అన్నను గుర్తుచేసుకుని. 
మర్నాడు వరుణ్‌ ఫోన్‌ చేసి చెల్లిని చూసొచ్చానని చెప్పాడు. ‘‘అబ్బో పర్లేదు, ఆమాత్రం చెల్లి మీద ప్రేముందే’’ అని నవనీతమ్మ అంటే,

‘‘సర్లే, అన్నాచెల్లెళ్ళన్నాక ఆమాత్రం 
ఎవరింట్లో అయినా కీచులాడుకుంటారు. వేరే వాళ్ళతో పోల్చితే మేమే నయం. ఎంతైనా అది నా చెల్లి కదా. నేనెళ్ళినందుకు పొంగిపోయింది. ఏదేదో వండి పెట్టింది. అందరిముందూ మా అన్నొచ్చాడంటూ గొప్పగా చెప్పుకుంది తెలుసా?’’ అన్నాడు వరుణ్‌. 
‘‘తెలిసిందిలే నాయనా. నువ్వొచ్చినందుకు మురిసిపోతూ నీ చెల్లి ముందే ఫోన్‌ చేసి చెప్పేసిందిలే. మీ పోట్లాటలూ సరి, మీ ప్రేమలూ సరి’’ అంటూ ముసిముసిగా 
నవ్వుకుని కొడుకూ కోడలితో కలిసి ఆ ముచ్చట్లు చెప్పుకుని ఆనందంగా నవ్వుకుంది నవనీతమ్మ. 


*              *          * 

‘‘ఏమండీ, పొద్దున అమ్మ ఫోన్‌ చేసింది. సంక్రాంతి పండగ దగ్గరకొచ్చింది కదా. అన్నయ్య ఒకటే బాధ పడుతున్నాడట- 
నేను రానేమోనని. సింధు పెళ్ళిలో సరిగా మర్యాదలు జరగలేదని మనం కోపగించుకుని వచ్చేశాం కదా, ఏ మొహం పెట్టుకుని మనతో మాట్లాడాలని కళ్ళనీళ్ళు నింపుకున్నాడని చెప్పింది అమ్మ’’ చెప్పింది వరలక్ష్మి. 
‘‘అంత బాధపడే బదులు ఒక ఫోన్‌ చేయొచ్చు కదా - సర్లే వెధవ మొహమాటం వాడూనూ. బట్టలు సర్దు, రేపు వెళ్ళి వాడ్ని చూసొద్దాం’’ బావమరిదిని స్నేహితునిలా భావించే బావగారు ఆరునెలలుగా అలిగి మాట్లాడుకోవట్లేదన్న సంగతి మరిచి 
మెత్తబడుతూ అన్నాడు. వరలక్ష్మి ముఖం చేటంతైంది. వెంటనే సూట్‌కేస్‌ అందుకుంది చెప్పిందే తడవన్నట్టు. 
‘‘అత్తయ్యా, మళ్ళీ వరలక్ష్మిని మనింట్లో చూస్తాననుకోలేదు. పెళ్ళి హడావుడిలో ఉండటంవల్లగానీ ఆడపడుచుని ఏనాడైనా చులకనగా చూశానా? వాళ్ళమధ్య భేదాభిప్రాయాలు పోయి అన్నమీద ప్రేమతో తనే రావటంతో ఆయన ముఖంలో ఆ కళను చూశారా? కోపమంతా ఎటుపోయిందో ఏమో. నాకీరోజు మళ్ళీ మనింటికి కొత్త శోభ వచ్చినట్టుంది’’ నవ్వుతూ కళ్ళొత్తుకుంది కోడలు వాసంతి. 
‘‘పిచ్చిపిల్లా. అంతేనే... అన్నాచెల్లెళ్ళ గొడవలు. మధ్యలో మనమే లేని టెన్షన్‌లు తెచ్చుకుంటుంటాం’’ నవనీతమ్మ 
అంటుండగానే హాల్లోంచి వరలక్ష్మి కేకేసింది ‘‘వదినా, ఇలా రా’’ అంటూ. వాసంతి వెళ్ళిపోయింది. '

పెద్దదిక్కు 


*              *          * 

‘‘చూశావా అమ్మా, మన వేణుగాడు నా బర్త్‌డేకి ఎంత మంచి బొకే పంపాడో కేక్‌తో సహా. లోపలింత ఇష్టం పెట్టుకుని కూడా వాడి భార్య మాటలు విని నామీద పోట్లాటకు ఎట్లా దిగాడో అర్థంకాలేదు’’ అన్నాడు తల్లికి బొకే చూపుతూ కొడుకు వరప్రసాద్‌. 
‘‘సర్లేరా, ఎంతటి మగాడైనా భార్య మాట వినటం సహజమే కదా! ఎంత విన్నా అన్నతమ్ముళ్ళ మధ్య గొడవలు తాత్కాలికమే అని తెలిసింది కదా? నిన్నూ నన్నూ తలవకుండా వాడెట్లా ఉంటాడ్రా? వచ్చేవారం వాడి పుట్టినరోజు కదా... నువ్వూ వాడికో బొకే పంపి, పండక్కి రమ్మని పిలువు. వాడిమీద నీకు కోపం లేదని తెలవగానే నీముందు వాలిపోడూ... పిచ్చినాగన్న!’’ మనవడితో చెప్పి, చిన్నకొడుకు పేరున ఆన్‌లైన్‌లో బొకే తెప్పించిన నవనీతమ్మ అంది ఏమీ ఎరగనట్టే.

