close

తాజా వార్తలు

అంతరిక్షం నయా యుద్ధక్షేత్రం 

ఉపగ్రహాల మోహరింపులు

అంతరిక్షం నయా యుద్ధక్షేత్రం 

వాళ చరవాణి చేతపట్టిన పిల్లలు, వృద్ధులు, వైద్యులు, డ్రైవర్లు, బట్వాడా (డెలివరీ)కుర్రాళ్లు, సముద్రంలో చేపల వేటకు వెళ్లే జాలర్లు, విమాన పైలట్లు, సైనికులు, నావికులకు జీపీఎస్‌ (గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌) లేనిదే పని జరగదు. భూమికి 20వేల కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో తిరిగే 30 ఉపగ్రహాల రేడియో సంకేతాలతో జీపీఎస్‌ పనిచేస్తుంది. దీని సొంతదారు అమెరికా ప్రభుత్వమైతే, నిర్వహణదారు అమెరికా వైమానిక దళం. అమెరికాకు ఇష్టం లేకుంటే ఇతరులకు జీపీఎస్‌ వినియోగాన్ని నిరాకరిస్తుంది. కార్గిల్‌ యుద్ధ సమయంలో జరిగింది అదే. అమెరికా అప్పట్లో భారత సేనలకు జీపీఎస్‌ సేవలను అనుమతించకపోవడంతో దిల్లీ సొంత జీపీఎస్‌ వ్యవస్థ ‘నావిక్‌’ రూపకల్పన చేపట్టింది. ఏడు ఉపగ్రహాల నావిక్‌ వ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో పని ప్రారంభించనందువల్ల ప్రస్తుతం భారత్‌ తన సరిహద్దుల్లో చైనా సేనల కదలికలను పసిగట్టడానికి అమెరికా జీపీఎస్‌ సాయం తీసుకొంటోంది. ఇప్పుడు భారత్‌-అమెరికాల మధ్య వ్యూహాత్మక బంధం బలపడుతున్నందున జీపీఎస్‌ సేవలు భారత్‌కు అందుతున్నాయి. అయితే భావి అవసరాల కోసం నావిక్‌ వ్యవస్థను 11 ఉపగ్రహాలకు విస్తరించడంతోపాటు జపాన్‌, ఫ్రాన్స్‌ వంటి మిత్ర దేశాల ఉపగ్రహాలనూ ఉపయోగించుకోవాలని భారత్‌ యోచిస్తోంది. రష్యాకు గ్లోనాస్‌, చైనాకు బైడూ, ఐరోపా సమాఖ్యకు గెలీలియో పొజిషనింగ్‌ సిస్టమ్‌, జపాన్‌కు క్యూజడ్‌ఎస్‌ఎస్‌ పేరిట సొంత వ్యవస్థలు ఉన్నాయి. ఈ ఉపగ్రహ యంత్రాంగాలు నేల, నింగి, సముద్రాలలో సాయుధ బలగాలకు దారి చూపడమే కాదు, పౌర జీవనానికి దిక్సూచిగా నిలుస్తున్నాయి. నేడు కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాల్లో 95 శాతం సైనిక, పౌర అవసరాలకు పనికొచ్చేవే!

