close

తాజా వార్తలు

Published : 24/01/2019 00:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముంచుతున్న ప్లాస్టిక్‌ సంచులు

ది ప్లాస్టిక్‌ యుగం. చౌకగా ఉత్పత్తి చేసే వీలు, ఎన్నో విధాలుగా వినియోగించే అవకాశం ఉన్నందువల్ల చేతి సంచులు, కాఫీ కప్పుల నుంచి కంప్యూటర్ల వరకు అన్నింటా తానై విస్తరించిన ప్లాస్టిక్‌- తేలిగ్గా ఛిద్రంకాని లక్షణంతో పర్యావరణానికి, మానవాళికి పెనుముప్పుగా దాపురించిందన్నది నిష్ఠుర సత్యం. నేడు విశ్వవ్యాప్తంగా తయారవుతున్న ప్లాస్టిక్‌ ఉత్పత్తుల్లో సగానికిపైగా ఇలా వాడి అలా పారేసేవే. దేశ దేశాల్లో ప్లాస్టిక్‌ సీసాలే నిమిషానికి పది లక్షలకుపైగా అమ్ముడుపోతున్నాయంటే ఏమనుకోవాలి? ఇంత భారీ వినియోగం కారణంగా భూమండలం మీద ఏటా 3.5 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ కాలుష్యం పేరుకుపోతూ, అందులో నాలుగోవంతు దాకా జలాల్లోకి చేరుతోంది. అది లక్షల సంఖ్యలో సముద్ర పక్షులు, పెద్దయెత్తున చేపలు, క్షీరదాలను బలిగొంటోంది. దేశీయంగా ఏటా 26 వేల టన్నులదాకా పోగుపడుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో దాదాపు 40 శాతం సేకరణకే నోచుకోవడం లేదని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎక్కడికక్కడ పేరుకుపోతున్న వ్యర్థాల మూలాన మురుగునీటి పారుదల వ్యవస్థ ఉక్కిరి బిక్కిరవుతోంది. వాన నీరు భూమిలో ఇంకకపోవడానికి, దేశంలో పలుచోట్ల వరదల బీభత్సానికి, జలచరాల సంఖ్య తగ్గిపోతుండటానికి టన్నులకొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాలే పుణ్యం కట్టుకుంటున్నాయి. ప్లాస్టిక్‌ ధూళి గాలిలో కలిసి క్యాన్సర్లు సహా రకరకాల ఆరోగ్య సమస్యలు ప్రజ్వరిల్లుతున్నాయి. మనిషి మనుగడనే దుర్భరం చేస్తున్న ప్లాస్టిక్‌ భూతంపై కదనకాహళి మోగించిన కేంద్రప్రభుత్వం- ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ ఉత్పత్తుల వినియోగాన్ని 2022 నాటికి రూపుమాపే లక్ష్యంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల క్రియాశీల తోడ్పాటును అభిలషిస్తోంది. సుమారు పాతిక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్లాస్టిక్‌ ఉత్పత్తుల కట్టడికి నిబద్ధత చాటినా వాస్తవిక కార్యాచరణ నీరోడుతోంది. ప్రాణాంతక ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణ కోసం జాతీయ స్థాయిలో ఏకోన్ముఖ వ్యూహం అమలులో జాగు చేసేకొద్దీ జాతికి తీవ్ర అనర్థం తప్పదు! 
 