‘‘చూశారా అత్తమ్మా, అన్నాతమ్ములిద్దరూ ఒక్కటైపోయారు. అక్కడికి నేనే కదా కానిదాన్నయ్యా. నాకు మాత్రం సింధు కూతుర్లాంటిది కాదా? నేను మాత్రం పెద్దగా ఏమనేశానని? రెండు తులాల గొలుసు సింధు మెడలో వేయలేదా చెప్పు? అలాంటిది నాకు అంత చీప్‌లో చీర పెట్టిందనే కదా... నలుగురిలో చులకన అనిపించి నాకొద్దని అన్నాను. దానికి వచ్చిన గొడవే ఇదంతా. నేను బాధపడటంలో తప్పుందంటారా చెప్పండి. తోటికోడలిగా నా విలువ నాకివ్వొద్దా?’’ అంటూ ముక్కు చీదింది బావగారింటికి వచ్చీరాగానే చిన్నకోడలు మంజరి. 
‘‘ఏమాత్రం తప్పులేదే. అసలు నీది తప్పని ఎవరన్నారు చెప్పు ముందు. మీ అక్క కూడా కాస్త ఆగమందే కానీ నిన్నేమీ కోపగించుకోలేదు. నా మరిది కోడళ్ళూ, బావ కోడళ్ళూ కూడా వచ్చారు కదా. అందరితోబాటూ పెళ్ళి మంటపంలో నీకూ అదే చీర పెట్టింది. తరవాత నువ్వెలాగూ ఇంటికొస్తావు కదా... అప్పుడు పెట్టడానికని కంచిపట్టు చీర ప్రత్యేకంగా కొని ఉంచిందే. నువ్వేమో మమ్మల్ని మాట్లాడనివ్వకపోతివాయె. కావాలంటే చూడు... నువ్విప్పుడొచ్చావ్‌ కదా, పండగరోజు అదే పట్టుచీర వాసంతి నీకు పెడుతుంది. చిన్నచిన్న అలకలూ ఆవేశంతో అవతలి వాళ్ళను సరిగా అర్థంచేసుకోకపోవటాలూ తప్ప మానవ సంబంధాల్లో పగలూ ప్రతీకారాలూ ఎందుకుంటాయి చెప్పు? నువ్వొస్తున్నావని నిన్నట్నుంచీ ఒకటే ఉబ్బితబ్బిబ్బవుతూ హడావుడి పెట్టేస్తోంది తెలుసా మీ అక్క’’ అంటూ నవ్వింది నవనీతమ్మ.

అత్తగారి మాటలతో తేలికైన హృదయంతో, ఇన్నాళ్ళూ అర్థంచేసుకోకుండా దూరమైనందుకు బాధపడుతూ, అక్కమీద అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన కొత్త ప్రేమతో వంటింట్లోకెళ్ళింది మంజరి. 
ఆ రాత్రి వాసంతి ‘‘అత్తమ్మా, నేను మాత్రం ఏం చెయ్యను చెప్పండి. సింధు పెళ్ళి ఖర్చుకుతోడు మన చుట్టాలూ ఎక్కువే కాబట్టి అందరితోబాటే చీర పెట్టాను మంజరికి. అప్పటికి వరుణ్‌కి ఉద్యోగం కూడా రాలేదు కదా. మన ఇంటికోడలే కదా 
పరిస్థితిని అర్థం చేసుకుంటుందనుకున్నాగానీ ఇంత యాగీ చేసి కనీసం ఇంటికైనా రాకుండా పెళ్ళి మంటపం నుంచే వెళ్ళిపోతుందని ఊహించలేదు తెలుసా. అయినవాళ్ళంటే ఇంతేనా అర్థంచేసుకోవటం?’’ అంటూ 
మనసులోని బాధ చెప్పుకుంది.