కిక్కిరిసిపోతున్న భూకక్ష్య 
ప్రపంచ ఆధిపత్యానికి మొదట్లో సముద్రతలం (నౌకా బలం), తరవాత గగన తలం (వైమానిక బలగం) ప్రాతిపదిక అయితే, 21వ శతాబ్దిలో అంతరిక్షమే వేదిక కానుంది. రోదసిలో పైచేయి సాధించడానికి ఉపగ్రహాలు, వ్యోమనౌకలే ఆలంబన. ఈ సందర్భంగా అమెరికా ఎక్స్‌-37బి పేరుతో సృష్టించిన రెండు హైటెక్‌ రోదసి విమానాల గురించి చెప్పుకోవాలి. వీటిలో ఒకటి రెండేళ్లపాటు భూమికి దిగకుండా కక్ష్యలోనే తిరిగి కిందకు వచ్చింది. ఇది అంతరిక్షంలో ఏం చేసిందో, ఏం చేయగలదో ఎవరికీ తెలియదు. దానిలో వాడిన సాంకేతికతలూ రహస్యమే. ఎక్స్‌ 37బిని మళ్ళీ మళ్ళీ కక్ష్యలోకి ప్రయోగించవచ్చు. దాన్ని ఉపయోగించి ప్రత్యర్థుల ఉపగ్రహాలను పేల్చేయవచ్చు. చైనా సైతం ఇటీవల ఉపగ్రహ విధ్వంస (ఏశాట్‌) అస్త్రాన్ని పరీక్షించింది. ఉపగ్రహాలు లేకుండా ముందుకు కదలని ఆధునిక జీవనం ఇలాంటి అస్త్రాల వల్ల పూర్తిగా స్తంభించిపోతుంది.

నిరుడు నవంబరు 30నాటికి 1,957 ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతుండగా, వాటిలో 849 (43 శాతం) ఉపగ్రహాలు అమెరికాకు చెందినవే. 284 ఉపగ్రహాలతో చైనా రెండోస్థానంలో ఉంది. తరవాతి స్థానాలను రష్యా (152), జపాన్‌ (75), భారత్‌ (57) ఆక్రమిస్తున్నాయి. పౌర జీవితంలో ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల వాడకం రోజురోజుకూ పెరిగిపోతున్నందువల్ల మున్ముందు మరెన్నో ఉపగ్రహాలతో భూకక్ష్య కిక్కిరిసిపోనుంది. వాటిని ఎవరైనా పేల్చేస్తే అంతా అస్తవ్యస్తమే. 2007లో చైనా కాలంచెల్లిన తన వాతావరణ ఉపగ్రహాన్ని తానే పేల్చేసింది. అన్ని దేశాలూ అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకు వినియోగిస్తామంటాయి. చివరకు దేశాల ఉద్దేశాలకన్నా వాటి పోరాట సామర్థ్యమే అంతిమ ఫలితాలను నిర్ణయిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికా, రష్యాలకు దీటుగా చైనా అంతరిక్ష సమర సామర్థ్యం పెంచుకొంటోంది. అది సహజంగానే భారత్‌, జపాన్‌లకు ఆందోళనకరం. ఒకటి మాత్రం నిజం. కక్ష్యలో పెరిగిపోతున్న రద్దీని తగ్గించాలంటే కాలంచెల్లిన ఉపగ్రహాలను పేల్చేయాలి. లేదా మరమ్మతులు చేసి మళ్ళీ వినియోగించాలి. కాలంచెల్లిన ఉపగ్రహాల శకలాలు నేడు కక్ష్యలో చెల్లాచెదురుగా వేలాడుతున్నాయి. వీటిని తొలగించకపోతే కొత్త ఉపగ్రహాలకు చోటు దొరకదు. 2016లో చైనా వేగంగా శిథిలాలను తొలగించే ఏడీఆర్‌ నౌక అవోలాంగ్‌-1ను ప్రయోగాత్మకంగా రోదసిలోకి పంపింది. అమెరికా, రష్యా, ఐరోపా సమాఖ్య (ఈయూ)లూ ఏడీఆర్‌ తయారీని చేపట్టాయి. కక్ష్యలోనే ఉపగ్రహాల మరమ్మతుకు ఓఓఎస్‌ నౌకల రూపకల్పన కొనసాగుతోంది. 2020కల్లా ఏడీఆర్‌, ఓఓఎస్‌ నౌకలు సాకారమవుతాయని, వీటిని సైనిక, పౌర ప్రయోజనాలకు వినియోగించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

అపార ఖనిజ సంపద రాశులు

అంతరిక్షం నయా యుద్ధక్షేత్రం 

అంతరిక్షంలో పైచేయి సాధించే దేశాలు చంద్రుడు, కుజుడిపై మానవ నివాసాలు ఏర్పరచి, అక్కడి అమూల్య ఖనిజ వనరులను సొంతం చేసుకుని ఆర్థిక ఆధిపత్యం సాధించగలుగుతాయి. కుజుడి మీద నుంచి గ్రహశకలాలకు పయనించి అక్కడి నుంచి విలువైన ఖనిజాలను భూమికి తీసుకురావచ్చు. ఉదాహరణకు కుజ-గురు గ్రహాల మధ్యనున్న 16 సైకి అనే గ్రహశకలం మీద 10,000 క్వాడ్రిలియన్‌ డాలర్ల విలువైన ఖనిజాలు ఉన్నాయని అంచనా. (ఒకటి పక్కన 15 సున్నాలు పెడితే ఒక క్వాడ్రిలియన్‌ అవుతుంది. లక్ష కోట్లు అంటే ఒకటి పక్కన 12 సున్నాలు మాత్రమే). 200 కిలోమీటర్ల వెడల్పు ఉన్న 16 సైకి గ్రహ శకలంలో ఇనుము, నికెల్‌, బంగారం, ప్లాటినం వంటి విలువైన లోహ నిక్షేపాలున్నాయి. దీనిమీదకు అమెరికా 2023లో పరిశోధక నౌకను పంపనుంది. గ్రహాంతర ఖనిజాల అన్వేషణలో జపాన్‌ ఇప్పటికే ముందడుగు వేసింది. జపాన్‌ అంతరిక్ష సంస్థ జాక్సా గతేడాది రైయుగు అనే గ్రహ శకలం మీద హయబుసా-2 అంతరిక్ష వాహనం సాయంతో రెండు రోబో రోవర్లను దింపింది. అవి సేకరించే మచ్చులను తీసుకుని హయబుసా 2020కల్లా భూమికి తిరిగొస్తుంది. ఇలాంటి ప్రయోగం జరగడం ప్రపంచంలో ఇదే ప్రథమం.

మరోవైపు చైనా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చంద్రుడి అవతలివైపు తన వ్యోమ నౌకను దింపింది. 2020కల్లా కుజ గ్రహానికి అన్వేషక నౌకను పంపడానికి, 2022కల్లా మానవ సిబ్బందితో భూకక్ష్యలో తిరిగే అంతరిక్ష వేదికను నిర్మించడానికి సమాయత్తమవుతోంది. ఇదంతా శాంతియుత ప్రయోజనాల కోసమేనని చైనా చెబుతున్నా, అంతరిక్షంలో ఆ దేశ సాంకేతిక పటిమ, పోరాట అవసరాలకూ ఉపయోగపడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంతరిక్ష సాయుధ బలగ అధిష్ఠానాన్ని (స్పేస్‌ కమాండ్‌) ఏర్పరచాలని రక్షణ శాఖను ఆదేశించారు. చైనా ధాటికి భారత్‌, జపాన్‌ అప్రమత్తమయ్యాయి. 2017 సెప్టెంబరులో ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబే అంతరిక్ష సహకారానికి అంగీకారం కుదుర్చుకున్నారు. తదనుగుణంగా భారత్‌, జపాన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థలైన ఇస్రో, జాక్సా ఈ ఏడాది మార్చిలో చర్చలు జరపనున్నాయి. చంద్ర మండల అన్వేషణ, జాతీయ భద్రత,           భూతల, సముద్రతల నిఘాను సంయుక్తంగా చేపట్టడంపై ఈ భేటీలో చర్చిస్తారు. హిందూ మహాసముద్రం, దక్షిణ, తూర్పు చైనా సముద్రాలపై పట్టు బిగించడానికి చైనా సాగిస్తున్న కార్యకలాపాలు అమెరికాతోపాటు జపాన్‌, భారతదేశాలకూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సముద్ర జలాల్లో చైనా కార్యకలాపాలపై అంతరిక్షం నుంచి నిఘా వేయడానికి భారత్‌, జపాన్‌ నడుంకడుతున్నాయి. తూర్పు చైనా సముద్రంలో ప్రస్తుతం జపాన్‌ అధీనంలో ఉన్న కొన్ని దీవులు తనవేనంటున్న బీజింగ్‌, దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. హిందూ మహాసముద్రంపై పట్టుకు జిబూటీ, పాకిస్థాన్‌లలో నౌకా స్థావరాలను నిర్మించి, శ్రీలంక, మాల్దీవుల్లోనూ పాగా వేస్తోంది.

నిఘా అస్త్రాలు 
నేడు హిందూ మహాసముద్ర జలాల్లో ఏటా సుమారు లక్ష నౌకలు తిరుగుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో 66 శాతం, సరకుల రవాణాలో 33 శాతం, కంటైనర్‌ రవాణాలో 50 శాతం ఈ జలాల ద్వారానే జరుగుతోంది. తీరదేశాల అభివృద్ధికి హిందూ మహాసముద్రం ఎంత కీలకమో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. భూతల, సముద్రతలాలపై నిఘాకు అంతరిక్షంలోని ఉపగ్రహాలను మించిన సాధనాలు లేవు. అందుకే భారత్‌ నిరుడు డిసెంబరులో తన మూడో సైనిక ఉపగ్రహం జీశాట్‌-7ఏను కక్ష్యలోకి ప్రయోగించింది. అది సైనిక స్థావరాలను, విమానాలను, భూతల రాడార్లను, డ్రోన్‌ యంత్రాంగాలను అనుసంధానిస్తుంది. విద్యుదయస్కాంత ఆఘాతాలతో ఉపగ్రహాలు, ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలను ధ్వంసం చేసే పరిజ్ఞానాల్లో, అంతరిక్షం, సైబర్‌ రంగాల్లో పైచేయి సాధించడానికి నేడు పోటీ నడుస్తోంది. ఆ బరిలోకి తామూ ప్రవేశిస్తామని జపాన్‌ రక్షణమంత్రి గత డిసెంబరులో ప్రకటించారు. అమెరికా, రష్యాలకు దీటుగా చైనా మరికొన్నేళ్లలో ఉపగ్రహ విధ్వంస అస్త్రాల (ఏశాట్‌)ను రంగంలోకి దింపనున్నందువల్ల జపాన్‌, భారత్‌ త్వరగా మేల్కొంటున్నాయి. నిజానికి కక్ష్యలో ప్రత్యర్థుల ఉపగ్రహాలను ధ్వంసం చేసే ఏశాట్‌ అస్త్ర తయారీ భారత్‌ చేతిలోని పనే. కానీ, అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకే వినియోగించాలన్న భారత్‌ విధానానికి ఈ తరహా అస్త్రాలు పూర్తి విరుద్ధం. అందుకే ఇతర మార్గాలను అన్వేషిస్తూ జపాన్‌ను కలుపుకొనిపోతోంది. కక్ష్యలో తమ ఉపగ్రహాలకు ముప్పు ఎదురైతే వెంటనే పసిగట్టి ప్రతిచర్యలు తీసుకోవడానికి భూమి మీద సెన్సర్లు, రాడార్లను నియోగించాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. తదనుగుణంగా భారత్‌ తన భూభాగంపై అయిదు ఉపరితల రాడార్‌ కేంద్రాలను భూటాన్‌, నేపాల్‌, మాల్దీవులు, బంగ్లాదేశ్‌, శ్రీలంకలలో 500 చిన్న కేంద్రాలను స్థాపించనుంది. ఫ్రాన్స్‌, అమెరికాలతో కలిసి దక్షిణ, తూర్పు చైనా సముద్రాలపై, హిందూ మహాసముద్రంపై అంతరిక్షం నుంచి నిఘా వేయడానికి భారత్‌, జపాన్‌లు సంప్రతింపులు జరుపుతున్నాయి. దీనికితోడు 2022కల్లా ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని భారత్‌ లక్షిస్తోంది. ఏతావతా ఆసియాలో సరికొత్త అంతరిక్ష పోటీకి రంగం సిద్ధమవుతోంది!

- ఏఏవీ ప్రసాద్‌

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.