‘సముద్ర జలాల్ని విషపూరితం చేసి జలచరాల్ని కబళిస్తూ, మనుషుల హార్మోన్లలోకి చొరబడి రోగగ్రస్తం చేస్తున్న ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అంతమొందించా’లన్నది నిరుటి ధరిత్రీ దినోత్సవ ఇతివృత్తం. ఆ స్ఫూర్తికి గొడుగుపడుతూ ప్లాస్టిక్‌పై దేశవ్యాప్త యుద్ధాన్ని ఫ్రాన్స్‌ ఉద్ధృతం చేసింది. జర్మనీ, ఇంగ్లాండ్‌, నార్వే ప్రభృత దేశాల్లోనూ ఉత్పత్తి వాడకాలపై ఆంక్షలు పకడ్బందీగా అమలవుతున్నాయి. 2005-2015 సంవత్సరాల మధ్య మొత్తం అంతర్జాతీయ ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో రమారమి సగందాకా రి-సైక్లింగ్‌ నిమిత్తం దిగుమతి చేసుకున్న చైనా, విధాన సమీక్షానంతరం నిషేధానికి మళ్ళింది. దేశీయంగానూ ప్లాస్టిక్‌ వ్యర్థాల దిగుమతిని నిషేధిస్తూ 2015లో ఉత్తర్వులు వెలువడినా, ఆ మరుసటి ఏడాది చేసిన సవరణ- ఆ కసరత్తు మౌలికోద్దేశానికే గండికొట్టింది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల(‘సెజ్‌’ల)లో నెలకొల్పిన ఏజెన్సీలకు ‘మినహాయింపు’ ప్రసాదించిన దరిమిలా ‘పెట్‌’ సీసాల దిగుమతులు జోరెత్తాయి. 2017లో 12 వేల టన్నులుగా నమోదైన అటువంటి దిగుమతులు, నిరుడు 48 వేల టన్నులకు ఎగబాకాయి. మరోవైపు- రాష్ట్రాలవారీగా ప్లాస్టిక్‌ సంచుల తయారీ, వాడకం, రవాణా, పంపిణీ, విక్రయం, నిల్వ, దిగుమతుల్ని నిషేధిస్తూ జారీ అయిన ఉత్తర్వులూ చాలాచోట్ల దస్త్రాలకే పరిమితమవుతున్నాయి. ప్లాస్టిక్‌ ఉత్పాదనలకు సరైన ప్రత్యామ్నాయాలు చూపడంలో ప్రభుత్వాల అలసత్వం, సిబ్బంది అవినీతి మూలాన- అమలులో నిషేధాంక్షలు కొరగానివవుతున్నాయి. జాగృత జన మహోద్యమంగా కొనసాగాల్సిన ‘ఉమ్మడి యుద్ధం’ ఇలా చతికిలపడినన్నాళ్లు, పునశ్శుద్ధి నామమాత్రమే అయినంత కాలం- దేశంలో చనిపోతున్న ప్రతి ఆవు, గేదె పొట్టలో కనీసం 30 కిలోల ప్లాస్టిక్‌ బయటపడే ఉదంతాలు పునరావృతమవుతూనే ఉంటాయి! 
 

దేశంలో ఏటా కోటీ ముప్ఫై లక్షల టన్నుల మేర ప్లాస్టిక్‌ వస్తూత్పాదనలు వినియోగిస్తుండగా, అందులో పునశ్శుద్ధికి నోచుకుంటున్నవి 40 లక్షల టన్నులేనని (సుమారు 30 శాతం) అంచనా. తక్కినవాటితో పాటు వెలుపలి నుంచి వచ్చిపడుతున్న వ్యర్థాలూ దేశం నలుమూలలా గాలిని, నీటిని, నేలను విషకలుషితం చేయడంలో పోటీపడుతున్నాయి. వ్యర్థాల కారణంగా అనర్థాలు దాపురించకుండా జాగ్రత్తపడటమే కాదు, చెత్త నుంచి పునర్వినియోగార్హమైన వస్తువుల సృష్టిలో స్వీడన్‌ సృజన పాటవం- ఏ దేశానికైనా విలువైన గుణపాఠం. జపాన్‌లో 75 శాతానికి పైగా ప్లాస్టిక్‌ వ్యర్థ పదార్థాల్ని తిరిగి ఉపయోగంలోకి తెస్తున్నారు. పోలాండ్‌, ఐర్లాండ్‌ లాంటిచోట్లా వ్యర్థాల రి-సైక్లింగ్‌ పరిశ్రమగా వర్ధిల్లుతోంది. ‘మాక్‌ రిబర్‌’ అనే అంకుర సంస్థ యూకేలో ప్లాస్టిక్‌ రహదారులు నిర్మిస్తోంది. చెన్నై విమానాశ్రయ ప్రాంతంలో న్యూజిలాండ్‌ తరహా ప్లాస్టిక్‌-బిటుమెన్‌ రహదారి నిర్మాణ ప్రతిపాదన ఇటీవలే వెలుగుచూసింది. దేశీయంగా ఆచార్య రాజగోపాలన్‌ వాసుదేవన్‌ వంటివారు ప్లాస్టిక్‌ రోడ్ల ప్రాధాన్యాన్ని చాటుతున్నా- ప్రభుత్వపరంగా సమధిక సహకారం ఒనగూడితేనే- వ్యర్థానికి కొత్త అర్థం దఖలుపడుతుంది. వ్యర్థాల పునశ్శుద్ధిని విస్తృతీకరిస్తూ, ప్లాస్టిక్‌ ఉత్పత్తులకు దీటైన ప్రత్యామ్నాయాల అన్వేషణనూ శీఘ్రతరం చేయాల్సిన తరుణమిది. వెయ్యేళ్లదాకా నశించకపోవడం ప్లాస్టిక్‌ దుర్లక్షణం. గాలిలో తేమ సోకినా, నేరుగా సూర్యరశ్మి తగిలినా వందరోజుల్లో దానంతటదే విచ్ఛిన్నమయ్యే పదార్థంతో చేతి సంచుల తయారీలో వియత్నాం సఫలమైంది. ప్రయత్నిస్తే ప్రత్యామ్నాయాలు అసాధ్యం కాదని నిరూపితమవుతున్న దశలో- ప్రభుత్వాల నిర్ణాయక చొరవ, ప్రజానీకం క్రియాశీల భాగస్వామ్యాలతోనే ఇక్కడా కొత్తపొద్దు పొడిచేది!


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని