close

తాజా వార్తలు

ఓటుకు తూటు పడకుండా...

‘ప్రాగ్దిశాకాశంలో ఉదయించిన వినూత్న తార’గా పండిత్‌ నెహ్రూ అభివర్ణించిన స్వతంత్ర భారత్‌ సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా నేడు డెబ్భయ్యోపడిలోకి అడుగిడుతోంది. గణతంత్ర దేశానికి జనతంత్ర పునాదిగా ఒక రోజు ముందే ఆవిర్భవించిన కేంద్ర ఎన్నికల సంఘం- పదిహేడో సార్వత్రిక ఎన్నికలకు ఓటర్లను సమాయత్తపరుస్తూ, తాజా జాబితాలో పేర్లు ఉన్నదీ లేనిదీ పరిశీలించుకోవాలని పిలుపిస్తోంది. ప్రతి ఎన్నికను ప్రతి ఒక్కరికి చేరువ చెయ్యడమే లక్ష్యమంటూ ఎలెక్షన్‌ కమిషన్‌ (ఈసీ) ఎంతగా చెప్పినా, తప్పుల తడకగా రూపొందుతున్న ఓటర్ల జాబితాలు లక్షలాది పౌరుల్ని వారి పౌరహక్కుకు దూరం చేస్తున్న దారుణం దశాబ్దాలుగా కళ్లకు కడుతూనే ఉంది. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల నాటికి 21 ఏళ్లు నిండిన వయోజనులుగా ఓటుహక్కు పొందినవారు 17.3 కోట్లమంది. వచ్చే ఎన్నికల నాటికి ఓటర్లసంఖ్య అంతకు అయిదింతలకు పైగా ఉండనుందని కేంద్ర ఎన్నికల సంఘమే చెబుతోంది. ఓటర్ల చేతిలో ఫొటో గుర్తింపు కార్డు, పోలింగ్‌ కేంద్రంలో ఎలెక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రం- ఈ రెండూ ఈసీ స్వర్ణోత్సవ లక్ష్యాలని నిర్వాచన్‌ సదన్‌ 2001లో ప్రకటించింది. ఓటింగ్‌ యంత్రాల విశ్వసనీయతపై విపక్ష శిబిరం విమర్శలు దీర్ఘశ్రుతిలో చెవిన పడుతుంటే, చేతిలో ఫొటో గుర్తింపు కార్డు ఉన్నా జాబితాలో పేరు లేదన్న కారణంగా ఓటుహక్కు వినియోగించుకోలేకపోతున్నవారి గోడు- ఈసీ సామర్థ్యాన్నే ప్రశ్నార్థకం చేస్తోంది. ఇప్పటికే 16 సార్వత్రిక ఎన్నికలు, 375 దాకా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన ఈసీ అనుభవం- ఓటర్ల జాబితాల సక్రమ కూర్పు విషయంలో పదేపదే ఎందుకు విఫలమవుతోంది? అర్హులైన ఓటర్లు ఎవరూ జాబితాల నుంచి జారిపోకుండా అడ్డదారిన బోగస్‌ ఓట్లు పోగుపడకుండా, ఈసీ జాగ్రత్త వహించాలని ప్రధాన ఎలెక్షన్‌ కమిషనర్లే ఎన్నోసార్లు కర్తవ్యబోధ చేస్తున్నా- బండి గాడిన పడితే ఒట్టు. ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలన్న పిలుపులు సరే, నిబద్ధ ఓటర్ల భాగస్వామ్యాన్ని నిలబెట్టే కర్తవ్యనిష్ఠ ఈసీ చొరవలో ప్రస్ఫుటం కావాలిప్పుడు!

‘ఏవో హత్యాయత్నాలతో ప్రజాస్వామ్యం మృత్యువాత పడే అవకాశం లేదు. కానీ ఉదాసీనత, నిర్లక్ష్యభావం, జాగ్రత్తగా పెంచి పోషించుకోలేకపోవడం వల్ల ప్రజాస్వామ్యం క్రమేణా కనుమరుగైపోతుంది’- రాబర్ట్‌ హచిన్స్‌ అనే అమెరికన్‌ తత్వవేత్త సూత్రీకరణ అది. కోట్లాది జనం అవిరళ త్యాగాల ఫలంగా పొందిన స్వాతంత్య్రం- సమన్యాయం, సమధర్మం ప్రాతిపదికలపై అందరి అభివృద్ధికీ మేలుబాటలు పరవాలనే సదాశయంతోనే ఒక ఓటు- ఒకే విలువ సూత్రంగా భారత ప్రజాతంత్రం పురుడుపోసుకుంది. అసలు ఓటు అంటే ఏమిటో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు తెలియజెబితే, విచక్షణాయుతంగా సంపూర్ణ అవగాహనతో ఓటేయడం రెండో ఎన్నికల నాటికే ఓటర్లకు అలవడిందని లోగడ ఈసీయే ఘనంగా చాటింది. తొలి ఓటర్ల జాబితా తయారీ సందర్భంగా యూపీ, అసోం లాంటిచోట్ల స్త్రీలు తమ పేర్లు చెప్పకుండా ఫలానా వ్యక్తి భార్య, కూతురు అని నమోదు చెయ్యాలని కోరిన వైనాల నుంచి, జాబితాలో తమ పేరు ఎందుకు మాయమైందని నిలదీసేంతగా మహిళల్లోనూ చైతన్యం ప్రభవించింది. జన చైతన్యానికి తగ్గట్లుగా నయా సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటుతో ఓటర్ల జాబితాల్ని పటిష్ఠీకరించడంలో ఈసీ వైఫల్యం- ప్రజాస్వామ్యంపట్ల నమ్మకాన్నే ఖర్చు రాసేస్తోంది. ఇటీవలి తుది జాబితా ప్రచురణలోనూ తప్పుల కుప్పలు పోగుపడటం ప్రజాస్వామ్య హితైషుల్ని కలవరపరుస్తోంది. మరింత మెరుగైన పనితీరుకు భరోసా ఇస్తూ నాలుగేళ్ల (2018-2022) కార్పొరేట్‌ ప్రణాళికతో ఆస్ట్రేలియా ఎన్నికల సంఘం ముందుకొచ్చిన తీరు నిర్వాచన్‌ సదన్‌ పెద్దలకు మార్గదర్శకం కావాలి. స్వయంపరిమితుల్ని ఏకరువు పెట్టడం కాదు, సాంకేతికత మేళవింపుతో సృజన పరిష్కారాలకు సంకల్పించాలి!

ఓటర్ల జాబితాల కూర్పు- ఎన్నికల సంఘానికి రాజ్యాంగబద్ధంగా దఖలుపడిన విధి. ప్రతి వెయ్యి జనాభాకు ఓటర్ల జాతీయ సగటు 689; అది కొన్నిచోట్ల వెయ్యికి మించిపోవడం ప్రజాస్వామ్యాన్ని క్రూరంగా పరిహసిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం పోకడ ఇది కాగా, అత్యంత ప్రాచీన జనస్వామ్య దేశంగా రాణకెక్కిన అమెరికాలో దాదాపు మూడోవంతు మంది అసలు ఓటర్లుగానే నమోదు కాని విడ్డూరం దాని ప్రతిష్ఠకు తూట్లు పొడుస్తోంది. ఓటరు నమోదు ప్రక్రియను ఆధునికీకరించి- అర్హులైన ఓటర్లందరూ, కేవలం అర్హులే జాబితాలో ఉండేలా అమెరికన్‌ చట్టసభ చొరవ చూపుతోంది. ఓటర్ల నమోదులో 92 శాతం రికార్డు సాధించిన ఆస్ట్రేలియా- ఓటరు జాబితాల క్రియాశీల నిర్వహణ ద్వారా అర్హులందరికీ పోలింగ్‌ సేవలను సమర్థంగా అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఇటీవల వెలుగుచూసిన ప్రజాస్వామ్య సూచీలో- మొత్తం 167 దేశాల జాబితాలో అమెరికా 25వ స్థానంలో, ఇండియా 41వ స్థానంలో నిలిచాయి. పూర్తిస్థాయి ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న తొలి 20 దేశాల్లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ చోటు దక్కించుకోగా, తప్పుల తడక జనస్వామ్య దేశాల జాబితాలో ఇండియా ఈసురోమంటోంది. జాతీయ స్థాయిలో పౌరులందరి సమాచార నిధిని నిర్వహిస్తున్న స్వీడన్‌- ఓటర్ల నమోదు ప్రక్రియను యాంత్రికంగా కానిచ్చేస్తుంటే, ఒక రాష్ట్రానికి చెందిన పౌరుడు ఎక్కడి నుంచైనా ఓటు వేసే అవకాశాన్ని ఆస్ట్రేలియా కల్పిస్తోంది. కేవలం సొంత ఊళ్లో లేనందువల్ల 2014 ఎన్నికల్లో ఎకాయెకి 28 కోట్లమంది ఓటుహక్కు వినియోగించుకోలేక పోయిన దేశం మనది. పౌరుల అస్తిత్వానికి చిహ్నంగా మారిన ఓటు విలువను మొదట ఈసీ గుర్తించాలి. అర్హులైన ఓటర్లంతా స్వేచ్ఛగా సక్రమంగా తమ హక్కు వినియోగించుకోవడంలో ఎలాంటి అవరోధాలు లేకుండా ఎన్నికల సంఘమే కాచుకోవాలి!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.