‘‘అందుకే కదే- దానికదే తొందరపడి అలిగినందుకు బుద్ధి తెచ్చుకుని ఇవాళ ఇంటికొచ్చింది. సర్లే, ఎలాగూ వరుణ్‌కి ఉద్యోగం వచ్చిన సందర్భంకూడా కాబట్టి రేపు పండగనాడు దానికో కంచిపట్టు చీర పెట్టేసెయ్‌. ఆనందంతో అన్ని వెలితులూ తీరిపోయి ‘అక్కా అక్కా’ అంటూ నీ కొంగుపట్టుకు తిరగదూ. ఒకమ్మ కడుపున పుట్టకపోయినా కలకాలం అక్కాచెల్లెళ్ళుగా కలిసుండే సంబంధమే తల్లీ తోడికోడళ్ళ సంబంధం. నీకు సొంత చెల్లెలు అరుణ అయినా అమెరికా నుంచి వారానికోసారి ఫోన్‌ చేస్తుందేమో, సంవత్సరానికోసారి చూడటానికొస్తుందేమోగానీ... మంజరి రోజుకు నాలుగు ఫోన్లూ, నెలకో రెణ్ణెల్లకో అయినదానికీ కానిదానికీ నిన్ను పలకరించేదీ చూడవచ్చేదీ ఇదే కాదూ చెప్పు’’ అని పెద్దకోడల్ని ఊరడించింది నవనీతమ్మ.

‘నిజమే కదా. పాపం తనే ఒక మాట చెప్పాల్సింది- తరవాత మంచిచీర కొనిపెడతానని. లేదంటే నలుగురిలో కాకుండా ఇంటికొచ్చాక ఆ చీర పరిస్థితి గురించి చెప్పి పెట్టాల్సింది. అత్తమ్మ చెప్పిందని కాదుగానీ, నిజంగానే అరుణకంటే ఎక్కువగా మనసు విప్పి అన్ని విషయాలూ చెప్పుకునేవాళ్ళు కదూ ఈ అలకలు రాకముందు. అయినా అక్క కదాని తనకే విలువిచ్చి పట్టు సడలించి అదే భర్తను తీసుకుని ఇంటికొచ్చింది. రేపు అర్జెంటుగా షాపుకెళ్ళి పట్టుచీర తీసుకురావాలి. ఎరుపురంగు దానికి చాలా ఇష్టం, బాగా నప్పుతుంది కూడా. ఒకటికి రెండు షాపులు తిరిగైనా మంచి చీర తేవాలి. ఎంత మురిసిపోతుందో. నాకు తెలుసు మంజరి గురించి... చిన్నచిన్న విషయాలకే పొంగిపోతుంది. అల్పసంతోషి. అలాగే ముక్కుమీద కోపం. దాని గుణం తెలిసి కూడా నేను కాకుంటే ఇంకెవరు దాన్ని అర్థం చేసుకుంటారు?’ అనుకుని తన గదిలోకెళ్ళి హాయిగా నిద్రపోయింది వాసంతి.

పదవరోజుకంతా ఇల్లంతా ఒకటే సందడి. పట్టుచీరలతో కోడళ్ళిద్దరూ పిండివంటలు చేస్తుంటే, కూతురు వరలక్ష్మి పర్యవేక్షణలో మనవరాలు సింధు మహలక్ష్మిలా అందరికీ వడ్డిస్తూ తిరుగుతుంటే, కొడుకులూ అల్లుడూ కబుర్లాడుకుంటూ చిన్నప్పుడు తమ తమ ఊళ్ళలోని సంక్రాంతి సంబరాల గురించి చెప్పుకుంటూ మధ్యమధ్య కాఫీలూ టీలూ తినుబండారాలూ ఆస్వాదిస్తూ నవ్వులు కలబోసుకుంటుంటే అందరి కడుపులూ పిండివంటలతో నిండినట్టు నవనీతమ్మ కళ్ళారా అందరినీ చూస్తూ ఆ దృశ్యాల్ని పదిలంగా దాచుకుని మనసు నింపుకుంది.

నట్టింట్లో కాసేపటిక్రితమే పెద్ద పండగరోజు బట్టలుపెట్టి మొక్కిన ఫొటోలో నుంచి ‘అవసరార్థం చిన్న అబద్ధాలాడితేనేంగానీ పిల్లల మనసుల్లో ఒకరిమీద ఒకరికి కోపాన్ని పోగొట్టి ప్రేమను నింపావు. తల్లిగా, పెద్దదిక్కుగా నీ కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చి ఈ లోకానున్న నా మనసులో శాంతిని నింపావు సుమీ’ అన్నట్టు తృప్తిగా చూస్తున్న భర్తవంక నీళ్ళు నిండిన కళ్ళతో చూసి చేతులు జోడించి తృప్తిగా సంక్రాంతిని ఆస్వాదించింది నవనీతమ్మ. ‘‘చిన్నచిన్న అలకలూ ఆవేశంతో అవతలి వాళ్ళను సరిగా అర్థంచేసుకోకపోవటాలూ తప్ప మానవ సంబంధాల్లో పగలూ 
ప్రతీకారాలూ ఎందుకుంటాయి చెప్పు? నువ్వొస్తున్నావని నిన్నట్నుంచీ ఒకటే ఉబ్బితబ్బిబ్బవుతూ హడావుడి పెట్టేస్తోంది తెలుసా మీ అక్క’’ అంటూ నవ్వింది నవనీతమ్మ.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.